Geography | సముద్ర ప్రవాహ వృత్తం అని దేన్ని అంటారు?
సముద్ర ప్రవాహాలు
- సముద్రంలోని నీరు నిర్దిష్ట లక్షణాలతో, నిర్దిష్ట దిశలో, నిరంతరం ప్రవహించడాన్ని సముద్ర ప్రవాహాలు అంటారు.
సముద్ర ప్రవాహాలు ఏర్పడటానికి కారణాలు
1) ప్రపంచ పవనాలు (Planetary Winds): పవనాలు తాము వీస్తున్న దిశలో సముద్ర నీటిని ముందుకు తోసుకుంటూ వెళతాయి. పవనాలు గంటకు 100 కి.మీ. వేగంతో వీస్తే సముద్రపు నీటిని 1.5 కి.మీ. వేగంతో తోసుకెళ్తాయి. - వ్యాపార పవనాలు భూమధ్య రేఖ ప్రవాహాలు ఏర్పడటానికి, పశ్చిమ పవనాలు పశ్చిమ పవన ప్రవాహాలు (West Wind Drift) ఏర్పడటానికి కారణమవుతున్నాయి.
2) అపకేంద్ర బలం (Centrifugal force): అపకేంద్ర బలం భూమధ్య రేఖ వద్ద అధికంగా ఉంటుంది. దీని కారణంగా సముద్రాల నీరు ధృవాల వైపునకు కదలడం ప్రారంభమవుతుంది.
3) గురుత్వాకర్షణ బలంలో తేడా (Gravity Differences): భూమధ్య రేఖ వద్ద కంటే ధృవాల వద్ద గురుత్వాకర్షణ బలం ఎక్కువ కాబట్టి నీరు ధృవాల వైపునకు ఆకర్షించబడుతుంది.
4) సౌరశక్తి (Solar Energy): భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత వల్ల వేడెక్కి జలాలు సంకోచించడం వల్ల సముద్ర నీటి మట్టం పెరుగుతుంది. అయన రేఖ ప్రాంతంతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద నీటి మట్టం 8 సెం.మీ. ఎక్కువ ఉంటుంది. తత్ఫలితంగా నీరు ధృవాల వైపునకు కదులుతుంది.
5) మంచుగడ్డల కరుగుదల (Melting of Iceberg): మంచుగడ్డలు కరగడం వల్ల అధికమైన నీరు పల్లాన్ని అనుసరించి కదలడం ప్రారంభిస్తుంది.
6) పెద్ద పెద్ద నదులు వచ్చి కలవడం: అమెజాన్, మిసిసిపి వంటి పెద్ద నదులు వచ్చి కలవడం వల్ల అధికమైన నీరు కూడా సముద్ర ప్రవాహాలు ఏర్పడటానికి కారణమవుతుంది.
గైర్ (Gyre): దీన్ని సముద్ర ప్రవాహ వృత్తం అని కూడా అంటారు. ప్రతి అర్ధగోళంలోని మహాసముద్రంలో ఖండాల పశ్చిమ భాగాన భూమధ్య రేఖ వద్ద ప్రారంభమైన ప్రవాహం, భూమధ్య రేఖకు సమాంతరంగా ప్రవహించి ఖండాల తూర్పుతీరం గుండా ఉత్తరం వైపునకు ప్రయాణించి చివరకు ప్రారంభమైన చోటుకు వస్తాయి. ఈ దీర్ఘ వృత్తాకారపు ప్రవాహాన్ని ‘గైర్’ అంటారు. - ఈ ప్రవాహ వృత్తంలో నాలుగు ప్రధాన ప్రవాహాలు ఉంటాయి.
1) భూమధ్య రేఖకు సమాంతరంగా ప్రవహించే భూమధ్య రేఖ ప్రవాహం. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం, దక్షిణాన దక్షిణం భూమధ్య రేఖ ప్రవాహంగా పిలువబడతాయి.
2) ఖండాలకు తూర్పున ధృవాల వైపుగా ప్రవహించే వేడి నీటి ప్రవాహాలు
3) పశ్చిమ పవన ప్రవాహం (West Wind Drift)
4) ఖండాల పశ్చిమాన భూమధ్య రేఖ వైపు ప్రయాణించే శీతల ప్రవాహం - భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపునకు ప్రవహించే ప్రతి ప్రవాహం ఉష్ణ ప్రవాహమే. ధృవాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపునకు ప్రవహించే ప్రతి ప్రవాహం శీతల ప్రవాహమే.
- పశ్చిమంగా ప్రవహించే ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహానికి, దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహానికి మధ్యలో భూమధ్య రేఖ ప్రతి ప్రవాహం ఏర్పడి తూర్పుగా ప్రవహిస్తుంది.
- ఖండాల పశ్చిమ భాగాన ప్రవహించే ప్రతి ప్రవాహం శీతల ప్రవాహమే.
- సముద్ర ప్రవాహాన్ని తరచుగా డ్రిఫ్ట్ అని కూడా సంబోధిస్తారు.
- సముద్ర ప్రవాహాల దిశను తీర ప్రాంత ఆకృతి, కొరియాలిస్ ఎఫెక్ట్ ప్రభావితం చేస్తాయి.
1. పసిఫిక్ మహాసముద్రంలో ప్రవాహాలు
ఎ. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని ప్రవాహాలు
1) ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం: వ్యాపార పవనాల వల్ల మెక్సికో పశ్చిమాన ప్రారంభమై 12,000 కి.మీ. దూరం ప్రయాణించిన తర్వాత ఫిలిప్పీన్స్ ద్వీపాల వద్ద ఉత్తరం వైపునకు తిరుగుతుంది.
2) కురోషివో ప్రవాహం (Kuroshiv Current): ఫిలిప్పీన్స్ ద్వీపాల నుంచి ఆసియా తూర్పు తీరం గుండా ప్రవహించే ప్రవాహం (జపాన్ తీరం మీదుగా)
3) పశ్చిమ పవన ప్రవాహం: ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్ అని అంటారు. జపాన్ ద్వీపాల వద్ద పశ్చిమ పవనాల ప్రభావం వల్ల తూర్పునకు తిరిగి ప్రవహించే ప్రవాహం.
4) కాలిఫోర్నియా శీతల ప్రవాహం: పశ్చిమ పవన ప్రవాహం అమెరికా పశ్చిమ తీరం గుండా శీతల ప్రవాహంగా ప్రవహిస్తుంది. ఇది కాలిఫోర్నియా ప్రవాహం అంటారు.
5) ఓయాషియో శీతల ప్రవాహం: దీన్నే కురైల్ శీతల ప్రవాహం అని అంటారు. ఆర్కిటిక్ సముద్రం నుంచి ప్రారంభమై బేరింగ్ జలసంధి గుండా ప్రయాణించి కురోషివో ప్రవాహాన్ని ఢీకొట్టే శీతల ప్రవాహం.
6) ఓఖోట్స్ శీతల ప్రవాహం: రష్యా తూర్పున గల ఓఖోట్స్ సముద్రం నుంచి వచ్చే చిన్న శీతల ప్రవాహం.
బి. దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ప్రవాహాలు
1) దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహం: పెరూ దేశ తీరం నుంచి ప్రారంభమై భూమధ్య రేఖకు సమాంతరంగా ప్రవహించే ప్రవాహం.
2) తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహం: ఇండోనేషియా ద్వీపాల వద్ద భూమధ్య రేఖ ప్రవాహం దక్షిణంగా తిరిగి ఆస్ట్రేలియా తూర్పు తీరం గుండా ప్రవహించే ప్రవాహం.
3) పశ్చిమ పవన ప్రవాహం: దక్షిణ పసిఫిక్ డ్రిఫ్ట్ అని కూడా అంటారు. ఆస్ట్రేలియా నుంచి చిలీ వరకు ప్రవహించే ప్రవాహం.
4) పెరూ శీతల ప్రవాహం: దీన్నే హంబోల్ట్ శీతల ప్రవాహం అని కూడా అంటారు. పెరూ, చిలీ పశ్చిమ తీరాల గుండా ఉత్తరంగా ప్రవహించే ప్రవాహం. - భూమధ్య రేఖ ప్రతిప్రవాహం: దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహంలోని కొంత భాగం కొన్ని సందర్భాల్లో పెరూ శీతల ప్రవాహానికి ఎదురుగా వస్తుంది. ఈ వేడి ప్రవాహాన్నే భూమధ్య రేఖ ప్రతిప్రవాహం అంటారు.
2. అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవాహాలు
ఎ. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవాహాలు
1) ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం: ఆఫ్రికా పశ్చిమ తీరం నుంచి కరీబియన్ ద్వీపాల వరకు ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ ప్రవాహం రెండుగా చీలిపోతుంది. అవి.. కరీబియన్ ప్రవాహం, అంటిల్లీస్ ప్రవాహం.
2) గల్ఫ్ ప్రవాహం: మెక్సికన్ గల్ఫ్ నుంచి అమెరికా తూర్పు తీరం గుండా న్యూఫౌండ్‌ల్యాండ్ వరకు ప్రవహించే ప్రవాహం. మెక్సికో సింధుశాఖలో ప్రవేశించిన కరీబియన్ ప్రవాహమే ఫ్లోరిడా గుండా గల్ఫ్ ప్రవాహంగా ప్రారంభమవుతుంది.
3) పశ్చిమ పవన ప్రవాహం: నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు. న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి తూర్పుగా నార్వే వరకు వెళ్లే ప్రవాహం.
4) కెనరీ శీతల ప్రవాహం: ఐరోపా పశ్చిమ తీరాన గల కెనరీ ద్వీపాల మీదుగా, ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రవహించే శీతల ప్రవాహం.
5) లాబ్రడార్ శీతల ప్రవాహం: గ్రీన్‌ల్యాండ్ పశ్చిమాన గల లాబ్రడార్ సముద్రం నుంచి దక్షిణంగా ప్రవహించే శీతల ప్రవాహం. ఇది న్యూఫౌండ్‌ల్యాండ్ వద్ద గల్ఫ్ ప్రవాహాన్ని ఢీకొంటుంది.
6) తూర్పు గ్రీన్‌ల్యాండ్ శీతల ప్రవాహం: గ్రీన్‌ల్యాండ్ తూర్పు తీరం గుండా ప్రవహించే శీతల ప్రవాహం.
సి. దక్షిణ అట్లాంటిక్ ప్రవాహాలు
1) దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహం: ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గినియా తీరం నుంచి బ్రెజిల్ వరకు ప్రవహించే ప్రవాహం.
2) బ్రెజిల్ ప్రవాహం: బ్రెజిల్ తూర్పు తీరం వెంట దక్షిణంగా ప్రవహించే ప్రవాహం.
3) పశ్చిమ పవన ప్రవాహం: దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు.
4) బెంగ్వేలా శీతల ప్రవాహం: ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా గినియా తీరం వరకు ప్రవహించే శీతల ప్రవాహం.
5) ఫాక్లాండ్ శీతల ప్రవాహం: అంటార్కిటికా జలాల నుంచి ఫాక్లాండ్ ద్వీపాల మీదుగా వచ్చే శీతల ప్రవాహం. ఇది బ్రెజిల్ శీతల ప్రవాహాన్ని ఢీకొంటుంది.
3. హిందూ మహాసముద్ర ప్రవాహాలు
ఎ. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రవాహాలు
1) ఉత్తర హిందూ మహాసముద్రంలో ఒక్క ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం తప్ప మిగిలిన ప్రవాహాలు ఏవీ స్పష్టంగా ఏర్పడవు. - భారత ద్వీపకల్ప హిందూ మహాసముద్ర మధ్య భాగంలోకి చొచ్చుకురావడం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల వల్ల పవన దిశలు మారిపోవడం దీనికి కారణాలు.
2) సోమాలియా ప్రవాహం: ఆఫ్రికా కొమ్ము దగ్గరగా గల సోమాలియా తీరం నుంచి ఉబికి వచ్చే జలాల వల్ల ఏర్పడే చిన్న ప్రవాహం.
బి. దక్షిణ హిందూ మహాసముద్రంలోని ప్రవాహాలు
1) దక్షిణ భూమధ్య రేఖా ప్రవాహం: ఇండోనేషియా ద్వీపాల నుంచి ఆఫ్రికా తూర్పు తీరం వచ్చే ప్రవాహం.
2) అగుల్ హౌస్ ప్రవాహం: ఆఫ్రికా తూర్పు తీరాన దక్షిణంగా మొజాంబిక్ జలసంధి గుండా ప్రవహించే ప్రవాహం.
3) పశ్చిమ పవన ప్రవాహం: దక్షిణ ఆఫ్రికా తూర్పు నుంచి ఆస్ట్రేలియా సిడ్నీ వరకు తూర్పుగా ప్రవహించే ప్రవాహం.
4) పశ్చిమ ఆస్ట్రేలియా ప్రవాహం: ఆస్ట్రేలియా పశ్చిమ తీరం గుండా ప్రవహించే శీతల ప్రవాహం.
సముద్ర ప్రవాహాల ఫలితాలు
1) భూమధ్య రేఖ ప్రాంతంలోని అధిక ఉష్ణోగ్రత ధృవ ప్రాంతాలకు అందిస్తుంది. 66 డిగ్రీల అక్షాంశం వద్ద గల నార్వే ప్రాంతం వెచ్చదనానికి కారణం నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్.
2) ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు ఎదురుపడే సమయంలో దట్టమైన పొగమంచు (Cold Wall) ఏర్పడుతుంది. ఈ పొగమంచు నౌకా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ ప్రాంతాలు చేపల దిబ్బలకు ప్రసిద్ధి.
ఎ) గల్ఫ్‌స్ట్రీమ్, లాబ్రడార్ ప్రవాహం కలుసుకునే న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రాంతంలో గ్రాండ్ బ్యాంక్ అనే చేపల దిబ్బ ఏర్పడింది.
బి) కురోషివో ప్రవాహం, ఒయాషివో ప్రవాహం కలుసుకునే జపాన్ ఉత్తర భాగాన చేపల దిబ్బ ఏర్పడింది.
సి) బ్రిటన్ ద్వీపాలకు, ఐరోపాకు మధ్యగల ఉత్తర సముద్రంలో కూడా డాగర్ బ్యాంక్ అనే చేపల దిబ్బ ఏర్పడింది.
3) ఉష్ణ ప్రవాహాలున్న చోట్ల సమృద్ధిగా వర్షాలు పడగా, శీతల సముద్ర ప్రవాహాలున్న చోట ఎడారులు ఏర్పడుతాయి. ప్రతి ఉష్ణ మండల ఎడారికి పక్కనే ఒక శీతల ప్రవాహం ఉంటుంది.
ఉదా: సహారా ఎడారి- కెనరీ శీతల ప్రవాహం, అటకామా ఎడారి- పెరూ శీతల ప్రవాహం, కలహారి ఎడారి- బెంగ్వేలా శీతల ప్రవాహం, పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారి- పశ్చిమ ఆస్ట్రేలియా శీతల ప్రవాహం, సోనారన్ ఎడారి- కాలిఫోర్నియా శీతల ప్రవాహం
4) దక్షిణ పసిఫిక్‌లోని భూమధ్య రేఖ ప్రతిప్రవాహ క్రియాశీలత మీద ఆధారపడే ఎల్‌నినో, లానినా అనే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
5) ధృవాల వద్ద గల మంచు ఖండాలను దక్షిణంగా తీసుకొని వచ్చి అవి కరగడానికి, అదేవిధంగా అనేక ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. సముద్ర ప్రవాహ దిశలో నౌకలు ప్రయాణిస్తే తేలికగా వెళ్లవచ్చు.
సర్గాసో సముద్రం: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో కరీబియన్ ద్వీపాలకు ఈశాన్య దిక్కున గల ప్రత్యేకమైన తీర ప్రాంతంలోని సముద్రం. సర్గాసో అనే సముద్రం నాచుతో (Seaweed) ఉన్న ప్రాంతం స్థిరమైన జలాలు ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతటా సముద్రం నాచుతో ఏర్పడింది. అంటిల్లీస్ ప్రవాహం దీని చుట్టూ ప్రవహిస్తూ సర్గాసో సముద్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. అంటే మధ్యలో స్థిర జలాలను ఏర్పరుస్తుంది. నౌకలు ఈ సర్గాసో గుండా ప్రయాణించడం కష్టమవుతుంది.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
Previous article
Telangana History | రేకపల్లి తిరుగుబాటు ఎవరి నాయకత్వంలో జరిగింది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు