General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
జనరల్ ఎస్సే గ్రూప్స్ ప్రత్యేకం
- ఇస్రో తన మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1ను పీఎస్ఎల్వీ (సి-57) ద్వారా 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించింది. ఈ ప్రయోగంతో సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఉపగ్రహాన్ని పంపిన ఐదో దేశంగా ఖ్యాతి గడిచింది. (అమెరికా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్, జపాన్‌లు ఇప్పటికే తమ ఉపగ్రహాలను సూర్యుని వద్దకు పంపాయి).
ఆదిత్య-ఎల్ 1 అంటే? - భూమికి, సూర్యునికి మధ్యనున్న ‘లాంగ్రెజ్ పాయింట్-1’ చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యునిపై అధ్యయనం చేయడానికి భారత్ ప్రయోగించిన అంతరిక్ష ‘అబ్జర్వేటరీ ఉపగ్రహమే’ ఆదిత్య-ఎల్1. సంస్కృతంలో ‘ఆదిత్య’ అనగా సూర్యుడు అని అర్థం. ‘ఎల్ 1’ అంటే లాంగ్రెజ్ పాయింట్ ‘1’.
లాంగ్రెజ్ పాయింట్ అంటే? - లాంగ్రెజ్ పాయింట్స్ అంటే.. రెండు ఖగోళ వస్తువుల గురుత్వాక్షరణ బలాలు సమానంగా పనిచేసే ప్రదేశాలు. ఇలా రెండు గురుత్వాకర్షణ బలాలు సమంగా ఆ ప్రదేశాల్లో ఉండటం వల్ల ఏదైనా చిన్న వస్తువు అక్కడ పరిభ్రమించడానికి కావలసిన అభికేంద్ర బలం (Centripetal Force) సమకూరుతుంది. అందువల్ల ఈ లాంగ్రెజ్ పాయింట్స్ వద్ద ఉపగ్రహాలు అతి తక్కువ ఇంధన వినియోగంలో స్థిరంగా పరిభమ్రించ గలవు.
- సూర్యునికి భూమికి మధ్య ఇటువంటి లాంగ్రెజ్
పాయింట్లు ‘5’ ఉన్నాయి. అవి ఎల్ 1, ఎల్2, ఎల్3, ఎల్4, ఎల్5.
ఆదిత్య ఉపగ్రహానికి ఎల్ 1 పాయింట్‌ను ఎంచుకోవడానికి కారణాలు: - ఈ లాంగ్రెజ్ పాయింట్ నుంచి సూర్యుడిని నిరంతరాయంగా ఎటువంటి అడ్డంకులు (గ్రహణాలు) లేకుండా పరిశీలించవచ్చు.
- భూమి వైపు పయనిస్తున్న సౌర తుఫానులు ఈ స్థానం (ఎల్1) వైపుగా వస్తాయి. కాబట్టి వాటిని చాలా త్వరగా పసిగట్టవచ్చు.
- ఎల్ 5, ఎల్ 4 పాయింట్లు భూమి, సూర్యుని మధ్యకాక వాటితో త్రిభుజ కోణాన్ని ఏర్పరుచుకొంటుంటాయి. (ఈ ఎల్2 పాయింట్ నుంచి ఖగోళ సుదూర ప్రాంతాలను భూమి ఛాయ పడకుండా నిరంతరాయంగా పరిశీలించవచ్చు. అందువల్ల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఈ ఎల్ 2 పాయింట్ వద్దకు ప్రవేశపెట్టారు.) ఎల్ 3 పాయింట్ సూర్యుని వెనుకగా ఉంటుంది. అందువల్ల భూమి వైపు వచ్చే సౌర తుఫానులను కచ్చితత్వంతో, త్వరగా గుర్తించడానికి ఎల్ 1 పాయింట్ సరైన ఎంపిక. అందువల్లనే అంతర్జాతీయ Soho ( Solar and Heliospheric Observatory) వద్ద ఉంది.
ఆదిత్య ఎల్1 ప్రయాణ విధానం: - ఆదిత్య ఎల్1 ను పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ (సి 57) రాకెట్ ద్వారా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు. సూర్యునికి, భూమికి మధ్యనున్న లాంగ్రెజ్-1 ప్రాంతానికి ఈ అబ్జర్వేట్ శాటిలైట్‌ను పంపిస్తున్నారు. ఎల్1 ను చేరడానికి రమారమి 4 నెలలు పట్టే ఈ ప్రయాణంలో 3 దశలు ఉన్నాయి.
1. లోఎర్త్ ఆర్బిట్‌లో పరిభ్రమణం: - ఈ ఉపగహాన్ని భూ నిమ్న కక్ష్య (Low earth Orbit ) లో తొలుత ప్రవేశపెడతారు. 16 రోజుల పాటు ఈ కక్ష్యలో దీర్ఘ వృత్తాకారంలో తన పరిధిని ప్రతీ ఆవృతానికి క్రమంగా పెంచుకుంటూ , ఐదు పరిభ్రమణలు భూమి చుట్టూ చేస్తుంది . తద్వారా ఎల్1 వైపుగా ప్రయాణించడానికి కావలసిన వేగం (Velocity)ను సంపాదిస్తుంది. పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ సామర్థ్యం ఎల్1 వరకూ చేరడానికి సరిపోదు కాబట్టి అదనపు సామర్థ్యాన్ని ఈ విధంగా సాధిస్తుంది.
2. ఎల్1 వైపుగా సంధింపు - ఈ పరిభ్రమణలు పూర్తయిన తరువాత On board Propulsion ను వినియోగించి ఎల్1 వైపుగా సంధింప చేస్తారు. ఈ క్రమంలో ఉపగ్రహం భూమ్యాకర్షణ శక్తిని దాటుకొని ఎల్1 వైపుగా 110 రోజులు ప్రయాణిస్తుంది. దీనినే (cruise Phase) క్రుయిజ్ ఫేజ్ అంటారు.
3. లాంగ్రెజ్ 1 పాయింట్ కక్ష్యలోకి ప్రవేశం: - ఎల్1 సమీపానికి చేరుకున్నాక ఇది ఒక పరిభమ్రణం చేసి, ఇంచుమించు భూమి-సూర్యుని మధ్య అడ్డంగా ఒక సమాంతర కక్ష్యను ఎల్1 చుట్టూ ఏర్పరచుకుని మిషన్ జీవితకాలం (ఐదు సంవత్సరాలు ) ఆ కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిని పరిశీలిస్తుంది.
ఈ ఉపగ్రహంలో ఉన్న పరికరాలు (పేలోడ్స్) : - ఈ ఉపగ్రహంలో దేశీయంగా అభివృద్ధి చేసిన 7 పేలోడ్స్ ఉన్నాయి. వీటిలో ఐదింటిని ఇస్రో అభివృద్ధి చేయగా రెండింటిని దేశీయ విద్యాసంస్థలు ఇస్రో సౌజన్యంతో అభివృద్ధి చేశాయి .
- ఈ పేలోడ్‌లో 4 రిమోట్ సెన్సింగ్ తరహావి కాగా మిగతా 3 పేలోడ్లు ఇన్‌సిటు ( In-situ ) తరహా పేలోడ్లు. రిమోట్ సెన్సింగ్ పేలోడ్లు సూర్యునిలోని క్రోమోస్ఫియర్, కరోనా భాగాలను అధ్యయనం చేస్తాయి. ఇన్‌సిటు పేలోడ్లు ఉపగ్రహం తిరుగుతున్న ఎల్1 పరిసరాలను అధ్యయనం చేస్తాయి.
పేలోడ్స్ వివరాలు:
(a) రిమోట్ సెన్సింగ్ పేలోడ్లు
1. Visible Emission line corana graph (VELC) : ఇది సూర్యుని కొరానా ప్రాంతాన్ని అధ్యయనం చేస్తుంది. సూర్యుని ఉపరితలంలో సంభవించే భారీ పేలుళ్లు, సౌర తుఫానుల తీరును (Dynamics of Coronal mass ejections)ను పరిశీలిస్తుంది .
2. Solar- Ultra Violet Imaging Telescope ( SUIT) : అతినీల లోహిత కాంతి ప్రాంతంలో ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ల చిత్రాలను తీయడంతో పాటు సూర్యకిరణాలు/ కాంతి పుంజంలోని వ్యత్యాసాలను (Irradiance Variations in near Ultraviolet) కొలుస్తుంది. దీనిని Inter University Centre for Astronamy and Astrophysics (పుణె), ఇస్రో సహకారంతో అభివృద్ధి చేసింది .
3. Solar Low Energy X-ray Spectrometer and High Energy L1 orbiting X-ray Spectrometers(SLEXS and HEL1os ) : ఈ రెండు పేలోడ్లు సూర్యుడి నుంచి ఉద్భవించే ఎక్స్‌రే జ్వాలలను అధ్యయనం చేస్తాయి. వీటిని ఇస్రోకు చెందిన యూ.ఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు) తయారు చేసింది.
(b) Insitu Payloads :
4. Aditya Solar wind Farticle Experiment and Plasma Analyses package for Aditya (ASPEX and PAPA) : ఈ పేలోడ్లు సోలార్ పవనాలు, ఎనర్జిటిక్ అయినను వాటి శక్తి వ్యాప్తి ( Energy Distribution)ను అధ్యయనం చేస్తాయి. ఇస్రోకు చెందిన సంస్థలైన Physical Research Laboratary (అహ్మదాబాద్). ‘ ASPEX’ను, Space physics Laboratory Vikram Sarabhai Space Centre ( తిరువనంతపురం) ‘PAPA’ను తయారు చేశాయి .
5. Magnetometer (MAG)
ఎల్1 వద్దగల అంతర్గ్రహ అయస్కాంత క్షేత్రాలను (Inter Planetary Magnetic Fields)ను కొలిచే సామర్థ్యం దీనికి ఉంది. దీన్ని ఇస్రోకు చెందిన లాబోరేటరి ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టం (బెంగళూరు) అభివృద్ధి చేసింది.
ప్రయోగ లక్ష్యాలు/ ఉపయోగాలు:
1. మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుని అధ్యయనం ద్వారా నక్షత్రాలలో జరిగే కేంద్రక సంలీన చర్యలను గురించి తెలుసుకోవచ్చు. నేటి క్లీన్ ఎనర్జీ అవసరాల దృష్ట్యా ఇది ఎంతో విలువైన సమాచారాన్ని అందించవచ్చు.
2. సౌర కుటుంబంలో శక్తి కేంద్రంగా అన్ని గ్రహాలకూ మూలధారంగా ఉన్న సూర్యుని గురించి అధ్యయనం చేయడం ద్వారా విశ్వం గురించి , సౌరకుటుంబం పుట్టిన అంశాల గురించి సమాచారం సేకరించవచ్చు .
3. అన్నింటి కన్నా ముఖ్యంగా సూర్యుని నుంచి వచ్చే సౌర తుఫానులను గురించి హెచ్చరించడానికి , భూమి మీద ఉన్న సమాచార వ్యవస్థలను అంతరిక్షంలోని శాటిలైట్లు, వ్యోమగాములను రక్షించుకోవడానికి ఈ అబ్జర్వేటరీ ఉపగ్రహం ఎంతో ఉపకరిస్తుంది.
4. సౌర తుఫానులు, సౌరజ్వాలలు, అయస్కాంత క్షేత్రాలు, కోరనల్ మాస్ ఈజెక్షన్స్, అత్యధిక ఉష్ణోగ్రతల ఆవిర్భావం, ప్రసరణ, సౌర వాతావరణంలోని వైవిధ్యతలు మొదలగు వాటి గురించి పరిశోధించవచ్చు.
ఆదిత్య ఎల్1 గురించి మరికొంత..
- ఆదిత్య ఎల్ 1 సూర్యునికి 1.5 (9,30,000 మైళ్లు ) మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్ 1 పాయింట్ చుట్టూ తిరుగుతూ సూర్యుడిని పరిశీలిస్తుంటుంది . ఈ ఉపగ్రహం కానీ, దానిలోని పేలోడ్స్ కానీ, సూర్యుని పైకి / సమీపానికి గాని వెళ్లవు, నిజానికి సూర్యునికి భూమికి మధ్యగల మొత్తం దూరం (15 కోట్ల కిలోమీటర్లు/150 మిలియన్ కిలోమీటర్లు) లో కేవలం ఒక శాతం దూరం వరకూ మాత్రమే ఇది ప్రయాణిస్తుంది.
- ఇస్రో ‘రెండో’ అబ్జర్వేటరీ ఉపగ్రహం ఈ ఆదిత్య ఎల్1. మొదటి అబ్జర్వేటరీ ఉపగ్రహం ‘ ఆస్ట్రోశాట్’ను 2015లో ప్రయోగించారు.
- చంద్రయాన్ 3 ప్రయాణించిన దూరానికి 4 రెట్లు ఎక్కువ దూరం ఆదిత్య ఎల్1 ప్రయాణిస్తుంది .
- ఈ మిషన్ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు
- ఉపగ్రహం బరువు 1475 కిలోలు
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
Previous article
IELTS Exam | Language Tests for Overseas Education
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు