General Studies | సాగునీరు పుష్కలం.. జీవ కాల్వలు ప్రధానం
భారతదేశం-నీటిపారుదల
- భారతదేశం ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయానికి కావాల్సిన నీరు వర్షం వల్ల కానీ, నీటి పారుదల వసతుల కల్పన ద్వారా కానీ చేకూర్చడం జరుగుతుంది.
- భారతదేశంలో వర్షపాత నమోదులో ప్రాంతీయ వ్యత్యాసాలు ఉండటం వల్ల వ్యవసాయానికి నీటి పారుదల వసతి అవసరం ఉంటుంది.
- వర్షపాతంతో సంబంధం లేకుండా పంటలకు అవసరమైన నీటి వసతిని వివిధ మార్గాల ద్వారా కల్పించడాన్ని నీటి పారుదల వసతులు అని అంటారు.
- వ్యవసాయ రంగంలో నష్టాలను తగ్గించడానికి, ఆహార భద్రతను పెంచడానికి నీటి పారుదల వసతులు కల్పించడం అత్యావశ్యకం.
- నీటి పారుదల వ్యవస్థ, వసతుల కల్పన కింది అంశాలపై ఆధారపడి ఉంటాయి. అవి..
1. దేశంలో నదీ వ్యవస్థ
2. నదీ పరీవాహక ప్రాంతం
3. భూభాగ స్వరూపం
4. వర్షం సంభవించే రీత్యా మొదలైనవి - దేశంలో ముఖ్యంగా వర్షాధారం, నదీ వ్యవస్థలను ఆధారంగా చేసుకొని నీటి పారుదల వసతులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి..
1. కాల్వలు 2. బావులు 3. చెరువులు
1. కాల్వలు: నీటి పారుదల వసతుల్లో కాల్వలు చాలా ముఖ్యమైనవి. భారతదేశంలో అనేక నదీ వ్యవస్థలు ఉండటం వల్ల కాల్వల ద్వారా నీటి సౌకర్యం సాధ్యమైంది. - ఉత్తర మైదానాల్లో సంవత్సరమంతా ప్రవహించే నదులు ఉన్నందున కాల్వల ద్వారా నీటి పారుదల అక్కడే అధికంగా ఉంది.
- దేశంలో కాల్వల ద్వారా సాగుభూమి ఎక్కువగా గల రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్.
- దేశంలో రెండు రకాల కాల్వలు ఉన్నాయి. అవి..
ఎ. వరద కాల్వలు
బి. నదీ కాల్వలు/జీవ కాల్వలు - వరద కాల్వలు వర్షాకాలంలోని వరద నీటిపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి.
- భారతదేశంలో పంజాబ్‌లోని సట్లేజ్ నదికి ఎక్కువ వరద కాల్వలు కలవు.
- జీవ కాల్వలు అంటే నదికి అడ్డంగా ఆనకట్టను నిర్మించి అక్కడి నుంచి నీటిని కాల్వల ద్వారా వ్యవసాయానికి అందించడానికి ఏర్పాటు చేసినవి.
- దేశంలో ఉత్తర మైదానాల్లో ఈ జీవ కాల్వలు ఎక్కువగా ఉన్నాయి.
2. బావులు - ఆర్థిక సర్వే 2020-21 ప్రకారం దేశంలో బావుల ద్వారా సాగుభూమి శాతం 62% ఉంది.
- డెల్టాయేతర ప్రాంతాలు, కాల్వలు లేని ప్రాంతాల్లోనూ తక్కువ లోతులో బావుల ద్వారా లభించే భూగర్భ జలాలను వ్యవసాయానికి వినియోగించడం దేశంలో పురాతన కాలం నుంచి వస్తున్న ప్రధాన ఆచారం. బావుల ద్వారా వ్యవసాయం చిన్న కమతాలకు అనుకూలం.
- 1950-51 సంవత్సరంలో బావుల నీటి పారుదల కింద సాగుభూమి 6.0 మిలియన్ హెక్టార్లు కాగా ఇది 2020-21 నాటికి 39 మిలియన్ హెక్టార్లుగా ఉంది.
- దేశంలో బావుల ద్వారా నీటి వసతి అత్యధికంగా ఉన్న రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్.
- బావులు రెండు రకాలు. అవి..
ఎ. ఉపరితల బావులు
బి. గొట్టపు బావులు
ఉపరితల బావి: లోతు తక్కువగా ఉండి అందు లోని నీటిని వ్యవసాయానికి వినియోగించడం కోసం రైతులు శారీరక శ్రమ ద్వారా తవ్వుకొనే బావి. - సాధారణంగా ఈ బావులు డెల్టా ప్రాంతాల్లో, నదీ లోయల్లో, అవక్షేప శిలలు ఉన్న ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉంటాయి.
గొట్టపు బావి: యంత్రాల సహాయంతో పంపుల ద్వారా భూ అంతర్భాగంలోని నీటిని పైకి తోడి వ్యవసాయానికి ఉపయోగించడం. - దేశంలో హరిత విప్లవం తర్వాత గొట్టపు బావుల వినియోగం పెరిగింది.
- గొట్టపు బావుల ద్వారా వ్యవసాయం ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానాల్లో ఎక్కువగా ఉంది.
చెరువులు: అతి పురాతన నీటిపారుదల సౌకర్యం. దక్కన్ పీఠభూమి ఎక్కువగా ఎత్తుపల్లాలు కలిగిన ప్రాంతం. అంతేకాక ఉపరితలం కఠినమైన శిలలతో నీరు సులభంగా ఇంకిపోని మట్టి పొరలతో ఏర్పడింది. కాబట్టి దేశంలో చెరువుల ద్వారా నీటి పారుదల సౌకర్యం ఎక్కువగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. - దేశంలో చెరువుల ద్వారా నీటి పారుదల సౌకర్యం ఎక్కువ గల రాష్ర్టాలు తమిళనాడు, ఏపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక.
- 1950-51 సంవత్సరంలో మొత్తం నీటి పారుదలలో చెరువుల కింద 17.2% ఉండగా ప్రస్తుతం 3.1%గా ఉంది.
నీటి పారుదల ప్రాజెక్టులు-రకాలు
1. భారీ నీటి పారుదల ప్రాజెక్టులు: 10,000 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం గల ప్రాజెక్టులను భారీ నీటి పారుదల ప్రాజెక్టులు అంటారు. ఉదా: భాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్
2. మధ్య తరహా ప్రాజెక్టులు: 2000 నుంచి 10,000 హెక్టార్ల మధ్య ఆయకట్టు ప్రాంతం గల ప్రాజెక్టులను మధ్యతరహా ప్రాజెక్టులు అంటారు. ఉదా: స్వర్ణ ప్రాజెక్టు, తుంగభద్ర ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు
3. చిన్న తరహా ప్రాజెక్టులు: 2000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు ప్రాంతం గల ప్రాజెక్టులను చిన్న తరహా ప్రాజెక్టులు అంటారు.
బహుళార్ధ సాధక ప్రాజెక్టు: ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలను ఆశించి నదీ ప్రవాహానికి సరైన స్థలం వద్ద నిర్మించిన ప్రాజెక్టులు.
1. భాక్రానంగల్ ప్రాజెక్టు
- పంజాబ్ రాష్ట్రంలో సట్లేజ్ నదిపై నిర్మించారు.
- దేశంలో అతిపెద్ద బహుళార్ధ సాధక పథకం.
- 14.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది.
- పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందుతున్నాయి.
- దేశంలో అత్యధిక విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టు. (1204 మెగావాట్లు)
నాగార్జున సాగర్ ప్రాజెక్టు
- దీన్ని కృష్ణానదిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నందికొండ వద్ద నిర్మించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఉంది.
- ఈ ప్రాజెక్టు నిర్మాణం 1955లో ప్రారంభించి 1967 నాటికి పూర్తి చేశారు.
- నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏపీ, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు.
- ఇది ప్రపంచంలో పెద్ద, అతి ఎత్తయిన రాతి కట్టడం.
- దీని కుడి ప్రధాన కాల్వను జవహర్లాల్ కాల్వ అని, ఎడమ ప్రధాన కాల్వను లాల్‌బహదూర్ శాస్త్రి కాల్వ అంటారు.
దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు
- ఇది స్వాతంత్య్రానంతరం ప్రారంభించిన మొదటి ప్రాజెక్టు.
- 1948లో ప్రారంభించి 1957 నాటికి పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టును అమెరికాలోని టెన్నిస్ వ్యాలీ అథారిటీ ప్రాజెక్టు ఆధారంగా నిర్మించారు.
- ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన ఉద్దేశం దామోదర్ నది వరదల నుంచి బెంగాల్ ప్రాంతాన్ని కాపాడటం.
- జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలు ఉమ్మడి పథకం. మైదాన్, పంచట్, కోనార్ ఆనకట్టలను ఈ ప్రాజెక్టు కింద నిర్మించారు.
హిరాకుడ్ ప్రాజెక్టు - ఇది ఒడిశా రాష్ట్రంలోని మహానదిపై ఉంది. 1937లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాజెక్టుకు మొదటగా నమూనా రూపొందించారు.
- ఈ ప్రాజెక్టు నిర్మాణం 1948లో ప్రారంభించి 1957 నాటికి పూర్తి చేశారు. ఇది ప్రపంచంలో పొడవైన ప్రాజెక్టు. దీని పొడవు 4.801 కి.మీ
కోసి ప్రాజెక్టు - కోసి నదిపై బీహార్ రాష్ట్రంలో నిర్మించారు. ఇది భారతదేశం, నేపాల్ దేశాల సరిహద్దులో ఉంది. కాబట్టి దీన్ని అంతర్జాతీయ ప్రాజెక్టు అంటారు.
- ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రధాన ఉద్దేశం కోసినది వరదల నుంచి బీహార్‌ను రక్షించడం.
నర్మద లోయ ప్రాజెక్టు - 1987లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో 30 భారీ, 135 మధ్యతరహా, 3000 చిన్న తరహా డ్యామ్‌లు ఉన్నాయి.
సర్దార్ సరోవర్ డ్యాం - నర్మద లోయ ప్రాజెక్టులో అతిపెద్ద డ్యాం. గుజరాత్‌లోని నవగాం ప్రాంతంలో నిర్మించారు.
ప్రధాని నరేంద్రమోదీ సర్దార్ సరోవర్ డ్యాంను 2017, సెప్టెంబర్ 17న ప్రారంభించారు.
ఇందిరాసాగర్ డ్యాం - మధ్యప్రదేశ్‌లో నర్మదా నదిపై ఉంది. ఇందిరాసాగర్‌కు దిగువన ఓంకారేశ్వర్, మహేశ్వర డ్యాం ఉంది. ఈ మూడింటిని కలిపి ఇందిరాసాగర్ కాంప్లెక్స్ అంటారు.
తుంగభద్ర ప్రాజెక్టు - తుంగభద్ర నదిపై కర్ణాటకలో ఉంది. దీని ఆయకట్టు విస్తీర్ణం 4.40 లక్షల హెక్టార్లు.
పోలవరం ప్రాజెక్టు - గోదావరి నదిపై నిర్మాణ క్రమంలో ఉంది. 1941లో నాటి నీటి పారుదల ముఖ్య ఇంజినీర్ ఎల్.వెంకటకృష్ణ అయ్యర్ పోలవరం సమీపంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టుకు రామపాదసాగర్ అని పేరును సూచించారు.
- 1981లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
- పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వ పొడవు 174 కి.మీ. ఈ కాల్వ ద్వారా ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు
- గోదావరి నదిపై తెలంగాణలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2016, మే 12న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి వద్ద భూమిపూజ చేశారు.
- ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భారీ నీటిపారుదల ఎత్తిపోతల పథకం.
- ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది.
శ్రీశైలం ప్రాజెక్టు - కర్నూలు జిల్లాలో కృష్ణానదిపై ఉంది. దీన్ని నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు అని కూడా అంటారు.
- ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం జల విద్యుత్ ఉత్పాదన. ఈ ప్రాజెక్టులో రెండు జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి.
- సాగునీటి అవసరాల కోసం 1981లో శ్రీశైలం కుడిగట్టు కాల్వ, 1983లో తెలుగుగంగా ప్రాజెక్టు, శ్రీశైలం ఎడమ కాల్వ నిర్మించారు.
ఫరక్కా ప్రాజెక్టు - ఇది పశ్చిమబెంగాల్లో గంగానదిపై నిర్మించారు. ఇది కోల్‌కతా ఓడరేవు నిర్మాణం కోసం నిర్మించిన బ్యారేజీ.
చంబల్ లోయ ప్రాజెక్టు - చంబల్ నదిపై మధ్యప్రదేశ్‌లో ఉంది.
- ఈ ప్రాజెక్టులోని డ్యామ్‌లు
1. గాంధీసాగర్ (మధ్యప్రదేశ్)
2. రాణా ప్రతాప్ సాగర్ (రాజస్థాన్)
3. జవహర్ సాగర్ (రాజస్థాన్)
4. కోటా బ్యారేజీ (రాజస్థాన్)
నిజాం సాగర్ ప్రాజెక్టు - దీన్నే పోచంపాడు ప్రాజెక్టు అని కూడా అంటారు. గోదావరి నదిపై తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో నిర్మించారు.
- దీన్ని స్థానికంగా క్రిష్ణపురం డ్యామ్ అని అంటారు. ఈ ప్రాజెక్టు నుంచి రామగుండం థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు నీటిని సరఫరా చేస్తారు.
తెలుగు గంగా ప్రాజెక్టు - దీని పూర్తి పేరు నందమూరి తారకరామారావు తెలుగుగంగా ప్రాజెక్టు. కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసే ప్రాజెక్టు.
వివాదాస్పద ప్రాజెక్టులు
1. వంశధార- ఒడిశా, ఏపీ
2. ఆల్మట్టి- కర్ణాటక, తెలంగాణ, ఏపీ
3. తుంగభద్ర ప్రాజెక్టు- కర్ణాటక, ఏపీ
4. బాబ్లీ ప్రాజెక్టు- మహారాష్ట్ర, తెలంగాణ
5. మెట్టూరు ప్రాజెక్టు- కర్ణాటక, తమిళనాడు
6. పొలాగ్ ప్రాజెక్టు- ఏపీ, తమిళనాడు
7. ముళ్ల పెరియార్- తమిళనాడు, కేరళ
వీరు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు