Indian history | వాస్కోడిగామ మార్గం.. వర్తకమే ప్రధానం
యూరోపియన్ల రాక
- క్రీ.శ. 1453లో తురుష్కులు రెండో మహమ్మద్ జైజాంటియన్ రాజ్యాన్ని ఓడించి ప్రధాన నగరమైన కాన్‌స్టాంట్‌నోపుల్ నగరాన్ని ఆక్రమించుకొన్న తర్వాత ఆ నగరం గుండా పాశ్చాత్యులు తూర్పు దేశాలకు వెళ్లడాన్ని నిషేధించారు. అందువల్ల పాశ్చాత్యులు తూర్పు దేశాలతో వ్యాపారం కోసం కొత్తగా సముద్రమార్గం కనుగొన్నారు. వారిలో మొదటగా పోర్చుగీసు, డచ్చివారు, డేన్లు, ఇంగ్లిష్‌వారు చివరగా ఫ్రెంచివారు భారతదేశం వచ్చారు.
పోర్చుగీసువారు
- భారతదేశంలో వ్యాపార కేంద్రాలను స్థాపించిన మొదటి యూరోపియన్ దేశం పోర్చుగల్. నూతన మార్గాల అన్వేషణలో ఆసక్తి చూపిన పోర్చుగీసు రాజు హెన్రీ ది నావిగేటర్. 1487లో పోర్చుగీసు నావికుడు బార్తలోమియా డోమిజ ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి పయనించి ఆఫ్రికా అగ్రాన్ని చేరి తుఫానులు ఎక్కువగా ఉన్నందున వెనుకకు వెళ్లిపోయాడు. ఈ తుఫానుల అగ్రాన్ని పోర్చుగీసు రాజు రెండో జాన్ గుడ్‌హోప్ అగ్రమని పేరు పెట్టాడు.
- తర్వాత రాజైన ఇమాన్యుయెల్ దగ్గరి బంధువు వాస్కోడిగామాను తూర్పు దేశాలకు నౌకామార్గం కనుగొనేందుకు పంపాడు. ఆ విధంగా వచ్చిన వాస్కోడిగామా 1498, మే 17న తాకిన తొలిరేవు కాలికట్ (కేరళ). అప్పటి కాలికట్, కొచ్చిన్, కన్ననూర్ ప్రాంతాల్లో వ్యాపారానికి అనుమతి ఇచ్చాడు.
- భారత గడ్డపై పోర్చుగీసువారి తొలికోట కొచ్చిన్, వాస్కోడిగామా రెండోసారి 1503లో వచ్చి ఏర్పరచిన స్థావరం కన్ననూర్.
- 1505లో పోర్చుగీసువారు భారతదేశంలోని తమ స్థావరాలను రక్షించుకోవడానికి నియమించిన మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్-డి-ఆల్మడా (1505-09) సముద్రాధిపత్యానికి ఆసక్తి చూపడం వల్ల ఇతని విధానాన్ని నీలి నీటి విధానంగా చెప్తారు.
- ఆల్మడా మరణానంతరం పోర్చుగీసు గవర్నర్లలో అత్యంత సమర్థుడు ఆల్ఫెన్సోడి ఆల్బూకర్క్ (1509-15) వచ్చాడు. ఇతడు మొదటగా 1510లో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల సాయంతో బీజాపూర్ నుంచి గోవాను పొందాడు. అదేవిధంగా 1515లో పర్షియా అగాధంలోని ఆర్మజ్ను వశపరచుకున్నాడు.
- ఆల్బూకర్క్ ముఖ్యంగా భూ ప్రాంతాల ఆక్రమణకు, విజయనగర రాజులతో సత్ సంబంధాలు నడిపి, భారతీయ స్త్రీలను వివాహమాడే విధానం ప్రారంభించాడు.
- అల్బూకర్క్ తర్వాత వచ్చిన ప్రముఖ గవర్నర్లలో నూనోడి కన్హ (1529-38) పోర్చుగీసువారి మొదటి ప్రధాన స్థావరం అయిన కొచ్చిన్ నుంచి గోవాకు మార్చారు. కన్వా గుజరాత్ పాలకుడు బహదూర్షా నుంచి డయ్యూ, బెస్సిన్లను పొందాడు.
- పోర్చుగల్ నుంచి భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి వచ్చిన మొదటి జెసూట్ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ (1542) కృషివల్ల క్రైస్తవం స్వీకరించిన తొలి మలబార్ తీరవాసులు పరదర్లు, ముక్కదలు (చేపలు పట్టేవారు).
- పోర్చుగీసువారు భారతదేశంలో ప్రధానంగా వ్యాపారం చేసిన వస్తువులు సుగంధ ద్రవ్యాలు, మిరియాలు
- అరేబియా తీరంలో పోర్చుగీసుల స్థావరాలు కొచ్చిన్, గోవా, డయ్యూ, డామన్, బేసిన్. అదేవిధంగా బెంగాల్ తీరంలోని పోర్చుగీసు స్థావరాలు సౌత్గోవాన్, చిట్టగాంగ్, హుగ్లీ.
- మొఘల్ చక్రవర్తి షాజహాన్ పోర్చుగీసువారి ఆధీనంలో ఉన్న హుగ్లీని ఆక్రమించి పోర్చుగీసు వారిని శిక్షించాడు. అదేవిధంగా పోర్చుగీసువారు భారతదేశంలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ 1556లో గోవాలో ప్రారంభించారు.
పోర్చుగీసువారి పతనానికి కారణాలు - పోర్చుగల్ దేశం భారతదేశంలో దండయాత్రలకు తగు ధనాన్ని చేకూర్చలేకపోయింది. దీనికి తోడు పోర్చుగల్ ఆసక్తి భారతదేశంలోని స్థావరాని కన్నా దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌పై ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడి వారి అధికారం సన్నగిల్లింది.
- దీనికితోడు తళ్లికోట యుద్ధానంతరం విజయనగర రాజుల పతనం మూలంగా పోర్చుగీసువారికి తగు రక్షణ లోపించి, వారి అధికారం సన్నగిల్లింది. కాని గోవా, డయ్యూ, డామన్లు మాత్రం పోర్చుగీసువారి అధికారం కింద చాలా కాలం కొనసాగాయి.
- ఇవి 1961లో భారతదేశంలో విలీనమయ్యాయి.
డచ్చివారు
- పోర్చుగీసు వారి తర్వాత భారత్‌లో ప్రవేశించిన యూరోపియన్లు డచ్చివారు. డచ్చివారి ప్రత్యేకత తూర్పువైపు సముద్రమార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించడం. డచ్చి ప్రభుత్వం (నెదర్లాండ్స్) 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి తూర్పు దేశాలకు వ్యాపార నిమిత్తం వచ్చారు.
- మచిలీపట్నం (1605), నెల్లూరు వద్ద పులికాట్ (1610) డచ్చివారి ప్రధాన స్థావరాలు. తర్వాత 1658 నాటికి మద్రాసు తీరంలోని నాగపట్నం వద్ద డచ్చి స్థావరాలు ఏర్పాటయ్యాయి. పులికాట్ పోర్చుగీసువారి ప్రధాన కోట గెల్ డ్రియల్ కోట.
- డేన్లు
- డచ్చివారి తర్వాత భారతదేశం వచ్చిన యూరోపియన్లు డేన్లు. వీరు డెన్మార్క్ దేశానికి చెందినవారు. భారతదేశం డేన్ల వర్తక స్థావరాలు తంజావూర్ సమీపంలో ట్రాంక్వీబార్, బెంగాల్ సమీపంలో ప్రధాన స్థావరంగా ఉన్న శ్రీరామ్‌పూర్ డేన్లు తమ స్థావరాలను ఆంగ్లేయులకు అమ్మేశారు.
ఇంగ్లిష్‌వారు
- అప్పటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ అనుమతి పొంది ఇంగ్లిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కొంతమంది లండన్ వర్తకులు 1600, డిసెంబర్ 31న స్థాపించారు. ఇది పూర్తిగా ప్రైవేటు సంస్థ. ఈమె తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి కంపెనీకి 15 సంవత్సరాలకు అనుమతి ఇచ్చింది.
- భారతదేశంలో అడుగుపెట్టిన మొదటి ఆంగ్లేయుడు ఫాదర్ థామస్ స్టీవెన్స్. ఈయన 40 సంవత్సరాలు గోవాలో ఉండి కొంకణి భాషను నేర్చుకొని ఆ భాషలో పద్యకావ్యాలు, వ్యాకరణం రాసిన గొప్పవాడు. అదేవిధంగా 1603లో అక్బరును బ్రిటిష్ ప్రతినిధి మిల్డెన్ హాల్ కలుసుకున్నాడు.
- ఈస్టిండియా కంపెనీకి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి నిరవధికంగా హక్కు కల్పించిన బ్రిటిష్ చక్రవర్తి మొదటి జేమ్స్. ఇతడు ఈస్టిండియా కంపెనీ తరఫున భారత్‌కు పంపిన రాయబారి. 1608లో జహంగీర్ కొలువుకు వచ్చిన కెప్టెన్ హాకిన్స్ వర్తకం కోసం సూరత్‌ను కోరాడు. కానీ అప్పటికి పోర్చుగీసువారి ప్రాబల్యం వల్ల సూరత్‌ను పొందలేక వెనుదిరిగాడు.
- రెండో వ్యక్తిగా సర్ థామస్ రో 1615లో జహంగీర్ కొలువుకు వచ్చి జహంగీర్ నుంచి పన్నులు లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సూరత్‌ను పొందాడు. బ్రిటిష్‌వారు పొందిన మొదటి వర్తక స్థావరం సూరత్.
- దక్షిణాదిన బ్రిటిష్ వారి తొలి స్థావరం మచిలీపట్నం. ఇది 1611లో గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులికుతుబ్షాచే (1580-1612) కెప్టెన్ హిప్పన్కు ఇచ్చారు. హిప్పన్ నౌక పేరు గ్లోబు.
- ఇంగ్లిష్‌వారు గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షాకు సాలుకు 500 పగోడాలు చెల్లించడం ద్వారా దిగుమతి సరకులపై సుంకం చెల్లించనవసరం లేకుండా పొందిన ఫర్మానా గోల్డెన్ ఫర్మానా.
- కంపెనీ అధికారి ఫ్రాన్సిస్ డే 1639లో మద్రాసు ప్రాంతాన్ని చంద్రగిరి రాజు నుంచి కొనుగోలు చేసి, 1641లో మద్రాసులో సెయింట్ జార్జి కోట నిర్మించారు. అప్పటికి ప్రధాన కేంద్రంగా ఉన్న మచిలీపట్నం నుంచి మద్రాసును తూర్పునకు ప్రధాన కేంద్రంగా మార్చారు.
- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హుగ్లీనది తీరంలో బహుమానంగా ఇచ్చిన కొంత భూమిని కంపెనీవారు ఖరీదు చేసి కలకత్తా నగరాన్ని నిర్మించారు. 1691లో జాబ్ చార్నోక్ కలకత్తా నగరానికి పథకాలు ఖరారు చేశాడు. తర్వాత కలకత్తాలో పోర్టు విలియం కోటను నిర్మించారు. చేరువలోని సుత్నుతి, గోవిందపూర్, కాళిఘాట్ అనే గ్రామాలను బ్రిటిష్ వర్తక సంఘం కొని నగరాన్ని అభివృద్ధి చేసింది. కాళీఘాట్ పేరు మీదుగా కలకత్తా అనే పేరు వచ్చింది.
- ప్రస్తుతం బొంబాయిగా ఉన్న దీవిని 1667లో కంపెనీ బ్రిటిష్ రాజైన ఛార్లెస్ నుంచి కౌలుకు తీసుకొని ఆక్సన్డన్ అనే అధికారి బొంబాయిని గొప్ప కేంద్రంగా తీర్చిదిద్దాడు. పశ్చిమ తీరంలో బొంబాయి ప్రధాన వర్తక కేంద్రంగా ఉంది.
ఫ్రెంచివారు
- వర్తకానికి భారతదేశంలో ప్రవేశించిన యూరోపియన్లలో ఆఖరివారు ఫ్రెంచివారు. 1664లో ఫ్రాన్సు చక్రవర్తి 14 లూయీ మంత్రి కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీని ఏర్పాటు చేశాడు. ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ తరఫున భారత్‌కు వచ్చిన తొలి రాయబారి ఫ్రాన్సిస్ కారన్ (1668).
- దేశంలో తొలి ఫ్రెంచి స్థావరం సూరత్‌ను 1668లో స్థాపించారు. 1669లో మీరాకారా అనే ఫ్రెంచి అధికారి మచిలీపట్నంను స్థావరంగా చేసుకున్నాడు.
- ఫ్రెంచివారు వాలికొండపురం ప్రతినిధి షేర్‌ఖాన్ నుంచి పాండిచ్చేరిని పొంది తరువాత ప్రధాన స్థావరంగా మార్చుకున్నారు.
- అదేవిధంగా బెంగాల్ గవర్నర్ షాయిస్తఖాన్ నుంచి బాలాసోర్, చంద్రనగర్, కాశింబజార్ పొంది, పాండిచ్చేరిలో పోర్ట్లూయిస్ కోటను నిర్మించారు.
- చివరగా కర్ణాటక యుద్ధాలతో బ్రిటిష్‌వారి చేతిలో ఓడిపోయి ఫ్రెంచివారు తమ ప్రాబల్యం కోల్పోయారు.
పీష్వాల యుగం
- మహారాష్ట్ర చరిత్రలో పీష్వాల యుగం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. వీరి కాలంలో మహారాష్ట్ర ప్రాబల్యం, ఆసేతు హిమాలయాల వరకు విస్తరించింది.
బాలాజీ విశ్వనాథ్ 1713-1720 - సాహు నుంచి పరిపాలనా అధికారాన్ని వంశపారంపర్య హక్కులతో పొందినప్పుడు బాలాజీ విశ్వనాథ్ ఇతడు చిత్పవన వంశానికి చెందిన బ్రాహ్మణుడు. ఇతని పూర్వికులు జింజిరా రాజ్యంలోని శ్రీవర్ధన్ ప్రాంతానికి చెందినవారు.
- బాలాజీ విశ్వనాథ్, మొఘలులతో సత్సంబంధాలు పెట్టుకొని మొఘల్ రాకుమార్తె జీనత్ ఉన్నిసా మెప్పును పొందాడు.
- సాహు మొఘల్ చెర నుంచి విముక్తుడై మహారాష్ట్ర చేరుకున్నప్పుడు బాలాజీ విశ్వనాథ్ అతడికి కుడి భుజంగా నిలిచి అతన్ని రాజుగా చేయడానికి తోడ్పడ్డాడు. ఇతడి శక్తి సామర్థ్యాలు, రాజభక్తిని గుర్తించిన సాహు 1713, నవంబర్ 16న బాలాజీని పీష్వాగా నియమించాడు. బాలాజీ విశ్వనాథ్‌ను మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడిగా చెప్పవచ్చు.
- బాలాజీ విశ్వనాథ్ 1714లో మొఘలులతో సంధి చేసుకొని దక్కన్‌లోని చౌత్, సర్దేశ్ముఖ్లను వసూలు చేసుకొనే హక్కు పొందాడు. ఈ సంధిలో మొఘలుల తరఫున ముఖ్యపాత్ర వహించినవారు సయ్యద్ సోదరులు. అదేవిధంగా మొఘల్ చక్రవర్తి ఫరూఖ్సియార్ను పతనం చెయ్యడంలో సయ్యద్ సోదరులకు సాయం అందించినవాడు బాలాజీ విశ్వనాథ్.
- రాజారాం కాలంలో ప్రారంభించబడిన జాగీర్దారీ విధానం, బాలాజీ విశ్వనాథ్ కాలంలో విస్తృతం చేయబడి మహారాష్ట్ర రాజ్యం వివిధ భాగాలుగా విభజించబడి మహారాష్ట్ర కూటమి అనే వ్యవస్థగా ఏర్పడి ఎవరికి వారు స్వతంత్రం ప్రకటించుకునే స్థాయికి వచ్చింది. ఇదే కూటమి చివరికి మహారాష్ట్ర పతనానికి కారణం అయింది.
- బాలాజీ విశ్వనాథ్‌ను సాహు ‘అతుల పరాక్రమ సేవక’ అని అభినందించాడు. ఇతడు తారాబాయితో వార్నా సంధి చేసుకున్నాడు. విశ్వనాథ్ 1720, ఏప్రిల్ 2న అకస్మాత్తుగా మరణించాడు.
పీష్వా మొదటి బాజీరావు
- బాలాజీ విశ్వనాథ్ పెద్ద కుమారుడు బాజీరావు. మహారాష్ట్ర చరిత్రలో శివాజీ తర్వాత చెప్పుకోదగ్గ యోధుడు. ఇతడి తెలివి తేటల్లో, శక్తి సామర్థ్యాల్లో నమ్మకం ఉన్న సాహు ఇతడిని పీష్వాగా నియమించాడు. ఇతడి సోదరుడు చిమ్నాజీ అప్పా పరిపాలనలో సహకరించాడు. మొదటి బాజీరావ్ ‘హిందు పద్ పద్ షాహీ’ స్థాపించడం ఆశయంగా పెట్టుకున్నాడు.
- మొదటి బాజీరావు దక్కన్ సుబేదార్ అయిన నిజాం-ఉల్-ముల్క్తో మూడు యుద్ధాలు చేసి నిజాంని ఓడించి మూడు సంధి షరతులకు ఒప్పించాడు.
- 1728లో పీష్వా బాజీరావు, నిజాం ఉల్ ముల్క్‌ను పాల్కెడ్ వద్ద ఓడించి ఘోర పరాభవానికి గురి చేశాడు.
- పాల్కెడ్ యుద్ధంలో ఓడిపోయిన నిజాం 1728లో ముంగిషివగావాన్ సంధి చేసుకున్నాడు.
- నిజాం రెండోసారి బాజీరావుతో 1731లో సూరత్ యుద్ధంలో ఓడిపోయి 1732లో రోహారామేశ్వర్ సంధి చేసుకున్నాడు.
- మహారాష్ట్ర దాడులను ఎదుర్కొనే సమర్థత ఒక్క నిజాంకే ఉందని భావించిన మొఘల్ చక్రవర్తి మహ్మద్‌షా నిజాంను ఢిల్లీకి రప్పించి, అతనికి అసఫ్‌జా అనే బిరుదు ప్రసాదించి తగిన సహాయ సంపత్తిని కలిగించి మహారాష్ర్టులను ఎదుర్కోవడానికి ఆదేశించాడు. బాజీరావు చేతిలో చారిత్రాత్మకమైన భోపాల్ యుద్ధం 1738లో నిజాం ఓడిపోయి 1738, జనవరి 17న దోరాహ్ సంధి చేసుకున్నాడు.
- సాహు గురువు బ్రహ్మేంద్రస్వామి స్థాపించిన పరశురామ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన జింజిరా సిద్ధిలను కూడా ఓడించాడు. మాళ్వా సుబేదార్ గిరిధర్ బహదూర్‌ను ఓడించి చంపివేశాడు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Previous article
Indian Geography | దేశంలో తుఫానులు ఎక్కువగా సంభవించే నెలలు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు