Biology | కన్నులు.. పిలకలు.. పత్రపు అంచులు
మొక్కల్లో ప్రత్యుత్పత్తి
- ఒక జీవి తన లాంటి మరోతరం జీవులను ఉత్పత్తి చేయగల శక్తిని ప్రత్యుత్పత్తి అంటారు. ఇది మొక్కల్లో మూడు రకాలుగా జరుగుతుంది. అవి. శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి.
శాఖీయ ప్రత్యుత్పత్తి
- శాఖీయ ప్రత్యుత్పత్తిలో ఒక మొక్క పుష్పం నుంచి కాకుండా ఏ ఇతర భాగాల నుంచైనా కొత్త మొక్కను ఉత్పత్తి చేస్తుంది.
ఉదాహరణలు
బంగాళాదుంప- కన్ను
అల్లం, పసుపు- కోరకాలు
గడ్డి మొక్క- రన్నర్
పిస్టియా- ఆఫ్సెట్
చామంతి, అరటి- పిలక మొక్కలు
కరివేప- వేరు మొగ్గలు
రణపాల- పత్రపు అంచులు - ఛేదనాలు అంటుకట్టడం ద్వారా గులాబీ, మందార, బోగన్విలియా, మామిడి మొదలైన మొక్కల నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు.
- దానిమ్మ, నారింజ, జామ మొదలైన పెద్ద పండ్ల మొక్కల్లో అంటుకట్టే విధానాన్ని గూటీ పద్ధతి అంటారు.
- ఒక మొక్క భాగాన్ని మరో మొక్కలో ప్రవేశపెట్టి, ఆ రెండింటిని జోడించి ఆ పైన వాటి పెరుగుదల కొనసాగే పద్ధతిని అంటుకట్టడం అంటారు. ఇలా ఏర్పడిన కొత్త మొక్కల్లో పై భాగాన్ని సయాన్, కింది భాగాన్ని స్టాక్ అంటారు.
- నాలుగు రకాల పద్ధతులు అంటుకట్టడంలో ఉన్నాయి. ఇవి ఎప్రోచ్, క్లెఫ్ట్, టంగ్, మొగ్గంటు పద్ధతులు.
అలైంగికోత్పతి
- ఈ రకమైన ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాల ఉత్పత్తి, వాటి సంయోగం వంటి ప్రక్రియలు జరగవు. ఒక జీవి రెండు సమానమైన లేదా అసమాన భాగాలుగా విడిపోయి పూర్తి జీవిగా ఏర్పడటాన్ని అలైంగికోత్పతి అంటారు.
ఉదా: బ్యాక్టీరియాల్లో విచ్ఛిత్తి - శైవలాలు, శిలీంధ్రాల్లో సిద్ధబీజాలు ఏర్పడటం
- రైజోపస్, ఆస్పర్జిల్లస్ల్లో కశాభయుత సిద్ధబీజాలు (గమన సిద్ధబీజాలు)
- ఈస్ట్లలో కోరకీభవనం
- బ్రయోఫైట్స్లో జెమ్మాకప్స్
లైంగికోత్పత్తి
- స్త్రీ, పురుష సంయోగబీజాలు సంయోగం చెంది నూతన జీవి ఏర్పడే విధానాన్ని లైంగికోత్పత్తి అంటారు. ఈ ప్రక్రియలో సంయోగ బీజాల ఉత్పత్తి, వాటి సంయోగం జరుగుతుంది.
- శైవలాలు, శిలీంధ్రాల్లో సంయోగబీజాలను నీటిలోకి విడుదల చేయడం ద్వారా అవి అక్కడ సంయోగం చెంది సంయుక్తబీజాన్ని ఏర్పరుస్తాయి.
- బ్రయోఫైటా, అభివృద్ధి చెందిన మొక్కల్లో స్త్రీ, పురుష సంయోగ బీజాలు అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ మొక్కల్లో పురుష సంయోగ బీజాలు పురుష సంయోగ బీజదం (ఆంథరీడియా) నుంచి స్త్రీ సంయోగ బీజాలు స్త్రీ సంయోగబీజదం (ఆర్కిగోనియా) నుంచి ఏర్పడతాయి.
- పుష్పంలోని భాగాలు రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం. ఇందులో కేసరావళి, అండకోశం పుష్పంలోని ప్రత్యుత్పత్తి భాగాలు.
- పురుష సంయోగబీజదం లేదా పరాగకోశంలో అభివృద్ధి చెందిన పరాగరేణువులు, అదే పుష్పంలోని లేదా వేరే పుష్పంలోని కేంద్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అంటారు.
పార్థినోజెనెసిస్: సాధారణంగా అభివృద్ధి చెందిన మొక్కల్లో స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడి అది పిండంగా రూపాంతరం చెంది కొత్త మొక్కలు ఏర్పడతాయి. కానీ కొన్ని మొక్కల్లో అండాశయం ఫలదీకరణం చెందకపోయినా పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి పిండాభివృద్ధిని లేదా ఫలదీకరణం చెందని అండం అభివృద్ధిని పార్థినోజెనెసిస్ (అనిషేక జననం) అంటారు.
పుష్పం
- మొక్కల కాండంపై గ్రీవం వద్ద పుష్పం జనిస్తుంది. పుష్పం ఒక కాడ సహాయంతో కాండానికి అతుక్కొని ఉంటుంది. దీన్ని పుష్ప వృంతం అంటారు. పుష్ప వృంతం పైభాగం ఉబ్బి ఉంటుంది. దీన్ని పుష్పాసనం అంటారు. పుష్ప భాగాలు పుష్పాసనంపై నాలుగు వలయాల్లో అమరి ఉంటాయి. అవి. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం.
రక్షక పత్రావళి: పుష్పాసనం పై అమరి ఉండే ఆకుపచ్చని నిర్మాణాన్ని రక్షక పత్రావళి అంటారు. ఇది పుష్పానికి రక్షణ కల్పిస్తుంది కాబట్టి దీన్ని రక్షక పత్రావళి అంటారు. మొగ్గ దశలో పుష్పం లోపలి వలయ భాగాలను రక్షిస్తుంది. ఇది పుష్పంలోని మొదటి వలయంలో ఉంటుంది.
ఆకర్షణ ప్రతావళి: వివిధ వర్ణాల్లో ఆకర్షణీయంగా ఉండే పుష్ప భాగాలను ఆకర్షణ పత్రావళి అంటారు. ఆకర్షణ పత్రాలు పర పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. పుష్పాలకు సువాసనను కల్పిస్తాయి. ఇవి పుష్పంలోని రెండో వలయంలో ఉంటాయి.
కేసరావళి: పుష్పంలోని ప్రత్యుత్పత్తి భాగాలను కేసరావళి అంటారు. కేసరావళి అనేది పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం. పుష్పం నిర్మాణం కుటుంబాన్ని బట్టి కేసరాల సంఖ్య ఉంటుంది. కేసరావళిలో కేసర దండం, పరాగ కోశం ఉంటాయి. పరాగ కోశంలో పరాగ రేణువులు ఉంటాయి. వీటిని పురుష బీజకణాలు అంటారు. ఇవి పుష్పం మూడో వలయంలో ఉంటాయి.
అండకోశం: ఇది పుష్పంలోని నాలుగో వలయంలో ఉంటుంది. అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. దీనిలో అండాశయం, కీలం, కీలాగ్రం అనే భాగాలుంటాయి. అండాశయంలో నాలుగు గదులుంటాయి. ఈ గదుల్లో అండాలు ఏర్పడతాయి. వీటిని స్త్రీబీజ కణాలు అంటారు. ఫలదీకరణ తర్వాత అండాలు విత్తనాలుగా మారుతాయి. - మొక్కలోని రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళిని అనావశ్యక భాగాలు అని, కేశరావళి, అండకోశాలను ఆవశ్యక భాగాలంటారు.
పుష్పాల రకాలు - పుష్పంలో కేసరావళి, అండకోశాన్ని ఆధారంగా చేసుకుని పుష్పాలను రెండు రకాలుగా విభజించారు. అవి
ఏకలింగ పుష్పాలు: కేసరావళి గాని, అండకోశం గాని ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగం మాత్రమే కలిగి ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. కేసరావళి మాత్రమే ఉండే పుష్పాలను పురుష పుష్పాలు అంటారు. వీటిలో అండకోశం ఉండదు. అండకోశం మాత్రమే కలిగి ఉండే పుష్పాలను స్త్రీ పుష్పాలు అంటారు. వీటిలో కేసరావళి ఉండదు.
ఉదా: సొరకాయ, బొప్పాయి
ద్విలింగ పుష్పాలు: కేసరావళి, అండకోశం రెండింటిని కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు.
ఉదా: ఉమ్మెత్త, మందార - కేసరావళిని మాత్రమే కలిగి ఉండే మొక్కలు బొప్పాయి, కొబ్బరి, తాటి చెట్టు.
విత్తనాల అంకురణ - మొక్కల్లో ఫలదీకరణ తర్వాత అండం విత్తనంగా మారుతుంది. దీనిలో పిండం, మొలకగా అభివృద్ధి చెందటాన్ని మొలకెత్తడం లేదా అంకురణ అంటారు.
- విత్తన అంకురణకు ఉష్ణోగ్రత, నీరు, ఆక్సిజన్, కాంతి మొదలైనవి అవసరం.
- విత్తనం మొలకెత్తడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 15-300C.
- ఆర్కిడ్లు, నికోటియానా (పొగాకు), విస్కమ్, రూమిక్స్ వంటి విత్తనాల అంకురణకు కాంతి అవసరం. ఎలియమ్ సెపా (వెల్లుల్లి) విత్తనాల అంకురణకు కాంతి అవసరం లేదు.
- విత్తనంలోని పిండం కొంతకాలం మొలకెత్తకుండా అచేతనావస్థలో ఉండటాన్ని సుప్తావస్థ అంటారు.
- అధిక అంకురణ తేజం, తక్కువ కాలంలో పంట, వ్యాధి నిరోధకత, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను మేలురకం విత్తనాలు అంటారు.
- అధిక జన్యు పరిశుద్ధి గల విత్తనం- మౌలిక విత్తనం
- మౌలిక విత్తనాల నుంచి ఉత్పత్తి అయిన విత్తనాలను పునాది విత్తనాలు అంటారు.
- నమోదు చేసిన విత్తనంలో 80-90 శాతం జనక జన్యు లక్షణాలు ఉంటాయి.
- ధ్రువీకరించిన విత్తనాల్లో 30 శాతం జనక జన్యు లక్షణాలుంటాయి.
మొక్కలు- ఆర్థిక ప్రాముఖ్యత
- మొక్కలు మానవుడికి ఆహారాన్ని అందించడంతో పాటు గృహ, వైద్యశాస్త్రంలో ఉపయోగపడతాయి.
ఆహార మొక్కలు: ఇందులో వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ, ఓట్ తదితరాలు ఉంటాయి. ఈ మొక్కల్లో పిండి పదార్థం ఉంటుంది.
పప్పు దినుసులు: వీటిలో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి. కందులు, వేరుశనగ, సోయాబీన్, పెసర, మినుములు, బఠానీ, చిక్కుడు పప్పు దినుసులు. పప్పు దినుసులను పరిమితికి మించి తినడం వల్ల ముఖ్యంగా ఎర్రటి పప్పు తినడం వల్ల ఎముకలు, నాడుల క్షీణత కలుగుతుంది. ఈ స్థితిని లాతిరిజం అంటారు.
కూరగాయలు
వీటిని నాలుగు రకాలుగా వర్గీకరించారు
1. ఫల కూరగాయలు: టమాటా, వంకాయ, బెండకాయ, కాకర మొదలైనవి.
2. కాండ కూరగాయలు: బంగాళదుంప, చామగడ్డ తదితరాలు.
3. వేరు కూరగాయలు: ముళ్లంగి, క్యారెట్, బీట్రూట్ మొదలైనవి.
4. ఆకుకూరలు: పాలకూర, బచ్చలి కూర, తోటకూర మొదలైనవి.
నూనెలు - ఆహార పదార్థాల్లో నూనెగింజలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మనం నిత్యం వినియోగించే పొద్దుతిరుగుడు, పామాయిల్, రైస్ బ్రాన్ నూనెలు మొక్కల నుంచి లభించే నూనెలు.
మసాలా దినుసులు: ఇవి ఆహారానికి రుచి, వాసన, నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగిస్తాయి. మిరప, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, పుదీనా, కుంకుమ పువ్వు, దనియాలు, రాతి పువ్వు ముఖ్యమైన మసాలాలు. - మిరపలో కాప్సిసిన్ అనే పదార్థం కారాన్ని కలుగజేస్తుంది. మిరియాలను మసాలాల రాజుగా అభివర్ణిస్తారు. యాలకులను మసాలాల రాణిగా పేర్కొంటారు. లవంగాలు పూమొగ్గలు.
ఫలాలు
మామిడి: దీని శాస్త్రీయనామం మాంజిఫెరా ఇండికా. దీన్ని ఫలరాజు (కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా) గా పిలుస్తారు.
అరటి: దీని శాస్త్రీయనామం మ్యూసా
పారడైసికా. ప్రపంచంలో అతి ప్రాచీన ఫలం ఇదే. అరటిలో చాలా రకాల
విటమిన్లు ఉంటాయి. (ఎ, బి, సి, డి, ఇ)
జామ: దీన్ని పూర్ మెన్ ఆపిల్ అంటారు. సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు