అనుపస్థితి భూస్వాములు… వ్యవసాయ మార్కెటింగ్ దశలు
1. భూదానోద్యమంలో మొదట భూమిని దానంగా ఇచ్చింది ఎవరు?
ఎ) వి. రామచంద్రారెడ్డి
బి) మీర్ ఉస్మాన్ అలీఖాన్
సి) రాజా బహదూర్ గిలివార్
నారాయణ్ సింగ్
డి) రాంకా రాజా సమాధానం (ఎ)
వివరణ : భూదాన్ ఉద్యమం : భూమిని దానంగా స్వీకరించే ఉద్యమాన్ని ‘భూదానోద్యమం’ అంటారు. ఎవరి బలవంతం గాని, ఏ విధమైన చెల్లింపులు గాని లేకుండా భూస్వాములు లేదా భూమిని దానంగా ఇచ్చే వాళ్లు భూమిపై యాజమాన్యాన్ని వదులుకొనేవారు. అందుకే భూదానోద్యమాన్ని భూమి బహుమతి ఉద్యమం లేదా రక్త రహిత విప్లవం అని కూడా అంటారు. భారత దేశంలో స్వచ్ఛంద భూసంస్కరణ ఉద్యమం అని అంటారు.
- భూదానోద్యమాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబాభావే 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ప్రారంభించారు.
- భూదాన ఉద్యమం భూమి లేని నిరుపేదల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టగలదనే ఆశయంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ఒక విధంగా భూసంస్కరణకు సహాయకారిగా ఉంటుంది. భూస్వాములపై ఒత్తిడిని తగ్గించడానికి, భూమిలేని వారి జీవితాలను మెరుగుపరచడానికి ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది.
- భూదానోద్యమంలో మొదటగా భూమిని దానంగా ఇచ్చిన భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి. తనకు ఉన్న 1400 ఎకరాల భూమిలో 100 ఎకరాల (40 హెక్టార్లు)ను మొదట దానంగా అందించారు. తరువాత అదనంగా 800 ఎకరాలను కూడా విరాళంగా ఇచ్చారు.
- ఆ తర్వాత హైదరాబాద్‌లో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూడా తన వ్యక్తిగత భూమిలో 14,000 ఎకరాలు భూదానోద్యమానికి విరాళంగా ఇచ్చారు.
- ఆ తర్వాత రాజా బహదూర్ గిలివార్ నారాయణ్‌సింగ్, CBE, రాంకా రాజాతో కలిసి 1,02,001 ఎకరాల భూమిని భూదానోద్యమానికి విరాళంగా ఇచ్చారు. ఇది దేశంలోనే అతిపెద్ద విరాళం.
- 1970 మార్చి నెల వరకు 48లక్షల ఎకరాల భూమిని ఈ ఉద్యమం కింద దానంగా స్వీకరించడం జరిగింది. ఈ భూమిని వ్యవసాయం చేసే భూమిలేని రైతులకు పంపిణీ చేశారు.
- దానంగా లభ్యమైన భూమి, దాని పంపిణీ అంశాలను బట్టి చూస్తే ఈ ఉద్యమం విజయవంతం కాలేదని చెప్పవచ్చు. దానంగా స్వీకరించిన భూమిలో కొంత సాగు చేయడానికి అనువుగా లేదు, వివాదాల్లో ఉన్నట్లుగా తేలింది. అంతేకాకుండా చాలా చోట్ల పంపిణీ చేసిన భూమిని సాగు చేయడం లేదు.
2. గ్రామదాన ఉద్యమం ఎక్కడ ప్రారంభించారు?
ఎ. తెలంగాణ రాష్ట్రం -యాదాద్రి
భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామం
బి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -నల్లగొండ జిల్లా, పోచంపల్లి గ్రామం
సి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం – హరిపూర్ జిల్లా, మన్గ్రోత్ గ్రామం
డి. ఒడిశా రాష్ట్రం – హరిపూర్ జిల్లా, మన్గ్రోత్ గ్రామం సమాధానం – (సి)
వివరణ : గ్రామదాన ఉద్యమాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబాభావే 1952లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హరిపూర్ జిల్లా మన్గ్రోత్ గ్రామంలో ప్రారంభించారు.
- భూదాన ఉద్యమం అధునాతన దశ గ్రామదాన ఉద్యమం/గ్రామ బహుమతి ఉద్యమం
- గ్రామాలను దానంగా స్వీకరించే ఉద్యమాన్ని ‘గ్రామదాన ఉద్యమం’ అంటారు.
- భూమిపై సమిష్టి యాజమాన్యాన్ని తీసుకురావడం ద్వారా స్వయం సమృద్ధి గల గ్రామాలను సృష్టించడం దాని లక్ష్యం.
- ఒక గ్రామంలోని యజమానుల్లో 80% తమ భూమిలో 51 శాతం కంటే తగ్గకుండా ఉంటే ఆ గ్రామాన్ని దానంగా స్వీకరించాలి.
- 1953 జనవరి 30న ఒడిశా రాష్ట్రం – కటక్ జిల్లాలోని మన్పూర్ గ్రామం మొదటి గ్రామదాన్ను అందుకుంది.
- నేడు భారతదేశంలోని ఏడు రాష్ర్టాల్లో అంటే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల్లో 3660 గ్రామదాన గ్రామాలున్నాయి. వీటిలో అత్యధికంగా ఒడిశాలో (1309) ఉన్నాయి.
- 1970 మార్చి నాటికి 3,78,000 గ్రామాలను దానంగా స్వీకరించారు.
- గ్రామదానోద్యమం సంపత్తి దానం, బుద్ధి దానం, శ్రమదానాలుగా విస్తరించి ప్రస్తుతం సర్వోదయ విధానానికి దారి తీసింది.
3. అధిక పరిమాణంలో భూమి గల భూస్వాములు వ్యవసాయం చేయటానికి వీలుకాకనో, ఇష్టం లేకనో తమ భూములను ఇతరులకు కౌలుకు ఇచ్చేవారిని ఏమంటారు?
ఎ) జాగీర్దారులు బి) దొరలు
సి) అనుపస్థితి భూస్వాములు
డి) పెత్తందారులు సమాధానం (సి)
వివరణ : స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో ఉన్న భూస్వామ్య పద్ధతుల్లో అంటే రైత్వారీ పద్ధతి, జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతుల ద్వారా పన్ను వసూలు నిమిత్తం ఉన్న మధ్యవర్తులను ప్రభుత్వం తొలగించడానికి చర్యలు తీసుకున్నది. కానీ భూమిని సేద్యం చేయకుండా యాజమాన్యపు హక్కును కలిగిన వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. అంతేకాకుండా మధ్యవర్తుల తొలగింపు చర్యల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరిగాయి. అవి
- అనుపస్థితి భూస్వాములు ప్రభుత్వానికి భూమిశిస్తు చెల్లించి రైతుల నుంచి కౌలు వసులు చేస్తారు. వీరు భూమి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేశారు.
- డానియల్ అండ్ థార్నర్ చెప్పినట్లు ‘చాలా మంది మధ్యవర్తులు వ్యవసాయ దారులుగా మరికొన్ని ప్రత్యేక హక్కులను పొందగలిగారు.
- మధ్యవర్తులు సొంత సేద్యం చేసుకొనే నెపంతో చాలామంది కౌలుదార్లను తొలగించి భూమి యాజమాన్యాన్ని పొందగలిగారు. ఈ విధంగా ఏర్పడిన రైతులే ‘అనుపస్థితి భూస్వాములు’
- అనుపస్థితి భూస్వాములు నష్టపడకుండా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. ఎక్కువ పరిమాణంలో కౌలు వసూలు చేస్తూ కౌలుదార్లను వీళ్లు బాధిస్తూ ఉంటారు. కౌలుదార్లను కట్టుబానిసలు, శ్రామికులుగా వారి గృహాల్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇటువంటి న్యాయబద్ధం కాని అమానుషమైన చర్యలను వీరు అవలంబించడం వల్ల ప్రభుత్వం 1960 తర్వాత జమీందారీ, మహల్వారీ పద్ధతులను రద్దు పరచడంలో అనుపస్థితి భూస్వాములు కూడా కనుమరుగయ్యారు.
4. ‘న్యూస్ లెటర్’ అనే పక్ష పత్రికను ఏ విత్త సంస్థ ప్రచురిస్తుంది?
ఎ. SBI బి. RBI
సి. IMF డి. IBRD
సమాధానం (బి)
వివరణ : భారతదేశంలో కేంద్రబ్యాంకును భారతీయ రిజర్వు బ్యాంకు (RBI – Reserve Bank of India) అంటారు. దేశంలో 1921లో ఇంపీరియల్ బ్యాంకును నెలకొల్పి కేంద్ర బ్యాంకుగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచిస్తే సమర్థవంతంగా పని చేయకపోవడం వల్ల, 1926లో హిల్టన్ యంగ్ అధ్యక్షతన ఏర్పడిన ‘రాయల్ కమిషన్’ తన నివేదికలో భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంకును నెలకొల్పాలని సూచించింది.
- JM కీన్స్ ప్రణాళిక ఆధారంగా 1934 మార్చి 5 RBI చట్టం ప్రకారం1935 ఏప్రిల్ 1న రూ.5 కోట్ల స్థిర మూలధనంతో ఒక్కొక్క వాటా రూ.100 ల చొప్పున రూ.5 లక్షల ఖాతాదారులతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది.
- భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949 జనవరి 1న RBIని ప్రభుత్వం జాతీయం చేసింది. RBI ప్రధాన కార్యాలయం ప్రారంభంలో కలకత్తాలో ఉండేది. తర్వాత 1937లో బొంబా యికి మార్చారు.
- RBI 20 మంది డైరెక్టర్లతో కూడిన నియంత్రణ మండలి కింద పనిచేస్తుంది. దీని ముఖ్య నిర్వహణ అధికారి గవర్నర్ ఇతనితోపాటు నలుగురు డిప్యూటీ గవర్నర్లు కూడా పని చేస్తారు. 1974 నుంచి RBI ‘న్యూస్ లెటర్’ అనే పక్ష పత్రికను ప్రచురిస్తుంది.
- RBI మొట్టమొదటి గవర్నర్ ఒస్బోర్న్ స్మిత్ (1935-37)
- RBI మొదటి భారతీయ గవర్నర్ C.D. దేశ్‌ముఖ్ (1943-49)
- ప్రస్తుతం RBI 25వ గవర్నర్ శక్తి కాంతదాస్ 2018 డిసెంబర్ 12 నుంచి విధులను నిర్వహిస్తున్నారు.
5. వస్తుమార్పిడి పద్ధతిలో C-C Economy అంటే ఏమిటి?
ఎ. Cash to Commodity Economy
బి. Credit to
Commodity Economy
సి. Commodity to
Commodity Economy
డి. Commodity to Cash Economy
సమాధానం (సి)
వివరణ : ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు ఆర్థిక లావాదేవీలన్నీ వస్తు రూపంలో జరిగేవి.
- ప్రాచీన కాలంలో వస్తువుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. అంతేకాక మానవుని కోరికలు కూడా చాలా పరిమితంగా ఉండేవి. అందువల్ల ప్రతి వ్యక్తి తనకు అవసరమైన వస్తు సేవలను తానే తయారు చేసుకొనే వారు.
- నాగరికత అభివృద్ధి చెందేకొద్ది మానవుని కోరికలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ పెరిగిన కోరికలను తీర్చుకోవడానికి వ్యక్తి తనకు తాను ఉత్పత్తి చేసుకోలేని స్థితికి వచ్చారు. అప్పుడు తనకు కావలసిన వస్తువుల్లో కొన్ని తానే తయారు చేసుకొని, మిగిలిన వాటి కోసం ఇతరుల మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. రాను రాను కోరికలు అధికమై వస్తువుల కోసం ఇతరుల మీద ఆధారపడటం ఎక్కువ అయింది.
- ప్రతి వ్యక్తి తాను ఏ వస్తువులను సులభంగా ఉత్పత్తి చేస్తాడో.. ఆ వస్తువులను ఇచ్చి తనకు కావలసిన ఇతర వస్తువులను మారకం ద్వారా పొందటం మొదలు పెట్టాడు. దీన్ని ‘వస్తు మార్పిడి’ అంటారు
- ఒక వస్తువుకు బదులు మరొక వస్తువును మార్పిడి చేయటాన్ని ‘వస్తు మార్పిడి’ అంటారు.
ఉదా : వరి పండించే వ్యక్తి – వస్త్రం నేసే వ్యక్తికి వరి ధాన్యాన్ని ఇచ్చి వస్ర్తాన్ని పొందడం.
- ఇద్దరు వ్యక్తులు తమకు కావలసిన వస్తువులను పరస్పరం మార్చుకొనే పద్ధతినే “వస్తు మార్పిడి” అంటారు.
- వస్తువులను ప్రత్యక్షంగా ఇచ్చి పుచ్చుకోవడాన్ని ‘వస్తు మార్పిడి పద్ధతి’ అంటారు.
- వస్తువుకు బదులుగా వస్తువు లేదా సేవకు బదులుగా వస్తువులు మార్పిడి చేసుకోవడాన్ని ‘వస్తు మార్పిడి పద్ధతి’ అంటారు.
- వస్తు మార్పిడి పద్ధతిలో వినిమయ మాంద్యం ఉండదు. అందుకే ఈ వస్తు మార్పిడి పద్ధతిని C-C Economy అంటే Commodity to Commo dity Economy అంటారు.
6. కింది వాటిలో వ్యవసాయ మార్కెటింగ్ దశలు ఏవి?
ఎ. అసెంబ్లింగ్, గ్రేడింగ్
బి. ప్రామాణీకరణ, అగ్మార్క్
సి. ప్రాసెసింగ్, ఎకోలేబులింగ్
డి. పైవన్నీ సమాధానం (డి)
వివరణ: వ్యవసాయదారుడు ఉత్పత్తి చేసిన వస్తువులు వినియోగదారులకు చేరే వరకు జరిగే ప్రక్రియను ‘వ్యవసాయ వస్తువుల మార్కెటింగ్’ అంటారు. సాధారణంగా వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించలేరు. అంతేకాకుండా ఉత్పత్తి అయిన రూపంలో వ్యవసాయ వస్తువులు వినియోగ అర్హత కావు వీటిని వినియోగానికి పనికి వచ్చేటట్లు మార్చడానికి కొన్ని ప్రక్రియలు అవలంబించవలసి ఉంటుంది.
ఉదా : వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చడం, నూనె గింజలను నూనెగా మార్చడం. వ్యవసాయ దారుడు తాను ఉత్పత్తి చేసిన వస్తువులను వినియోగానికి అనువుగా మార్చి వినియోగదారునికి నేరుగా విక్రయించలేడు. మధ్యలో క్రయ విక్రయ వివిధ దశలు దాటి వినియోగదారునికి చేరుతాయి.
మార్కెటింగ్ దశలు
- అసెంబ్లింగ్ (Assembling): వ్యవసాయదారులు వివిధ ప్రాంతాల్లోని కమతాల్లో ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఒక నిర్ణీత ప్రదేశానికి చేరవేసే ప్రక్రియను ‘అసెంబ్లింగ్’ అంటారు.
- గ్రేడింగ్ (Grading): వ్యవసాయ ఉత్పత్తులను వాటి నాణ్యతను బట్టి వేరు చేసే ప్రక్రియను ‘గ్రేడింగ్’ లేదా ‘శ్రేణీకరణ’ లేదా ‘తారతమ్య నిరూపణ’ అంటారు.
- గ్రేడింగ్ సదుపాయాలను మొదట నాగపూర్‌లో ప్రారంభించి తర్వాత భోపాల్, భువనేశ్వర్‌లో ఏర్పాటు చేశారు.
- ప్రామాణీకరణ (Standardization): గ్రేడింగ్ చేసిన ఉత్పత్తులను ప్రామాణీకరణ చేసి ప్రభుత్వం అగ్మార్క్ గుర్తు ఇస్తుంది.
- అగ్మార్క్ (AGmark): వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యతగల వస్తువులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తును ‘అగ్మార్క్’ అంటారు.
- ఈ అగ్మార్క్ గల వస్తువులకు గిట్టుబాటుధర లభిస్తుంది.
- ప్రాసెసింగ్ (Processing): వ్యవసాయ ఉత్పత్తిని వినియోగానికి అనువుగా మార్చడాన్ని ‘ప్రాసెసింగ్’ అంటారు.
ఉదా : వరిధాన్యాన్ని బియ్యంగా మార్చడం - ఎకోలేబులింగ్ (Eco Labeling): వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత ప్రామాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం ఎకోలేబులింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం వస్తువుల నాణ్యతను మదింపు దిశగా మూడవ పార్టీ నిర్ధారిస్తుంది. దీని వల్ల వస్తువులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వీలుంటుంది.
- వ్యవసాయోత్పత్తిని మార్కెట్‌కు రవాణా చేయడం, గిడ్డంగుల్లో నిల్వ చేయడం, అవసరమైతే నష్ట భయాన్ని నివారించడం కూడా మార్కెటింగ్‌లో ఒకభాగం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?