Indian Geography | అవక్షేప శిలలు.. అర్ధ చంద్రాకారపు శిఖరాలు
భారతదేశ నైసర్గిక స్వరూపం
- హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, బృహత్ మైదానాలు కలిసి భారతదేశం ఏర్పడింది. భారతదేశ నైసర్గిక స్వరూపాల్లో అత్యధిక వయస్సు కలది ద్వీపకల్ప భారతదేశం. అతి తక్కువ వయస్సు కలవి గంగా, సింధూ మైదానాలు.
- భారత భూభాగంలో పర్వతాలు 10.7 శాతం, కొండ ప్రాంతాలు 18.6 శాతం, పీఠభూములు 28 శాతం, మైదానాలు 43 శాతం కలిగి ఉన్నాయి.
- భారతదేశంలోని నైసర్గిక ప్రాంతాలను ఐదు భాగాలుగా విభజించారు. అవి:
1. ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు (The Himalayan Mountains)
2. ఉన్నత మైదానాలు (బృహత్ మైదానాలు లేదా గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు) (Great Plain of North India)
3. ద్వీపకల్ప పీఠభూమి (The Peninsular Plateau)
4.తీర మైదానాలు (The Coastal Plain)
5. దీవులు (The Islands)
1. హిమాలయ పర్వతాలు - ఇవి టెథిస్ మహాసముద్రం నుంచి ఏర్పడినవి. టెథిస్ మహాసముద్రం 65-70 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి కుచించుకుపోవడం మొదలైంది. దీనికి కారణం పలకల కదలికలే. 30-60 మిలియన్ సంవత్సరాల క్రితం యురేషియన్ పలక, ఇండియా పలక టెథిస్ సముద్ర భూ పటలానికి దగ్గరగా రావడంతో పగుళ్లు, ముడతలు ఏర్పడటం ఆరంభమైంది.
- హిమాలయాలు ప్రస్తుత ఎత్తుకు ఎదగడానికి 7 మిలియన్ల సంవత్సరాలు పట్టింది. ఇవి అర్ధ చంద్రాకారంలో ఉన్నాయి. హిమాలయాలు అవక్షేప శిలలతో ఏర్పడినవి.
- ఇవి అర్ధ చంద్రాకారంలో ఉండి 2,400 కి.మీ. కలిగి, పశ్చిమాన నంగప్రభాత్ (8,126 మీ.) నుంచి తూర్పున నాంచాబార్వ (7756 మీ.) వరకు విస్తరించి ఉన్నాయి.
- ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరాలను కలిగి అతి తక్కువ వయస్సు కలిగిన ముడుత పర్వతాలుగా పిలువబడుతున్నాయి.
- హిమాలయ పర్వతాలు 5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఇవి పశ్చిమాన సింధూనది ప్రాంతం నుంచి తూర్పున బ్రహ్మపుత్ర నది ప్రాంతం వరకు (కశ్మీర్ నుంచి అసోం వరకు) 2,400 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి.
- వెడల్పు 240 కి.మీ. నుంచి 500 కి.మీ. వరకు ఉన్నది. హిమాలయాలను ఉత్తర, దక్షిణ దిశల్లో నాలుగు భాగాలుగా విభజించారు.
ఎ. ట్రాన్స్ హిమాలయ మండలం
బి. ఉన్నత హిమాలయాలు
సి. నిమ్న హిమాలయాలు
డి. శివాలిక్ కొండలు
ఎ. ట్రాన్స్ హిమాలయాలు - కారకోరంను ఇండియాలో క్రిష్ణగిరి పర్వతాలు/కైలాసగిరి పర్వతాలు అంటారు.
- K2 శిఖరం అంటే కె-కారకోరం, 2-రెండో ఎత్తయిన శిఖరం.
- K2 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం. దీని ఎత్తు 8,611 మీటర్లు. దీన్ని ‘క్వీన్ ఆఫ్ హిమాలయాస్’ అని అంటారు.
- K2 శిఖరాన్ని పాకిస్థాన్‌లో చోగోరి, చైనాలో క్వాగిర్, భారత్‌లో కృష్ణగిరి, గాడ్విన్ ఆస్టిన్ అని కూడా పిలుస్తారు.
హిమాని నదాలు
- ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండే యుద్ధభూమి సియాచిన్ యుద్ధ భూమి. ఇది భారతదేశానికి చెందిన సైనిక స్థావరం.
పామీర్ పీఠభూమి
- ప్రపంచంలో అతి ఎత్తయిన పామీర్ పీఠభూమి ట్రాన్స్ హిమాలయా మండలంలోనే ఉంది. దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. ఇక్కడ ఉన్న మానస సరోవరం నుంచే అనేక నదులు జన్మిస్తున్నాయి.
బి. ఉన్నత/ కేంద్ర, హిమాద్రి హిమాలయాలు - హిమాద్రి హిమాలయాలు ఎత్తయిన శిఖరాలకు ప్రసిద్ధి.
హిమాలయాల్లో ముఖ్యమైన శిఖరాలు
శిఖరం – ఎత్తు – ప్రదేశం
ఎవరెస్ట్- 8,848- నేపాల్
కే2- 8,611- జమ్ముకశ్మీర్
కాంచనగంగా- 8,586- సిక్కిం
మకాలు – 8,485- నేపాల్
ధవళగిరి -8,167- నేపాల్
అన్నపూర్ణ- 8,091- నేపాల్
నంగప్రభాత్- 8,126- జమ్ముకశ్మీర్
నందాదేవి- 7,817- ఉత్తరాంచల్
నాంచాబార్వ- 7,782- అరుణాచల్ ప్రదేశ్
కనుమలు- రాష్ర్టాలు
బుర్జిల్ పాస్, జోజిల- జమ్ముకశ్మీర్
బారా లఛల – హిమాచల్‌ప్రదేశ్
నీతి, లిపులేక్- ఉత్తరాఖండ్
నాథులా, జలప్లా- సిక్కిం
పొంగ్సు, బోమ్దిల్లా – అరుణాచల్ ప్రదేశ్
సి. మధ్య/ నిమ్న/హిమాచల్ హిమాలయాలు - ఈ హిమాలయాలు హిమాద్రి హిమాలయాలకు దక్షిణ భాగంలో విస్తరించి ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 4,500 మీటర్లు.
- హిమాచల్ హిమాలయాలు జమ్ముకశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉంటాయి. వీటి వెడల్పు 60-80 కి.మీ
- ఇవి అవక్షేప శిలలతోను, రూపాంతర ప్రాప్తి శిలలతోను ఏర్పడ్డాయి.
వేసవి విడిదులు - హిమాచల్ హిమాలయాలు అనేక వేసవి విడిదులకు ప్రసిద్ధి.
- రాష్ట్రం- వేసవి విడిది
- జమ్ముకశ్మీర్ – గుల్మార్గ్, పహల్గావ్, పన్తిటప్
- హిమాచల్‌ప్రదేశ్- కులు, మనాలి, సిమ్లా, ధర్మశాల, స్పటి, లాహుల్, చంబ, కేలంగ్, కంగ్రా
- పశ్చిమబెంగాల్ – డార్జిలింగ్, కాలిమ్పాంగ్
- హిమాచల్‌ప్రదేశ్‌లోని దౌల్ధర్ పర్వతశ్రేణిలో సిమ్లా వేసవి విడిది ఉన్నది. హిమాచల్ హిమాలయాలను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు.
- జమ్ము కశ్మీర్‌లోని పిర్పంజల్ పర్వతశ్రేణిలోని బన్నీహల్ కనుమను ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని పిలుస్తారు. దౌల్ధర్ పర్వత శ్రేణులు జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ల గుండా ఉత్తరాఖండ్ వరకు వ్యాపించి ఉన్నాయి.
లోయలు
1. కశ్మీర్ లోయ (కశ్మీర్) భూలోక స్వర్గం
2. కంగ్రా లోయ (హిమాచల్ ప్రదేశ్)
3. కులు లోయ (హిమాచల్ ప్రదేశ్)
డి. బాహ్య హిమాలయాలు - వీటినే శివాలిక్ పర్వత శ్రేణులు అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్‌లో వ్యాపించి ఉన్నాయి.
- శివాలిక్ శ్రేణులను వివిధ రాష్ర్టాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.
- జమ్ము కశ్మీర్లో జమ్ము కొండలు,
ఉత్తరాఖండ్‌లో దుంధువా శ్రేణులు,
నేపాల్‌లో చురియా, మురియా కొండలు అని పిలుస్తారు. - శివాలిక్ తూర్పు ప్రాంతంలో అయనరేఖ తేమతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు కలవు. శివాలిక్లు కలపకు పుట్టినిల్లుగా పేర్కొంటారు.
- పూర్వాంచల్/ఈశాన్య కొండలు హిమాలయాల కొనసాగింపు. ఇవి భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉత్తర దక్షిణ దిక్కులు వ్యాపించి ఉన్నాయి.
- శివాలిక్ కొండల సగటు ఎత్తు 1,500 మీ.
- ఈ కొండలను జమ్ము కశ్మీర్లో జమ్ము కొండలని, ఉత్తరప్రదేశ్‌లో దుద్వా శ్రేణులని పిలుస్తారు. శివాలిక్ కొండల్లో భూకంపాలకు ఎక్కువగా వస్తాయి.
- భారత్‌లో భూకంపాలు ఎక్కువగా సంభవించే రాష్ట్రం- అసోం.
ఉన్నత మైదానాలు/బృహత్ మైదానాలు
- అత్యధిక జనసాంద్రత, సారవంతమైన నేలలు కలిగిన తక్కువ ఉన్నతి కలిగిన మైదాన ప్రాంతాల్లో గంగా సింధూ మైదానం ఒకటి.
- గంగా, సింధు మైదానాలు 2400 కి.మీ. పొడవు 150 నుంచి 320 కి.మీ. వెడల్పు కలిగి మూడు నదీ హరివాణా వ్యవస్థల చేత ఏర్పడి ఉన్నది. ప్రపంచంలో ఒక పెద్ద విస్తారమైన అల్యూవియల్ నేలలను కలిగి అత్యధిక జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఇది ఒకటి.
- గంగా-సింధు మైదానాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా వర్గీకరించవచ్చు. అవి:
1. బాబర్ మైదానాలు
2. టెరాయి మైదానాలు
3. బంగర్ మైదానాలు
4. ఖాదర్ మైదానాలు
గంగా-సింధు మైదానాలను ప్రాంతీయంగా వివిధ భాగాలుగా వర్గీకరించారు. అవి:
1. సింధు పంజాబ్, హర్యానా మైదానాలు - పంచనదులు ప్రవహించే భూమి: పంజాబ్, హర్యానా మైదానాలు 5 నదులు (రావి, బియాస్, జీలం, చీనాబ్, సట్లెజ్) పరీవాహక వ్యవస్థ కింద ఉన్నది. దీన్నే ఐదు నదులు ప్రవహించే భూమిగా పిలుస్తారు. అందుచేత పంజాబ్ అనే పేరు వచ్చింది. (పాకిస్థాన్‌లోని పంజాబ్ కూడా దీనిలో భాగమే)
2. రాజస్థాన్ మైదానం/ఎడారి ప్రాంతం - థార్ ఎడారి-ఇది ఉష్ణ మండల ఎడారి. ప్రపంచంలో ఉన్న పెద్ద ఎడారుల్లో
తొమ్మిదోది.
3. గంగా మైదానం - గంగా మైదానం ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో వ్యాపించి ఉంది. ఇది భారత్‌లో అత్యంత ఎత్తయిన మైదానం.
- పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ సమీపాన గంగా-బ్రహ్మపుత్ర నదులు కలిసి అతిపెద్ద డెల్టాను ఏర్పరుస్తాయి. ఈ డెల్టాలో ‘సుందరి’ అనే వృక్షాలు పెరగడం వల్ల ఈ డెల్టాను ‘సుందర్బన్ డెల్టా’ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, సారవంతమైన డెల్టా.
4. బ్రహ్మపుత్ర మైదానాలు - ఈ మైదానం బ్రహ్మపుత్ర, లోహిత్, సెసిర నదుల ఒండ్రుమట్టి నిక్షేపణలతో అసోం లోయలో ఏర్పడినది.
- మజులీ ద్వీపం: బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోనే అతిపెద్ద నది ద్వీపాన్ని ఏర్పరిచింది. దీని పేరు మజులీ ద్వీపం అంటారు. దీని వైశాల్యం 929 చ.కి.మీ.
ద్వీపకల్ప పీఠభూమి
- భారతదేశంలో అతిపెద్ద నైసర్గిక స్వరూపం. దీన్నే కవచ స్థలాకృత అని కూడా అంటారు.
- ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన పీఠభూమి ఇది. ఈ పీఠభూమి పశ్చిమం నుంచి తూర్పు వైపునకు వాలి ఉన్నది.
- ఖండచలనానికి ముందు ఇది గోండ్వానా భూభాగంలో ఒక భాగంగా ఉండేది.
- ఇది త్రికోణ ఆకృతి కలిగి ఉండి ప్రీ-కేంబ్రియన్ కాలానికి చెందినది. దీని వయస్సు 600 మిలియన్ సంవత్సరాలు. హిమాలయ పర్వతాలతో పోలిస్తే దీని వయస్సు ఎక్కువ.
- 16 లక్షల చ.కి.మీ.ల వైశాల్యాన్ని కలిగి ఉంది.
- ద్వీపకల్ప పీఠభూమి అగ్నిమయ, రూపాంతర ప్రాప్తి శిలలతో ఏర్పడి ఉన్నది.
- ద్వీపకల్ప పీఠభూమిలో థార్ ఎడారి, ఆరావళి పర్వతాలు వింధ్య, సాత్పూరా పర్వతాలు, చోటానాగపూర్ పీఠభూమి, మేఘాలయ పీఠభూమి, కచ్, కైత్వార్, కొంకణ తీరం, కేరళ తీర మైదానాలు, దక్కన్ లావా పీఠభూమి, కర్ణాటక పీఠభూమి, తెలంగాణ, పశ్చిమ తూర్పు కనుమలు ఒడిశా డెల్టా దీని కిందికి వస్తాయి.
పీఠభూమి-విస్తరణ
మాళ్వా పీఠభూమి - ఇది ఆరావళి, వింధ్య పర్వతాలకు మధ్యన మధ్యప్రదేశ్‌లో ఉన్నది.
- దీని పొడవు 530 కి.మీ. వెడల్పు 390 కి.మీ., వైశాల్యం 1500 చ.కి.మీ.
- ఇది లావా శిలల (అగ్నిశిలలు)తో ఏర్పడింది. ఈ పీఠభూమి ఎక్కువగా కందర భూములను కలిగి ఉంది.
- కందర భూములు అంటే వరదల వల్ల అధికంగా కోతకు గురైన భూములు.
- చంబల్, బానస్ నదుల వరదల వల్ల ఈ భూములు ఎక్కువగా ఏర్పడ్డాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలోని మేవార్ పీఠభూమి, బోరాట్ పీఠభూములు, గుజరాత్‌లోని కథియావార్, గిర్నార్ మొదలగు పీఠభూములు మాళ్వా పీఠభూమిలో అంతర్భాగంగా ఉన్నాయి.
- ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలలో విస్తరించిన బుందేల్‌ఖండ్ పీఠభూమి, మధ్యప్రదేశ్‌లో భాగల్ఖండ్ పీఠభూమి, బుందేల్ పీఠభూములు ఈ మాళ్వా పీఠభూమిలోనే అంతర్భాగంగా విస్తరించి ఉన్నాయి.
- భాగల్ఖండ్ పీఠభూమిలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన పన్నా గనులు కలవు.
జీబీకే పబ్లికేషన్స్ సౌజన్యంతో…
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు