Current Affairs | జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్లో చేరిన నాలుగో దేశం?
1. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా ఎవరు ఎన్నికయ్యారు? (4)
1) అడ్రే అజౌలే
2) టెడ్రెస్ అద్నాం
3) అల్వారో లారియో 4) క్యూ డోంగ్యు
వివరణ: ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థకు క్యూ డోంగ్యు మరోసారి ఎన్నికయ్యారు. సంస్థ ప్రధాన కార్యలయంలో జూలై 1న ఎన్నికలు నిర్వహించారు. ఆయన చైనా దేశానికి చెందిన వ్యక్తి. ఈ పదవికి ఆయన ఎన్నిక కావడం వరుసగా ఇది రెండోసారి. ఈ సంస్థ ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1945, అక్టోబర్ 16న దీన్ని ఏర్పాటు చేశారు. అందుకే అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ సంస్థకు ఎన్నికయిన తొలి చైనా వాసి క్యూ డోంగ్యు. 2019లో తొలిసారి ఎన్నికయ్యారు.
2. కేఏపీపీ-3 దేనికి సంబంధించింది? (2)
1) సూపర్ కంప్యూటర్
2) అణు రియాక్టర్
3) కొత్త రోబో
4) పైవేవీ కాదు
వివరణ: కేఏపీపీ అంటే కాక్రాపార్ అణు విద్యుత్ ప్రాజెక్ట్. ఇది గుజరాత్లో ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 700 మెగావాట్ల ఈ అణు రియాక్టర్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఘనతను దక్కించుకున్న తొలి స్వదేశీ అణు రియాక్టర్ ఇదే. దేశ అణు విద్యుత్ ఉత్పత్తిలో ఇది కీలక మైలురాయిగా చెప్పొచ్చు. భారత్‌లో ప్రస్తుతం 22 అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి.
3. పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్‌ను పొందింది ఎవరు? (3)
1) వినయ్ మోహన్ పాత్ర
2) విశాల్ సింగ్
3) రాజిందర్ సింగ్ దత్
4) ఉమేశ్ పటేల్
వివరణ: ‘అన్‌డివైడెడ్ ఇండియన్ ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్’ను ఏర్పాటు చేసిన రాజిందర్ సింగ్ దత్‌కు పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ దక్కింది. మాజీ సైనికులను ఒక తాటిపైకి తెచ్చేందుకు ఆయన చేసిన కృషికి ఈ అవార్డ్‌ను గెలుచుకున్నారు. ఇతరులకు సాయం చేసే వారికి ఇచ్చే అవార్డ్ ఇది. రాజిందర్ సింగ్ దత్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో చేరారు. 1963లో అన్‌డివైడెడ్ ఇండియన్ ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. మాజీ సైనికులందరికీ ఉపయోగపడుతున్నారు.
4. ఏ రోజున అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత రోజుగా నిర్వహిస్తారు? (1)
1) జూలై 3 2) జూలై 1
3) జూలై 2 4) జూలై 4
వివరణ: ఏటా జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత రోజుగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ రోజుకు ఎలాంటి ఇతివృత్తం లేదు. ఈ ఏడాది న్యూజిలాండ్ దేశం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పలుచని ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధించింది. సూపర్ మార్కెట్లలో వీటిని వినియోగిస్తారు. అలాగే ప్లాస్టిక్ స్ట్రాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌ను భారత్ గతేడాది జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు దేవాలయాల్లో ప్లాస్టిక్ అనుమతిని నిషేధించారు. తిరుమల తిరుపతి కొండపై ప్లాస్టిక్ బాటిళ్లను కూడా అనుమతించరు. విజయవాడ కనకదుర్గ, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం దేవాలయం, భీమడోలులోని ద్వారకా తిరుమల, కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం, శ్రీశైలం దేవాలయంలో కూడా ప్లాస్టిక్‌ను నిషేధించారు
5. ఇటీవల ఏ జాబితా నుంచి భారత్‌ను యూఎన్ సెక్రటరీ జనరల్ తొలగించారు? (2)
1) పోషకాహార లోపం అధికంగా ఉన్న దేశాల జాబితా
2) సాయుధ పోరులో బాలల పరిస్థితి దేశాల జాబితా
3) లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న దేశాల జాబితా
4) శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే దేశాల జాబితా
వివరణ: సాయుధ పోరు వల్ల బాలలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలాంటి దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తూ యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని శుభసూచకంగా భావించవచ్చు. 2016 నుంచి భారత్ తీసుకుంటున్న చర్యల మూలంగా సాయుధ వ్యవస్థలు ఉన్న చోట భారత్‌లో బాలల పరిస్థితి మెరుగైందని ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలల హక్కుల పరిరక్షణలో భారత్ చొరవను సెక్రటరీ జనరల్ ప్రశంసించారు. ఈ జాబితాలో భారత్‌ను 2010లో చేర్చారు.
6. జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్లో చేరిన నాలుగో దేశం ఏది? (3)
1) దక్షిణాఫ్రికా 2) ఇండోనేషియా
3) సెనెగల్ 4) వియత్నాం
వివరణ: పునరుత్పాదక విద్యుత్ శక్తుల ప్రోత్సాహానికి జీ-7 కూటమితో పాటు ఇతర అగ్రదేశాలు అమలు చేస్తున్న విధానమే జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్. విద్యుత్ పరివర్తన భాగస్వామ్యంగా దీన్ని చెప్పవచ్చు. కాలుష్యం లేదా భూతాపానికి కారణమయ్యే విద్యుత్ వ్యవస్థల నుంచి సౌర, పవన విద్యుత్ వ్యవస్థల వైపునకు అంగీకరించిన దేశాలు మళ్లాల్సి ఉంటుంది. ఇందుకు అయ్యే వ్యయాన్ని అగ్రదేశాలు సమకూరుస్తాయి. ఈ తరహా భాగస్వామ్యాన్ని అంగీకరించిన తొలి దేశం దక్షిణాఫ్రికా కాగా, ఆసియాలో తొలి దేశం ఇండోనేషియా. అలాగే వియత్నాం కూడా ఈ తరహా భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. నాలుగో దేశంగా సెనెగల్ ఇటీవల చేరింది.
7. ఈ-ఎస్ఏఆర్ఏఎస్ అనే పోర్టల్ దేనికి సంబంధించింది? (1)
1) మార్కెటింగ్
2) ఆదాయపు పన్ను చెల్లింపు
3) బ్యాంకింగ్ వ్యవస్థ
4) బీమా రంగం
వివరణ: దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌లో భాగంగా ఈ-ఎస్ఏఆర్ఏఎస్ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను ఈ మొబైల్ యాప్ ద్వారా విక్రయిస్తారు. ఫలితంగా వారి ఆదాయం పెరుగుతుంది. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఈ కామర్స్ వ్యవస్థగా దీన్ని చెప్పవచ్చు.
8. తుషార్ మెహతా ఏ పదవిలో నియమితులయ్యారు? (4)
1) అటార్నీ జనరల్
2) అదనపు సొలిసిటర్ జనరల్
3) డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐ
4) సొలిసిటర్ జనరల్
వివరణ: సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా తుషార్ మెహతా పదవీ కాలాన్ని పొడిగించారు. ఇది చట్ట ప్రకారం ఏర్పాటైన వ్యవస్థ. ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ జూన్ 30న కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే అదనపు సొలిసిటర్ జనరళ్లుగా విక్రమ్‌జిత్ బెనర్జీ, బల్బీర్ సింగ్, కేఎం నటరాజ్, ఎస్వీ రాజు, ఐశ్వర్య భాటి, ఎన్ వెంకటరామన్లను కూడా పునర్నియమించారు. అటార్నీ జనరల్ అనేది మాత్రం రాజ్యాంగబద్ధ పదవి. ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత కాలం పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా వెంకటరమణి ఉన్నారు. ఈ పదవినే భారత తొలి న్యాయాధికారిగా పేర్కొంటారు.
9. గ్లోబల్ ఇండియన్ ఐకాన్ అవార్డును యూకే నుంచి పొందిన క్రీడాకారిణి ఎవరు? (3)
1) పీవీ సింధు 2) మిథాలీ రాజ్
3) మేరీ కోం 4) అశ్విని
వివరణ: ప్రముఖ బాక్సింగ్ చాంపియన్ మేరీ కోం మరో ప్రతిష్ఠాత్మక అవార్డును పొందారు. యూకే నుంచి గ్లోబల్ ఇండియన్ ఐకాన్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 2012 ఒలింపిక్స్ బాక్సింగ్‌లో పతకాన్ని గెలిచారు. ఈ క్రీడలో పతకాన్ని సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
10. ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసే విద్యుత్ పరివర్తన సూచీలో భారత ర్యాంక్ ఎంత? (1)
1) 67 2) 87 3) 15 4) 21
వివరణ: స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా ప్రపంచ ఆర్థిక ఫోరం సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ విడుదల చేసిన విద్యుత్ పరివర్తన సూచీలో భారత్ 67వ ర్యాంకును దక్కించుకుంది. యాక్సెంచర్ అనే సంస్థతో కలిసి ఈ సూచీని రూపొందించారు. సుస్థిర విద్యుత్ సరఫరా, కార్బన్ తీవ్రత తగ్గింపు, పునరుత్పాదక శక్తి పెంపు, విద్యుత్‌ను అందుబాటులో ఉంచడం తదితర అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు.
11. పీఎం-పీఆర్ఏఎన్ఏఎం దేనికి సంబంధించింది? (2)
1) పేదలకు ఆహారం ఇచ్చే కార్యక్రమం
2) రసాయన ఎరువుల వినియోగం
తగ్గించడం
3) ఇంధనాన్ని పొదుపుగా వాడటం
4) యోగా
వివరణ: రసాయన ఎరువుల స్థానంలోనే ప్రత్యామ్నాయాన్ని తెచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిందే పీఎం-ప్రణామ్. దీని పూర్తి రూపం- పీఎం ప్రోగ్రాం ఫర్ రిస్టోరేషన్-అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ అమేలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. అలాగే ప్రస్తుతం యూరియాకు ఉన్న రాయితీ పథకాన్ని కూడా మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు రూ.3.68 లక్షల కోట్లు వ్యయం చేయనుంది. పీఎం ప్రణామ్లో భాగంగా రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించిన రాష్ర్టాలకు ప్రోత్సాహకాలను కేంద్రం అందజేస్తుంది. ఈ పథకం అమలును 2023-24 బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది.
12. ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధిగా ప్రస్తుతం ఎవరు ఉన్నారు? (3)
1) రుచిరా కాంబోజ్
2) అపరాజిత శర్మ
3) బ్రజేందర్ నవ్‌నీత్
4) అపరాజిత సారంగి
వివరణ: స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా ప్రపంచ వాణిజ్య సంస్థ పని చేస్తుంది. దీన్ని 1995, జనవరి 1న ఏర్పాటు చేశారు. గ్యాట్ ఒప్పందంలో భాగంగా ఈ వ్యవస్థ వచ్చింది. ఇందులో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది. దీనికి భారత్ తరఫున శాశ్వత ప్రతినిధిగా బ్రజేందర్ నవ్‌నీత్ ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగిసినా మరో తొమ్మిది నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 2020 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. జూన్ 28న ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే 2024 మార్చి 31 వరకు పొడిగించారు.
13. సాగర్ సామాజిక్ సహ్యోగ్ దేనికి సంబంధించింది? (1)
1) సీఎస్ఆర్
2) యూఎన్సీఎల్వోస్
3) ప్రాదేశిక జలాలు 4) పైవేవీ కావు
వివరణ: సాగర్ సామాజిక్ సహ్యోగ్ను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతకు సంబంధించింది ఇది. గడిచిన మూడు సంవత్సరాల లాభాల్లోని సరాసరిలో 2% సమాజానికి ప్రయోజనం కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. 2013లో భారత్ ఈ చట్టాన్ని చేసింది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న ప్రపంచపు తొలి దేశం భారత్. లాభాలు పొందుతున్న నౌకాశ్రయాలు తమ లాభాల్లో కొంత తీర అభివృద్ధికి వెచ్చించాలి.
14. ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? (2)
1) సిద్ధార్థ
2) రూపా పాయ్
3) పరమేశ్వర్
4) వినాయక్
వివరణ: రూపా పాయ్ రచించిన ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకం జూన్ 27న విడుదల చేశారు. యోగ వల్ల కలిగే ప్రయోజనాలు, యోగ చేసే పద్ధతులకు సంబంధించి పిల్లలకు అర్థమయ్యేలా దీన్ని రచించారు. పతంజలి రచించిన యోగా సూత్రాలను బాలలకు అర్థమయ్యేలా భాష్యం చెప్పారు. దీనిలోని చిత్రాలను సయన్ ముఖర్జీ గీశారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు