POLITY | ఓ బాలికా.. తెలుసుకో నీ రక్షణ
బాలికల రక్షణ
- భారతదేశంలో ఇప్పటికీ ఆచారాలు, సంప్రదాయాలు అమ్మాయిల తలరాతను నిర్దేశిస్తాయి. ప్రపంచం ఎంతో పురోగతి చెందినా సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్నా, ఎన్నో అంశాలు మారినా, అమ్మాయిల పరిస్థితి మారడం లేదు. 21వ శతాబ్దంలో అమ్మాయిలు అన్ని రంగాల్లో పోటీ పడే సామర్థ్యం ఉన్నా, కట్టుబాట్లు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు, పేదరికం ఇలా అనేక అంశాల వల్ల అబ్బాయిలతో సమానంగా పోటీ పడలేకపోతున్నారు.
- ఆడపిల్లలు భగవంతుని అద్భుత సృష్టిలోని భాగాలు. వారు లేకుండా మానవ మనుగడ ఊహాతీతం. అయితే ఈనాటికి ఆడపిల్లల ఉనికి సమాజంలో ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అందరూ పుత్ర సంతానాన్ని కోరుకుంటున్నారు. ఫలితంగా అమ్మాయిల పుట్టుక కుటుంబానికి, సమాజానికి అవాంచితంగా ఉంది. దీంతో చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు.
- బాలికలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు మూల స్తంభాల వంటివారు. వారి హక్కులు, అభివృద్ధి, బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యమైన అంశం.
బాలికలు ఎదుర్కోంటున్న సమస్యలు
లింగ వివక్ష
- సమాజం, కుటుంబం ఈనాటికి బాలికల పట్ల రెండో స్థాయి దృష్టినే కలిగి ఉన్నారు. పితృస్వామ్య వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలు, అధికార పంపిణీ, సామాజిక సంస్థలు లింగ వివక్షకు కారణాలు.
- భారతదేశంలో ఏటా సుమారు కోటి ఇరవై లక్షల మంది బాలికలు జన్మిస్తారు. కానీ వారిలో 15 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి సుమారు 30 లక్షల మంది బాలికలు చనిపోతున్నారు. దీనికి కారణం బాలికల మీద ఉన్న చిన్నచూపే, ప్రేమలో, విద్యలో, ఆస్తిలో, రాజకీయాల్లో, ఉద్యోగాల్లో ప్రతిచోట బాలికలు, మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటున్నారు. లింగ సమానత్వం లేనిదే దేశంలో అభివృద్ధి, సామాజిక మార్పు సాధ్యం కాదు. లింగ సంబంధ సూచీలో 2019లో మొత్తం 129 దేశాలకుగాను భారత్కు 95వ స్థానం దక్కింది.
భ్రూణ హత్యలు - పుట్టిన 30 రోజుల్లో బాలికల మనుగడ బాలుర మనుగడలో 50 శాతం మాత్రమే. దేశంలో లింగ వివక్ష కారణంగా 50 వేల మంది బాలికలు పుట్టకముందే మరణిస్తున్నారు. సమాజంలో స్త్రీలు తగ్గిపోవడం వల్ల లైంగిక హింసలు పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తుంది. దేశంలో ప్రతి 1000 మంది మగవారికి సుమారు 940 మంది స్త్రీలు ఉన్నారు.
బాల్య వివాహాలు - ప్రపంచంలో ఏటా 18 ఏళ్లలోపు 10 మిలియన్ల మంది బాలికలకు వివాహాలు అవుతున్నాయి. దేశంలో ఏటా 12.15 మిలియన్ల బాల్యవివాహాలు జరుగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మూడు మిలియన్ల బాలికలకు 13 ఏళ్లలోపే వివాహాలు చేస్తున్నారు. అందులో 55 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉంటున్నారు. చిన్నవయస్సులో పెళ్లిల్లు చేయడం వల్ల 50 శాతం మంది బాలికలు మరణానికి గురవుతున్నారు.
లైంగిక వేధింపులు-పీడన - శారీరక, మానసిక, లైంగిక వేధింపులు బాలికలపై రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50% దాడులు 16 ఏళ్ల లోపు బాలికలపైనే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, ఢిల్లీలో బాలికలు ఎక్కువ శాతం లైంగిక దోపిడీకి గురవుతున్నారు. బాగా తెలిసినవారు, నమ్మకమున్న వారే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
అపహరణ - జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకారం అపహరణకు గురైన బాలికల్లో 28% మంది 18 ఏళ్లలోపు వారే. గత రెండు దశాబ్దాల నుంచి దేశంలో 5 కోట్ల మంది బాలికలు కనబడకుండాపోయారు. బాలికలను అమ్మడం, విదేశాలకు తరలించడం, మాదకద్రవ్యాల రవాణాలో వాడుకోవడం వంటివి చేస్తున్నారు.
పౌష్టికాహార లోపం - ప్రపంచంలో మూడో వంతు మంది బాలికల మరణాలు పౌష్టికాహార లోపం వల్లనే జరుగుతున్నవి. 48% మంది ఐదేళ్లలోపు బాలికలు మానసిక ఎదుగుదల లేకుండా ఉన్నారు. 43% తక్కువ బరువుతో బాధపడుతున్నవారు ఉన్నారు.
నిర్లక్ష్యం, వివక్ష - అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముగ్గురిలో ఒకరు కనీసం ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయడం లేదు. దేశంలో 15-24 ఏళ్ల వయస్సు గల బాలికలు 96 మిలియన్ల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. 6-13 ఏళ్ల వయస్సున్న బాలికలు చదువు మానేస్తున్నారు. ఐదేళ్లలోపు బాలికలు 38% వివిధ కారణాల వల్ల మనో వైకల్యం కలిగి ఉన్నారు.
బాలికల కోసం రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణలు - లింగ వివక్షను నిరోధించి సామాజిక, ఆర్థిక సమానత్వం, స్వయం నిర్ణయాధికారం, సమాన విద్యాహక్కు, ఉద్యోగ హక్కు కోసం రాజ్యాంగం కొన్ని రక్షణలను కల్పించింది.
అధికరణలు
- 14, 15, 16- కుల, మత, జాతి, లింగ, జన్మస్థలం మొదలైన వాటికి సంబంధించిన వివక్ష నుంచి నిషేధం.
- 21(ఎ)- 6-14 ఏళ్ల వయస్సు ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య
- 23- మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రామికత్వాన్ని నిషేధిస్తుంది
- 24- 14 సంవత్సరాల లోపు పిల్లలు బాలకార్మికులుగా ఉండటాన్ని నిషేధిస్తుంది.
- 39- శ్రమ దోపిడీని, పనికి తగిన వేతనాన్ని పొందలేకపోవడాన్ని, పిల్లలను నిందించడాన్ని, పిల్లలను వయస్సుకు మించిన పనుల్లో పెట్టుకోవడాన్ని నిషేధిస్తుంది.
- 39(ఎఫ్)1- లింగ వివక్ష లేకుండా సమాన, ఆరోగ్యకరమైన వాతావరణంలో వారి స్వేచ్ఛకు, గౌరవానికి అడ్డు రాకుండా వారి బాల్యాన్ని రక్షిస్తూ వారికి సమాన అవకాశాలను కల్పిస్తుంది.
- డా.బీఆర్. అంబేద్కర్ అన్నట్లు ఒక దేశం సాధికారత దిశలో పయనించాలంటే బాలికలు అభివృద్ధి చెందాలి. ఆమె పుట్టుక ఆనందం కావాలి. ఆమెకు పూర్తి భద్రత, ప్రేమ దొరకాలి. ఆమెకు తన శక్తిని నిరూపించుకునే ప్రతి అవకాశం కల్పించాలి. దాని కోసం రాజ్యాంగం రచించిన పై రక్షణలు వారికి కల్పించబడతాయి.
బాలికల రక్షణ – చట్టాలు
- ఎన్.సి.పి.సి.ఆర్ (నేషనల్ కమిషన్ ఫర్ ఆపరేషన్, చైల్డ్ వెల్ఫేర్) బాలికల సంరక్షణ కోసం అనేక చట్టాలను చేసింది.
- బాలిక వివాహ నిషేధ చట్టం 2012
- జువైనల్ చట్టం 1986 (ఈ చట్టం వేశ్యా గృహాల్లో చిక్కుకున్న బాలికలకు రక్షణ, భద్రత, పునరావాస చర్యలను చేపడుతుంది. మాదక ద్రవ్యాలకు, మద్యానికి అలవాటుపడి నైతికంగా హీనమైన జీవితం గడుపుతున్న, నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన బాలికలను రక్షించి వారిని భద్రతా గృహాల్లో ఉంచి అధికారులతో పర్యవేక్షణ చేపడుతుంది.)
- ప్రీనాటల్ డయాగ్నస్టిక్ (జనన పూర్వక లింగ నిర్ధారణ పరీక్షలు) నిషేధ చట్టం-1994
- పోక్సో చట్టం-2016 (బాలికల పట్ల అసభ్య ప్రవర్తన నుంచి అసభ్య రీతిలో వారి ముందు శరీరాన్ని ప్రదర్శించడం నుంచి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.)
- బాలకార్మిక చట్టం 1986, 1983. ఈ చట్టం బాలికలను కొన్ని ప్రత్యేకమైన ఉపాధి పనుల్లో నియమించటం, ప్రమాదకరమైన పనుల్లో నియమించడాన్ని నిషేధిస్తుంది.
- ఉచిత నిర్బంధ విద్య-2009. ఈ చట్టం 6-14 ఏళ్ల బాలబాలికలందరికి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తుంది.
- లైంగిక నేరాల నుంచి బాలబాలికలను రక్షించే చట్టం-2012.
- ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ చట్టం-2000. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్/గర్ల్ చట్టం-1983. బాలికలతో అశ్లీల చిత్రాలు చేయించడం, లైంగికపర ప్రదర్శనల నుంచి రక్షిస్తుంది.
- మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం -1971.
- వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం-1976.
- బాల కార్మికుల రవాణా చట్టం-1961. బాలబాలికలను అక్రమంగా రవాణా చేయడం నుంచి రక్షిస్తుంది.
- మానవ అవయవాల అక్రమ రవాణా నిషేధ చట్టం-1994.
- శారీరక దండనను నిషేధించడానికి ఏరకమైన కేంద్ర చట్టం/శాసనం లేదు. అయితే వివిధ రాష్ర్టాలు శారీరక దండనను నిషేధిస్తూ చట్టాలు చేశాయి.
- జువైనల్ జస్టిస్ చట్టం-2015 బాలబాలికల రక్షణ పరమైన అంశాలను, న్యాయపరమైన ఇబ్బందుల్లో ఉన్న పిల్లల అవసరాలను తీర్చే నిబంధనలను బలోపేతం చేస్తుంది. అంటే అనాథలు, వదిలివేయబడినవారు, లొంగిపోయిన పిల్లలు, తీవ్రమైన, క్రూరమైన నేరాలు చేసిన పిల్లలు ఇందులో చేర్చబడ్డారు.
- అక్రమ మాదకద్రవ్యాల రవాణా, మత్తు పదార్థాల చట్టం-1981. ఈ చట్టం కింద బాలికలకు మాదకద్రవ్యాలను అలవాటు చేయడం, వాటికి వారిని బానిసలుగా మార్చడం, వాటి రవాణా కోసం వారిని వాడటం, విద్యాలయాల్లో వాడటం, మత్తు పదార్థాల విషయాల్లో బాలికలను ఉపయోగించినా, వారిచే అమ్మించడాన్ని నిషేధిస్తుంది.
- మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ చట్టం-1971. చిన్నతనంలో బలవంతంగా గర్భం దాల్చినా, లైంగిక వేధింపుల వల్ల గర్భం దాల్చినా ఆ గర్భాన్ని తొలగించే వీలు కల్పిస్తుంది.
బాలికల రక్షణలో న్యాయ నిబంధనలు
- 1860 భారత శిక్షాస్మృతి బాలికలపై జరిగే అరాచకాలను అడ్డుకోవడానికి కొన్ని న్యాయ నిబంధనలను అడ్డుకోవడానికి కొన్ని న్యాయ నిబంధనలను ఏర్పాటు చేసింది. అవి బాలికలకు చట్టపరమైన రక్షణను
కల్పిస్తాయి. అవి: - సెక్షన్ 66, 67, 67(ఎ), 67(బి) గృహహింస
- సెక్షన్- 302 హత్య
- సెక్షన్ 312- గర్భవతి స్వచ్ఛందంగా గర్భస్రావానికి పాల్పడితే..
- సెక్షన్ 315- భూృణ హత్యలు
- సెక్షన్ 317- 12 ఏళ్ల లోపు బాలికల శరీరాన్ని బహిరంగపర్చడం
- సెక్షన్ 318- బాలికల పుట్టుకను దాచిపెట్టి రహస్యంగా వారిని పారవేయడానికి ప్రయత్నించడం
- సెక్షన్ 354- బాలికలపై వేధింపులు
- సెక్షన్ 363- భిక్షాటన కోసం అపహరణ
- సెక్షన్ 364- అక్రమ సంభోగం కోసం బాలికలను సేకరించడం
- సెక్షన్ 366(ఎ)- బాలికల ఎగుమతి
- సెక్షన్ 366(బి)- బాలికల దిగుమతి
- సెక్షన్ 370, 370(ఎ) మానవ అక్రమ రవాణా
- సెక్షన్ 372- వేశ్యా వృత్తి కోసం బాలికలను కొనడం
- సెక్షన్ 373- వేశ్యా వృత్తి కోసం బాలికలను అమ్మడం
- సెక్షన్ 376- మానభంగం
- సెక్షన్ 509- లైంగిక వేధింపులు
పై నిబంధనలు బాలికలను ఆయా అంశాల నుంచి రక్షిస్తాయి.
చట్టం విధించే శిక్షలు - మానభంగం- ఏడు సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలుశిక్ష, జరిమానా
- బాలికల అపహరణ- 20 ఏళ్ల జైలు శిక్ష (చంపితే జీవితఖైదు)
- బాలికల రవాణా- ఏడు నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష
- బాల్యవివాహాలు- రెండు సంవత్సరాలు కఠిన జైలుశిక్ష, లక్ష వరకు జరిమానా
- బాలికల పట్ల హింస- ఏడాది వరకు జైలు, జరిమానా
- లైంగిక వేధింపులు, హింస- ఏడాది నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు, జరిమానా. మళ్లీ వేధిస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు, జరిమానా
- బాలికల అసభ్య, అశ్లీల చిత్రాలు తీయటం- కేసు తీవ్రతను బట్టి మూడు నెలలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష
- గృహ హింస- మూడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలుశిక్ష, జరిమానా.
- లైంగిక దాడి- మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష
- భారతదేశంలో బాలికల సంరక్షణ విధానం (యాక్షన్ ఎయిడ్ అసోసియేషన్) చర్య, చికిత్స అనే నూతన పద్ధతిని యు.ఎన్.సి.ర్.ఎల్. సూత్రాల కింద కల్పించింది. అన్ని స్థాయిల్లో వారి విషయంలో జోక్యం చేసుకొని వారికి సంరక్షణ కల్పిస్తుంది. అంతేగాక వారికి శిక్షణ తరగతులు, నైపుణ్య అభివృద్ధి వేదికల ద్వారా వారి హక్కులపై జరిగే ఏ విధమైన ఉల్లంఘనలకు వ్యతిరేకంగా సవాలు చేయడానికి సాధికారత కలిగించే విధంగా, బాల్య వివాహాలు, బాలికల హక్కులు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్న సాంఘిక ఆచారాలు, బాల నేరస్థులు, బాలికల అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా సవాలు చేసేలా యాక్షన్ ఎయిడ్ అసోసియేషన్ బృందం వారు పని చేస్తున్నారు. సురక్షిత స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తారు.
- ఎన్.సి.పి.సి.ఆర్ బాలబాలికలకు సంబంధించి వారిపై జరిగే నేరాలు, అకృత్యాలను నిరోధించి వారికి రక్షణ కల్పించే విధంగా చట్టాలను చేస్తుంది.
యోజన మాస పత్రిక సౌజన్యంతో..
Previous article
Government Jobs 2023 | 470 పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు