Current Affairs – Groups Special | ప్రపంచ సామర్థ్య సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1. ప్రపంచ అంతరిక్ష వారంగా నిర్వహించే తేదీలు ఏవి? (2)
1. అక్టోబర్ 1 నుంచి 7
2. అక్టోబర్ 4 నుంచి 10
3. అక్టోబర్ 10 నుంచి 17
4. సెప్టెంబర్ 15 నుంచి 21
వివరణ: ఏటా అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తారు. 1999లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ చేసిన తీర్మానం మేరకు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇదే తేదీలను ఎంపిక చేసుకోడానికి కారణం ఉంది. సోవియట్ యూనియన్ తొలిసారి
స్పుత్నిక్-1ను ఇదే రోజున ప్రయోగించారు. మానవుడు తయారు చేసిన ఒక ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లడం అదే ప్రథమం. ఈ ఏడాది ఈ వారపు ఇతివృత్తం-అంతరిక్షం-వ్యవస్థాపన. భారతదేశం తన తొలి అంతరిక్ష ప్రయోగాన్ని 1975, ఏప్రిల్ 19వ తేదీన చేపట్టింది. తొలి ఉపగ్రహానికి పెట్టిన పేరు ఆర్యభట్ట.
2. ఆర్21 మాట్రిక్స్-ఎం ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. ఇది ఏంటి? (2)
1. కరోనా కొత్త వేరియంట్
2. మలేరియా వ్యాక్సిన్
3. ఏ వైరస్‌కైనా పనిచేసే వ్యాక్సిన్
4. కొత్తగా కనుగొన్న గెలాక్సీ
వివరణ: మలేరియాకు రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఆర్21/మ్యాట్రిక్స్-ఎంను వినియోగించాలని జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మలేరియాకు ఇది రెండో వ్యాక్సిన్. ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01 అనేది మలేరియాకు అందుబాటులోకి వచ్చిన తొలి వ్యాక్సిన్. జీఏవీఐ (గ్లోబల్ వ్యాక్సిన్ అలయెన్స్), అలాగే యూనిసెఫ్ ఈ వ్యాక్సిన్‌ను కొని ఉచితంగా పేద దేశాలకు ఇవ్వనున్నాయి. ప్రస్తుత ఆర్21 వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, సీరం ఇన్స్టిట్యూట్లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీని సామర్థ్యం 75% మేర ఉందని అధ్యయనంలో తేలింది. దీన్ని వినియోగించుకొనేందుకు ఇప్పటికే బుర్కినాఫాసో, ఘనా, నైజీరియా దేశాలు అనుమతిచ్చాయి
3. ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-19 చాంపియన్‌షిప్‌ను గెలిచిన దేశం ఏది? (3)
1. బంగ్లాదేశ్ 2. శ్రీలంక
3. భారత్ 4. పాకిస్థాన్
1. సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అండర్-19ను భారత జట్టు గెలుచుకుంది. తుదిపోరులో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్న దశరథ్ రంగశాల స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా భారత్‌కు చెందిన మంగ్లేతంగ్ కిప్గెన్ నిలిచారు. అదే విధంగా టాప్ స్కోరర్‌గా గుగ్వామ్సర్ గోయేరే ఉన్నారు.
4. కింది వారిలో ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ పొందనిది ఎవరు? (4)
1. పియరే అగోస్తిని
2. అన్ని హ్యులియర్
3. ఫెరెంక్ క్రౌస్జ్ 4. కటలిన్ కరికో
వివరణ: పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన పియర్ అగోస్తి, ఫెరెంక్ క్రౌజ్, హ్యులియర్‌లకు ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. వీరి పరిశోధన కారణంగా ఎలక్ట్రాన్ల పరిశీలన చాలా సులువైంది. వ్యాధి నిర్ధారణ రంగంలో కొత్త ఆవిష్కరణలకు సరికొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాల రూపకల్పనకు దారి తీసింది. అలాగే ఈ ఏడాది నోబెల్ సాధించిన వారిలో కటలిన్ కరికో కూడా ఉన్నారు. వీరు డ్య్రి వైస్మెన్తో కలిసి ఈ ఏడాది వైద్య విభాగంలో నోబెల్ బహుమతిని పంచుకోనున్నారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడంలో వీరి పరిశోధన కీలకంగా ఉంది.
5. డబ్ల్యూహెచ్వోవోఎస్హెచ్ (హుష్) అనే పదం ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. ఇది ఏంటి? (2)
1. ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు ఉద్దేశించిన పదం
2. హైస్పీడ్ రైలు
3. కొత్త విదేశాంగ విధానం
4. బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక ఒప్పందం
వివరణ: హుష్ అనే పదం హైస్పీడ్ రైలును సూచిస్తుంది. దీన్ని ఇండోనేషియాలో ప్రవేశపెట్టారు. ఈ తరహా రైలు ఆగ్నేయాసియాలో రావడం ఇదే ప్రథమం. జకార్తా నుంచి బాండుంగ్ల మధ్య ప్రయాణిస్తుంది. దీని పూర్తి రూపం-వాక్తు హెమత్, ఉపరాసి ఆప్టిమల్ సిస్టమ్ హండల్. ఇది ఇండోనేషియా భాషకు సంబంధించింది. దీని అర్థం ‘సమయం ఆదా, విశ్వసించదగ్గ వ్యవస్థ, తక్కువ వ్యయం’.
6. ఏ రాష్ట్రం ఇటీవలే కుల ఆధారిత సర్వేను విడుదల చేసింది? (3)
1. ఒడిశా 2. ఉత్తరప్రదేశ్
3. బిహార్ 4. త్రిపుర
వివరణ: కుల ఆధారిత జనగణనను బిహార్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2న విడుదల చేసింది. రెండు దశల్లో దీన్ని సేకరించారు. దీని ప్రకారం ఆ రాష్ట్ర జనాభా 13 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. అతి ఎక్కువగా ఉన్న సామాజిక వర్గం ఈబీసీ. మొత్తం జనాభాలో వీళ్లు 36.01% మేర ఉన్నారు. జనాభా పరంగా చూస్తే వీరి సంఖ్య సుమారు 4.70 కోట్లు. ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని అర్థం. బీసీలు 27.12% మేర ఉన్నారు. సంఖ్య పరంగా వీరి జనాభా 3.54 కోట్లు. రాష్ట్రంలో ఎస్సీలు 19.65% మేర, అంటే సంఖ్య పరంగా 2.56 కోట్ల మేర ఉన్నారు. సాధారణ క్యాటగిరీలో 15.52% మేర ఉన్నారు
8. అక్టోబర్ 2న కింద పేర్కొన్న ఏ నాయకుల జయంతి ఉంటుంది? (2)
ఎ. మహాత్మాగాంధీ
బి. సర్దార్ వల్లభాయ్ పటేల్
సి. లాల్ బహుదూర్ శాస్త్రి
1. ఎ 2. ఎ, సి
3. ఎ, బి 4. ఎ, బి, సి
వివరణ: అక్టోబర్ 2న గాంధీ, లాల్‌బహుదూర్ శాస్త్రిల జయంతి. ఈ ఏడాది మహాత్మాగాంధీ జయంతి ఇతివృత్తం ‘ఏక్ తారీఖ్ ఏక్ గంటా ఏక్ సాత్’ అలాగే స్వచ్ఛతా పక్వాడా 2023న ఈ సందర్భంగా నిర్వహించారు. దీని ఇతివృత్తం ‘చెత్త రహిత భారత్’. లాల్బహూదూర్ శాస్త్రి దేశానికి రెండో ప్రధాన మంత్రిగా పనిచేశారు. ‘జై జవాన్.. జై కిసాన్’ ఆయన నినాదం. హరిత, శ్వేత విప్లవాలు ఆయన హయాంలోనే వచ్చాయి. మహాత్మాగాంధీ 1869లో జన్మిస్తే, లాల్బహూదర్ శాస్త్రి 1904లో జన్మించారు. శాస్త్రి ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వారు.
9. పశ్మినా ఏ రాష్ట్రంతో ముడిపడి ఉంది? (3)
1. రాజస్థాన్ 2. హర్యానా
3. జమ్మూ కశ్మీర్ 4. ఉత్తరాఖండ్
వివరణ: బషోలీ పశ్మినా అనేది ఎంతో కాలంగా జమ్మూ కశ్మీర్లో కనిపించే కళా నైపుణ్యం. ఇటీవల దీనికి జీఐ ట్యాగ్ దక్కింది. ఇది చేతితో తయారు చేసే శాలువా. మృదుత్వం, సరళమైన కళా నైపుణ్యంతో దీన్ని తయారు చేస్తారు. బరువు కూడా తక్కువగా ఉండటం ఈ శాలువ ప్రత్యేకత.
10. ప్రాజెక్ట్ ఉద్భవ్ ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. ఇది ఎవరు ప్రారంభించారు? (1)
1. భారత సైన్యం
2. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ
3. ఇస్రో
4. భూగర్భ మంత్రిత్వ శాఖ
వివరణ: ప్రాజెక్ట్ ఉద్భవ్ను భారత సైన్యం ప్రారంభించింది. భారత ప్రాచీన సాహిత్యంలో ఉండే యుద్ధరీతి, వ్యూహాత్మక ఆలోచనలను తెలుసుకొనేందుకు ఉద్దేశించింది ఇది. రక్షణ రంగంలో మేథో మదన సంస్థగా ఉన్న యూనైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా దీనికి సహకరిస్తుంది. భారత సైనిక వ్యవస్థ గురించి పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు. 2021 నుంచి పరిశోధన కొనసాగుతుంది. ‘పరంపరికా భారతీయ దర్శన్-రణ్నీతి ఔర్ నేత్రితా కే శాశ్వత్ నియమ్’ పేరుతో ఒక ప్రచురణ కూడా తీసుకొచ్చారు. దీన్ని ఆధునికీకరించనున్నారు. కౌటిల్యుడు, కమండకుడు, కురాల్ రాసిన అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు.
11. భారత్, బంగ్లాదేశ్‌లు సెప్టెంబర్ చివరివారంలో దేనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి? (2)
1. తీస్తా నదీ జలాల పంపకం
2. సుందర్బన్స్ పరిరక్షణ
3. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన
4. క్రీడల్లో సహకారం
వివరణ: పర్యావరణ పరంగా సుందర్బన్స్కు ఎలాంటి హాని జరగకుండా పరస్పరం సహకరించుకోవాలని భారత్, బంగ్లాదేశ్‌లు నిర్ణయించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ రెండు దేశాల్లో విస్తరించి ఉంది. యునెస్కో సాంస్కృతిక జాబితాతో పాటు రామ్సర్ సైట్లో కూడా ఇది భాగం. ఒప్పందం ద్వారా సమన్వయం చేసుకుంటూ ఈ ఆవాసాన్ని రక్షించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులను కలిగి ఉంటుంది.
12. ఐఆర్ఈడీఏ ఇటీవల కాలంలో ఏ హోదాను పొందింది? (3)
1. నవరత్న 2. మహారత్న
3. షెడ్యూల్-ఎ 4. షెడ్యూల్-బి
వివరణ: భారత పునరుత్పాదక శక్తి అభివృద్ధి ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) సంస్థ షెడ్యుల్ ఏ హోదాను ఇటీవల పొందింది. గతంలో ఇది షెడ్యూల్డ్-బి విభాగంలో ఉంది. ఈ సంస్థను 1987లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. మెరుగైన పనితీరు, టర్నోవర్ ఆధారంగా ఈ హోదాను ఇచ్చారు. మరింతగా విస్తరిస్తే మినీరత్న క్యాటగిరి-1 హోదాను పొందుతుంది.
13. ప్రపంచ సామర్థ్య సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (4)
1. 40 2. 67 3. 38 4. 56
వివరణ: ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ సామర్థ్య సూచీ (వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్)లో భారత్ 56వ స్థానంలో ఉంది. గతేడాది భారత్ 52లో ఉంది. జీవన నాణ్యత, కనీస వేతనం, ప్రాథమిక, ద్వితీయ విద్యల ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు. ఈ సూచీలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ 40వ స్థానంలో నిలిచింది. విద్యుత్తు పరివర్తన సూచీలో 67వ ర్యాంక్ ఉంది. అలాగే ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన లాజిస్టిక్స్ ఇండెక్స్‌లో 38వ స్థానంలో నిలిచింది
14. మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నోది? (1)
1. 106 2. 128
3. 101 4. 107
వివరణ: లోక్‌సభతో పాటు రాష్ర్టాల శాసన సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ 128వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగా దీనికి ఆమోదం లభించింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఇదే. నియోజకవర్గాల పునర్విభజన
తర్వాత ఇది అమలు కానుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరింది. 15 సంవత్సరాల పాటు ఇది అమలులో ఉంటుంది.
7. ఏ దేశంలో అక్టోబర్ 14న బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు? (4)
1. క్యూబా 2. పెరూ 3. గయానా 4. అమెరికా
వివరణ: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉత్తర అమెరికాలోని మేరిల్యాండ్‌లో అక్టోబర్ 14న ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ పర్యవేక్షిస్తుంది. ఇది 19 అడుగుల ఎత్తు ఉండనుంది. దీనికి రామ్ సుతార్ రూపశిల్పి. ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహానికి రూపశిల్పి కూడా ఆయనే. అలాగే హిరోషిమాలో ఈ ఏడాది మే నెలలో నరేంద్రమోదీ ఆవిష్కరించిన మహాత్మా గాంధీ ప్రతిమ రూపశిల్పి కూడా రామ్ వన్జీ సుతారే
15. గ్లోబల్ ఇండియన్ అవార్డ్ ఎవరికి దక్కింది? (3)
1. రవ్నీత్కౌర్ 2. మాదాబిపురి బుచ్
3. సుధామూర్తి 4. ఎవరూ కాదు
వివరణ: ప్రముఖ రచయిత్రి, సంఘ సేవకురాలు సుధామూర్తికి ఈ ఏడాది గ్లోబల్ ఇండియన్ అవార్డ్ దక్కింది. కెనడా ఇండియా ఫౌండేషన్ ఈ అవార్డ్‌ను ఆమెకు ఇచ్చింది. అవార్డ్‌లో భాగంగా 50 వేల డాలర్లు ఆమెకు ఇస్తున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసి తమదైన ముద్ర వేసిన వారికి ఈ అవార్డ్ ఇస్తారు. సుధామూర్తి ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డ్‌ను కూడా పొందారు. రవ్నీత్ కౌర్ ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ బాధ్యతను చేపట్టిన తొలి మహిళ ఆమెనే. అలాగే మాదిబిపురి బుచ్ సెబీకి నేతృత్వం వహిస్తున్నారు. భారత్‌లో ఒక నియంత్రణ వ్యవస్థకు సారథిగా నియామకం అయిన తొలి మహిళ ఆమే.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?