Telangana History | ప్రశ్నించిన బందగీ.. ఎదురుతిరిగిన ఐలమ్మ
సామజిక ఆర్థిక పరిస్థితులు
- 1724 నుంచి హైదరాబాద్ రాజ్యాన్ని పరి పాలిస్తున్న మొదటి నిజాం, నిజాం-ఉల్-ముల్క్ కాలం నుంచే ఇతర రాష్ట్రాల నుంచి సంస్థానంలోకి వచ్చిన ముస్లింలు, స్థానికంగా మత మార్పిడి చేసుకొన్న దళిత, వెనుకబడిన కులాల వారు మొత్తం కలిసి 10% ఉండగా అది 1948 వరకు 14%నికి పెరిగింది. దీనికి తోడు ‘అంజుమన్-ఇ-తబ్లిక్-ఉల్- ఇస్లాం’ అనే మత సంస్థ మతమార్పిడి కార్యకలాపాలను విస్తృతంగా చేపట్టింది. ప్రధానంగా ఆనాటి తెలంగాణ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ నిర్మాణం, అధికారానికి మధ్య ఉన్న సంబంధాలను, ఆధిపత్య విధానాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే అప్పటి సామజిక, ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు.
- ముస్లింలు జనాభాలో 14 శాతం ఉన్నప్పటికీ, ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగాల్లో 90 శాతానికిపైగా ఉండేవారు. ముస్లింలు పాలక వర్గమని, వారికి సంస్థానంలోని మిగతా ప్రజలపై ఆధిక్యత ఉందనే భావాన్ని పెంపొందించడం కోసం నిజాం ‘ముల్లాలు’ ప్రయత్నించేవారు. దీనికి వ్యతిరేకంగా మధ్య తరగతి మేధావులు, ఆర్య సామాజికులు పోరాడారు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం ఆరంభమయ్యేనాటికి తెలంగాణలో రైతులను అణచివేయడానికి, దోపిడీ చేయడానికన్నట్లుగా మూడు రకాల భూమి శిస్తు వసూలు విధానం అమల్లో ఉండేది.
దివానీ లేదా ఖల్సా
- హైదరాబాద్ సంస్థానంలో వ్యవసాయానికి పనికి వచ్చే మొత్తం భూమి 5 కోట్ల 30 లక్షల ఎకరాలు. అందులో 3 కోట్ల ఎకరాలు అంటే మొత్తం వ్యవసాయ భూమిలో 60% ప్రత్యక్షంగా ప్రభుత్వం భూమి శిస్తు విధానంలో ఉండేది. దీన్నే దివానీ ఖల్సా ప్రాంతం అంటారు.
జాగీర్లు
- సంస్థానంలోని మొత్తం వ్యవసాయ భూమి లో 30% భూమి జాగీర్ల కింద ఉండేది. వీటిలో పైగాలు, సంస్థానాలు, జాగీర్దార్లు, ఇజారాదార్లు, మక్తేదార్లు, ఇనాందార్లు, అగ్రహాలికులు అనే పేర్లతో వివిధ రకాల ఫ్యూడల్ భూస్వామ్య వర్గాలు ఉండేవి. వీరిలో కొందరికి పన్నులు విధించి వసూలు చేసేందుకు సొంత రెవెన్యూ – పొలీస్-సివిల్ -క్రిమినల్ అధికారులుండేవారు. జాగీర్దార్లు లేని ప్రాంతాల్లోని గ్రామాలు స్థానిక భూస్వాముల ఆధీనంలో ఉండేవి. వారినే దేశ్ముఖ్లని పిలచేవారు. వీరందరూ గ్రామాల్లోని అధికశాతం సొంతం చేసుకొన్న అగ్రకులాలకు చెందిన వారే.
సర్ఫేఖాస్
- నిజాం తన సొంత ఖర్చుల కోసం కేటాయించిన 10% వ్యవసాయ భూమినే సర్ఫేఖాస్ అంటారు. ఈ పద్ధతి ద్వారా నిజాంకు ఏటా రెండు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. దీనిలో ఏ మాత్రం ప్రజాసంక్షేమం కోసం వినియోగించక పోగా అదనంగా ఖజానా నుంచే నిజాం నవాబుకు ఏడాదికి 70 లక్షల రూపాయలు ఇచ్చేవారు.
- ముఖ్యంగా ‘పైగా’లంటే నిజాంకు యుద్ధాల్లో తోడ్పాటుకు, సాయుధ బలగాలను ఏర్పాటు చేసి పోషించటం కోసం, ముస్లిం భూస్వాములకు, ముఖ్యంగా నిజాం బంధువులకు మంజూరు చేసే ఎస్టేట్లు. ఇక్కడ కూడా దోపిడీ అణచివేత ఎక్కువగానే ఉండేవి. నీటిపారుదల సౌకర్యం గల జాగీరు ప్రాంతాల భూమిపై పన్ను, దివానీ ప్రాంతాల్లో ప్రభుత్వం వసూలు చేసేదానికి పదిరెట్లు 10 నుంచి 15 బస్తాల ధాన్యం పన్ను రూపంలో వసూలు చేసేవారు.
- పేద ప్రజలతో ఉచితంగా, బలవంతంగా, దౌర్జన్యంగా పనిచేయించుకొనే వెట్టిచాకిరీ విధానం హైదరాబాద్ సంస్థానంలో సర్వసాధారణంగా ఉండేది. సంస్థానాధీశులు, పైగాలు, జాగీర్దార్లు, భూస్వాములు, ప్రభుత్వాధికారులు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను అనేక రకాలుగా దోపిడీ చేసేవారు. భూస్వామ్య విధానం అమల్లో ఉన్న ప్రతి గ్రామంలోని కులవృత్తుల వారిని బానిసల కంటే హీనంగా చూసేవారు. దీనికి తోడుగా నిర్బంధ, బలవంతపు శ్రమదోపిడీ, అక్రమ వసూళ్లు, తీవ్రమైన శిక్షలు, కుల వివక్షత, స్త్రీలపై అకృత్యాలు బలవంతపు పన్నులు, లెవీ వసూలు, నాగువడ్డీ (ధాన్యంపై అధికవడ్డీ) వసూలు మొదలైనవాటిని బలవంతంగా పేద ప్రజలపై మోపి వసూలు చేసేవారు.
నిర్బంధ శ్రమదోపిడీ
- నిజాం నిరంకుశ భూస్వామ్య వ్యవస్థలో నిర్బంధ శ్రమదోపిడీ అనేది ఒక అన్యాయమైన పద్ధతి. ఆనాడు తెలంగాణ ప్రతి పల్లెలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ విధానాన్ని భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జమీందారులు, మక్తేదారులు చివరికి గ్రామాధికారులు, వారి ఏజెంట్లు కూడా ఎలాంటి హద్దు, అదుపు లేకుండా నిజాం ప్రభువుకు ప్రతినిధులుగా ప్రతి గ్రామంలో అమలు చేసేవారు. ఇదే ఆనాటి నిరంకుశ పరిపాలనకు ఒక ప్రతీక.
శాంతియుత రైతాంగ ఉద్యమాలు (1930-46)
- 1930లో ఏర్పాటు చేసిన ఆంధ్ర మహాసభతో ప్రభావితమైన తెలంగాణ ప్రజలు, 1934లో ఏర్పాటు చేసిన ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ, 1938లో ఏర్పాటైన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, 1939లో ప్రారంభమైన కామ్రేడ్స్ అసోసియేషన్ నాయకుల ప్రోత్సాహంతో శాంతిపోరాటా లు ప్రారంభించారు. 1939లో స్థాపించిన హైదరాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ నాయకులు అందించిన సహాయ సహకారాలతో రైతాంగ ఉద్యమాలను భూస్వాములకు వ్యతిరేకంగా నిర్వహించారు. అందులో ముఖ్యమైనవి.
షేక్ బందగీ సాహెబ్ ప్రతిఘటన
- బందగీ సాహెబ్, జనగామ తాలూకాలోని విసునూరు దేశ్‌ముఖ్ రాపాక వేంకటరామచంద్రారెడ్డి అధికార పరిధిలోగల కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన ముస్లిం రైతు. అయితే తనకున్న 4 ఎకరాల వ్యవసాయభూమి విషయంలో దాయాదులైన అహ్మద్, అబ్బాస్ అలీ, అతని సోదరులతో వివాదం మొదలైంది.
- అబ్బాస్‌అలీ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డిని ఆశ్రయించగా, బందగీ సాహెబ్ దేశ్‌ముఖ్‌కు కూడా లొంగలేదు. చివరికి ఈ భూమి వివాదం కోర్టు వచ్చింది. తీర్పు బందగి
సాహెబ్‌కు అనుకూలంగా రావడంతో, భరించలేని అబ్బాస్‌అలీ సోదరులు, దేశ్‌ముఖ్ మద్దతుతో 26, జూలై, 1940లో బందగీని అతి దారుణంగా నరికి
చంపేశారు. - ఈ భయంకరమైన సంఘటన తెలంగాణ ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని, ఎదిరించి పోరాడే ధైర్యాన్ని ఇచ్చింది.
ధర్మపురం – మొండ్రాయి లంబాడాల తిరుగుబాటు
- జనగామ తాలూకాలోని ధర్మపురం పూసుకూరు రాఘవరావు మక్తేదారు ఆధీనంలో ఉండగా మొండ్రాయి కఠారు నరసింహారావు మక్తేదారు పరిధిలో వుండేది.
- ఈ రెండు గ్రామాల పరిధిలోని గిరిజన లంబాడాలు సాగు చేసుకుంటున్న దాదాపు 200 ఎకరాల బంజరు దౌర్జన్యంగా భూస్వాములు ఆక్రమించుకొని, ఎదురు తిరిగిన లంబాడా నాయకులపై కేసులు పెట్టించారు. చివరికి ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ సంఘం నాయకుల నాయకత్వంలో తిరుగుబాటుచేసి తమ భూములను దక్కించుకున్నారు.
ఎర్రబాదు ప్రజా తిరుగుబాటు
- నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకాలో ఎర్రబాదు గ్రామ భూస్వామి జెన్నారెడ్డి పేర లక్షన్నర ఎకరాల భూమి ఉండేది. ఆయన తన పరిధిలో గల గ్రామాలైన చిల్లకుంట, ఎడవెళ్ళి, నూతనకల్లు, గ్రామాలకు చెందిన అనేక మంది రైతులను వాళ్ల భూముల నుంచి వెళ్లగొట్టి, వాటిని తన పేర మార్చుకోవడమే కాకుండా తన కిరాయి మనుషుల ద్వారా పేద రైతులపై దాడి చేయాలనుకున్నాడు.
- కానీ తమ నాయకుడైన గాజుల రామచంద్రయ్య నాయకత్వంలో రైతులు తిరుగుబాటు చేసి తాము కోల్పోయిన భూములను తిరిగి దక్కించుకున్నారు.
- ఈక్రమంలోనే తాలుకా గ్రామాల్లో 5000 ఎకరాలకుపైగా భూములున్న భూస్వాములపైన కూడా సంఘం మద్దతుతో రైతులు తిరుగుబాటును లేవదీశారు.
చాకలి ఐలమ్మ భూపోరాటం
- వేల ఎకరాల భూమిని చట్ట విరుద్ధంగా తమ ఆధీనంలో ఉంచుకొన్న భూస్వాములు, చట్టబద్దంగా బంజరు భూములను కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న పేదరైతు కూలీలను బేదఖల్ (Land Alienation) రూపేణా తొలగిస్తూ నానా రకాలుగా బాధించేవారు. ఈ తరహాలోనే మల్లంపెల్లి మక్తేదారు రాఘవరావుకు సంబంధించిన పాలకుర్తి పరిధిలోని 10 ఎకరాల తరిభూమిని, 20 ఎకరాల ఖుష్కిని (పుట్టల పంపు) స్థానిక రజక కుటుంబమైన చిట్యాల నర్సయ్య, అయిలమ్మ కౌలుకు తీసుకొని సాగుస్తుం డేవారు. ఉద్యమ కాలంలో ఈ కుటుంబం దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డికి, స్థానిక పోలీస్‌పటేల్ వీరమనేని శేషగిరిరావుకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల సంఘానికి సహకరిస్తుందనే కారణంతో ఇతర సందర్భాల్లో జరిగిన గొడవలను పాలకుర్తి కుట్రకేసుగా బనాయించి, ఐయిలమ్మ భర్త నర్సయ్య, కొడుకులు సోమయ్య, లచ్చయ్యలతోపాటు పార్టీ ముఖ్యనాయకులను జైలుకు పంపించారు. ఆ సమయంలోనే చాలా తెలివిగా విసునూరు దేశ్‌ముఖ్, రామచంద్రారెడ్డి, మల్లంపల్లి మక్తేదారు నుంచి తాను ఐయిలమ్మ-నర్సయ్య భూములను కౌలుకు తీసుకున్నట్లు ఒక ఒప్పంద పత్రం రాయించు కొన్నాడు. అంతే కాకుండా దేశ్‌ముఖ్ చేతికందివచ్చిన పంటను దక్కించుకోవడానికి తన మనుషుల చేత దాడి చేయించాడు. అప్పటికే జిల్లా పార్టీ నిర్ణయం మేరకు ఐయిలమ్మ కుటుంబానికి రక్షణగా ఉన్న స్థానిక నాయకులు భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు ప్రతాపరెడ్డి, నల్లా నరసింహులు ప్రజల సహకారాలతో వారి దాడిని విజయవంతంగాఎదర్కొని అయిలమ్మ పంటను ఆమె ఇంటికి చేర్చారు. ఆనాడు ఈ సంఘటనలో అయిలమ్మ చూపించిన ధైర్యానికి, తెగువకు ఆమె పార్టీకి, నాయకులకు అందించిన సహాయ సహకారాలకు జిల్లాపార్టీ నాయకుడు దేవులపల్లి వేంకటేశ్వరరావు ఎంతగానో ఆశ్చర్యపోయారు. అందుకే ఈమె కమ్యూనిస్టు ఐయిలమ్మగా పేరు గాంచింది
ఆంధ్రమహాసభ – కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు
- హైదరాబాద్ సంస్థానంలో పెల్లుబికిన ప్రజా చైతన్యం, అనుకోని సంఘటనల వల్ల 1921లో ఏర్పటైన ఆంధ్రజన సంఘం 1924లో జనకేంద్ర సంఘంగా, చివరికి 1930లో నిజాం రాష్ర్టాంధ్ర మహాసభగా పేరు మార్చుకొని, 1940నాటికి కాంగ్రెస్ మితవాదుల నాయకత్వంలో ఏడో మహాసభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించింది. అయితే 1941 చిలుకూరులో ఆంధ్రమహాసభ సమావేశం రావి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరగడంతో పాక్షికంగా ఆంధ్రమహాసభ కార్యకలాపాలు కమ్యూనిస్టుల నాయకత్వంలోకి వెళ్లిపోయాయి. 1941 జనవరి-జూన్ నెలల మధ్యలో కమ్యూనిస్టులు ఖమ్మం, తునికిపాడు, చందుపట్ల, సూర్యాపేట, జనగామ ప్రాంతాల్లో రహస్యంగా రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించి ఉత్సాహవంతులైన యువకులను తమవైపు ఆకర్షించుకున్నారు.
- ఈ ఆంధ్రమహాసభ అనేది క్రమంగా కమ్యూనిస్టు పార్టీ రూపాన్ని సంతరించుకుని జనగామ, సూర్యాపేట తాలూకాల్లో కౌలుదారు ఆందోళనలు చేపట్టింది. ఈ విధంగా చిలుకూరు ఆంధ్రమహాసభ సమావేశం తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఒక ప్రధాన మలుపుగా సహకరించింది.
- 1935లో కమ్యూనిస్టు పార్టీపై బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే 1939-45ల మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీకి వ్యతిరేకంగా రష్యాతో కలిసి యుద్ధంలో పాల్గొన్న ఇంగ్లండ్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో భాగంగా భారత కమ్యూనిస్టులపై 1942లో నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో స్థానికంగా కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ కార్యకర్తలు నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల్లోని కొన్ని తాలూకాలతో పాటుగా, జనగామ, సూర్యాపేట తాలూకా ప్రాంతాల్లో కౌలుదారు సమస్యలు, వెట్టిచాకిరీలపై పోరాడారు. 1940 నుంచి 1946 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్రమహాసభ – కమ్యూనిస్టులు ఇటు భూస్వాములను అటు ప్రభుత్వాన్ని కూడా సమాంతరంగా కదిలించే విధంగా పేదరైతు కూలీలు, ప్రజలతో చాలా బలమైన పోరాట పునాదుల్ని నిర్మించారు. అంతేకాకుండా వారు తీసుకున్న సమస్యలన్నీ కూడాప్రభుత్వ నిబంధనలు, ఆంధ్రమహాసభ తీర్మానాల పరిధిలోనే ఉండేవి. దస్తుర్-ఉల్-అమల్ రెవిన్యూ కోడ్-1907 ప్రకారం ఆసామి శిఖంలు కౌలుదార్ల కోరిక మేరకు 12 సంవత్సరాలుగా భూమిని కౌలు చేస్తున్న కౌలుదార్లను శిఖందార్లుగా గుర్తించాలని తెలుపుతూ వారికి శిఖం పొందేటట్లు చేశారు. ఆంధ్ర మహాసభలోని వామపక్ష కార్యకర్తలు నిజాం నిరంకుశ, ఫ్యూడల్ భూస్వాములు సాగిస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దురాక్రమణలు, అణచివేతలు, వెట్టి చాకిరీలకు వ్యతిరేకంగా చట్టబద్ధంగానే ఎంతో విలువైన శాంతియుత సామూహిక ప్రజాపోరాటాలు నిర్వహించారు
- 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభ సమావేశం జాతీయ మితవాదులను వ్యతిరేకించి, వారి అవినీతిని ఎండగట్టి యువతలో స్ఫూర్తిని, అంకితభావాన్ని కలిగించడంతో పాటు తెలంగాణ చర్రితను కొత్త పంథాలోకి మార్చివేసింది.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు