పెంబర్తి లోహ హస్తకళ.. ఇత్తడి మెటల్ షీట్ భళా
గ్రామీణ టూరిజం
- తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన చిత్ర లేఖనం సంస్కృతులు, సంప్రదాయాలకు, ఆచారాలకు నిలయమైంది. హస్తకళా వస్తువులకు అత్యధిక ప్రాధాన్యం కలిగి ఉంది. వీటిని అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం కొన్ని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులను గుర్తించింది.
అవి ..
పోచంపల్లి – యాదాద్రి భువనగిరి జిల్లా
నిర్మల్ – ఆదిలాబాద్ జిల్లా
చేర్యాల – సిద్దిపేట జిల్లా
పెంబర్తి – జనగామ - వీటి ద్వారా హస్తకళల కుటుంబాలను ప్రోత్సహించడం, అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.
జనగామ జిల్లా
- పెంబర్తి లోహ హస్తకళ: ఈ కళాకృతి ప్రపంచ ప్రసిద్ధి గాంచినది. ఇది ఇత్తడి మెటల్ షీట్‌పైన కళాఖండాలు చెక్కే ఒక కళ. కాకతీయుల కాలంలో ప్రజాదరణ పొందిన రథాలను, దేవాలయాలను అలంకరించారు. చారిత్రక కట్టడమైన కాకతీయుల ద్వారం ఈ కళాకృతుల్లో చెక్కిందే. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ పెంబర్తిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్‌గా గుర్తించింది.
నిర్మల్
- ఈ కళాకృతులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. నిర్మల్‌ను పాలించిన నిమ్మనాయకుడు కొయ్య బొమ్మలను తయారు చేసే కళాకారులను తీసుకువచ్చి ఉపాధి కల్పించాడు. ఈ బొమ్మల తయారీకి ఉపయోగపడేవి పునికి చెట్టు కలప. హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపోరియం ద్వారా నిర్మల్ బొమ్మలను విదేశాలకు ఎగుమతి చేస్తారు. నిర్మల్ పెయింటింగ్‌లో బ్లాక్ పెయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్‌గా రావడం దీనిలోని ప్రత్యేకత. నిర్మల్ బొమ్మలు, క్రాఫ్ట్, నిర్మల్ ఫర్నీచర్, నిర్మల్ పెయింటింగ్‌కు 2008లో భౌగోళిక గుర్తింపు లభించింది.
జోగులాంబ గద్వాల
- గద్వాల చీరలకు ప్రసిద్ధి చెందినది. 2012లో ఈ చీరలకు భౌగోళిక గుర్తింపు లభించింది.
కరీంనగర్ జిల్లా
- ఫిలిగ్రీ కళ: కరీంనగర్ వెండి నగిషీ పనులకు ప్రసిద్ధి. నగల పెట్టెలు, ఫ్లవర్‌వాజ్, చార్మినార్ బొమ్మలు, పక్షులు, పుష్పాల ఆకృతులు మొదలైన వాటిపై నగిషీ పనులు ఇక్కడ చేస్తారు. ఈ కళను రూపొందించినది కడార్ల రామయ్య. ఈ కళకు 2007లో భౌగోళిక గుర్తింపు లభించింది.
సిద్దిపేట జిల్లా
- చేర్యాల పెయింటింగ్స్: చేర్యాల గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్క్రోల్ పెయింటింగ్స్‌కు ప్రసిద్ధి. ఈ పెయింటింగ్స్‌లో పురాణాలను, ఇతిహాసాలను డిజైన్లుగా తీసుకొని మట్టి రంగులతో గోడకు వేలాడదీసే పెయింటింగ్స్ వేస్తారు. వీటికి 2010లో భౌగోళిక గుర్తింపు లభించింది. సిద్దిపేట గొల్లభామ చీరలకు ప్రసిద్ధి. వీటికి 2011లో భౌగోళిక గుర్తింపు లభించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా
- పోచంపల్లి: ఇక్కడ తయారయ్యే ఇక్కత్ చేనేత చీరలు 2005 నుంచి భౌగోళిక గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ జిల్లాలోని ప్రముఖ చేనేత కేంద్రం, గ్రామీణ పర్యాటక కేంద్రం పోచంపల్లి గ్రామాన్ని తెలంగాణ సిల్క్ సిటీ అని పిలుస్తారు.
హెరిటేజ్ టూరిజం
తెలంగాణ రాష్ట్రం అనేక చారిత్రాత్మక ప్రదేశాలను హోటళ్లను కలిగి ఉంది. మెదక్ ఫోర్ట్, గోల్కొండ ఫోర్ట్, ఖమ్మం ఫోర్ట్, నిజామాబాద్ ఫోర్ట్, ఎలగందుల ఫోర్ట్, భువనగిరి ఫోర్ట్
హైదరాబాద్ జిల్లా
- క్రీ.శ. 1562లో మొఘల్ చక్రవర్తి కులీ కుతుబ్ షా వలి హైదరాబాద్ నగర నిర్మాణం చేపట్టాడు. దేశంలోనే అతి ప్రాచీన నగరాల్లో ఒకటి, అతిపెద్ద నగరాల్లో 5వది, తెలంగాణ రాష్ట్ర రాజధాని, ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇది మూసీ నది ఒడ్డున ఉన్నది.
- చార్మినార్: 1591లో మొఘల్ చక్రవర్తి కులీ కుతుబ్ షా చార్మినార్‌ను నగరం నడిబొడ్డున నిర్మించాడు. భూమి నుంచి 48.7 మీటర్ల ఎత్తులో నాలుగు మినార్లను నిర్మించారు. లోపల నుంచి ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్లి నలువైపులా నగర అందాల్ని వీక్షించడానికి పర్యాటకులు వస్తుంటారు.
- గోల్కొండ కోట: 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. భారతదేశంలోని కోటల్లోనే అతి ప్రాచీనమైనది. తర్వాత కులీ కుతుబ్ షాహీలు గ్రానైట్ కోటను నిర్మించారు.
సాలార్జంగ్ మ్యూజియం
- దీన్ని 3వ సాలార్జంగ్ అయిన యూసఫ్ అలీఖాన్ నెలకొల్పాడు. గడియారాల సేకరణలో ఈ మ్యూజియం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మేలిముసుగు ధరించిన రెబెకా శిల్పం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
- ఇతర పర్యాటక ప్రదేశాలు: పైవాటితో పాటు హైదరాబాద్‌లో చూడవలసిన ఇతర పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి హుస్సేన్ సాగర్‌కు ఆనుకొని ఉన్న నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, బుద్ధుని విగ్రహం దగ్గరకు బోటింగ్, పబ్లిక్ గార్డెన్స్, రామోజీ ఫిలింసిటీ, వండర్ వరల్డ్ పార్క్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరా పార్క్, ఐ-మ్యాక్స్, రాష్ట్రపతి నిలయం, జూబ్లీ హాల్, సెయింట్ జోసఫ్ చర్చి, ఫలక్‌నుమా ప్యాలెస్, పాయిగా సమాధులు మొదలైనవి.
- జగిత్యాల: మొఘల్ పరిపాలనలో దీన్ని నిర్మించారు. నిల్చుని పైకిచూస్తే ఈ కోట నక్షత్రాకారంలో కనబడుతుంది. 18వ శతాబ్దంలో నిజాం సంస్థానంలో ఖాసీం రజ్వీ ఈ కోటను పునర్నిర్మించాడు.
ములుగు జిల్లా
- తాడ్వాయి: గిరిజన, వన్యప్రాణి సంరక్షణ, పకృతి పర్యాటక కేంద్రం. తాడ్వాయి గిరిజన గ్రామం సమ్మక్క, సారలమ్మ తాడ్వాయిగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ప్రేమికులకు ఇక్కడి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం కనువిందు చేస్తుంది.
- దట్టమైన అడవి లోపల వన జీవన్ పేరుతో అటవీశాఖ కాటేజీలు నిర్మించింది. పర్యాటకులు వీటిలో బస చేసి అడవి అందాలను ఆస్వాదించవచ్చు.
జోగులాంబ గద్వాల జిల్లా
- గద్వాల కోట: 17వ శతాబ్దంలో గద్వాల పాలకుడైన పెద సోమభూపాలుడు నిర్మించాడు. గద్వాల పాలకులు కర్నూలు నవాబులను ఓడించి దేశంలోనే అతి పెద్దదైన 32 అడుగుల ఎత్తయిన యుద్ధ మర ఫిరంగిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇప్పటికీ ఈ కోటలోనే ఉన్నది.
కామరెడ్డి జిల్లా
- దోమకొండ కోట: కుతుబ్ షాహీల పాలనలో నిర్మించారు. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన దోమకొండ సంస్థానాల రెడ్డి పాలకులు ఈ కోటను నిర్మించినట్లుగా కూడా చెబుతారు.
- కౌలాస్ కోట: జుక్కల్ మండలంలో ఉన్న ఈ కోటను రాష్ట్రకూటులు నిర్మించారు. సెమీ ద్రవిడియన్ శైలిలో ఉన్న ఈ కోటను కాకతీయులు కాలంలో అభివృద్ధి చేశారు.
కరీంనగర్ జిల్లా
- ఎలగందుల ఖిల్లా: కరీంనగర్‌కు 15 కి.మీ. దూరంలో ఉన్న పురాతన చారిత్రక గ్రామం. మానేరు నది ఒడ్డున 1754లో జాఫర్- ఉద్-దౌలా అనే నిజాం రాజు నిర్మించాడు.
ఖమ్మం జిల్లా
- ఖమ్మం ఖిల్లా: 1512లో కుతుబ్ షాహీలు స్వాధీనం చేసుకున్న ఈ కోటను మొదట క్రీ.శ.950లో కాకతీయుల కాలంలో నిర్మించారు. ఖమ్మం పట్టణం మధ్యలో గ్రానైట్‌తో నిర్మించబడింది.
నిజామాబాద్ జిల్లా
- నిజామాబాద్ కోట: ఇంద్రపురిగా పిలిచే నిజామాబాద్ కోట తర్వాత ఇందుర్తి/ ఇందూరుగా ప్రస్తుతం నిజామాబాద్‌గా పిలవబడుతుంది. రాష్ట్ర కూటులు ఈ కోటను నిర్మించారు. కోట వాస్తు శిల్పం అసఫ్‌జాహీ శైలిని ప్రతిబింబిస్తుంది.
వరంగల్ జిల్లా
- వరంగల్ ఖిల్లా : రెండో ప్రోలరాజు ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ కోటలో గల కాకతీయుల కళా తోరణాలు, శిల్పకళకు ప్రసిద్ధి గాంచినవి. దీన్నే ఏకశిలా నగరం/సుల్తాన్పూర్ అని కూడా అంటారు. కోటకు నాలుగు వైపులా నాలుగు అతిపెద్ద తోరణాలు ఉన్నాయి. కోటలోపల సితాబ్‌ఖాన్ నిర్మించిన ఎత్తయిన రాతి కట్టడం ఉంది. దీని పేరు ఖుష్‌మహల్.
కల్చరల్ టూరిజం
- తెలంగాణ బతుకమ్మ, బోనాలు, సమ్మక్క-సారలమ్మ జాతర వంటి సాంస్కృతిక పండుగలను వీక్షించడానికి అనేక మంది పర్యాటకులు వస్తున్నారు
- బతుకమ్మ: ఇది తెలంగాణ పూల పండుగ, దీన్ని ప్రధానంగా మహిళలు జరుపుకొంటారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. ఈ పండుగను ఆశ్వయుజ చైత్ర అమావాస్య రోజున మొదలవుతుంది. ఈ పండుగను 9 రోజులు నిర్వహిస్తారు. ఈ పండుగకు ముందు పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని 9 రోజులు బొడ్డెమ్మ అడతారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. దీన్నే పూల పండుగ అంటారు. దీనిలో ప్రధానంగా తంగేడు, గునుగు పూలు వినియోగిస్తారు. బతుకమ్మకు మరోపేరు గౌరమ్మ ఈ పండుగ రోజున గౌరమ్మను పూజించి చెరువులో నిమజ్జనం చేస్తారు.
- బోనాలు: ఈ పండుగను కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ, లాల్‌దర్వాజ మైసమ్మలకు బోనాలు సమర్పిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో బోనాల శకటాన్ని ప్రదర్శించారు.
సమ్మక్క సారలమ్మ జాతర
- అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర లేదా సమ్మక్క-సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు. ఇది కుంభమేళా తర్వాత దాదాపు కోటి మంది భక్తులను ఆకర్షిస్తున్న జాతర. ఇది తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రారంభ మవుతుంది. ఇది అన్యాయమైన చట్టాలతో పాలించిన పాలకులకు వ్యతిరేకంగా తల్లి, కుమార్తెలయిన సమ్మక్క, సారలమ్మల పోరాటంగా చెప్పకొంటారు. కుంభమేళా తర్వాత ఎక్కువ మంది హాజరయ్యే పండుగ ఇది. సమ్మక్క సారలమ్మ దేవతలకు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది ఆదివాసీల అతిపెద్ద పండుగ. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. కోటికి పైగా భక్తులు ఈ జాతరను సందర్శించారు.
అడ్వెంచర్ టూరిజం
- ఈ టూరిజం రిసార్ట్‌ను రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు.
వ్యాపార పర్యాటకం
- రాష్ర్టానికి పర్యాటకులను ఆకర్షించేందుకు సమావేశాలు, గోష్టులు, ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. వివిధరకాల ప్రపంచస్థాయి హోటల్స్, సమావేశ కేంద్రాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఔషధ సంస్థలు, సుసంపన్నమైన సంస్కృతి ప్రపంచ ప్రసిద్ధ వంటకాలకు ఆలవాలం వ్యాపార పర్యాటకానికి హైదరాబాద్ అనుకూలమైనదిగా చెప్పవచ్చు.
క్రూయిజ్ టూరిజం
- తెలంగాణలో ప్రధానమైన నదులు, చెరువులు కలిగి ఉండటం వల్ల క్రూయజ్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ.
- బోటులో షికారుతో కూడిన టూరిజాన్ని క్రూయిజ్ టూరిజం అంటారు.
- కృష్ణా, గోదావరి నదుల్లో దీన్ని బాగా అభివృద్ధి చేశారు. గోదావరిలో పట్టిసీమ నుంచి పాపికొండల వరకు జరిగే టూరిజం కృష్ణానదిలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ఏర్పాటు చేసిన బోటు షికారు.
- హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చెందింది.
- లక్నవరం సరస్సులో క్రూయిజ్ టూరిజం బాగా అభివృద్ధి చెందింది.
Previous article
96వ రాజ్యాంగ సవరణ @ ‘ఒడియా’
Next article
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు