TSPSC Exams Special | గోదావరి-నగరీకరణ-బొగ్గు గనులు-శీతోష్ణస్థితి
1. తెలంగాణలో గోదావరి ప్రాముఖ్యతలను తెలిపి, దానితో వివాదంపై వ్యాఖ్యానించండి?
ప్రాముఖ్యం
1) మహారాష్ట్రలో జన్మించిన గోదావరి తెలంగాణలో కందుకుర్తి నుంచి బూర్గంపాడు వరకు దాదాపు 500 కి.మీ. ప్రయాణిస్తుంది.
2) ఇది తెలంగాణలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి జిల్లాల గుండా ప్రయాణిస్తూ 8 జిల్లాల్లో తన పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది.
3) మంజీర, ప్రాణహిత, కడెం, మానేరు, పెద్దవాగు, హరిద్ర, హల్ది, కిన్నెరసాని, స్వర్ణ వంటి ఉపనదులను రాష్ట్రంలో కలిగి ఉంది.
4) గోదావరి భారత్‌లో రెండో పెద్ద నదిగాను, మరోవైపు రాష్ట్రంలో అతిపెద్దదిగాను ఉంది.
5) దీని ప్రాంతాల్లో సారవంతమైన ఒండ్రు నేలలను, నల్లరేగడి నేలలను కలిగి ఉండటం వ్యవసాయోత్పత్తుల పెరుగుదలకు కారణమవుతుంది.
6) దీని పరీవాహక ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన కుంతాల, పొచ్చెర, బొగొత వంటి జలపాతాలు ఉన్నాయి.
7) పోచారం, మంజీర, జిన్నారం, ప్రాణహిత, కిన్నెరసాని, పాకాల వంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి.
8) ఖనిజ ఉత్పత్తిలో రాష్ర్టాన్ని ఉన్నత స్థానంలో ఉంచిన గోదావరి ప్రాంతంలో సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ, భద్రాద్రి ధర్మల్ పవర్‌స్టేషన్, మణుగూరు భారజల కేంద్రం పాల్వంచ స్పాంజి ఐరన్ పరిశ్రమలు ఉన్నాయి.
వివాదాలపై వ్యాఖ్యానం
1) సహజ సిద్ధంగానే సమృద్ధిగా వర్షపాతం ఉండే ప్రాంతాల గుండా ప్రయాణించడం వల్ల, ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా పరీవాహక రాష్ర్టాల సమ్మతితో ఇష్టపూర్వకంగా చేసుకున్న ఒప్పందాలుగా ఉండటం, ఇప్పటికీ 1000 టీఎంసీల పైగా వృథాగా జలాలు సముద్రంలో కలవడం వంటి కారణాల వల్ల ఈ నదీజలాల విషయంలో వివాదాలు తక్కువ.
2) 1956లో నదీజల వివాదాల చట్టం ఏర్పాటు, దాని ఆధారంగా 1969లో గోదావరి వివాదం కోసం ‘బచావత్’ ట్రిబ్యునల్ ఏర్పాటు వీటన్నింటికీ భిన్నంగా 1975లో అప్పటి 5 పరీవాహక రాష్ర్టాల ముఖ్యమంత్రులు ద్వైపాక్షిక, బహుళ పక్ష ఒప్పందాలు, వాటి ఆధారంగా 1979-80లో గోదావరి ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చింది.
3) ఈ తీర్పునకు పోచంపాడు ఆనకట్టను ఆధారంగా తీసుకున్నారు. ప్రధాన గోదావరి నదిపై జయక్వాడి ఆనకట్టను ఎగువన ఉన్న నీటినంతటినీ మహారాష్ట్రకు కేటాయించారు.
3) మంజీరపై నిజాంసాగర్ ఆనకట్టకు ఎగువన ఉన్న నీటిలో మహారాష్ట్రకు 22 టీంఎసీలు, కర్ణాటకకు 14 టీఎంసీలు, తెలంగాణకు 62 టీఎంసీలు కేటాయించారు. పూర్ణ నదిపై సిద్ధేశ్వర ఆనకట్టకు ఎగువన ఉన్న నీటినంతటినీ 9 టీఎంసీలు మినహా మహారాష్ట్రకే కేటాయించారు. పైన చెప్పిన నాలుగు ఆనకట్టల మధ్యలో ఉన్న జిల్లాల్లో 102 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయిస్తూ జూలై 1 నుంచి అక్టోబర్ 29 వరకు బాబ్లీ గేట్లను పైకెత్తి ఉంచాలని నిర్ణయించారు.
4) పోచంపాడుకు దిగువ మహారాష్ట్రకు 300 టీఎంసీలు అవిభక్త ఆంధ్రకు 300 టీఎంసీలు, మధ్యప్రదేశ్‌కు 300 టీఎంసీలు, ఒడిశాకు 200 టీఎంసీలు కేటాయించారు. ఏ విధంగా చూసినప్పటికీ తెలంగాణ పరీవాహక ప్రాంతంలో మనకు అటు ఇటుగా 965 టీఎంసీలను కేటాయించినట్లు చెప్పవచ్చు.
5) గోదావరితో ప్రస్తుతమున్న వివాదాల్లో కొంత పోలవరంతో ముడిపడి ఉంది. ఒకవేళ పోలవరం నిర్మాణం పూర్తయితే కొత్తగూడెం జిల్లాలో ఇంకొంత ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదముంది. పోలవరం నుంచి కృష్ణాకు మళ్లిస్తున్న 80 టీఎంసీల నీటిలో మహారాష్ట్ర, కర్ణాటకలకు నీటిని కేటాయించి తెలంగాణకు నీటిని కేటాయించకపోవడం మన హక్కులకు కొంత భంగం కలిగిందని చెప్పవచ్చు.
6) ప్రధానంగా ఈ వివాదం పరోక్షంగా కృష్ణానది వివాదాలతో ముడిపడినట్లయ్యింది. బాబ్లీ ఆనకట్ట, లోయర్ పెన్‌గంగా ఆనకట్ట, భూపాలపట్నం ఆనకట్ట, పోలవరం, కాళేశ్వరాన్ని కూడా వివాదంగా మారుస్తూ సహచర రాష్ర్టాలు కేంద్ర జలవనరుల శాఖకు అప్పుడప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాయి.
2. భారతదేశంలో నగరీకరణ ప్రక్రియ ధోరణులను పరిశీలించండి?
- పట్టణ జనాభా పరిమాణంలో భారతదేశం ప్రపంచంలో చైనా, యూఎస్ఏ తరువాత 3వ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల పరంగా భారతదేశంలో 377 మిలియన్ల మంది ప్రజలు సుమారు 7935 నగర జనావాసాల్లో నివసిస్తున్నారు. నగర జనాభా మొత్తం భారతదేశ జనాభాలో 31.16 శాతంగా ఉంది.
- రాష్ర్టాల పరంగా చూస్తే మహారాష్ట్రలో 13.5 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 11.8 శాతం, తమిళనాడులో 9.3 శాతం పట్టణ జనాభా కేంద్రీకృతమై మిగిలిన రాష్ర్టాల్లో పట్టణ జనాభా పరిమాణం అతి తక్కువగా ఉంది. 1901లో మొత్తం దేశ జనాభాలో పట్టణ జనాభా 11.4 శాతం ఉండగా, 2001 నాటికి 28.53 శాతానికి పెరిగి, 2011 నాటికి 31.16 శాతానికి చేరింది.
- భారతదేశంలో నగరీకరణ ప్రక్రియ కేవలం కొన్ని పెద్ద నగరాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంది. దేశంలో మెట్రోపాలిటన్ మిలియన్ నగరాల సంఖ్య 1981లో 12 కాగా, 1991 నాటికి 23, 2001 నాటికి 35, 2011 నాటికి 53 కు చేరింది. పెద్ద నగరాలు, పట్టణాలు మరింత విస్తరిస్తూ ఉంటే చిన్నసైజు పట్టణాలు జనాభా పరంగా, సంఖ్యాపరంగా తగ్గిపోతున్నాయి.
- భౌగోళిక పరంగా దక్షిణ భారత్‌లో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నగరీకరణ వేగంగా విస్తరిస్తుంది. కారణం చారిత్రకపరమైన, వనరులపరమైన, సాంస్కృతికపరమైన అంశాలు దోహదం చేస్తున్నాయి.
- ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలవైపు జరిగే వలసలు కీలకమైనవి. ఈ వలసలు ప్రధానంగా బ్రిటిష్ వారు అనుసరించిన దోపిడీ ఆర్థిక విధానాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని అందించే కుటీర పరిశ్రమలు, కుల వృత్తులు క్షీణించడంతో ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలవైపు వలసలు పెరగడం ప్రధాన కారణం. అందువల్ల భారతదేశ నగరీకరణ ప్రక్రియను జీవనాధార నగరీకరణ అని అంటారు.
- ప్రస్తుతం నగరీకరణ ప్రక్రియలో సేవారంగ అభివృద్ధి ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే జిల్లా కేంద్రాల అభివృద్ధి ఇప్పటికీ వాటి పారిశ్రామిక అభివృద్ధిపై మాత్రమే ఆధారపడి ఉంది. అయితే వ్యవసాయరంగ అభివృద్ధి వల్ల జరిగే నగరీకరణ ప్రక్రియ దేశంలో భౌగోళికంగా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంది.
3. భారతదేశ శీతోష్ణస్థితిని నియంత్రించే కారకాలను విశ్లేషించండి?
ప్రధాన కారకాలు
1) అక్షాంశం: అక్షాంశాల పరంగా 804 ఉత్తర అక్షాంశం నుంచి 3706ల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉండటం వల్ల కర్కటక రేఖకు దిగువన గల ప్రాంతం ఉష్ణమండలంలోను, ఎగువన గల భాగం సమశీతోష్ణ మండలంలోను ఉంది. సహజంగానే అయనరేఖా మండల పశ్చిమ ప్రాంతం ఎడారిని కలిగి ఉంటుంది.
2) భూ జల భాగాల విస్తరణ: ద్వీపకల్ప పీఠభూమికి మూడువైపులా నీరు ఉండటం భారతదేశ శీతోష్ణస్థితులపై గణనీయ ప్రభావాన్ని కలిగి ఉంది. రుతుపవనాల ఆవిర్భావానికి, సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితులను కలిగి ఉండటానికి, అయనరేఖ చక్రవాతాలు ఏర్పడటానికి కారణమవుతుంది.
3) సముద్రం నుంచి గల దూరం: తీరప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యత్యాసాలు తక్కువగా ఉండి, అధిక వర్షపాతాన్ని పొందుతూ, సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితిని కలిగి ఉంటాయి. సముద్రానికి దూరంగా ఉన్న ఢిల్లీ, నాగపూర్, హైదరాబాద్ వంటి పట్టణాలు అధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలను నమోదు చేస్తూ తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఖండాంతర్గత శీతోష్ణస్థితిని కలిగి ఉంటాయి.
4) హిమాలయ పర్వతాలు: ఉత్తర భారతదేశ మైదానాలకు వర్షం కురవడానికి సైబీరియా నుంచి వచ్చే శీతల గాలులను అడ్డుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
5) ఎత్తు: ఎత్తు పెరిగే కొద్ది పీడనం, ఉష్ణోగ్రతలు తక్కువ అవుతాయి. 110ల అక్షాంశం వద్దగల ఊటీ, కోయంబత్తూర్ పట్టణాలు వరుసగా 130C, 26.80C జనవరి ఉష్ణోగ్రతలు నమోదు చేస్తాయి. దీనికి కారణం కేవలం ఎత్తులో తేడా మాత్రమే.
6) నిమ్నోన్నతాలు: పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, తూర్పు హిమాలయాలు, ఉత్తర భారతదేశ మైదానాలు ఇవన్నీ కూడా వివిధ రకాలుగా శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమతీర మైదానాల్లో పర్వతీయ వర్షపాతం కురవడానికి, షిల్లాంగ్ పీఠభూమి వర్షాచ్ఛాయ ప్రాంతం కావడానికి ఈ నిమ్నోన్నతాలే కారణం.
7) ప్రపంచ పవనాలు: భారతదేశం సహజంగా శుష్క ఈశాన్య వ్యాపార పవనాల మేఖలలో ఉంది. జూన్ నెలలో ఆగ్నేయ వ్యాపార పవనాలు నైరుతి రుతుపవనాలుగా రూపాంతరం చెంది వర్షాగమనానికి కారణమవుతాయి. శీతాకాలంలో నైరుతి పశ్చిమ పవనాలు వాయవ్య భారతదేశంలోకి ప్రవేశించి పశ్చిమ విక్షోభాలకు కారణమవుతుంది.
8) జెట్‌స్ట్రీమ్స్: శీతాకాలంలో పశ్చిమ జెట్‌స్ట్రీమ్స్, నైరుతి రుతుపవన కాలంలో తూర్పు జెట్‌స్ట్రీమ్స్ ప్రభావానికి భారతదేశం లోనవుతుంది.
- పై అంశాలే కాకుండా టిబెట్ పీఠభూమి, ఎల్‌నినో, లా నినా, సోమాలియా ప్రవాహం, హిందూ మహాసముద్ర ద్వయాంశ స్థితి మొదలైనవి భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తున్నాయి.
4. భారతదేశంలో బొగ్గు గనుల విస్తరణను తెలుపుతూ, వాటి వినియోగం వల్ల కలిగే లాభ, నష్టాలను పేర్కొనండి?
- బొగ్గు అనేది ఒక హైడ్రోకార్బన్, కాలుష్య, తరిగిపోయే ఇంధన వనరు. దేశంలో లభించే బొగ్గులో 99 శాతం నాణ్యమైన బొగ్గు గోండ్వానా రకానికి చెందింది. ఇది బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, తూర్పు మధ్యప్రదేశ్‌లో లభిస్తుంది. భారత్‌లో టెర్షియరీ బొగ్గు ఉత్పత్తి 1 శాతం మాత్రమే.
- దేశంలోని ప్రధాన బొగ్గు క్షేత్రాలు ఝరియా, సింగ్రౌలీ, చిరిమిరి, తాతాపాని, కాంప్టీ, తాల్చేర్, ఉత్తర, దక్షిణ గోదావరి బొగ్గు క్షేత్రాలు.
- దేశంలో లభ్యమయ్యే బొగ్గులో 80 శాతం బిట్యుమినస్ రకం, ఇది నాన్ కోకింగ్ రకానికి చెందింది. దీనిలో సల్ఫర్, యాష్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇతర దేశాల నుంచి నాణ్యమైన కోకింగ్ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీన్ని ఇనుము-ఉక్కు పరిశ్రమల్లో వినియోగించారు.
ప్రయోజనాలు - దేశ భక్తి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర వహించే ప్రధాన వనరు. దేశంలోని స్థాపిత శక్తిలో బొగ్గు ఆధారిత థర్మల్ ఎనర్జీ వాటా దాదాపు 52 శాతంగా ఉండటమే గాకుండా ప్రధాన భారీ పరిశ్రమలకు సంబంధించి ముడిసరుకుగా బొగ్గు ఉపయోగపడుతుంది.
- ప్రత్యామ్నాయ లేదా ఇతర శక్తి వనరులతో పోలిస్తే బొగ్గు ఆధారిత శక్తి ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాల్లో కూడా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయవచ్చు.
- బొగ్గు ఆధారిత భారీ పరిశ్రమల ఏర్పాటు వల్ల, ఆ ప్రాంతాల్లో విస్తృతంగా ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, వాటి అనుబంధ రంగాల అభివృద్ధి మొదలైన ప్రయోజనాలను బొగ్గు ద్వారా పొందవచ్చు.
బొగ్గు వినియోగం వల్ల కలిగే నష్టాలు
1) భూ పటలంలోని బొగ్గును వెలికితీసే ప్రక్రియలో భూ పాతాలు సంభవించడం ద్వారా ప్రాణ నష్టాలు కలుగుతాయి.
2) బొగ్గు మైనింగ్‌లో పాల్గొనే కార్మికులకు సంబంధించి న్యుమోనియోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధి సంభవిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వంటి పర్యావరణ సమస్యలకు కారణమవుతుంది.
3) బొగ్గు దహన ప్రక్రియ వల్ల ఆమ్ల వర్షాలు సంభవిస్తాయి.
4) బొగ్గు మైనింగ్ ప్రక్రియ వల్ల సంబంధిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఆవాసాలను కోల్పోయి నిర్వాసితులు కావడం, ఆ ప్రాంతాల్లోని జీవవైవిధ్యత దెబ్బతింటుంది.
5) శిలాజ ఇంధనంగా బొగ్గును మండించినప్పుడు సల్ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ ఆక్సైడ్ వంటివి భూ, జల వనరులను కలుషితం చేస్తాయి.
6) దేశంలో లభ్యమయ్యే బొగ్గు నాన్-కోకింగ్ రకానికి చెందింది. అందువల్ల ఇందులో సల్ఫర్, బూడిద పాళ్లు ఎక్కువగా ఉండి వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తుంది.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?