General Science Biology | మహమ్మారి సంక్రమణ.. పసిపిల్లల ప్రాణ హరణ
చిన్నారుల జీవితాలను పసిప్రాయంలోనే తుంచేసే మహమ్మారి తలసేమియా. ఇది ఒక జన్యుసంబంధమైన వ్యాధి. ఎముక మూలుగలో హిమోగ్లోబిన్ ఉండే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి నిలిచిపోవడాన్ని తలసేమియా వ్యాధి అంటారు. బిడ్డకు జన్మనిచ్చే వారి వల్లే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. దీని ద్వారా జన్యు వాహకులైన తల్లిదండ్రులకు జన్మించే బిడ్డల్లో 25 శాతం మంది పుట్టుకతోనే వ్యాధిగ్రస్థులయ్యే అవకాశం ఉంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లెక్కల ప్రకారం ప్రపంచంలో 4.5 శాతం మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతుండగా భారతదేశంలో మూడు కోట్ల యాభై లక్షలకు పైగా తలసేమియా బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి.
తలసేమియా
- తలసేమియా అంటే గ్రీకు భాషలో సముద్రం అని అర్థం. ఈ వ్యాధికి గురైన చిన్నారులకు జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. తలసేమియా ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది. అవి..
ఆల్ఫా తలసేమియా - ఆల్ఫా తలసేమియా : 16P క్రోమోసోమ్ లోపానికి కారణమవుతుంది. ఇది ఆల్ఫా గ్లోబిన్ ఉత్పత్తి తగ్గుదలకు కారణమవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. వాటిని హిమోగ్లోబిన్ H, హైడ్రాప్స్ ఫెటాలిస్గా చెప్పవచ్చు. హిమోగ్లోబిన్ H వల్ల ఎముకల సంబంధింత సమస్యలు వస్తాయి. నుదురు, దవడల వద్ద ఎముకలు పెద్దవిగా ఉంటాయి. కామెర్లు సోకి చర్మం పసుపు రంగులోకి మారుతుంది. అదేవిధంగా కళ్లలోని నల్లగుడ్డు పెద్దదిగా కనిపిస్తుంది. హైడ్రాప్స్ తలసేమియా శిశువు జన్మించడానికి ముందు సంక్రమిస్తుంది. ఇది సోకిన శిశువులు చాలా వరకు కడుపులోనే, కొందరు శిశువులు పుట్టిన కొద్దిరోజులకే చనిపోతారు.
బీటా తలసేమియా - ఈ రకంలో బీటా గ్లోబిన్ జన్యువులు ప్రభావితం అవుతాయి. ఇది మేజర్ తలసేమియా లేదా తలసేమియా ఇంటర్మీడియా అనే రెండు రకాలుగా ఉంటుంది. పిల్లలకు రెండేళ్ల వయస్సు రావడానికి ముందే మేజర్ తలసేమియా లక్షణాలు బయటపడతాయి. పిల్లల్లో ముఖం పీక్కుపోయి ముడతలు పడినట్లు ఉంటుంది. శరీర రంగులోనూ వ్యత్యాసాలు కనిపిస్తాయి. తరచూ వ్యాధులు సంభవిస్తుంటాయి. ఆకలి సరిగా ఉండదు. ఎదుగుదల కనిపించదు.
డెల్టా తలసేమియా - డెల్టా చైన్ సంశ్లేషణకు కారణమైన జన్యువుల పరివర్తన కారణంగా వస్తుంది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి సాధారణంగా లక్షణ రహితంగా ఉంటాడు. ఎర్ర రక్తకణాలు అసాధారణంగా చిన్నగా ఉన్న చోట మైక్రోసైటోసిస్ సంభవించవచ్చు. తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల కారణంగా కాని జన్యువుల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు కాని ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆల్ఫా, బీటా తలసేమియా అప్రభావితమైన ఆటోసోమల్ పద్ధతిలో వారసత్వంగా వ్యాపిస్తాయి. ఆటోసోమల్ పద్ధతిలో వారసత్వంగా వ్యాపించిన ఆల్ఫా, బీటా తలసేమియాలు అధికంగా నమోదయ్యాయి. తల్లిదండ్రులకు హిమోగ్లోబినోపతి లక్షణం ఉంటే గర్భంలో ఉండే బిడ్డకు 25 శాతం ఆపద కలిగే అవకాశం ఉంటుంది.
తలసేమియా-కొన్ని వాస్తవాలు - ఇది ఒక తీవ్రమైన వంశపారంపర్య, రక్త సంబంధ వ్యాధి.
- ప్రపంచ జనాభాలో 4.5 (250 మిలియన్లు) శాతం మంది తలసేమియా మైనర్ వ్యాధితో బాధపడుతున్నారు.
- సుమారు 35 మిలియన్ల భారతీయులు ఈ వ్యాధిని కలిగించే అసాధారణ జన్యువును కలిగిన వాహకులు.
- ప్రపంచంలో ప్రతి సంవత్సరం 10 నుంచి 12 వేల మంది పిల్లలు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు.
- తలసేమియా వ్యాధిగ్రస్థుల జీవిత కాలం పెంచాలంటే రక్త మార్పిడి, విలువైన మందులు అవసరం.
- వివాహం, గర్భధారణకు ముందు శిశుజననం తర్వాత పరీక్షలు చేయించుకోవడం, అవగాహన కల్పించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
వ్యాధి సాధారణ లక్షణాలు - మూడు నెలల వయస్సు నుంచి 18 నెలల వయస్సులో ఈ వ్యాధి బయటపడుతుంది.
- ముఖం పాలిపోయి బాల్యంలోనే ముడతలు పడినట్లుగా తయారవుతుంది.
- శరీరం రంగు తేడాగా ఉంటూ పాలిపోయినట్లు మారుతుంది.
- శారీరక ఎదుగుదల ఉండదు. బొడ్డు భాగంలో వాపు ఉంటుంది.
- తరచూ అనారోగ్యాలకు గురవుతుంటారు.
చికిత్స - పెరుగుదల తక్కువగా ఉండటం, పెలుసుబారిన ఎముకలు, తొందరగా వ్యాధులకు గురికావడం వంటి లక్షణాలను మొదటి ఏడాదిలోనే గుర్తించినట్లయితే తలసేమియా మేజర్‌ను తగ్గించడం తేలికవుతుంది. మొదటి సంవత్సరంలోనే శిశువుల్లో హిమోగ్లోబిన్ స్థాయిని, పెరుగుదలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. హిమోగ్లోబిన్ పరిమాణం 70 శాతం కన్నా తగ్గినప్పుడు పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది. వారు క్రమం తప్పకుండా రక్త మార్పిడి చికిత్స చేయించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం హిమోగ్లోబిన్ స్థాయి 115-120 గ్రా/లీ. ఉండేలా చూసుకోవాలి. ఈ చికిత్సలో ముఖ్యమైన అంశం ప్రతి 3, 4 వారాలకొకసారి గాఢత కలిగిన ఎర్ర రక్తకణాలను ప్రవేశపెట్టడం ద్వారా చికిత్స చేస్తారు. మూల కణాల మార్పిడి ద్వారా తలసేమియా వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు వారి కణజాలాలకు సమానమైన కణజాలం కలిగిన వారి (సోదర/సోదరి) నుంచి సేకరించిన ఎముక మజ్జలో ఉండే ఎర్ర రక్తకణాల మూలకణాల (ఎముక మజ్జ మార్పిడి) మార్పిడి ద్వారా చికిత్స చేయవచ్చు. పెళ్లికి ముందు వధూవరులు మొత్తం బ్లడ్ కౌంట్ (సీబీసీ), హెచ్‌బీఏ-2 లెవల్ పరీక్షలు చేయించుకోవాలి. ఇద్దరిలో కనీసం ఒకరికైనా తలసేమియా లేదని తేలితే నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇద్దరు వాహకులైతే పుట్టబోయే పిల్లలకు తలసేమియా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు.
- వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం ఆరోగ్య కార్డుల ద్వారా సహాయం అందించాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి వ్యాధిబారిన పడిన వారికి రక్తం అందించే చర్యలు చేపట్టాలి. వైద్యరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రాణాంతక వ్యాధులపై పరిశోధనలు చేసి ఎముకల మూలుగ మార్పిడి చికిత్సకు ఖర్చు తక్కువ అయ్యేలా చూడాలి. ఇలాంటి అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
- 2023 తలసేమియా దినోత్సవం థీమ్: ‘జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్యం చేయండి. తలసేమియా సంరక్షణ అంతరాన్ని తగ్గించడానికి విద్యను బలోపేతం చేయండి.’
మూలకణాలు-మేలు కణాలు
- కాలుష్యమయమైన వాతావరణం, క్రమం తప్పిన ఆహారపు అలవాట్లు, శారీరక అలవాట్లు లేకపోవడం వెరసి అనారోగ్య సమస్యలు దాడి చేస్తున్నాయి. ఈ కారణంగా అకాల మరణాలు సంభవిస్తూ మానవుడి ఆయుష్షును గాలిలో దీపంలా మారుస్తున్నాయి. వీటన్నింటిని ఎదిరించి మనిషి జీవితకాలాన్ని పెంచడానికి వైద్యులు ప్రత్యామ్నాయ వైద్య చికిత్సా విధానాలను పరిశోధిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మూలకణాల పరిశోధనలో కొంగొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయి. మానవ శరీర అవయవాలను తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్నాం. కాని ప్రజల్లో అవయవ దానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అది పూర్తిస్థాయిలో సాధ్యపడటం లేదు. అందువల్ల మూలకణాల నుంచి అవయవాల ఉత్పత్తికి ప్రాముఖ్యం పెరిగింది.
మూలకణాలు అంటే?
- మానవ శరీరం కణాల నిర్మితం. ఆయా కణాలు విభజన చెంది కణజాలాలుగా రూపొంది చర్మం, వెంట్రుకలు, రక్తకణాలు, మెదడు, కాలేయం వంటి అన్ని శరీర భాగాలు ఏర్పడతాయి. ఇవన్నీ కణాలే అయినా అవి చేసే పనిని బట్టి కొద్ది వైవిధ్యంతో ఉంటాయి. ఈ వేర్వేరు కణాల్లో ఏ అవయవంగానైనా రూపొందే శక్తి ఒక్క మూలకణాలకు మాత్రమే ఉంటుంది. అలాంటి మూలకణాన్నే స్టెమ్‌సెల్ అంటారు. మూలకణాలు మొదట ఒకటిగానే కనిపిస్తాయి. అవి నిర్వర్తించాల్సిన విధులను బట్టి వివిధ రకాల కణాలుగా రూపాంతరం చెందుతాయి. శరీర కణాలన్ని మూలకణాలు కావు. రెండు నిర్ధిష్ట లక్షణాలున్న జీవ కణాలు జీవకణాలు మాత్రమే మూలకణాలు. అసాధారణ పరిస్థితుల్లో లేదా ఏదైనా అవయవం లేదా కణజాలం పనిచేయని స్థితి ఏర్పడినప్పుడు మూలకణాలు ఆయా కణాలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో అవయవాన్ని పూర్తిగా తయారుచేస్తాయి. బొడ్డుతాడు నుంచి సేకరించే మూలకణాలను హెమటోపాయిటిక్ స్టెమ్‌సెల్స్ అని బొడ్డుతాడు కణజాలం నుంచి సేకరించే వాటిని బోన్‌మారో స్టెమ్‌సెల్స్ అంటారు.
సేకరించడం ఎలా?
- ప్రసవ సమయంలో శిశువు బొడ్డుతాడును అంటిపెట్టుకుని ఉండే రక్తంలో, మాయలో మూలకణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. బొడ్డు తాడును బిడ్డ నుంచి వేరు చేసిన తర్వాత ఆ రక్తాన్ని సేకరిస్తారు. ఇందులో హెమటోపాయిటిక్ మూలకణాలు అధిక సంఖ్యలో ఉంటాయి. వీటిని రక్త, జన్యు సంబంధమైన వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ప్రసవం జరిగిన ఆరు గంటలలోపు బొడ్డుతాడును, రక్తాన్ని సేకరిస్తే అందులో 98 శాతం మూలకణాలు క్రియాత్మకంగా ఉంటాయి. ఆలస్యం జరిగేకొద్ది అవి నిష్క్రియాత్మకంగా మారుతాయి.
- మూలకణాలతో చికిత్స చేయగల వ్యాధులు అనేకం. ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రాణాంతక రోగాలు, సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లుకేమియాతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, మెటబాలిక్ స్టోరేజీ వంటి 70 రకాల వ్యాధులకు చికిత్స సాధ్యమవుతుంది. అవయవ కణజాల పునర్నిర్మాణం, రీజనరేటివ్ మెడిసిన్‌తో కొత్త కణజాలాలను నిర్మించేందుకు మూలకణాలను ఉపయోగిస్తారు. కిలో బరువు ఉన్న శరీర అవయవం రూపొందించడానికి ఒక మిలియన్ మూలకణాలు అవసరం అవుతాయి.
- ప్రజల్లో అవగాహన లేకపోవడంతో బిడ్డ పుట్టిన వెంటనే రెండో ఆలోచనకు తావు లేకుండా బొడ్డు తాడును, మాయను పారవేస్తారు. ఎంతో అమూల్యమైన మూలకణాలను పనికిరాకుండా చేస్తారు. ఇప్పుడిప్పుడే వీటిని నిల్వ చేసే పద్ధతులపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
- తల్లిదండ్రుల అనుమతితో సేకరించిన బొడ్డుతాడును, రక్తాన్ని -196..0c వద్ద లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులో నిల్వ చేస్తారు.
- మూలకణాలను నిల్వ చేసే శాస్త్ర సాంకేతికతతో ఏర్పాటు చేసినవే మూలకణాల బ్యాంకులు. మూలకణాలను నిల్వ చేయడంతో భవిష్యత్తులో బిడ్డకు రాగల వ్యాధులకు చికిత్స, అవసరమైతే శరీర అవయవాలను పరిశోధనశాలల్లో ఉత్పత్తి చేసే వీలు ఉంటుంది.
- ఇటీవల జరిగిన పరిశోధనల్లో పాల దంతాల నుంచి లిపోసెక్షన్తో తొలగించే కొవ్వు నుంచి కూడా మూలకణాలను ఉత్పత్తి చేస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు