రానున్న తరం పొగ తాగకుండా చట్టం చేసిన దేశం?
1. పర్యావరణ మార్పు మిషన్‌ను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం? (3)
1) మధ్యప్రదేశ్ 2) హర్యానా
3) తమిళనాడు 4) కేరళ
వివరణ: పర్యావరణ మార్పు మిషన్‌ను తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. ఈ ఘనతను దక్కించుకున్న తొలి రాష్ట్రం అదే. కార్బన్ తటస్థతను సాధించడమే లక్ష్యం. భారత ప్రభుత్వం 2070 నాటికి కార్బన్ తటస్థత సాధించాలని లక్ష్యం నిర్దేశించుకోగా, అంతకు ముందే చేరుకోవాలని తమిళనాడు భావిస్తుంది. 2021-22 బడ్జెట్లో తమిళనాడు రాష్ట్రం పర్యావరణానికి రూ.500 కోట్లు కేటాయించింది. తమిళనాడు హరిత పర్యావరణ సంస్థను ఏర్పాటు చేసింది. ప్రకృతి పరిరక్షణ ప్రాజెక్టులను ఇది చేపడుతుంది. అవి..
1. హరిత తమిళనాడు మిషన్
2. తమిళనాడు చిత్తడి నేలలు
3. తమిళనాడు పర్యావరణ మార్పు. జిల్లా స్థాయిలోనూ ఆయా కార్యక్రమాలను అమలు చేస్తారు.
2. ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించారు? (2)
1) డిసెంబర్ 2023 2) డిసెంబర్ 2024
3) డిసెంబర్ 2025 4) డిసెంబర్ 2026
వివరణ: వీధి వ్యాపారులు, తోపుడు బండ్లపై ఆధారపడ్డవారికి రుణాలు ఇచ్చేందుకు కేంద్రం జూన్ 1, 2020న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. దీని పూర్తి రూపం- ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. లాక్డౌన్ మూలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీధి వ్యాపారులకు ప్రయోజనం కలిగించేందుకు దీన్ని అమలు చేశారు. రూ. 10,000 రుణాలు ఇస్తారు. ఈ పథకం అమలును డిసెంబర్ 2024 వరకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. తీసుకున్న రుణాన్ని వాయిదా పద్ధతిలో కూడా చెల్లించేందుకు వీలుంటుంది. అలాగే సమయానికి తిరిగి చెల్లించినా లేదా ముందుగానే చెల్లించినా వడ్డీలో 7% రాయితీ ఇస్తారు.
3. ఇటీవల వార్తల్లో నిలిచిన సింగపూర్ ప్రకటన దేనికి సంబంధించింది? (3)
1) పట్టణ మౌలిక సదుపాయాలు
2) నీటి సరఫరా 3) కార్మిక హక్కులు
4) సైబర్ భద్రత
వివరణ: అంతర్జాతీయ కార్మిక సంస్థకు చెందిన ఆసియా పసిఫిక్ ప్రాంతీయ 17వ సమావేశం ఇటీవల సింగపూర్‌లో నిర్వహించారు. సమావేశం అనంతరం సింగపూర్ ప్రకటనను వెలువరించారు. కార్మిక భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వాక్ స్వాతంత్య్ర హక్కు ఇవ్వాలని ఇందులో సూచించారు. అలాగే లింగ వివక్ష లేకుండా వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. వెర్సయిల్స్ ఒప్పందం ద్వారా ఇది 1919లో ఏర్పాటయ్యింది. కార్మికుల సంక్షేమానికి ప్రమాణాలను ఈ సంస్థ నిర్దేశిస్తుంది.
4. వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ ఎవరు? ( 4)
1) రోహిత్ శర్మ 2) క్రిస్‌గేల్
3) సచిన్ టెండూల్కర్ 4) ఇషాన్ కిషన్
వివరణ: కేవలం 126 బంతుల్లోనే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్‌తో చటోగ్రామ్‌లో డిసెంబర్ 10న జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనతను దక్కించుకున్నాడు. వన్డేల్లో ఇప్పటి వరకు డబుల్ సెంచరీలు సాధించిన వాళ్లు, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, గప్టిల్. 138 బంతుల్లో గేల్ డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డ్‌ను భారత్‌కు చెందిన ఇషాన్ కిషన్ అధిగమించాడు. అయితే తొలిసారిగా వన్డేల్లో 200 స్కోర్ చేసిన ఘనత సచిన్ టెండూల్కర్‌దే. రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఇదే మ్యాచ్‌లో మరో బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో ఆయన రెండో స్థానంలో ఉన్నాడు. 100 సెంచరీలతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 72 సెంచరీలతో విరాట్ రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ 71 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
5. రాజ్యసభ ఆమోదించిన విద్యుత్ పరిరక్షణ బిల్లుకు సంబంధించి సరైనవి? (3)
1) శిలాజేతర ఇంధనాల వినియోగం
2) కార్బన్ మార్కెట్ ఏర్పాటు
3) హరిత హైడ్రోజన్ వినియోగం
4) పైవన్నీ సరైనవే
వివరణ: విద్యుత్ పరిరక్షణ బిల్లును ఇటీవల రాజ్యసభ ఆమోదించింది. దీన్ని ఈ ఏడాది ఆగస్టులోనే లోక్‌సభ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారనుంది. ఇది అమల్లోకి రావడంతో శిలాజేతర ఇంధనాల వాడకం తప్పనిసరి కావడంతో పాటు హరిత హైడ్రోజన్, హరిత అమ్మోనియా, జీవ ద్రవ్యం తదితరాల వినియోగం పెరుగుతుంది. దేశ వ్యాప్తంగా కార్బన్ మార్కెట్ కూడా అందుబాటులోకి రానుంది. విద్యుత్‌ను పరిరక్షించుకొనేందుకు క్రమబద్ధీకరణ జరుగుతుంది. విద్యుత్ సమర్థత కూడా పెరుగుతుంది. అంటే ప్రస్తుతం చేస్తున్న పనులను తక్కువ విద్యుత్‌ను వినియోగించి పూర్తి చేయనున్నారు.
6. భారత్‌లో లాజిస్టిక్స్ రంగం అభివృద్ధికి ఏ అంతర్జాతీయ సంస్థ 250 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది? (3)
1) ప్రపంచ బ్యాంక్ 2) బ్రిక్స్ బ్యాంక్
3) ఆసియా అభివృద్ధి బ్యాంక్
4) ఆసియా మౌలిక సదుపాయాలు-పెట్టుబడుల బ్యాంక్
వివరణ: దేశంలో లాజిస్టిక్స్ సౌకర్యాల పెంపు, అలాగే సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించి ఆసియా అభివృద్ధి బ్యాంక్ 250 మిలియన్ డాలర్ల రుణ సాయం ఇవ్వనుంది. ఫిలిప్పీన్స్‌లోని మనీలా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. భారత్ ఇప్పటికే వేర్వేరు 16 మంత్రిత్వ శాఖలను సమీకృతం చేస్తూ పీఎం గతిశక్తి యోజనను ప్రకటించింది. లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రవాణా ఖర్చులతో పాటు ఇతర అనవసర వ్యయాలు తగ్గుతాయి.
7. తెలంగాణ రాష్ట్రంలో అయిదేళ్ల వ్యవధిలో ఎంత శాతం వరి సాగు పెరిగిందని కేంద్రం ఇటీవల ప్రకటించింది? (2)
1) 50% 2) 86%
3) 63% 4) 47%
వివరణ: తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం అయిదు సంవత్సరాల్లో 86% పెరిగింది. ఈ మేరకు కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. 2017-18 సంవత్సరంలో రాష్ట్రంలో 19.62 లక్షల హెక్టార్ల వరి సాగు జరగగా, 2021-22 నాటికి అది 36.54 లక్షల హెక్టార్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం అయిదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 45.85 శాతం వృద్ధి చెందింది. అలాగే తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి సంఘాలకు సంబంధించి కూడా కేంద్రం పలు అంశాలను పేర్కొంది. తెలంగాణలో మొత్తం 32 జిల్లాల నుంచి ఇంత వరకు 142 వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు నమోదయ్యాయి. సిద్దిపేటలో అతి ఎక్కువగా 14 రానున్నాయి. ఆ తర్వాత కరీంనగర్-12, మెదక్-11, నిజామాబాద్‌లో పది వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు రానున్నాయి.
8. నాబార్డ్ చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? (1)
1) కేవీ షాజి 2) మేఘనా అహ్లావత్
3) మీనేష్ సి షా 4) ఎవరూ కాదు
వివరణ: నాబార్డ్ చైర్మన్‌గా కేవీ షాజి నియమితులయ్యారు. గతంలో ఆయన ఇదే బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ముంబై కేంద్రంగా ఈ బ్యాంక్ పనిచేస్తుంది. భారత టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్‌కు అధ్యక్షురాలిగా మేఘనా అహ్లావత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఆమె. నేషనల్ డెయిరీ డెవలప్మెట్ బోర్డ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా మీనేష్ సి షా నియమితులయ్యారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో దీని ప్రధాన కేంద్రం ఉంది. 1966లో ఇది ఏర్పాటయ్యింది. దీనికి తొలి చైర్మన్‌గా వర్గీస్ కురియన్ పనిచేశారు. ఆయనకు శ్వేత విప్లవ పితగా పేరు ఉంది.
9. రానున్న తరం పొగ తాగకుండా చట్టం చేసిన దేశం? (3)
1) ఆస్ట్రేలియా 2) క్యూబా
3) న్యూజిలాండ్ 4) మెక్సికో
వివరణ: యువత సిగరెట్లు కొనకుండా నిషేధించడంతో పాటు రానున్న తరం పొగ బారిన పడకుండా చట్టం చేసిన ప్రపంచ తొలి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. 2025 నాటికి పొగ రహిత దేశంగా మారాలని ఆ దేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2009, జనవరి 1 తర్వాత జన్మించిన వాళ్లకు సిగరెట్లను విక్రయించరు. అలాగే వీటిని అమ్మే వాళ్ల సంఖ్యపై కూడా పరిమితులు విధించారు. ప్రస్తుతం ఆ దేశంలో 6000 మంది వీటిని విక్రయిస్తుండగా 600 వరకు తగ్గించనున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో 8% మంది పెద్దలు పొగ పీలుస్తున్నట్లు తెలుస్తుంది.
10. ఏ ప్రాంతంలోని కంది పప్పునకు జీఐ ట్యాగ్ లభించింది?(4)
1) మహబూబ్‌నగర్ 2) ఖమ్మం
3) సూర్యాపేట 4) తాండూర్
వివరణ: తాండూర్ కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు లభించింది. రెండు తెలుగు రాష్ర్టాల్లో వ్యవసాయ పంటల పరంగా తొలిసారిగా జీఐ ట్యాగ్ పొందింది ఇదే. తెలంగాణ నుంచి తొలిసారిగా జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి పోచంపల్లి ఇక్కత్ చీరలు. ప్రస్తుతం తాండూర్ కందిపప్పునకు జీఐ ట్యాగ్ కోరుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తు చేసింది. అధికంగా ఈ కంది నాణ్యతను కలిగి ఉండటంతో పాటు 22% ప్రొటీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ పప్పు అధిక రుచిని కలిగి ఉంటుంది.
11. ఆవరణ వ్యవస్థ పునరుద్ధరణ ప్రాజెక్టుల్లో భాగంగా యూఎన్ అవార్డును పొందిన భారత ప్రాజెక్ట్ ఏది? (2)
1) నదుల అనుసంధానం
2) నమామి గంగా
3) రామ్సర్ సైట్ల పునరుద్ధరణ
4) ఏదీ కాదు
వివరణ: సహజ ఆవరణ వ్యవస్థల పునరుద్ధరణలో భాగంగా ప్రపంచంలో పది అత్యుత్తమ ప్రాజెక్టుల్లో నమామి గంగా ఒకటిగా నిలిచింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేసింది. అంతే కాదు కెనడాలోని మాంట్రియల్లో అవార్డును అందజేసింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకు ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న అశోక్ కుమార్ ఈ అవార్డును డిసెంబర్ 14న అందుకున్నారు. నమామి గంగా ప్రాజెక్టును కేంద్రం 2014లో ప్రారంభించింది. దాదాపు 70 దేశాలకు చెందిన 150 ప్రాజెక్టులు ఈ పోటీలో పాల్గొన్నాయి. అయితే ఇందులో పదింటిని ఎంపిక చేశారు. అందులో భారత్‌కు చెందిన నమామి గంగా కూడా ఉంది.
12. ఏ దేశాన్ని యూఎన్ ఉమెన్ నుంచి ఇటీవల తొలగించారు? (3)
1) రష్యా 2) ఉక్రెయిన్
3) ఇరాన్ 4) ఉత్తర కొరియా
వివరణ: ఐక్యరాజ్య సమితి మహిళా సంస్థ నుంచి ఇరాన్‌ను తొలగించారు. న్యూయార్క్ కేంద్రంగా యూఎన్ ఉమెన్ పని చేస్తుంది. 2011లో ఈ సంస్థ ఏర్పాటయ్యింది. లింగ వివక్షను రూపుమాపేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఏ దేశంలో మహిళలకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తారో ఆయా దేశాలను అప్రమత్తం కూడా చేస్తుంది. హిజాబ్ ధరించడానికి సంబంధించి ఇటీవల ఇరాన్ దేశంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. స్వేచ్ఛను కోరుతూ ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అయితే వాటిని అణచివేసేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నించడాన్ని యూఎన్ ఉమెన్ తప్పు పట్టింది. అయితే మహిళల నిరసనకు ఇరాన్ దిగి వచ్చింది. మోరల్ పోలీస్ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
13. అమెరికా తన తొలి అంతరిక్ష బలగపు యూనిట్‌ను ఏ దేశంలో ప్రారంభించింది? (4)
1) ఇజ్రాయెల్ 2) సౌదీ అరేబియా
3) భారత్ 4) దక్షిణ కొరియా
వివరణ: అమెరికా తన అంతరిక్ష మిలిటరీ యూనిట్‌ను దక్షిణ కొరియాలో ప్రారంభించింది. ఉత్తరకొరియా, చైనా, రష్యా అంతరిక్ష కదలికలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒక దేశం అంతరిక్షంలోని తన ఆస్తులను పరిరక్షించుకొనే అంశంలో భాగంగా స్పేస్ మిలిటరీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. 2007లో చైనా యాంటీ శాటిలైట్ పరీక్షను నిర్వహించింది. భారత్ కూడా ఈ తరహా పరీక్షను 2019లో చేపట్టింది. ఈ తరహా పరిజ్ఞానం ఉన్న దేశాలు కేవలం నాలుగే ఉన్నాయి. అవి- అమెరికా, రష్యా, చైనా, భారత్.
14. ఏ దేశంతో కలిసి భారత్ సూర్యకిరణ్ సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తుంది? (2)
1) ఇండోనేషియా 2) నేపాల్
3) బంగ్లాదేశ్ 4) భూటాన్
వివరణ: సూర్యకిరణ్ పేరుతో భారత్, నేపాల్ దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. డిసెంబర్ 16న సూర్యకిరణ్ 7వ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 29 వరకు ఇవి కొనసాగుతాయి. నేపాల్‌లోని సల్జ్హందిలో ఇవి కొనసాగుతున్నాయి. భారత్ తరఫున 5జీఆర్ సైనికులు ఇందులో పాల్గొంటున్నారు. నేపాల్ తరఫున భవాని బక్ష్ బెటాలియన్ సైనికులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే విన్యాసాలు ఇవి.
15. రూ.1,58,561 సంఖ్య దేనికి సంబంధించింది? (3)
1) తెలంగాణ అప్పు
2) కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన నిధులు
3) తెలంగాణ తలసరి ఆదాయం
4) ఏదీ కాదు
వివరణ: తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,58,561గా ఉంది. అలాగే టెలి కన్సల్టెన్సీ సేవల అమల్లో పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన టెలి కన్సల్టెన్సీ క్యాంపెయిన్‌లో తెలంగాణలో 17.47 లక్షల కన్సల్టేషన్లు పూర్తి చేసింది.
-వి. రాజేంద్ర శర్మ ఫ్యాకల్టీ
9849212411
- Tags
- nipuna
- Study material
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం