General Studies Natural Disasters | వరద ఉపశమన చర్యలు – భూపాతాలు
నిర్మాణేతర ఉపశమన చర్యలు
వరద ముప్పున్న ప్రాంతాల మ్యాపింగ్ ఏ ప్రాంతంలోనైనా వరద ముప్పును తగ్గించడానికి ముందుగా ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపును తయారు చేయడం ప్రాథమిక చర్య, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను, వరదలు సంభవించే వ్యవధిని, వరదలు ఎంత మేరకు విస్తరిస్తాయనే అంశాన్ని చరిత్రకు
సంబంధించిన రికార్డులు తెలియజేస్తాయి.
- భూ వినియోగ నియంత్రణ వల్ల వరద మైదాన ప్రాంతాలు, తీర ప్రాంతాలను నీరు ముంచెత్తినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గుతాయి.
- ఆస్పత్రులు, పాఠశాలలు వంటి ముఖ్యమైన వసతులను సురక్షితమైన ప్రాంతాల్లో నిర్మించాలి. పట్టణ ప్రాంతాల్లో కుంటలు, సరస్సులు లేదా లోతుగాఉండే ప్రాంతాల్లో నీటిని నిల్వచేసే జలాశయాలను ఏర్పాటు చేయాలి.
జాతీయ వరద ముప్పు ఉపశమన ప్రాజెక్ట్
(నేషనల్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ – ఎన్ఎఫ్ఆర్ఎంసీ)
- వరదల ముప్పును, తీవ్రతను లేదా వాటి పర్యవసానాలను ఉపశమింప చేయడం లేదా తగ్గించడం కోసం జాతీయ వరదముప్పు ఉపశమన ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. దుర్భలత్వం ఉన్న కమ్యూనిటీల్లో చైతన్యం కల్పించడంతోపాటు విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు పునరావాసం పునరుద్ధరణకు కావలసిన వనరులు, సామర్థ్యాల సమీకరణకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. వరదముప్పు ఉపశమన ప్రాజెక్టుపై సవివరమైన ప్రాజెక్టు రిపోర్టును రూపొందించే బాధ్యతలను ఎన్డీఎంకు అప్పగించారు.
వరద నిర్వహణ కార్యక్రమం - భారత ప్రభుత్వం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 11వ పంచవర్ష ప్రణాళికా కాలానికి రూ.800 కోట్ల వ్యయంతో వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ఇందు కోసం రూ.10,000 కోట్లు కేటాయించారు.
- మహారాష్ట్రలోని పుణెలో ఉన్న జాతీయ జల అకాడమీ(నేషనల్ వాటర్ అకాడమీ-ఎన్.డబ్ల్యు.ఎ) వరదల నిర్వహణపై అఖిల భారత స్థాయి రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్లకు శిక్షణ ఇస్తుంది. 12వ పంచవర్ష ప్రణాళికలో ఎన్.డబ్ల్యు.ఎ.ను వరదల ఉపశమనానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
- భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అనుబంధ విభాగమైన జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వరద నిర్వహణకు సంబంధించి 5 రకాలైన సేవలను అందిస్తుంది. అవి
1) నియర్ రియల్ టైమ్ ఫ్లడ్
మ్యాపింగ్ అండ్ మానిటరింగ్
2) ఫ్లడ్ డ్యామేజ్ అసెస్మెంట్
3) ఫ్లడ్ హజార్డ్ మ్యాపింగ్
4) రివర్ బ్యాంక్ ఎరొజన్ (erosion) మ్యాపింగ్
5) నదీప్రవాహంలో వచ్చే మార్పుల మ్యాపింగ్ అసోం, బీహార్ వరదలు
కొన్ని ముఖ్యమైన వరద వివరాలు
- 2004 రుతుపవనాల కాలంలో అసోం, బీహార్ రాష్ర్టాల్లో తీవ్రమైన వరద పరిస్థితులు భారీ విధ్వంసానికి కారణమయ్యాయి. టెలిఫోన్ ఎక్చేంజ్‌లు మునిగిపోవడం లేదా కేబుళ్లు దెబ్బతినడం, రోడ్లు, రైల్వేలైన్లు ధ్వంసం కావడంతో ఆ రాష్ర్టాల్లో అనేక జిల్లా ప్రధాన కేంద్రాలు రాష్ట్ర రాజధానితో సంబంధాలు పూర్తిగా కోల్పోయాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పునరావాస, సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచారాన్ని సైతం రాష్ట్రకేంద్రానికి తెలియజేయడానికి వీల్లేకుండా పోయింది. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలతో రాష్ట్ర రాజధానులకు కమ్యూనికేషన్ సంబంధాలను ఏర్పాటు చేయడానికి తక్షణమే అత్యవసర సమన్వయ సామగ్రితోపాటు శాటిలైట్ ఫోన్లను పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.
బంగ్లాదేశ్ వరదలు - బంగ్లాదేశ్ నదులతో చుట్టు ముట్టి ఉన్న దేశం. ఇక్కడ వరదలు 1974వ సంవత్సరం వేసవిలో వచ్చాయి. ఈ వరదలు ఒక నెలపాటు సుమారు సగం దేశాన్ని ముంచేశాయి. వరదల వల్ల 1200 మంది మరణించగా, వ్యాధులు, ఆకలితో మరో 27,500 మంది మరణించారు, 4,25,000 ఇళ్లు కూలిపోవడం లేదా తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. మొత్తం 36 మిలియన్ల మంది ఈ విపత్తు కారణంగా దుర్భర కష్టాలు ఎదుర్కొన్నారు.
ఉత్తరాఖండ్ వరదలు - 2013 జూన్ 14 నుంచి 17వరకు కురిసిన అసాధారణ భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు సంభవించాయి. సాధారణంగా రుతుపవనాల కాలంలో కురిసే సాధారణ వర్షాల కంటే 275 శాతం అధికంగా వర్షాలు కురవడంతో మందాకిని అలకనంద నదులు ఉప్పొంగి పెను విధ్వంసం సృష్టించాయి.
- చార్‌ధామ్‌లుగా పిలిచే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌ల సందర్శనకు వెళ్లిన సుమారు 70 వేల మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు.
- సముద్ర మట్టానికి సుమారు 3800 మీటర్ల ఎత్తులో ఉన్న చరోబరి హిమానీ నదం కరిగిపోవడంతో మందాకినీ నది ఉప్పొంగి వరద బీభత్సం సృష్టించింది. 58వ నంబర్ రహదారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చార్ధామ్లతోపాటు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, రూప్‌కుంద్ వంటి ప్రాంతాలను కూడా వరదలు ముంచెత్తాయి. భారీవర్షాలకు వరదలతోపాటు భూపాతాలు (కొండచరియలు విరిగిపడటం) కూడా సంభవించడంతో అనేక మంది వరదల్లో చిక్కుకుపోయారు.
కాశ్మీర్ వరదలు - ఆకస్మిక వర్షాలతో 2014 సెప్టెంబర్‌లో కశ్మీర్ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. భారతదేశంలోని జమ్ము కశ్మీర్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్ లోని జిల్గిత్ -బాల్టిస్థాన్ పంజాబ్ ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. 2014 సెప్టెంబర్ 24 నాటికి ఈ వరద కారణంగా భారతదేశంలో 277 మంది, పాకిస్థాన్‌లో 280 మంది మరణించారు.
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో వేలాది గ్రామాలు వరదప్రభావానికి గురయ్యాయి. 390 గ్రామాలు పూర్తిగా నీటమునిగి పోయాయి. శ్రీనగర్‌లోని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి.
- ఈ వరదల కారణంగా 2014 సెప్టెంబర్ 8 నాటికి శ్రీనగర్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు 12 అడుగుల లోతున నీటిలో మునిగిపోయాయి. కశ్మీర్ లోయతోపాటు మొత్తం దక్షిణ కశ్మీర్ జిల్లాల్లో మృతుల సంఖ్య 190కి చేరింది. జమ్ముకశ్మీర్ వరదలను ప్రధాని జాతీయ విపత్తుగా ప్రకటించారు. ఈ వరదల వల్ల రూ.5000 నుంచి రూ. 6000 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆంధ్రప్రదేశ్‌లో వరదలు - 2009 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 మధ్య కృష్ణానది, దాని ఉపనదులకు సంభవించిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలోని మహ బూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని 87 మండలాలు 525 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి.
- ప్రధానంగా కర్నూలు నగరంతోపాటు ఆ జిల్లాలోని మంత్రాలయం, మరికొన్ని పట్టణాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని 20.72 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలు కూడా వరద ముంపును ఎదుర్కొన్నాయి.
భూ పాతాలు
- శిలలు, మృత్తికలు, కృత్రిమంగా నింపిన ప్రదేశాలు లేదా అవన్నీ కలిసిన పదార్థాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా లేదా నెమ్మదిగా పడిపోవడం, జారిపోవడాన్ని భూపాతం అంటారు. భూపాతాలు ఎక్కువగా పర్వతప్రాంతాల్లోనే సంభవిస్తాయి. అయినప్పటికీ రహదారులు, భవనాల నిర్మాణానికి మట్టి తవ్వకాలు జరిగే చోట, గనుల్లో కూడా భూపాతాలు ఏర్పడతాయి. భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో కలిసి కూడా సంభవిస్తాయి.
భూపాత వైపరీత్యం: ఒక నిర్దిష్ట ప్రాంతంలో నష్టం కలిగించే భూపాతం సంభవించడాన్ని భూపాత వైపరీత్యం అంటారు.
భూపాత దుర్భలత్వం: వైపరీత్యంతో ప్రభావితమైన ప్రాంతంలో నిర్దిష్ఠ అంశాలకు లేదా అంశాల సమూహానికి జరిగే నష్ట సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఈ దుర్భలత్వాన్ని స్కేలుపై 0 (ఎలాంటి నష్టం లేకపోవడం) నుంచి 1 (పూర్తి నష్టం) వరకు సూచిస్తారు. దుర్భలత్వం భౌతిక, సామాజిక, ఆర్థిక పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
భూపాత అపాయం : భూపాత ముప్పు ఉన్న ప్రాంతంలో ప్రాణ నష్టం, వ్యక్తులకు లేదా ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలగడం వంటి హానికర పర్యవసానాల సంభావ్యతను భూపాత అపాయం అంటారు.
భూపాతాలకు కారణాలు
భౌగోళిక దుర్భల పదార్థం: శిలలు లేదా మృత్తికా కూర్పు నిర్మాణంలో బలహీనత కూడా భూపాతాలకు కారణమవుతుంది.
క్రమక్షయం: చెట్ల నరికివేత, రోడ్ల నిర్మాణం వల్ల పర్వత వాలుల అంచులు క్రమక్షయం చెంది ఆ ప్రాంతాలు భూపాతాలకు గురయ్యే దుర్భలత్వం పెరుగుతుంది.
తీవ్రమైన వర్షపాతం : తుఫాను అలజడుల కారణంగా కొద్ది వ్యవధి నుంచి పలు గంటలపాటు ఉండే తీవ్ర వర్షపాతం లేదా చాలా రోజులపాటు కురిసే తీవ్రమైన వర్షపాతం వల భూపాతాలు పెద్ద ఎత్తున ఏర్పడతాయి. ఈ తరహా భూపాతాలు ఎక్కువగా పశ్చిమ కనుమల్లో ఏర్పడుతున్నాయి. కొండప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురవడం వల్ల కూడా భూపాతాలు ఏర్పడతాయి.
- తవ్వకాలు జరపడం వల్ల, అగ్ని పర్వత విస్ఫోటనాల భూపాతాలు ఏర్పడతాయి.
భూకంపాలు: తీవ్ర భూకంపాల సందర్భంలో సాపేక్షికంగా పలుచగా లేదా లోతుగా ఉండే విచ్ఛిన్న నేలలు లేదా శిలలు లేదా రెండూ కలగలిపిన భూపాతాలు ఏర్పడతాయి. ఇలాంటి భూపాతాలు ఎక్కువగా హిమాలయాలు ఈశాన్య పర్వత ప్రాంతాలు, పశ్చిమ కనుమల్లో సంభవిస్తాయి.
భూ పాతాలు – రకాలు
ప్రపాతం: జారి పడటం, ఎగరడం, దొర్లడం ద్వారా లోతైన వాలులు లేదా శిఖరాల నుంచి వేరుపడ్డ పదార్థాల అనూహ్య చలనాలను ప్రపాతం అంటారు.
ప్రవాహాలు: శిథిల ప్రవాహం, శిథిల సంపాతం, లహర్, బురద ప్రవాహం మొదలైనవి.
సర్పణం లేదా పాకడం: మట్టి లేదా శిలలు నెమ్మదిగా నిటారుగా కిందకు జారడం అవి వంపు తిరిగిన చెట్ల కాండాలు, వంగిన కంచెలు లేదా రిటైనింగ్ గోడలు పడిపోయిన స్తంభాలు లేదా కంచెలను తలపిస్తాయి.
శిథిల ప్రవాహం: మట్టి రాళ్లు, సేంద్రియ పదార్థం వంటివి గాలి, నీటితో అవనాళికలతో కూడి శిథిల ప్రవాహం ఏర్పడుతుంది.
శిథిల సంపాతం: అతివేగం నుంచి అసాధారణ వేగంతో కూడిన శిథిల ప్రవాహం.
లహర్: అగ్ని పర్వత వాలు నుంచి ఏర్పడే బురద ప్రవాహం లేదా శిథిల ప్రవాహం సాధారణంగా, అగ్ని పర్వత నిక్షేపాలు కొట్టుకుపోయే భారీ వర్షపాతం. అగ్ని పర్వత విస్ఫోటన ఘటనల కారణంగా ఉద్భవించే ఉష్ణంతో ఆకస్మికంగా మంచు కరగడం లేదా హిమానీనదాల నుంచి నీరు పొంగిపొర్లడం, అగ్ని పర్వత విస్ఫోటనాల వల్ల జ్వాలాబిలం, సరస్సులు విచ్ఛిన్నం కావడం వల్ల లహర్ ఏర్పడుతుంది.
పంక ప్రవాహం: కనీసం 50 శాతం ఇసుక, పోడు, బురదమట్టి ఉన్న తడి పదార్థం వేగంగా ప్రవహించడాన్ని పంక ప్రవాహం అంటారు.
శీఘ్ర పాతాలు : పలురకాల ద్రవ్యరాశి చలనాలన్నింటినీ భూ పాతం అని అంటారు. ఇందులో రెండు ప్రధానమైన భూపాతాలు ఉన్నాయి. అవి
1) భ్రమణ శీఘ్ర పాతాలు
2) స్థలాంతర భూపాతాలు
కూలిపోవడం : ఒక రాతి ఖండం ముందుకు దొర్లడం లేదా తిరిగి వాలు నుంచి కిందకు జారడాన్ని కూలిపోవడం అంటారు.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు