లైఫ్‌కు ‘ఇంటర్’చేంజ్ (ఇంటర్ పరీక్షలు రాసేవారికోసం)
- ఇక్కడి సామర్థ్యమే బతుకుకు భరోసా
- 3 గంటలు జవాబులకే కేటాయించొద్దు
- ప్రణాళికాబద్ధంగా రాస్తేనే మంచి మార్కులు
- క్లినికల్ సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూ
- రేపటి నుంచి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక మలుపు. ఇక్కడి సామర్థ్యాన్ని బట్టే బతుకుపై భరోసా ఏర్పడుతుంది. జీవితంలో ఎటు వైపు వెళ్లాలో ఇక్కడి రాతే మార్గనిర్దేశం చేయనున్నది. జీవితాన్ని మలుపు తిప్పే ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి ప్రణాళికలో సమాధానాలు రాయాలని, పరీక్ష కోసం కేటాయించిన 180 నిమిషాలు సమాధానాలు రాసేందుకే కేటాయించవద్దని ఇంటర్‌బోర్డు కౌన్సెలర్, బిహేవియర్ అనలిస్ట్ పీ జవహర్లాల్ నెహ్రూ సూచించారు.
సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించి సమాధానాలు రాస్తే మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. ఎంత చదివావు.. ఏం చదివావు అన్నది ముఖ్యం కాదని, మూడు గంటల్లో ఏం రాశావు అన్నదే ప్రధానమని అన్నారు. 200 రోజులు చదివినా.. పరీక్షలకు 15 రోజుల ముందు చదివినా ఆన్షర్షీట్లో ఎలా రాశామన్నదే అత్యంత ముఖ్యమని తెలిపారు. నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
సమయాన్ని ఇలా విభజించండి..
- సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి. మొదటి 10 నిమిషాల్లో ప్రశ్నలను శ్రద్ధగా చదవడం, హాల్‌టికెట్ నంబర్, ఇన్విజిలేటర్ సంతకం, ప్రశ్నల ఆప్షన్లు, ప్రశ్నలను సరిగ్గా అర్థంచేసుకోవడం వంటివి చేయాలి. ఉదాహరణకు తేడాలు రాయమంటే.. చాలా మంది పోలికలు రాస్తారు. ముందు ఏం రాయదల్చుకున్నామో, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి.
- కీలకమైన రెండో భాగంలో 150 నిమిషాలు సమాధానాలకు కేటాయించాలి. చిన్న జవాబులు, వ్యాస రూప ప్రశ్నల్లో దేనికి ఎంత రాయాలో అంతే రాయాలి. షార్ట్ ఆన్సర్లకు మూడు, నాలుగు పేజీలు రాయవద్దు. షార్ట్ ఆన్సర్లను 3 నిమిషాలు, వ్యాస రూప ప్రశ్నలను 15 నిమిషాల్లో పూర్తిచేయాలి. మధ్యలో ఒక ప్రశ్నకు సమాధానం రాకపోతే తదుపరి ప్రశ్నకు వెళ్లిపోవాలి.
- మూడో భాగంలో 10 నిమిషాలు రివ్యూ (సమీక్ష) కోసం కేటాయించాలి. ఈ సమయంలో పెండింగ్‌వి రాసుకోవడం, శీర్షికలు, ఉపశీర్షికలు రాశామోలేదో చూసుకోవడం, ప్రశ్నల నంబర్లు వేశామో లేదో సరిచూసుకోవాలి. ఎన్ని రాశాం, ఎన్ని వదిలేశాం అన్నది సైతం తేల్చుకోవాలి.
- నాలుగో భాగంలో 10 నిమిషాలు స్టాండ్‌బైగా, లేదా ఎమర్జెన్సీకి (అనుకోని సందర్భాలు, అవరోధాలు) కేటాయించాలి. మంచినీళ్లు, బాత్రూమ్ వెళ్లడం, కొన్ని సార్లు స్కాడ్ చెకింగ్స్ వచ్చినప్పుడు సమయం తీసుకుంటుంది. ఇంకొన్నిసార్లు తల తిరిగినట్టుగా ఉంటుంది. వీటికి ఆ పది నిమిషాలను వాడాలి.
మరికొన్ని సూచనలు..
- పరీక్షకు ముందురోజు ఏమీ చదవకపోవడం మంచిది. పరీక్ష రోజు అస్సలు చదవద్దు. నాకు అన్నీ వచ్చు. నేను బాగా రాస్తాను. పాస్ అవుతానన్న నమ్మకంతో పరీక్ష హాల్లోకి ప్రవేశించాలి.
- ప్రశ్నపత్రం ఇవ్వగానే మనకు సమాధానాలు వచ్చి న ప్రశ్నల నంబర్‌పై పెన్సిల్‌తో టిక్ చేసుకోవాలి.
- ప్రశ్నలను చదివి ఏం అడిగారో దానిని బట్టే ఆన్సర్ రాయాలి. ఉదాహరణకు రాముడు భార్య కాని వారు ఎవరు.. అన్న ప్రశ్న ఇస్తే.. కంగారుగా మొదటి ముక్కలు చదివేసి అశాస్త్రీయంగా సీత అని రాయవద్దు. ఇది తప్పు. ప్రశ్నను పూర్తిగా చదివాకే జవాబు రాయాలి.
- అన్సర్షీట్లో ప్రశ్న నంబర్, సెక్షన్ జాగ్రత్తగా వేయాలి. పొరపాటు చేస్తే మార్కులు కోల్పోతారు.
- పెన్నులు, పెన్సిళ్లు స్కేల్ వంటివి వెంట తీసుకెళ్లాలి.
- సమాధానాల్లో రాయాల్సిన అన్ని పాయింట్లు రాయాలి.
- చిత్రాలు (పిక్చర్స్) బొమ్మలు గీసిన తర్వాత భాగాలను తప్పనిసరిగా గుర్తించాలి. ఎన్ని ఎక్కువ భాగాలు గుర్తిస్తే ఎక్కువ మార్కులు వస్తాయి.
- గణితం విద్యార్థులు కుడివైపు 22 శాతం రఫ్ వర్క్ కోసం కేటాయించాలి. ఏ పేజీ రఫ్ వర్క్ ఆ పేజీలోనే ఉండిపోతుంది. కావున గందరగోళం ఉండదు.
- ఒక పరీక్ష రాయకపోయినా ఏమీ కాదు. మిగతావి సంపూర్ణంగా రాయండి. ఆ ఒక్కటి మళ్లీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో రాసుకోవచ్చు. ప్రతి పరీక్షలో మీ ప్రతిభ బయటపడుతుంది.. మీరు మరింత సాధన చేస్తే మెరుగుపడుతుంది.
- ఆరోగ్యం, జీవితం రెండు ముఖ్యమే. ఇంతకు ముందు ఎన్నో పరీక్షలు రాశారు. అందులో ఇదొకటి.
- పరీక్షలు పాఠ్యాంశాలపై విద్యార్థులకు గల అవగాహనను తెలిపే సూచికలు మాత్రమే. పరీక్షలు జీవిత సూచికలు కాదు. ఎప్పటికి ఇలాగే ఉండిపోతారన్న భ్రమలు వద్దు.
- Tags
- Inter
- nipuna special
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?