Career Guidance – Polytechnic | పాలిటెక్నిక్‌లో చేరిక.. భవిష్యత్తుకు భరోసా
Career Guidance – Polytechnic | పదో తరగతి పూర్తవ్వగానే విద్యార్థికి టెక్నాలజీ, స్కిల్స్‌ను పరిచయం చేసే వేదికలు పాలిటెక్నిక్ కళాశాలలు. చిన్న వయస్సులోనే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించడానికి ఉత్తమమైన ఎంపికలు. ఇంటర్, డిగ్రీ తదితర కోర్సులు చదవకుండానే పది పూర్తయిన మూడేళ్లలో డిప్లొమా పట్టా సాధించేందుకు పాలిసెట్ సదవకాశాన్ని కల్పిస్తుంది.
తెలంగాణ పాలిసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత పూర్తయ్యింది. రెండో విడత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏ బ్రాంచీ ఎంచుకుంటే భవిష్యత్తు ఉంటుంది.. ఎలాంటి కళాశాలలో చేరితే ఉత్తమ బోధన ఉంటుంది.. అనే అంశాలపై కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్యాకేజింగ్ టెక్నాలజీ హెచ్‌వోడీ డాక్టర్ వై.వెంకట్‌రెడ్డి అందించిన సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
డిప్లొమాతో మంచి భవిష్యత్తు
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలున్నాయి. చిన్న వయస్సులోనే టెక్నికల్ స్కిల్స్ సాధించి ఉన్నత స్థానంలో స్థిరపడే ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఫీజుతో మంచి విద్య అందుతుంది. బీటెక్, బీఫార్మసీతో పోల్చితే తక్కువ ఫీజులు ఉంటాయి. కౌన్సెలింగ్ ద్వారా సీటు రాని విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లను నేరుగా పాలిటెక్నిక్ కన్వినర్ ద్వారా భర్తీ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయడానికి ప్రైవేట్ కళాశాలలకు అవకాశం ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు డిప్లొమా చేయడం వల్ల తొందరగా స్థిరపడవచ్చు.
సుశిక్షితులైన లెక్చరర్స్, ఉత్తమమైన క్యాంపస్‌లు
రాష్ట్ర వ్యాప్తంగా 56 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. అన్నింటిలో అనుభవజ్ఞులైన ప్రభుత్వ లెక్చరర్స్ బోధిస్తున్నారు. మంచి ల్యాబ్‌లు, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కళాశాలల్లో ఎక్కువగా ఎనాలసిస్ విధానంలోనే బోధన జరుగుతుంది. విద్యార్థులు ఏడాది పొడవునా చదువుపైనే దృష్టి సారించేలా అకడమిక్ క్యాలెండర్ ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో సగానికి పైగా ఎన్బీఏ గుర్తింపు లభించింది. ప్రభుత్వ కళాశాలల్లో విద్యా బోధన సరిగా ఉండదనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో చదివిన విద్యార్థులు మంచి ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ చదివి ఉత్తీర్ణులైనవారికి మంచి మంచి ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి. చాలా పెద్దపెద్ద సంస్థలు ఏటా వందల మంది విద్యార్థులను తమ సంస్థల్లో చేర్చుకుంటున్నారు.
అన్ని బ్రాంచీలు ముఖ్యమే..
గడిచిన మూడేళ్ల నుంచి విద్యార్థులు కంప్యూటర్ ఆధారిత కోర్సులపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటిలోనే ఎక్కువగా చేరుతున్నారు. కరోనా ప్రభావం తర్వాత వర్క్‌ఫ్రం హోం విధానం అందుబాటులోకి వచ్చాక వీటికి క్రేజ్ పెరిగింది. కానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీ పెరిగిపోతుంది. ఈనేపథ్యంలో లాంగ్న్‌ల్రో వీటికి అంత డిమాండ్ ఉండకపోవచ్చు. కానీ కోర్ బ్రాంచీలైన ఈఈఈ, సివిల్, మెకానికల్ వంటి కోర్సులకు ఎప్పటికైనా డిమాండ్ ఉంటుంది. కన్స్ట్రక్షన్, మ్యానుఫాక్చరింగ్ రంగంలో మన రాష్ట్రం దూసుకుపోతుంది. ఈ క్రమంలో కోర్ బ్రాంచీల విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆయా బ్రాంచీల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది కాబట్టి భవిష్యత్తులో అవి చదివిన వారికి మంచి డిమాండ్ ఉంటుంది.
ఎక్కువ ఆప్షన్ల ఎంపికే ఉత్తమం
కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే అంత మంచింది. ఎందుకంటే ర్యాంకు, రిజర్వేషన్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. చాలా మంది విద్యార్థుల్లో ఎక్కువ ఆప్షన్లు పెట్టుకుంటే నచ్చిన కళాశాలల్లో సీటు రాదేమో అనే అపోహ ఉంది. అది తప్పు.. ఎందుకంటే ర్యాంకు ఆధారంగానే టాప్ నుంచి మీడియం కళాశాలల కేటాయింపు ఉంటుంది. అందుకే మంచి ర్యాంకు వచ్చిన వారు ఎన్ని ఆప్షన్లు పెట్టుకున్నా మొదట ఎంపిక చేసిన కళాశాలలోనే సీటు వస్తుంది. రిజర్వేషన్, ర్యాంకును బట్టి కేటాయింపు ఉంటుంది.
ఫోన్ నంబర్, పాస్వర్డ్ ఎవ్వరికీ చెప్పొద్దు
వెబ్ ఆప్షన్లు పూర్తయ్యాక మీ ఫోన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎవరికీ చెప్పొద్దు. కొన్ని ప్రైవేట్ కళాశాలలవారు ఫోన్ చేసి పాస్వర్డ్ అడుగుతారు. మీరు పాస్వర్డ్ చెబితే వెబ్ ఆప్షన్లలో వారి కళాశాలనే ఎంపిక చేస్తారు. దీంతో మీ ర్యాంకుకు తగ్గ కళాశాలలో సీటు రాకపోవచ్చు. కొంతమంది మధ్యవర్తులు మంచి వసతులు, సౌకర్యాలు ఉన్నాయంటూ ఫలనా కళాశాలలో చేరాలని ఫోన్ నంబర్, పాస్వర్డ్ అడుగుతారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. కౌన్సెలింగ్‌లో పాల్గొని కేటాయించిన కళాశాలలోనే విద్యార్థులను చేర్పించాలి.
తల్లిదండ్రులు విద్యార్థి వెంటే ఉండాలి..
గ్రామీణ ప్రాంత విద్యార్థులు వెబ్ ఆప్షన్ల ఎంపికకు ఇంటర్నెట్ సెంటర్లపై ఆధారపడతారు. విద్యార్థి అప్పుడే పదో తరగతి పూర్తయి ఉంటాడు. వెబ్ ఆప్షన్లపై పూర్తి అవగాహన ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు కానీ బంధువుల్లో ఎవరైన కౌన్సెలింగ్ మీద అవగాహన ఉన్నవారు వారితో వెళ్లాలి. ఏదైనా ఆన్లైన్ సెంటర్లో స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే మీ ఐడీ లాగవుట్ చేసిన తర్వాతనే అక్కడి నుంచి వెళ్లండి. ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులకు మీ వివరాలు చెబితే వెబ్ ఆప్షన్లు పూర్తయ్యేదాకా మీరే దగ్గరుండి చేయించండి. వెబ్ ఆప్షన్లు పూర్తయ్యాక ఒక ప్రింట్ తీసుకుని మీరు ఎంచుకున్న కళాశాలలను ఒకసారి కరెక్టా కాదా సరి చూసుకోండి. ఏదైనా మీరు అనుకోని కళాశాల ఎంపిక అయితే వెంటనే సరి చేసుకోండి.
అపోహలు వీడితే కెరీర్‌కు బాటలు..
చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో డిప్లొమా కంటే బీటెక్ చదివితేనే మంచి అవకాశాలుంటాయనే అపోహ ఉంది. కానీ డిప్లొమా చదివినవారికే ప్లేస్‌మెంట్స్ ఎక్కువగా లభిస్తున్నాయి. దీనికి కారణం డిప్లొమాలో మంచి స్కిల్స్, నైపుణ్యాలు అందించడమే. మూడేళ్ల కోర్సులో వారు ఎంచుకున్న బ్రాంచీకి సబంధించిన పూర్తి అవగాహన, కమాండింగ్ వచ్చేలా విద్యా బోధన ఉంటుంది. ఇటీవల కాలంలో బీటెక్ చదివిన వారికంటే డిప్లొమా, ఆ తర్వాత బీటెక్ చేసిన వారికి పేరుగాంచిన సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు ప్రతి సంవత్సరం మంచి ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.
ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సు ప్రత్యేకం
రామంతాపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అందిస్తున్న ‘ప్యాకేజింగ్ టెక్నాలజీ’ కోర్సు రాష్ట్రంలోని మరే కళాశాలలో లేదు. దేశ వ్యాప్తంగా ఈ కోర్సు కేవలం హైదరాబాద్‌లోని రామాంతాపూర్, మహారాష్ట్రలోని నాగపూర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కోర్సు చదివిన విద్యార్థులకు వంద శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. దీన్ని 1996లో ప్రారంభించారు. ఈ కోర్సు ద్వారా రామంతాపూర్కళాశాలలో ఇప్పటికి 27 బ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సు చదివిన దాదాపు అందరు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ప్యాకేజింగ్ టెక్నాలజీ చదివిన వారిని ప్యాకేజిస్టులు అంటారు. ప్రతి వస్తువును ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంతో పాటు సురక్షితంగా ఉండేలా రూపొందించడమే వీరి బాధ్యత. వీరికి క్వాలిటీ కంట్రోల్, ప్యాకేజింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ విభాగాల్లో కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 40 వేల ప్యాకేజింగ్ పరిశ్రమలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ పదుల సంఖ్యలో ఉన్నాయి. కానీ సంబంధిత శిక్షణ అందించే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి డిప్లొమాలో ఈ కోర్సు చదివిన విద్యార్థులందరికీ ప్లేస్‌మెంట్స్ దక్కుతాయి.
కుమారస్వామి కాసాని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం