Current affairs | ఏ రోజున జాతీయ కాగితపు దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
1. ఐఎన్ఎస్ విశాఖపట్నం ఏ దేశానికి పంపారు? (4)
1) ఇండోనేషియా 2) వియత్నాం 3) జపాన్ 4) ఒమన్
వివరణ: సముద్ర భాగస్వామ్యాన్ని పెంచుకొనే ఉద్దేశంతో భారత నావికాదళం, రాయల్ ఒమన్ నావికాదళాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని ఒమన్ దేశానికి పంపారు. ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని తొలిసారిగా నావికాదళంలోకి 2021, నవంబర్ 21న ప్రవేశపెట్టారు. దీని పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు. ఇది 30 నాట్ల వేగాన్ని అందుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లో కూడా పోరాటం చేసే పటిమ ఐఎన్ఎస్ విశాఖపట్నానికి ఉంది.
2. ప్రస్తుతం ఎన్ని రాష్ర్టాల్లో మంచినీటిలో ఆర్సెనిక్ కలుస్తుందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది? (2)
1) 2 2) 3 3) 4 4) 5
వివరణ: ప్రస్తుతం పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లోనే ఆర్సెనిక్ కలిసిన నీరు ఉందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. లోక్‌సభలో రాత పూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2019 ఆగస్టులో కేంద్రం జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించింది. 2024 నాటికి అన్ని ఇళ్లకు సురక్షిత మంచినీటిని అందించాలన్నది దాని లక్ష్యం. అప్పట్లో ఆర్సెనిక్ నీటిని అందుకున్న రాష్ర్టాలు ఆరు. 14,020 గృహ సముదాయాలకు ఈ నీరే వెళ్లేదని, ప్రస్తుతం అది కేవలం మూడు రాష్ర్టాలకు, 460 ఆవాసాలకు మాత్రమే పరిమితమైందని మంత్రి పేర్కొన్నారు.
3. యూఎల్‌ఎల్‌ఏఎస్ దేనికి సంబంధించింది? (3)
1) క్రీడలు 2) ఎంఎస్ఎంఈ
3) విద్య 4) ఆన్లైన్ గేమింగ్
వివరణ: యూఎల్‌ఎల్‌ఏఎస్ అనేది సంక్షిప్త రూపం. దీన్ని విస్తరిస్తే.. అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. దేశ వ్యాప్తంగా విద్య, అక్షరాస్యతను పెంపొందించేందుకు ఉద్దేశించింది. దీని నినాదం ఉల్లాస్- నవ్ భారత్ సాక్షరత కార్యక్రమ్. ఈ విధానం ప్రాథమిక విద్య, జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించింది. వివిధ కారణాలతో పాఠశాలకు వెళ్లలేని, 15 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఇది ప్రయోజనం. ప్రాథమిక విద్య, డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతలను ఇందులో భాగంగా నేర్పుతారు. ఇందుకు ఉల్లాస్ పేరుతో యాప్‌ను కూడా ప్రారంభించారు.
4. యూరియా గోల్డ్ అంటే ఏంటి? (1)
1) సల్ఫర్ పూత పూసిన యూరియా
2) బంగారు వర్ణంలోని యూరియా
3) క్రిమి సంహారిణి 4) ఏదీ కాదు
వివరణ: సల్ఫర్ పూత పూసిన యూరియాను యూరియా గోల్డ్ అంటారు. ఇటీవల దీన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. రాజస్థాన్‌లోని సికర్‌లో నిర్వహించిన సమావేశంలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. భూమిలో సల్ఫర్ లోపాన్ని దీని ద్వారా అధిగమించవచ్చు. దీనివల్ల రైతులకు ఉత్పాదకత పెరుగుతుంది. వేప పూత పూసిన యూరియా కంటే దీన్ని మెరుగైందిగా భావిస్తారు. సల్ఫర్ పూసిన యూరియా, నైట్రోజన్ విడుదల నిదానంగా చేస్తుంది. దీనివల్ల పంటలు ఎక్కువగా నత్రజనిని వినియోగించుకుంటాయి.
5. అత్యంత పొడవైన గ్రేట్ బారియర్ రీఫ్ ఏ దేశంలో ఉంది? (4)
1) ఇండోనేషియా 2) అర్జెంటీనా
3) చిలీ 4) ఆస్ట్రేలియా
వివరణ: ప్రపంచంలో అతిపెద్ద, పొడవైన బారియర్ రీఫ్ ఆస్ట్రేలియా దేశంలో ఉంది. వాయవ్యం నుంచి ఆగ్నేయం దిశగా దాదాపు 2000 కిలోమీటర్లు విస్తరించింది. ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశాల జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదనను తాత్కాలికంగా యునెస్కో నిలిపివేసింది. దీనికి ముప్పు తొలగిపోలేదని మాత్రం స్పష్టం చేసింది. ఈ ప్రదేశం 1981లో యునెస్కో వారసత్వ జాబితాలో చేరింది.
6. ఏ రోజున జాతీయ కాగితపు దినోత్సవాన్ని
నిర్వహిస్తారు? (3)
1) నవంబర్ 16 2) మే 3
3) ఆగస్టు 1 4) ఆగస్టు 7
వివరణ: ఏటా ఆగస్టు 1న జాతీయ కాగితపు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున చేతితో కాగితాన్ని తయారు చేసే ఒక సంస్థను పుణెలో స్థాపించారు. 1940 ఆగస్ట్ 1న ఇది ప్రారంభమైన నేపథ్యంలో ఈ రోజును జాతీయ కాగితపు రోజుగా నిర్వహిస్తారు. ఇదే కార్యాలయంలో భారత రాజ్యాంగ తొలి ప్రతులను కూడా ముద్రించారు. అలాగే ఏటా నవంబర్ 16న జాతీయ పత్రిక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మే 3న అంతర్జాతీయ పత్రిక రోజుగా జరుపుతారు.
7. యుద్ధ్ అభ్యాస్ ఏ రెండు దేశాల మధ్య నిర్వహించే విన్యాసం? (2)
1) భారత్, రష్యా
2) భారత్, అమెరికా
3) భారత్, ఆస్ట్రేలియా
4) భారత్, ఇండోనేషియా
వివరణ: ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 8 వరకు భారత్, అమెరికా మధ్య యుద్ధ్ అభ్యాస్ సైనిక విన్యాసాన్ని నిర్వహించనున్నారు. 2004 నుంచి ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నాయి. సైనికులకు సంబంధించి శిక్షణ, సాంస్కృతిక మార్పిడి తదితర అంశాలే లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 19వ యుద్ధ్ అభ్యాస్ జరగనుంది. శాంతి పరిరక్షణ కూడా ఈ విన్యాసంలో భాగం కానుంది. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కూడా ఇందులో భాగం కానుంది. అలాగే భారత్, అమెరికా మధ్య వజ్ర ప్రహార్, మలబార్, కోప్ ఇండియా, రెడ్ ఫ్లాగ్ తదితర విన్యాసాలు కూడా నిర్వహిస్తున్నారు.
8. భారతీయ అమెరికన్ అయిన శోహిని సిన్హాకు ఏ విభాగంలో ఉద్యోగాన్ని కల్పించారు? (2)
1) నాసా 2) ఎఫ్‌బీఐ
3) అమెరికా విదేశాంగ శాఖ
4) పైవేవీ కాదు
వివరణ: అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ విభాగంలో ప్రత్యేక ఏజెంట్‌గా శోహిని సిన్హా నియమితులయ్యారు. ఆమె భారతీయ అమెరికన్. అమెరికాలోని ఉతా రాష్ట్రంలో సాల్ట్ లేక్ సిటీలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉగ్రవాద వ్యతిరేక అంశాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. ఇప్పటి వరకు ఆమె ఎఫ్‌బీఐ ప్రధాన కేంద్రంలో ఆ సంస్థ డైరెక్టర్‌కు ప్రత్యేక అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎఫ్‌బీఐలో శోహిని 2001లో చేరారు.
9. రోహిణి కమిషన్ దేనికి సంబంధించింది? (3)
1) కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
2) స్థానిక పాలన
3) బీసీల ఉపవర్గీకరణ
4) పైవేవీ కాదు
వివరణ: వెనుకబడిన వర్గాల ఉప వర్గీకరణకు సంబంధించి గతంలో కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణి కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలోని వివరాలను బహిర్గతం చేయలేదు. భారత్‌లో ఎస్సీ, ఎస్టీ కాకుండా ఇతర వెనుకబడిన వర్గాలను తొలిసారిగా గుర్తించింది కాలేల్కర్ కమిషన్. 1953లో ఈ ప్రక్రియ జరిగింది. వీరి జనాభా 52 శాతం ఉంటుందని 1980లో మండల్ కమిషన్ గుర్తించింది. ఈ కులాల్లో 1257 సామాజిక వర్గాలున్నాయని వెల్లడించింది. వీరికి రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది.
10. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఎంఆర్ఐ స్కానర్‌ను ఏ నగరంలో అందుబాటులోకి తెచ్చారు? (4)
1) బెంగళూరు 2) ముంబయి
3) పుణె 4) న్యూఢిల్లీ
వివరణ: భారత్‌లో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మ్యాగ్నటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ స్కానర్‌ను న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. తక్కువ వ్యయంతో తయారు చేయడంతో పాటు ఇది అతి తక్కువ బరువును కలిగి ఉంటుంది. 1.5 టెస్లా వేగం కలిగి ఉంటుంది. నేషనల్ బయోఫార్మ మిషన్‌లో భాగంగా వోక్సెల్ గ్రిడ్స్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. దీనికయిన చేసిన వ్యయం రూ.17 కోట్లు. ఇందులో రూ.12 కోట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇచ్చింది. పేదలకు ఈ స్కానర్
ఉపయోగపడుతుంది.
11. అంతర్జాతీయ పులుల రోజు ఏది? (2)
1) జూలై 28 2) జూలై 29
3) జూలై 30 4) జూలై 31
వివరణ: ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల రోజుగా నిర్వహిస్తారు. పులుల పరిరక్షణకు సంబంధించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజును ఎంచుకున్నారు. 2010 నుంచి నిర్వహిస్తున్నారు. ఆ సంవత్సరంలో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 13 దేశాల సమావేశం జరిగింది. ఈ దేశాల్లోనే పులుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2022 నాటికి వాటి సంఖ్యను రెట్టింపు చేయాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్యలో పులులున్న దేశం భారత్. రాష్ర్టాల వారీగా చూస్తే అతి ఎక్కువ సంఖ్యలో మధ్యప్రదేశ్‌లో పులులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాలు వరుసగా కర్ణటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి.
13. మాంగ్రూవ్ మిత్ర కార్యక్రమం ఏ రాష్ర్టానికి సంబంధించింది? (1)
1) ఒడిశా 2) పశ్చిమబెంగాల్
3) మహారాష్ట్ర 4) ఆంధ్రప్రదేశ్
వివరణ: మాంగ్రూవ్ మిత్ర కార్యక్రమం ఒడిశా రాష్ర్టానికి చెందింది. మడ అడవులను రక్షించుకొనేందుకు ఉద్దేశించింది. ఒడిశాలోని కేంద్రపడా జిల్లాకు చెందిన 25 కుటుంబాలు, దాదాపుగా 25 ఎకరాల భూమిని దానం చేశాయి. మడ అడవుల పరిరక్షణ కోసమే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మాంగ్రూవ్ మిత్ర ప్రోగ్రాం పేరుతో పిలుస్తున్నారు. ఒడిశాలోని భితర్కనికా జాతీయ పార్క్ సమీపంలో ఈ భూమిని వాళ్లు దానం చేశారు. ఈ పార్క్‌లో 82 మాంగ్రూవ్ జాతులున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం పెరగడంతో మడ అడవులు ధ్వంసయయ్యాయి. ఈ నేపథ్యంలోనే భూదాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
14. వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరంలో చేరిన తొలి భారత నగరం ఏది? (2)
1) అహ్మదాబాద్ 2) బెంగళూరు
3) తూర్పుగోదావరి 4) ముంబయి
వివరణ: సంస్కృతిని అన్వేషించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటైన వ్యవస్థే వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 40 నగరాలు ఇందులో ఉన్నాయి. భారత్ నుంచి ఇందులో ఎంపికయిన ఏకైక నగరం బెంగళూరు. ఇది 41వ నగరం. 2012లో లండన్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో 12 నగరాలుండేవి.
15. ఏ కూటమిని జీ-20లో చేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు? (3)
1) క్యారికోం 2) షాంఘై
3) ఆఫ్రికన్ యూనియన్ 4) ఎల్-69
వివరణ: జీ-20లో ఆఫ్రికన్ యూనియన్ను కూడా చేర్చుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ప్రస్తుతం జీ-20 కూటమికి భారత్ నేతృత్వం వహిస్తుంది. 2022, డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించింది. 2023, నవంబర్ 30 వరకు భారత నాయకత్వం కొనసాగనుంది. ఆఫ్రికన్ యూనియన్‌లో 55 దేశాలున్నాయి. సిర్టే ప్రకటన ద్వారా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1999, సెప్టెంబర్ 9న లిబియాలో ఈ ప్రకటన వెలువడింది. దీని ఏర్పాటును అధికారికంగా 2001, మే 26న ఇథియోపియాలోని అడిస్ అబాబాలో నిర్వహించారు.
12. జూపిటర్ 3 దేనికి సంబంధించింది? (3)
1) కొత్తగా కనుగొన్న ఒక ఉపగ్రహం
2) ప్రపంచంలో అతిచిన్న ప్రైవేట్ కమ్యూనికేషన్స్ ఉపగ్రహం
3) ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ కమ్యూనికేషన్స్ ఉపగ్రహం
4) రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
వివరణ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని జూలై 27న స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. దీనికి జూపిటర్ 3గా పేరు పెట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్లో ఫాల్కాన్ హెవీ రాకెట్‌ను వినియోగించి దీన్ని ప్రయోగించారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహం. అమెరికా, లాటిన్ అమెరికాల్లో హుగెస్ నెట్ వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 100 ఎంబీపీఎస్ వరకు బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌ను అందించగలదు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు