Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
బతుకమ్మ పండుగ
- తెలంగాణలో దసరా నవరాత్రులకు సమాంతరంగా జరుపుకొనే పూల పండుగ బతుకమ్మ. ఇది మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజులపాటు సాగే వేడుక. ఓ పళ్లెంలో గుమ్మడి పువ్వులు పరిచి, వాటి మీద తంగేడు, గునుగు, బీర, గన్నేరు, ఆనప, గోరింట, నిత్యమల్లె, నువ్వు, రుద్రాక్ష మొదలైన పూలను వరుసలో అమర్చుతారు. వాటిమీద తమలపాకులో పసుపు గౌరమ్మను ఉంచుతారు. బతుకమ్మ అంటే ఇదే.
- సాయంత్రం వేళకు మహిళలంతా కలిసి ఇంటి వాకిట్లో బతుకమ్మను ఉంచి, లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ప్రదక్షిణగా తిరుగుతారు. ఆదిపరాశక్తి మహిమల్ని, బతుకమ్మ పుట్టుక గురించిన పాటలు పాడతారు. బతుకమ్మకు నిదేదనగా వివిధరకాల పదార్థాల్ని సమర్పిస్తారు. తర్వాత బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. చివరి రోజైన తొమ్మిదో రోజు బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. ఈ రోజు నిమజ్జనం సందర్భంగా సాగనంపే పాటల్ని ఆలపిస్తారు. నిమజ్జనం అంటే పార్వతిదేవిని శివుడి దగ్గరికి పంపించడం.
బతుకమ్మ పుట్టుక.. - మహిషాసురుణ్ణి సంహరించే ప్రయత్నంలో జగన్మాత సొమ్మసిల్లింది. ఆమెకు సేవలు చేసిన దేవతలు, మళ్లీ ఉత్సాహపరిచేందుకు పాటలు పాడారు. అలసట తీరిన అమ్మ మహిషుణ్ని వధించింది. జగత్తుకు కొత్త బతుకును ప్రసాదించింది. అందరికీ బతుకునిచ్చిన అమ్మ కనుక బతుకమ్మ అయింది. ఇంకా దక్షయజ్ఞం సందర్భంగా అవమానానికి గురై, అగ్నికి ఆహుతైన సతీదేవికి ప్రతిరూపంగా పసుపుతో గౌరమ్మను సృష్టించారంటారు. అయితే వైదిక శ్రీచక్రార్చనకు ప్రతిరూపంగా జానపదులు పూల తో బతుకమ్మను పూజిస్తారని అంటారు.
బతుకమ్మ వేడుక
మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
రెండో రోజు అటుకుల బతుకమ్మ
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ
ఐదోరోజు అట్ల బతుకమ్మ ఆరో రోజ అలిగిన బతుకమ్మ
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ
దీపావళి
- ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున వచ్చే దీపాల పండుగే దీపావళి. రావణ వధ తర్వాత శ్రీరాముడు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు తదితరులతో కలిసి అయోధ్యకు వచ్చింది ఈ రోజునే అంటారు. అలా రాముడు వస్తున్నందుకుగాను అయోధ్య ప్రజలు ఈ రోజున తమ ఇళ్లను అలంకరించి, దీపాలు వెలిగించి స్వాగతం పలికారట. అప్పటినుంచి ఆశ్వయుజ అమావాస్య నాడు ఇండ్లలో దీపాలు వెలిగించడం ఆచారంగా వస్తున్నదని కథ.
- మరో కథ ప్రకారం అమావాస్యకు ముందురోజైన చతుర్దశినాడు శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుణ్ని సంహరించాడు. ఈ విజయానికి గుర్తుగా మరునాడు ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారట. నరకుణ్ని సంహరించిన ఆశ్వయుజ కృష్ణ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుస్తారు.
- దీపావళి రోజు దీపాలు వెలిగించి లక్ష్మీపూజ చేయడం, నోములు, వ్రతాలు చేయడం ఆచారం. వ్యాపారులైతే ఈ రోజు లక్ష్మీపూజ చేసి తమ ఖాతాలను కొత్తగా ప్రారంభిస్తారు. రాత్రివేళ పిల్లా పెద్దా ఆనందోత్సాహాలతో కోలాహలంగా పటాకులు కాల్చి సందడి చేస్తారు. దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకొంటారు.
భ్రాతృ విదియ లేదా భాయూ దూజ్ - దీపావళి తర్వాత రెండు రోజులకు… అంటే కార్తిక శుద్ధ విదియ నాడు జరుపుకొనే పండుగ భ్రాతృ విదియ. సోదరులు, సోదరీమణుల అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండేలా గుర్తుచేసే రోజు ఇది. ఈ రోజున అన్నలు, తమ్ముళ్లు తమ అక్కలు, చెల్లెళ్ల దగ్గరికి వెళ్తారు. సోదరి తమ సోదరులను సాదరంగా ఆహ్వానించి వారి నుదుట కుంకుమబొట్టు పెట్టి నోరు తీపిచేస్తుంది. బదులుగా సోదరులు తమ సోదరిని అన్ని విధాలుగా అండగా నిలుస్తారు.
- భ్రాతృ విదియ వెనుక ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు కార్తిక శుద్ధ విదియనాడు తన అన్న యముడు తనను చూసేందుకు రాకపోవడంతో యమున నిరాశచెందింది. అప్పటికి తన సోదరుణ్ని చూసి పన్నెండేళ్లు అయిందట. ఈ విషయాన్ని గంగ యముడికి గుర్తు చేస్తుంది. దాంతో యముడు యమునను చూసేందుకు వెళ్తాడు. యమున తన అన్నను సాదరంగా ఆహ్వానిస్తుంది.
- సోదరి ఆతిథ్యం తీసుకున్న యముడు భ్రాతృ విదియ నాడు తమ అక్కాచెల్లెళ్లను చూసేందుకు వచ్చిన సోదరులకు నరకం ఉండదని వరం ఇస్తాడు. యముడితో ముడిపడి ఉన్నందువల్ల యమ ద్వితీయ అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర ప్రాంతంలో, హర్యానా, పంజాబ్ రాష్ర్టాల్లో ఈ పండుగను ప్రధానంగా జరుపుకొంటారు.
లోహ్రి - ఉత్తర భారతదేశంలో జనవరి నెలలో(13న) జరుపుకొనే వ్యవసాయ పర్వదినం లోహ్రి. పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీల్లో విశేషంగా జరుపుకొంటారు. ఇది వసంత రుతువు ఆగమనానికి సూచిక. లోహ్రి రోజున సాయంత్రం వేళలో వీధుల్లో కూడళ్ల దగ్గర మంటలు వెలిగించి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. నువ్వులతో చేసిన మిఠాయిలు, మరమరాలు, మక్కజొన్న గింజలతో కలిపి ఈ మంటల్లో వేస్తారు. ఇలా చేస్తే తమకు మంచి జరుగుతుందని నమ్మకం. కొన్నిచోట్ల దుల్హాభట్టి అనే జానపద నాయకుడి గేయాలు ఆలపిస్తారు. ఇతను ధనవంతుల దగ్గర సంపదను దోచుకుని పేదలకు పంచేవాడట.
వసంతపంచమి - దీన్ని శ్రీపంచమి అని కూడా పిలుసారు. ఇది మాఘ శుద్ధ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలల్లో) వస్తుంది. ఈ రోజున హిందువుల విద్యా దేవత సరస్వతి ఆరాధన విశేషంగా జరుగుతుంది.
మహాశివరాత్రి - మాఘ కృష్ణ చతుర్దశి నాటి రాత్రిని శివరాత్రిగా పిలుస్తారు. శివుడికి సంబంధించిన ఆనవాళ్లు క్రీ.పూ. 2500 నాటి సింధూ నాగరికతలో బయల్పడ్డాయి. వేదాల్లో శివుణ్ని రుద్రుడిగా పేర్కొన్నారు. ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. సాయంత్రానికి శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకుంటారు. భారతదేశంలో 12 ముఖ్యమైన శివాలయాలున్నాయి. వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఆలయాల్లో అర్ధరాత్రి వేళ శివుడికి విశేష పూజలు చేస్తారు.
- ఓ మారు బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ తాను గొప్ప అంటే తాను గొప్ప అని వాదనకు దిగారట. అప్పుడు వాళ్లిద్దరి మధ్య ఒక అగ్నిస్తంభం ఆవిర్భవించిందట. అంతే కాకుండా ఈ అగ్నిస్తంభం ఆద్యంతాలు కనుక్కొన్నవాళ్లే గొప్ప అని వినిపించిందట. ఈ పరీక్షలో బ్రహ్మ, విష్ణువు ఇద్దరిలో ఎవ్వరూ నెగ్గలేకపోయారట. దాంతో అగ్నిస్తంభం శివుడి రూపమే అని తెలుసుకుని తమకంటే శివుడే గొప్ప అని ఒప్పుకొన్నారట. ఆ రోజునే లింగోద్భవ ఘట్టంగా, శివరాత్రిగా జరుపుకొంటున్నారన్నది పురాణ గాథ.
- ద్వాదశ జ్యోతిర్లింగాలు
1. సౌరాష్ట్ర (గుజరాత్) సోమనాథ్
2. శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్) మల్లికార్జున
3. ఓంకార్ (మధ్యప్రదేశ్) ఓంకారేశ్వర్
4. ఉజ్జయిని (మధ్యప్రదేశ్) మహాకాళేశ్వర్
5. నాసిక్ (మహారాష్ట్ర) త్రయంబకేశ్వర్
6. రామేశ్వరం (తమిళనాడు) రామేశ్వర
7. కేదారనాథ్ (ఉత్తరాఖండ్) కేదారేశ్వర్
8. వారణాసి (ఉత్తరప్రదేశ్) విశ్వేశ్వర్
9. వైద్యనాథ్ (జార్ఖండ్)వైద్యనాథ్
10. భీమశంకర్ (మహారాష్ట్ర) భీమేశ్వర్
11. నాగేశ్వర్ (గుజరాత్) ద్వారక
12. ఘృష్ణేశ్వర్ ఘృష్ణేశ్వర్
మకరసంక్రాంతి
- సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా జనవరి 13, 14, 15 తేదీల్లో జరుపుకొనే పండుగ. మహారాష్ట్రలో ఈ పండుగను ఏడు రోజులపాటు జరుపుకొంటారు. సంక్రాంతి సందర్భంగా స్త్రీలు ఒకరికొకరు కుంకుమ, గాజులు, దువ్వెనలు వంటివి కానుకలుగా ఇచ్చుకుంటారు. ఇంకా నువ్వుండలు ఇచ్చుకుని “తిల్ గుడ్ గ్యా-ఆణి గోడ్ గోడ్ బోలా” (నువ్వులు, బెల్లం తిని తీయగా మాట్లాడండి) అని చెప్పుకొంటారు.
- మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల్లో సంక్రాంతినాడు సూర్యుడికి నివేదనగా పాలు పొంగిస్తారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టాల్లో భోగి, సంక్రాంతి, కనుమ పేరుతో మూడు రోజులు జరుగుతుంది. భోగినాడు ఉదయమే చలిమంటలు కాచుకుంటారు. ఇండ్ల ముందు గొబ్బెమ్మలు పెడతారు. సాయంత్రం వేళల్లో చిన్న పిల్లలకు “భోగిపళ్లు” పోస్తారు.
- సూర్యుడికి నివేదనగా పాలు పొంగిస్తారు. కనుమ రోజు పశువుల పండుగ. ఈ రోజు తమకు వ్యవసాయ పనుల్లో సాయపడినందుకు కృతజ్ఞతగా పశువులను కడిగి, అలంకరించి, వాటికి తినుబండారాలు తినిపిస్తారు. తమిళనాడులో సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు.
హోలి
- ఫాల్గుణ పౌర్ణమి నాడు వస్తుంది. వసంతోత్సవం, ఇంకా పంటకోతలకు సంబంధించిన పండుగైన హోలీని ఉత్తర భారతదేశంలో ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. రెండు రోజుల పండుగలో మొదటిరోజు మంటలను వెలిగించి హోలికా లేదా కామ దహనం చేస్తారు. రెండోనాడు రంగునీళ్లను, రంగులను ఒకరి మీద ఒకరు చల్లుకుంటారు.
- హోలి పుట్టుక వెనుక పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది హిరణ్యకశిపుడి సోదరి హోలిక కథ. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తిలో మునిగిపోయి తండ్రి మాటను లెక్క చేయడు. అందుకని హిరణ్యకశిపుడు తన కొడుకు మనసు మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవి ఫలించక పోవడంతో ప్రహ్లాదుణ్ని అంతమొందించే ప్రయత్నం చేస్తాడు. వీటిలో భాగంగా ఒకసారి తన సోదరి హోలికను పిలుస్తాడు.
- హోలికకు మంటల్లో కాలిపోని వరం ఉంటుంది. సోదరుడి ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుణ్ని ఒడిలో కూర్చోబెట్టుకుని, మంటల్లో ప్రవేశిస్తుంది. అయితే విష్ణుమాయ వల్ల హోలిక దహనమవుతుంది. ప్రహ్లాదుడు నవ్వుతూ బయటికి వస్తాడు. అలాచెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలి జరుపు కొంటున్నారని చెబుతారు.
- మరో కథ ప్రకారం పార్వతీ పరమేశ్వరులకు పెండ్లి చేసేందుకు మన్మథుడు ప్రయత్నించగా, అతణ్ని పరమేశ్వరుడు తన మూడో కంటితో భస్మం చేసేస్తాడు. దీనికి గుర్తుగా హోలి ముందు రోజు కామదహనం నిర్వహిస్తారు.
- దేశంలో వివిధ ప్రాంతాల్లో హోలిని నిర్వహించినా ఉత్తరప్రదేశ్‌లోని వ్రజ్భూమి, మథుర పరిసరాల్లో జరుపుకొనే వేడుకలు ప్రసిద్ధి చెందినవి. కొన్ని రోజులపాటు జరిగే ఈ వేడుకలకు ప్రేరణ గోకులంలో కృష్ణుడు, గోపికలు వసంతాలు ఆడుకున్న కథ. మథుర సమీపంలోని ఓ పల్లెలో జరిగే “లాఠ్ మార్” హోలీది మరో ప్రత్యేకత. ఇందులో స్త్రీలు తమ భర్తలను లాఠీలతో కొడుతూ ఉంటే, వారు వాటిని కాచుకోవాలి. అలా ఏడాదిలో ఒక్కరోజు పురుషుల మీద ఆధిపత్యం చాటుకునే అవకాశం స్త్రీలకు వస్తుంది.
- ఉత్తరప్రదేశ్‌తో పాటు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ర్టాల్లో కూడా హోలిని ఎంతో సంబరంగా జరుపుకొంటారు.
హర్షవర్ధన్ చింతలపల్లి
Previous article
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు