Civil Services Success Stories | వీక్లీ టెస్టులతో లోపాలు సవరించుకున్నా..
నిధి పాయ్
ఆల్ఇండియా 110వ ర్యాంక్
సివిల్స్ సాధించడమనేది లక్షలాదిమంది కల. చాలామంది చిన్నప్పటి నుంచి భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీస్‌లో చేరి సమాజానికి సేవ చేయాలనుకుంటారు. అలాంటి కోవకే చెందిన నిధి పాయ్ సివిల్స్‌లో 110వ ర్యాంక్ సాధించింది. సివిల్స్ విజయ ప్రస్థానంతోపాటు భవిష్యత్తులో సివిల్స్ రాసే అభ్యర్థులకు నిధి అందిందిచన సలహాలు, సూచనలు ఆమె మాటల్లో….
కుటుంబ నేపథ్యం
మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలు కర్ణాటక నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న నారాయణ్ పాయ్ హోటల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అమ్మ శ్రద్ధ పాయ్ గృహిణి. అక్క సీఏ చదివింది. నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ సాధించాలని కోరిక ఉంది.
నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. పాఠశాల విద్య హిమాయత్‌నగర్‌లోని హార్వర్డ్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. ఇంటర్ న్యూ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కాలేజీలో చదివాను. బీకాం (ఆనర్స్) డిగ్రీని అరోరా కాలేజీలో పూర్తిచేశాను. డిగ్రీ పూర్తి కాగానే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను.
సివిల్స్ మొదటి ప్రయత్నంలో బాగా టెన్షన్, స్ట్రెస్ వల్ల విజయం సాధించలేక పోయాను. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను కానీ ర్యాంక్ రాలేదు. ఆప్షనల్ సబ్జెక్టులో స్కోర్ తగ్గడం వల్ల సివిల్స్ సాధించలేకపోయాను.
మూడో ప్రయత్నంలో 110వ ర్యాంక్ సాధించాను. ప్రస్తుతం ఐఆర్‌ఎస్‌ను ఆప్ట్ చేసుకున్నాను. భవిష్యత్తులో ఐఏఎస్ కోసం ప్రయత్నిస్తాను.
ప్రిపరేషన్ ఇలా!
సివిల్స్ కోసం డిగ్రీ పూర్తికాగానే మొదట జీఎస్ ఫౌండేషన్‌ను ఐఏఎస్ బ్రెయిన్స్‌లో, ఆంత్రోపాలజీ బ్రెయిన్ ట్రీ కార్తీక్ సార్ దగ్గర, ఆంత్రోపాలజీ టెస్ట్ సిరీస్‌ను విష్ణు ఐఏఎస్ అకాడమీ విష్ణు సార్ దగ్గర తీసుకున్నాను. ప్రిలిమ్స్ కోసం మొదట యూపీఎస్సీ సిలబస్, పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాను. దీంతోపాటు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రామాణిక పుస్తకాలను చదివాను. మెయిన్స్ విషయానికి వస్తే ఆప్షనల్స్, జీఎస్ పేపర్స్‌పై పట్టు కోసం కష్టపడ్డాను. ఆప్షనల్‌గా ఆంత్రోపాలజీని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం మార్కెట్లో దీనికి సంబంధించిన మెటీరియల్ పూర్తి స్థాయిలో లభ్యం కావడం. మంచి స్కోరింగ్ ఆప్షనల్‌గా పేరుండటం, కోచింగ్ కూడా అందుబాటులో ఉండటం వల్ల ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా తీసుకున్నాను. మూడుసార్లు నా ఆప్షనల్ సబ్జెక్టు ఆంత్రోపాలజీనే. రోజూ 7 నుంచి 88 గంటలు ప్రిపరేషన్ కొనసాగించాను.
ఇంటర్వ్యూ
ఆర్ఎన్ చౌబే బోర్డు ఇంటర్వ్యూ చేసింది. సుమారు 30 నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది. హాబీలు, కుటుంబం, రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై అడగలేదు.
ప్రధానంగా యూనిఫాం సివిల్ కోడ్, పట్టణాల పేర్ల మార్పు, ఆస్పా యాక్ట్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు.
కోచింగ్ తీసుకోవాలా ?
కోచింగ్ అనేది అభ్యర్థి ఆలోచన, సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. కోచింగ్ తీసుకోకుండా కూడా విజయం సాధించవచ్చు. ఈసారి కూడా చాలామంది కోచింగ్ తీసుకోకుండానే విజయం సాధించారు. మా ఇంటికి దగ్గరగా కోచింగ్ అవకాశం ఉండటం వల్ల నేను కోచింగ్ తీసుకున్నాను.
ఆన్లైన్లో చాలా మెటీరియల్, గైడెన్స్ అందుబాటులో ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకుని సివిల్స్ సాధించవచ్చు. కావల్సిందల్లా సివిల్స్ సాధించాలనే స్థిరమైన పట్టుదల ఉండాలి.
అభ్యర్థులకు సలహాలు..
డిగ్రీ చదివేవారు సబ్జెక్టులను బాగా చదవాలి. అవకాశం ఉంటే డిగ్రీ సెకండియర్ లేదా ఫైనల్ ఇయర్ తర్వాత సివిల్స్ కోసం ఒక్క ఏడాది సీరియస్‌గా కష్టపడితే విజయం సాధించవచ్చు. ఒక్కోసారి అపజయం ఎదురైనా నిరాశ పడకుండా మళ్లీ ప్రయత్నించండి తప్పక విజయం సాధిస్తారు. రోజూ న్యూస్ పేపర్ చదవడం, రాజ్యసభ టీవీ చూడటం, ప్రామాణిక పుస్తకాలను చదవడం చేయాలి. సివిల్స్ రాయాలనుకునేవారు ముఖ్యంగా పరీక్షను పరీక్షగానే చూడండి. సివిల్సే ప్రపంచం కాదు. వందశాతం మీ ఎఫోర్ట్ పెట్టండి. ఫలితం ఎలా వచ్చినా స్వీకరించండి.
– జి.గణేష్, చిక్కడపల్లి రిపోర్టర్
డాక్టర్ నుంచి సివిల్స్ వైపు
రేపూడి నవీన్ ఆల్ఇండియా 550వ ర్యాంక్
డాక్టర్ కావడం అతడి కల. కానీ తాను చదువుతున్న చోటుకు ఓ ఐఏఎస్ రావడంతో అప్పుడే అతని ఆలోచన సివిల్స్ వైపు మళ్లింది. ఆ దిశగా ప్రిపేర్ అవుతున్న క్రమంలో అమ్మ అనారోగ్యం బారిన పడటంతో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా పట్టు విడవ లేదు. బాధను దిగమింగుకొని తల్లిదండ్రులు, తమ్ముడి సహకారంతో మళ్లీ ప్రిపరేషన్ మొదలెట్టాడు. చివరికి ఆరో ప్రయత్నంలో 550వ ర్యాంకుతో మెరిశాడు. అతడే గుంటూరుకు చెందిన రేపూడి నవీన్. ఆయన విజయ ప్రస్థానం ‘నిపుణ’తో పంచుకున్నారిలా..
కుటుంబ నేపథ్యం?
మాది గుంటూరు పట్టణం. నాన్న రేపూడి జయపాల్, అమ్మ విజయలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. తమ్ముడు వినయ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అమెరికాలో సెటిల్ అయ్యాడు.
విద్యాభ్యాసం?
ప్రాథమిక విద్య జగ్గయ్యపేటలో, గుంటూరు పబ్లిక్ స్కూల్ పదో తరగతి వరకు చదివాను. విజయవాడలో ఎంబీబీఎస్ పూర్తి
చేశాను.
సివిల్స్ వైపు రావడానికి కారణం?
వైద్య విద్య చివరి సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ఉండటంతో అప్పుడే విజయవాడ సబ్ కలెక్టర్‌గా వచ్చిన డా.సలోమి సబానా హాస్పిటల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆమె కూడా అంతకుముందు డాక్టర్ కావడంతో ఆమెను చూసి స్ఫూర్తి పొందాను. ప్రజలకు ఎంతో సేవ చేయొచ్చని భావించి ఎంబీబీఎస్ వదిలేసి సివిల్స్ వైపు వచ్చాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
ఢిల్లీలోని వాజిరాం ఐఏఎస్ అకాడమీలో సంవత్సరం కోచింగ్‌కు వెళ్లాను. తర్వాత సొంతంగా ప్రిపరేషన్ కొనసాగించాను. హైదరాబాద్‌లోని విష్ణు ఐఏఎస్ అకాడమీలో టెస్ట్ సిరీస్ తీసుకొని ఫాలో అయ్యాను. రోజూ 6-8 గంటలు చదివాను. ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. NCERT బుక్స్ చాలా ఉపయోగపడ్డాయి. సివిల్స్ సన్నద్ధత యాత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రిపరేషన్లో ఇంటర్నెట్, యూట్యూబ్ మెయిన్ పార్ట్ అయిపోయింది. చాలావరకు మెటీరియల్ ఇంటర్నెట్లోనే లభ్యమవుతుంది. ఒత్తిడిని మర్చిపోవడానికి క్రికెట్, టెన్నిస్ ఆడాను.
ఎన్నో ప్రయత్నంలో సాధించారు?
మూడో ప్రయత్నంలో ఉన్నప్పుడు అమ్మ అనారోగ్యంతో ఉండగా ప్రిపరేషన్ ఆపేశాను. అనంతరం మళ్లీ చదివాను. గతంలో ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు నాలుగుసార్లు వెళ్లాను. ఇంటర్వ్యూకు రెండుసార్లు హాజరయ్యాను. చివరికి ఆరో ప్రయత్నంలో సాధించాను.
ఇంటర్వ్యూలో ఏం అడిగారు?
RN చౌబే బృందం ఇంటర్వ్యూ చేసింది. సుమారు 25 నిమిషాలు సాగింది. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే లాభమా, నష్టమా? హెలికాప్టర్‌కు పైన రెక్కలతో పాటు వెనకాల రెక్కలు ఎందుకుంటాయి.. వాటి మెకానిజమ్ ఏంటి? ఆర్బీఐ కరెన్సీ ముద్రణ వంటి విషయాలతో పాటు ఇతర ప్రశ్నలు అడిగారు. చాలావరకు సమాధానాలు ఇచ్చాను.
ఆప్షనల్స్
ఆప్షనల్స్ రెండు రకాలు ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌పై పట్టు ఉందనుకుంటే అదే ఎంచుకోవాలి. లేదంటే ఆసక్తిని బట్టి సోషియాలజీ, ఆంత్రోపాలజీ వంటివి ఎంచుకోవచ్చు.
సర్వీస్‌లో చేరాక ఏం చేద్దామనుకుంటున్నారు?
ఐఆర్ఎస్ లేదా ఐపీఎస్ వచ్చే అవకాశముంది. ఏదో చేయాలని కాకుండా 100% నా రోల్ పోషిస్తే అదే సంతృప్తినిస్తుంది. విధులతో పాటు బయటి లైఫ్‌ను కూడా సమానంగా బ్యాలెన్స్ చేయాలి.
యువతకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
సివిల్స్ వైపు రావాలనుకుంటే ముందే ప్రిపరేషన్ ఉండాలి. అప్పటికప్పుడు చదివి రాసే పరీక్ష కాదు కాబట్టి ముందుచూపు తప్పనిసరి. రోజూ కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించడం ఉత్తమం. నిత్యం బ్రేక్‌ఫాస్ట్ ఎలాగో దినపత్రికలు చదవడం అలా అలవాటు చేసుకోవాలి.
– సురేంద్ర బండారు
నాన్న ప్రోత్సాహంతో సాధించాను
మంద అపూర్వ ఆల్ఇండియా 646 వ ర్యాంక్
చిన్నప్పుడు స్కూల్‌కు కలెక్టర్ బంగ్లా ఎదుట నుంచి వెళ్తుండగా అందులో ఎవరుంటారని అడిగితే కలెక్టర్ ఉంటారని, చాలా గొప్ప వ్యక్తి అని నాన్న చెప్పారు. అదే స్ఫూరిగా నాన్న ప్రేరణ, ప్రోత్సాహంతో సివిల్స్ సాధించానని మంద అపూర్వ అన్నారు. ఆమె సక్సెస్ గురించి ఆమె మాటల్లో..
కుటుంబ నేపథ్యం
మాది హనుమకొండలోని ఎక్సైజ్‌కాలనీ. నాన్న అశోక్ కుమార్ కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. అమ్మ రజనీదేవి ప్రభుత్వ టీచర్‌గా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌లో పనిచేస్తున్నారు. పెద్దన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్, చిన్నన్న అభినవ్ పుణెలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద వదిన మానస అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం, చిన్న వదిన దివ్య పుణెలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివాను. ప్రస్తుతం ఎంటెక్ (స్ట్రక్చరల్ ఇంజినీరింగ్) చేస్తున్నాను. నాన్న ప్రోత్సాహం వల్ల సివిల్స్ రాయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మూడుసార్లు మెయిన్స్ రాశాను. రెండుసార్లు ఇంటర్వ్యూకి వెళ్లాను. ర్యాంక్ రాకపోవడంతో సివిల్స్ వదిలేసి వేరే ఉద్యోగం చేసుకోమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ నేను సాధించగలనని కుటుంబ సభ్యులు నమ్మి, ప్రోత్సహించారు. స్నేహితులు అండగా ఉన్నారు. దీంతో సివిల్స్ సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటే ప్రిపరేషన్ సులువవుతుంది.
ప్రిపరేషన్
ప్రిలిమ్స్‌కి చాలా టెస్ట్ పేపర్స్‌ని సాల్వ్ చేశాను. పూర్వ యూపీఎస్సీ ప్రశ్నపత్రాలను విశ్లేషించి, రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. జనరల్ స్టడీస్ కోసం కోచింగ్ తీసుకోలేదు. శంకర్ విజన్, ఫోరం టెస్ట్ సిరీస్ రాశాను. ఆప్షనల్ కోసం మాత్రం ఢిల్లీలో గైడెన్స్ ఐఏఎస్‌లో కోచింగ్ తీసుకున్నాను. మొదటి నుంచి నా ఆప్షనల్ జియోగ్రఫీ. మకువతో ఎంచుకున్న సబ్జెక్ట్ కాబట్టి ప్రతి అటెంప్ట్‌లో మంచి మారులు వచ్చేవి. ఈసారి కూడా 272 మార్కులు సాధించాను. సివిల్స్‌కు ప్రణాళిక అవసరం. మొదటి నుంచి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి, ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి. టాపర్స్‌ని చూసి మనం ఎకడ ఉన్నాం అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. కేవలం తెలివి సరిపోదు స్థిత ప్రజ్ఞత, ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఒకటికి రెండుసార్లు ఓడినా నిరుత్సాహ పడకుండా కష్టపడాలి. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు తప్పనిసరిగా చదవాలి.
ఇంటర్వ్యూ
మనోజ్ సోని బోర్డ్ ఇంటర్వ్యూ చేసింది. దాదాపు 30 నిమిషాల పాటు ఇంటర్వ్యూ కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర విభజన, అభివృద్ధిపై అడిగారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అభిప్రాయం చెప్పమన్నారు. కృత్రిమ మేధస్సు, చాట్‌జీపీటీ వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుందా అని అడిగారు. తెలంగాణకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధి సూచికలపై అభిప్రాయం చెప్పమన్నారు. కొత్త సెక్రటేరియట్, గ్రీన్ బిల్డింగ్, ఇండో-సార్సెనిక్ నిర్మాణ శైలిపై ప్రశ్నలు అడిగారు.
ప్రజలకు సేవ చేస్తాను
సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రభుత్వంలో వివిధ శాఖల్లో చిన్న వయస్సులోనే అత్యున్నత నాయకత్వపు హోదాలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఎకువ మందికి ప్రభుత్వ ఫలాలను వారి దగ్గరకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. ప్రజలతో మమేకమై, ప్రభుత్వ సేవలను ప్రజలకి మరింత దగ్గరగా తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తా.
నా సలహా
సివిల్స్ సాధించాలంటే ప్రణాళికబద్ధంగా చదవాలి. ఫెయిలైనా నిరుత్సాహ పడకుండా ముందడుగేయాలి. గత విజేతల ఇంటర్వ్యూలు చదవాలి. రోజూ 8 నుంచి 9 గంటలు ఇష్టంతో చదివితే అనుకున్నది సాధించవచ్చు.
– పిన్నింటి గోపాల్
(నమస్తే తెలంగాణ ప్రతినిధి, వరంగల్)
కోచింగ్ లేకుండానే సాధించా
డోంగ్రె రేవయ్య ఆల్ఇండియా 410 వ ర్యాంక్
మాది కుమ్రం భీం జిల్లా. నాన్న డోంగ్రె మనోహర్. నాకు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే చనిపోయాడు. అమ్మ విస్తారుబాయి. రెబ్బెన మండలంలోని తుంగెడ ప్రభుత్వ పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తుంది. నాన్న చనిపోయిన తరువాత కాగజ్‌నగర్‌లోని అమ్మమ్మ ఇంట్లో ఉండి శిశు మందిర్‌లో ఐదో తరగతి వరకు చదివా. ఆ తరువాత విద్యాభ్యాసం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌లోనే సాగింది. మద్రాస్ ఐఐటీలో సీటు వచ్చినప్పుడు వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. దాతలు ఇచ్చిన డబ్బులతోనే మద్రాస్ ఐఐటీలో బీటెక్(కెమికల్ ఇంజినీర్)లో చేరా. అప్పటి నుంచి సివిల్స్ వైపు వెళ్లాలనే పట్టుదల పెరిగింది. రెండో ప్రయత్నంలో అనుకున్నది సాధించా. పట్టుదల, కృషి ఉంటే ఎవరైనా సివిల్స్ సాధించవచ్చని చెప్పుకొచ్చారు సివిల్స్ ర్యాంకర్ డోంగ్రె రేవయ్య. ఆయన తన విజయగాథను పంచుకున్నారు.
కుటుంబ నేపథ్యం?
పేదరికంలో పుట్టాను. అన్నయ్య శ్రవణ్ తిర్యాణిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. చెల్లెలు స్వప్న. నాగ్‌పూర్‌లో బీటెక్ చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంది. ఐదో తరగతి శిశు మందిర్, పది సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివాను. హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. ఇక్కడ ఐఐటీకి కోచింగ్ ఇచ్చారు. మద్రాస్‌లోని ఐఐటీలో కెమికల్ ఇంజినీర్లో సీటు వచ్చింది. అప్పటి నుంచి సివిల్స్ సాధిస్తాననే నమ్మకం కలిగింది. కొంత కాలం ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అయ్యా. మొదటిసారి సాధించలేకపోయా. తరువాత ఉద్యోగం వదిలేసి పూర్తి సమయం ప్రిపరేషన్‌కే కేటాయించా. రెండో ప్రయత్నంలో 410 ర్యాంకు సాధించా. కలెక్టర్ అశోక్ నాకు స్ఫూర్తిగా నిలిచారు.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
నా ప్రిపరేషన్ సొంతంగా సాగింది. పూర్తి సమయం చదువుకే కేటాయించా. కోచింగ్‌కు వెళ్లలేదు. ఎంచుకున్న మెయిన్ సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించా. ప్రతి సబ్జెక్టుని ఎక్కువసార్లు రివిజన్ చేశా. మాక్ ఇంటర్వ్యూకు వెళ్లేవాడిని. సివిల్స్‌లో ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయో అలాంటి వాతావరణంలోనే మాక్ ఇంటర్వ్యూలు ఉండేవి. ముందు మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి. పాలిటీ లక్ష్మీకాంత్ పుస్తకాలు చదివా. ఆధునిక చరిత్ర, స్పెక్ట్రం, తమిళనాడు హిస్టరీ, ఎకనామిక్స్, శంకర్ ఐఏఎస్ రాసిన ఎన్విరాన్మెంటల్ పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి.
ఇంటర్వ్యూలో ఏయే ప్రశ్నలు అడిగారు?
ఇంటర్వ్యూలో తెలంగాణపై చాలా ప్రశ్నలు అడిగారు. తెలంగాణ విడిపోయాక లాభపడిందా అనే ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో పెరిగిన జీడీపీ గురించి వివరించా. జీడీపీ రెట్టింపు అయిందని చెప్పాను. విద్య, వ్యవసాయ రంగాల్లో సాధించిన ప్రగతి, విత్తన భాండాగారంగా మారిందని తెలిపా. అభివృద్ధి, పెరిగిన తలసరి ఆదాయం గురించి వివరించా. ఎగుమతులు, దిగుమతులపై, కో-ఆపరేటివ్ ఫైనాన్సింగ్‌పై, ఖలిస్థాన్ మూవ్‌మెంట్‌పై, ఆర్టికల్ 21పై ప్రశ్నలు అడిగారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌కు ఆ పేరెలా వచ్చిందని అడిగారు. దీనికి సమాధానంగా కుమ్రం భీం చరిత్రను వివరించా. ఆయన పోరాట స్ఫూర్తికి గుర్తుగా ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టినట్లు తెలిపా.
భవిష్యత్‌లో సివిల్స్ రాసేవారికి మీరిచ్చే సలహాలు, సూచనలు?
సివిల్స్ రాయాలనుకునే వారికి పట్టుదల, శ్రద్ధ అవసరం. ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి మంచి మెటీరియల్ సేకరించాలి. ప్రధాన సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి. అనేకసార్లు రివిజన్ చేసుకోవాలి. ఎస్ఏ, ఎథిక్స్‌పై పట్టు కలిగి ఉండాలి. రెండు రోజుల్లో నాలుగు పేపర్లు పూర్తి చేయాలి. ఇంటర్వ్యూలో అభ్యర్థి నిజాయితీని, నమ్మకాన్ని, పర్సనాలిటీని పరిశీలిస్తారు. సివిల్స్ సర్వీసెస్‌లో జాయిన్ అయ్యాక దేనికి ప్రాధాన్యం ఇస్తారు? చదువుకు ముందు ప్రాధాన్యం ఇస్తా. పేదరికం నుంచి ఉన్నత స్థానాలకు వెళ్లాలనుకునేవారికి చేయూతనందించేలా కృషి చేస్తా.
– జాడి హన్మయ్య, కుమ్రం భీం ఆసిఫాబాద్
తొలి ప్రయత్నంలోనే సివిల్స్
ఆదర్శ్ కాంత్ శుక్లా ఆల్ఇండియా 149 వ ర్యాంక్
కష్టానికి ప్రత్యామ్నాయం లేదంటాడు. ఏకాగ్రతే ఏకైక మార్గం అని తెలుసుకున్నాడు. తన చిన్నప్పటి కల అయిన సివిల్స్ సాధించాలనుకుని ఆ దిశగా ప్రయాణం సాగించాడు. ఐఏఎస్, ఐపీఎస్ అయితే ఆ అధికారాలతో ఎన్నో ప్రయోజనకర పనులు చేయొచ్చని, అదే తనకు సంతృప్తినిస్తుందని నమ్మాడు. దానికి తోడు అతడి తల్లిదండ్రులు ఏ కష్టం రానీయలేదు. కృషికి తోడు పట్టుదల తోడైతే ఏదైనా సాధించొచ్చని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచాడు ఆదర్శ్ కాంత్ శుక్లా. తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 149వ ర్యాంకు సాధించాడు. అతడి విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం..
కుటుంబ నేపథ్యం
ఆదర్శ్ కాంత్ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా రాంనగర్ ప్రాంతానికి చెందినవాడు. ఇతడి తండ్రి రాధాకాంత్ శుక్లా ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తల్లి గీతా శుక్లా గృహిణి. అక్క స్నేహా శుక్లా ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. వీరిది మధ్య తరగతి కుటుంబం.
ప్రిపరేషన్ ఇలా..
ఆదర్శ్ పదో తరగతిలో స్టేట్ ఆరో ర్యాంకు సాధించాడు. ఇంటర్మీడియట్లో 90% పైగా మార్కులు పొందాడు. 2018లో బీఎస్సీలో గోల్డ్‌మెడల్ సాధించాడు. సివిల్స్ సాధించాలని 2019, జనవరిలో ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. కరోనా సమయంలో ఇంట్లోనే ఉండి చదివాడు. ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదు. రోజూ 8-10 గంటలు చదివాడు. ఒత్తిడి తగ్గించుకునేందుకు క్రికెట్ ఆడేవాడు. ఇంటర్వ్యూలో తెలియని ప్రశ్నలకు తప్పు సమాధానాలు చెప్పొద్దని ముందే నిర్ణయించుకున్నాడు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సక్సెస్ చేజిక్కించుకున్నాడు.
సలహాలు..
సివిల్స్ సాధన ఏళ్ల శ్రమ అని, కానీ తక్కువ సమయంలో తాను సాధించానని.. ఆ క్రెడిట్ తన తల్లిదండ్రులకే దక్కుతుందని తెలిపాడు. ఏం సాధించాలన్నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల సపోర్టు చాలా అవసరమని అందరికి తెలిసిన విషయమేనని వెల్లడించాడు ఈ ఐపీఎస్. మనల్సి మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దని, కష్టపడితే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుందంటాడు. ఏది సాధించాలన్నా ఏకాగ్రతే అసలైన సాధనమని చెప్పాడు ఆదర్శ్.
ఐదోసారి విజయం
శ్రవణ్‌కుమార్ రెడ్డి ఆల్ఇండియా 426 వ ర్యాంక్
పట్టుదల, తపన ఉంటే విజయం సాధించవచ్చని నిరూపించారు సివిల్ సర్వీస్ ర్యాంకర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి. నాలుగుసార్లు రాసినా అనుకున్న ర్యాంకు సాధించలేకపోయారు. ఐదో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించారు. ఆయన విజయ రహస్యాలు తెలుసుకుందాం..
కుటుంబం
షాద్‌నగర్ రేగోడి చిలకమర్రి ప్రాంతానికి చెందిన చింతకింది శివకుమార్‌రెడ్డి పీర్జాదీగూడలో నివాసం ఉంటున్నారు. ఆయనకు సివిల్ సర్వీస్ సాధించాలనే లక్ష్యం ఉండేది. ప్రిలిమ్స్ సాధించి పరిస్థితులు అనుకూలించక మెయిన్స్ రాయలేకపోయారు. ఇండియన్ రైల్వేస్‌లో ట్రైన్ గార్డుగా ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో సివిల్స్ లక్ష్యం నెరవేరలేదు. దీంతో తండ్రి కలను తాను నెరవేర్చాలనుకన్నాడు కుమారుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి. ఐఐటీ బాంబేలో చదివారు. మ్యాథమెటిక్స్ ఆప్షనల్స్‌తో సివిల్స్ రాశారు.
కోచింగ్ తీసుకోకుండానే..
శ్రవణ్ ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. రోజూ 8-10 గంటలు చదివారు. విచక్షణతో చదువుతూ, విషయాలపై అవగాహన పెంచుకుంటూ చదివారు. సీనియర్ రామ్మోహన్‌రెడ్డి గైడ్ చేశారు. తన మిత్రుడు ప్రణవ్‌తో కలిసి చదవడం ఉపయోగపడింది. అవసరమైన అంశాలపై యూట్యూబ్, ఇంటర్నెట్ను ఫాలో అవుతూ ప్రతిరోజూ న్యూస్ పేపర్లు చదివారు.
ఇంటర్వ్యూ
యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని బృందం శ్రవణ్‌కుమార్‌రెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి చెప్పమన్నారు. తెలంగాణలో ఇరిగేషన్, హరితహారం, పవర్ ప్రాజెక్టులపై అడిగారు.
సలహా..
కష్టపడి చదవుతూ ఎక్కువగా సమయం కేటాయించాలి. మెంటర్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాలే ప్రామాణికంగా చదవాలి. ఇష్టమైన సబ్జెక్టులనే ఆప్షనల్స్‌గా తీసుకోవాలి.
– పల్లా మహేందర్‌రెడ్డి, ఉప్పల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు