అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
సివిల్స్,గ్రూప్-1 జనరల్ ఎస్సే
న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్
2030 నాటికి సాధించదలచుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ (2023)లో మూడు అనుసంధాన అంశాలైన పేదరికం, ఆకలి, వాతావరణ మార్పులకు సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మిగతా లక్ష్యాల సాధనలో ఎంతో మంచి పురోభివృద్ధి ఉండగా ఈ మూడు లక్ష్యాల విషయాల్లో తిరోగమనం కనిపిస్తుంది. ముఖ్యంగా వాతావరణ మార్పులకు సంబంధించి ప్రపంచ ఉష్ణోగ్రతలు పూర్వపారిశ్రామికీకరణ (ప్రీ ఇండస్ట్రియల్) కాలం కంటే 1.1డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్గారాలు ఇదే స్థాయిలో కొనసాగితే 2035 నాటికి ట్రిప్పింగ్ పాయింట్ అయిన 1.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటేస్తాయి. ఈ శతాబ్దం చివరినాటికి 2.5 డిగ్రీల సెల్సియస్ చేరుకుంటాయి. పారిస్ అగ్రిమెంట్ ప్రకారం సాధించదలచిన పూర్వపారిశ్రామిక కాలం నాటికంటే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం సాధ్యమయ్యే పనికాదు.
పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించాలంటే ప్రస్తుతం విడుదలవుతున్న గ్రీన్హౌస్ ఉద్గారాలను ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం నుంచి 45 శాతం తప్పించాల్సి ఉంటుంది.
2050 నాటికి కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను నెట్‌జీరో స్థాయికి (విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్‌ను పూర్తిగా పర్యావరణం శోషించుకునే స్థాయికి చేరడం) తీసుకురావాలి.
అయితే ఈ లక్ష్యాలను సాధించాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్హౌస్ ఉద్గారాల్లో (హరిత గృహ ఉద్గారాలు) నాలుగింట మూడువంతులు (3/4th) విడుదల చేస్తున్న శక్తి ఉత్పాదక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. శిలాజ ఇంధనాల స్థానంలో క్లీన్ ఎనర్జీని ప్రవేశపెట్టాలి. ఆ చర్యల దిశగా కాప్-28 సమావేశాల్లో ఒక కీలక ముందడుగు పడింది. 2050 నాటికి న్యూక్లియర్ ఎనర్జీని ప్రస్తుతం ఉన్న స్థాయికంటే మూడింతలు ఎక్కువ స్థాయికి పెంచడానికి తీర్మానం జరిగింది.
ఈ డిక్లరేషన్ ప్రపంచబ్యాంక్, ప్రపంచ విత్త సంస్థలు, రీజినల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ వంటి రుణ వితరణ సంస్థలను న్యూక్లియర్ ఎనర్జీ సంబంధిత సాంకేతికతలు సమకూర్చుకొనేందుకు ప్రాధాన్యతా రుణాలు అందించాలని కోరింది. ఈ కాప్-28 సమావేశంలో న్యూక్లియర్ ఎనర్జీ ప్రోత్సాహక పరంగా మరో ముందడుగు పడింది. పారిస్ అగ్రిమెంట్ లక్ష్యాలను నిర్ణీతకాల అవధుల్లో సమీక్షించే ‘గ్లోబల్ స్టాక్ టేక్ (జీఎస్టీ)’ పరిగణన అంశాల్లో న్యూక్లియర్ ఎనర్జీని కూడా చేర్చారు. ఒక దేశం పారిస్ ఒప్పంద లక్ష్యాల సాధనపరంగా సాధించిన వృద్ధి గణనలో న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తిని కూడా ఇక నుంచి గణించనుండటంతో ఈ రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది.
కాప్-27 సమావేశంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) ప్రారంభించిన ‘ఆటమ్స్ ఫర్ నెట్ జీరో ఇనిషియేటివ్’ (Atoms for Net Zero Initiative), వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ (WNA), ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ సంయుక్తంగా ప్రారంభించిన ‘నెట్ జీరో ఇనిషియేటివ్’ లను పాలసీపరంగా ముందుకు తీసుకువెళ్లడానికి, న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లకు ఆర్థిక తోడ్పాటుకు సహకరించేందుకు ఒక వేదికగా ప్రత్యేక సదస్సును నిర్వహించాలని కాప్-28 సమావేశ సందర్భంగా నిర్ణయమయ్యింది. దీంతో బెల్జియంలోని బ్రస్సెల్స్ పట్టణంలో మార్చి 2024లో తొలి వరల్డ్ న్యూక్లియర్ ఎనర్జీ సమావేశం జరగనున్నట్లు బెల్జియం ప్రధాని గ్రోస్సీ (Grossi), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో గత మార్చి నెలలో 21న తొలిసారి వరల్డ్ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డిక్రూ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) డైరక్టర్ జనరల్ రఫైల్ గ్రోసీ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. భారత్‌తో సహా 30 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంధన భద్రత కోసం అణుఇంధన ఆవశ్యకత, క్లీన్ ఎనర్జీపరంగా, సుస్థిర ఇంధనపరంగా, పారిస్ ఒప్పంద లక్ష్యాల సాధన పరంగా న్యూక్లియర్ ఎనర్జీ వినియోగాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించాల్సిన అవసరాల సంబంధించి చర్చించి ఒక డిక్లరేషన్‌పై సంతకాలు చేశారు. ఈ సంతకాలు చేసిన దేశాల్లో భారత్, అర్జెంటీనా, అర్మేనియా, బంగ్లాదేశ్, బెల్జియం, బల్గేరియా, కెనడా, చైనా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఈజిప్ట్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, హంగేరీ, ఇటలీ, జపాన్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, పోలాండ్, రొమేనియా, సౌదీ అరేబియా, సెర్బియా, స్లోవేకియా, స్లోవేనియా, సౌత్ కొరియా, స్వీడన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, అమెరికా ఉన్నాయి.
జల విద్యుచ్ఛక్తి తర్వాత అత్యంత శుద్ధమైన శక్తి వనరుగా పేర్కొనే అణు ఇంధనం / న్యూక్లియర్ పవర్ ప్రపంచ వ్యాప్త లోకార్బన్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో 25 శాతం వాటా కలిగి ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు ప్రస్తుతం ఉన్న హరిత గృహ ఉద్గారాల్లో 45 శాతం ఉద్గారాలను తగ్గించాలంటే అన్ని దేశాలకూ జలవిద్యుచ్ఛక్తి తయారీ సాధ్యపడని కారణంగా, వేగంగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరడానికి అణువిద్యుత్ ఉత్పత్తి ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. అయితే అణు విద్యుత్ ఉత్పత్తి విషయంలో కొన్ని సంశయాలు ఉన్నాయి.
అత్యంత ఖరీదైన వ్యవహారం కావడంతో పేద దేశాలు నిర్మాణ వ్యయాన్ని భరించలేకపోవడం, రేడియో ధార్మికత గల అణు ఇంధనాన్ని అణు వ్యర్థాలను చాలా జాగ్రత్తగా నిర్వహించవలసి ఉండటం, గతంలో 2011లో ఫుకుషిమా భూకంపం కారణంగా వచ్చిన సునామీలో ధ్వంసమైన అణు రియాక్టర్లకు సంబంధించిన అణు వ్యర్థాల పారబోత విషయంలో జపాన్ నేటికీ ఎదుర్కొంటున్న సమస్యలు, రష్యాలోని చెర్నోబిల్‌లో 1986లో జరిగిన అణులీకేజీ కారణంగా నేటికీ ఆ ప్రాంతంలో అణు ధార్మికత తొలగకపోవడం వంటి అణు ప్రమాద పర్యవసానాలు దీర్ఘకాలం ఎదుర్కొనే ముప్పు ఈ తరహా ఇంధన వినియోగంలో ఉండటం, అమెరికాలోని ఓహియో ప్రాంతంలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై జరిగిన స్లామర్(Slammer) కంప్యూటర్ వైరస్ దాడి, ఇరాన్లో 2010లో స్టక్స్నెట్ వైరస్‌తో అణు విద్యుత్ రియాక్టర్‌పై దాడి, 2019లో భారత్‌లోని కుడంకుళం న్యూక్లియర్ పవర్‌ప్లాంట్‌లో ఇదే తరహా దాడులు జరిగి ఉండటం, విదేశీ ఉగ్రవాదుల సైబర్ దాడుల ప్రమాదాలు పొంచి ఉండే అవకాశాలు ఈ తరహా ఇంధనానికి ఉండే ప్రధాన లోపాలుగా ఉన్నాయి.
అయితే ఇటీవల కాలంలో అణుధార్మికతను నియంత్రించగల కవచాలు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వంటి వినూత్న సురక్షిత టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో అణువిద్యుత్ ఉత్పత్తి రంగంపై తిరిగి అనేక దేశాలు ఆశక్తి చూపుతున్నాయి. బెల్జియం న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్‌లో కూడా ఈ సురక్షిత టెక్నాలజీ విస్తరణ ఆర్థిక పరంగా ఈ టెక్నాలజీల వినియోగానికి మద్దతు వంటి విషయాలపై సమాలోచనలు జరిగాయి. ఒక గ్రాము అణు ఇంధనం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు సమానమైన విద్యుత్‌ను బొగ్గు ద్వారా ఉత్పత్తి చేయాలంటే 600 కేజీల బొగ్గును వినియోగించడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఉద్గారాలతో పోల్చిన అతి తక్కువ అణు వ్యర్థాలు ఉత్పత్తి అవడం, అతి తక్కువ స్థలంలో అతి తక్కువ కాలంలో నిరంతరం అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పరిశుద్ధ ఇంధనాన్ని, ఎటువంటి కార్బన్ ఉద్గారాలు లేకుండా ఉత్పత్తి చేయగలగడం, తక్కువ పరిమాణంలో అణు ఇంధనాన్ని తీసుకొని దీర్ఘకాలం వినియోగించే సౌలభ్యం ఉండటం, పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చగల సుస్థిర ఇంధన ప్రత్యామ్నాయం అణు విద్యుత్ కావడంతో ఈ ఇంధన వినియోగం దిశగా అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుస్థిర, పరిశుద్ధ ఇంధనంగా ఉన్న న్యూక్లియర్ పవర్ వినియోగాన్ని, వినూత్న భద్రతా ఆవిష్కరణలను ఈ రంగంలో ప్రోత్సహించేందుకు ఒక అంతర్జాతీయ కార్యాచరణ వేదికగా న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్‌కు బెల్జియంలో శ్రీకారం చుట్టారు.
డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు
- శక్తి ఉత్పాదన, పారిశ్రామిక రంగాల నుంచి వచ్చే హరిత గృహవాయువుల నియంత్రణకు ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న వ్యూహాలకు న్యూక్లియర్ ఎనర్జీ వినియోగాన్ని విస్తరించే వ్యూహాన్ని కూడా జతచేయడం. లోకార్బన్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి న్యూక్లియర్ ఎనర్జీ ఉత్తమ మార్గంగా ప్రబోధించడం.
- ఇంధన భద్రతను పెంపొందించడానికి, సుస్థిరాభివృద్ధి, క్లీన్ ఎనర్జీ దిశగా దేశాలు పరివర్తన చెందడానికి న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పాదనను పెంపొందించుకొనే దిశగా సహకరించడం, ప్రోత్సహించడం.
- అణువిద్యుత్ రంగంలో నూతన ఆవిష్కరణలైన ఫ్యుజన్ ఎనర్జీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ (SMRs ) (300 MW Per Unit) వంటి సాంకేతికతల బదిలీ విస్తరణ అనువర్తనాలకు సహకరించడం.
- ఆటమ్స్ ఫర్ నెట్ జీరో ఇనిషియేటివ్, నెట్ జీరో కార్బన్ ఇనిషియేటివ్ వంటి చొరవలను ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ల జీవితకాలం పెంపొందించడానికి, ఆర్థిక సహాయం పెంపొందే దిశగా చర్యలు.
- న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు సంబంధించి వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడం.
- న్యూక్లియర్ పవర్ పెంపొందించడానికి స్వేచ్ఛాయుత పారదర్శక వ్యాపార వాతవణంలో పెంపొందించే దిశగా చర్యలు చేపట్టడం.
బెల్జియం న్యూక్లియర్ సమ్మిట్‌లో భారత్‌వాణి
- ఈ సమ్మిట్‌లో అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రటరీ అయిన డా. అజిత్‌కుమార్ మొహంతీ భారత ప్రతినిధిగా కింది తీర్మానాలను ప్రకటించారు.
1) కాప్-26లో భారత ప్రధాని ప్రవచించిన విధంగా 2070 నాటికి భారతదేశం నెట్‌జీరో ఎమిషన్స్ (నికర సున్నా ఉద్గారాల) లక్ష్యానికి కట్టుబడి ఉంది.
2) ప్రస్తుతం ఉన్న 7.5 మెగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యాన్ని 2030 నాటికి మూడింతలు చేయడం. భారత స్వాతంత్య్ర శతాబ్దిఉత్సవాల నాటికి (2047) ఎలక్ట్రిసిటీ మిల్స్‌లో అణువిద్యుత్‌ను అభిలషణీయ స్థాయికి చేర్చడానికి భారత్ కట్టుబడి ఉంది.
3) భారతదేశం అవలంబిస్తున్న మూడు దశల అణుశక్తి (Three Stage Nuclear Power)కార్యక్రమంలో భాగంగా తొలి దశలో ఇటీవల దేశీయంగా రూపొందించిన (Indegenously Designed) 700 మెగావాట్ల రెండు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్
రియాక్టర్(PHWR)లను ఇటీవల కాక్రపార లో (Unit 3,4) ప్రారంభించారు. అదే విధంగా మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటి మరో 10 రియాక్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభించింది.
4) ఇటీవల రెండో అణుశక్తి కార్యక్రమంలో భాగంగా తొలి దేశీయ ఫాస్ట్ బ్రీడర్
రియాక్టర్లో (500 MW) కోర్ లోడింగ్ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా భారత్ ఒక చారిత్రక మైలురాయిని అధిగమించి తన శాస్త్ర సాంకేతిక, ఇంజినీరింగ్ సామర్థ్యాలను చాటుకుంది.
5. భారతదేశం శాంతియుత అణుశక్తి వినియోగ లక్ష్యాలకు కట్టుబడి ఉంది. అణు భద్రతాపరమైన సురక్షిత విధానాల్లో మంచి ట్రాక్ రికార్డును కలిగి ఉండటంతో పాటు అణుశక్తిని భవిష్యత్ ఇంధనంగా ఇంధన భద్రతాపరంగా, వాతావరణ సంరక్షణ పరంగా అనుకూలమైనదనే విశ్వాసం కలిగి ఉంది. అణుశక్తి అభివృద్ధికి, ఆవిష్కరణలకు, విజ్ఞాన బదిలీకి భారత్ ప్రపంచ దేశాలతో జతకట్టేందుకు సంసిద్ధంగా ఉంది.
మల్లవరపు బాలలత , సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు