General Studies | పోటెత్తే అలలు.. ముంచెత్తే కెరటాలు
సునామీలు
(Tsunami)
ఒకదాని తర్వాత ఒకటి తీరప్రాంతాన్ని ముంచెత్తే ఎత్తైన అలల పరంపరనే సునామీ అంటారు. సునామీ అనేది జపనీస్ పదం. సునామీ అంటే తీర కెరటం అని అర్థం. ‘సు’ అంటే తీరం, ‘నామి’ అంటే కెరటం. దీన్నే హార్బర్ వేవ్ అని పిలుస్తారు. 1962 నుంచి అధికారికంగా ఈ సునామీ పదాన్ని వాడుతున్నారు. 80 శాతం సునామీలు పసిఫిక్ మహా సముద్రంలోనే ఏర్పడతాయి.
- సునామీ అనే పదాన్ని సార్వత్రికంగా వినియోగించేందుకు 1963లో అమెరికాలోని హవాయిలో జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సులో ఒప్పందం చేసుకున్నారు.
- సునామీ తరంగాలనే Wave Trains అంటారు. ప్రపంచంలో 80 శాతం సునామీలు అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలు సంభవించే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో సంభవిస్తాయి. భారత తీరప్రాంతాలను సునామీ తరంగాలు తాకాలంటే భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదు కావాలి.
- సముద్రాల్లో వచ్చే అన్ని భూకంపాలు సునామీలను ఏర్పరచవు. ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు మాత్రమే ఏర్పరుస్తాయి.
- భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో ఉంది.
- ఆంధ్రప్రదేశ్ సునామీ దుర్బలత్వం ఎక్కువగా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల మధ్య తీర ప్రాంతం వెంబడి ఉంది.
- INCOIS (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. ఈ కేంద్రాన్ని 3 ఫిబ్రవరి 1999లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
- పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్ర కార్యాలయం హవాయిలోని ఇవా బీచ్ వద్ద 1948లో ఏర్పాటు చేశారు.
- అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం (International Tsunami In formation Centre-ITIC)ను హవాయి రాష్ట్రంలోని హొనలులు నగరంలో ఏర్పాటు చేశారు.
- పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూపు (International Coordination Group for the Tsunami Warning System in the Pacific- ICGITSU) కేంద్ర కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఉంది.
- 2004లో సంభవించిన ఇండోనేషియా సునామీ చాలా దేశాల మీద తీవ్ర ప్రభావం చూపింది.
- 2011లో పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన జపాన్ సునామీ జపాన్ దేశాన్ని తీవ్రంగా నష్టపరిచింది.
- సునామీని వాటర్ బాంబ్ అని కూడా పిలుస్తారు.
- 2022 జనవరి 15న టాంగోలో హంగా హపాయి దీవిలో అగ్నిపర్వతం బద్దలై టాంగో, ఫిజీ దేశాల్లో సునామీ (పసిఫిక్ మహాసముద్రంలో) సంభవించింది. సముద్రపు అలలు దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు ఏర్పడి సునామీ సంభవించింది.
- సునామీ నీటి అలలు గంటకు 800 కి.మీ. కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తాయి. కాబట్టి ఆ అలల తాకిడికి తీర ప్రాంతాలు చాలా వరకు కోతకు గురై తీవ్రంగా నష్టపోతాయి.
- సునామీ అలలు దాదాపు 30 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి.
- చరిత్రలో నమోదైన మొట్టమొదటి సునామీ ఏజియన్ సముద్రంలో క్రీ.పూ.479లో సంభవించింది. అమెరికాకు చెందిన హెక్ 1934లో సునామీలకు చెందిన మొట్టమొదటి జాబితాను రూపొందించాడు. ఆ తర్వాత 1947లో క్రీ.పూ. 479 నుంచి క్రీ.శ. 1946 వరకు సంభవించిన 479 సునామీల వివరాలను సేకరించారు.
సునామీ కారణాలు
l సునామీలు ప్రధానంగా ఐదు కారణాల వల్ల సంభవిస్తాయి.
1. భూకంపంతో పాటు వచ్చే భ్రంశ చలనాలు
2. జలాంతర్గత భూకంపాలు
3. భూపాతం సముద్రంలో
4. సముద్రంలో అగ్నిపర్వత విస్ఫోటనం
5. సముద్రంలో ఉల్కాపాతం, ఆస్టరాయిడ్స్ పడినప్పుడు
సునామీ వ్యాప్తి
- సముద్రంలో సాధారణంగా తరంగ దైర్ఘ్యం 100 నుంచి 200మీటర్లు ఉండి రెండు తరంగాల మధ్య కాలవ్యవధి తేడా 5 నుంచి 20 సెకన్లు ఉంటుంది.
- సునామీలు తీర ప్రాంతానికి వచ్చేటప్పటికి వరుస కలిగిన తరంగాలుగా ఉండి శ్రేణులు, ద్రోణులను కలిగి ఉంటుంది. సునామీల మధ్య కాల వ్యవధిలో తేడా 10 నుంచి 45 నిమిషాలు, వీటి తరంగ దైర్ఘ్యం 500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
- ఇవి సముద్రపు లోతు కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సునామీలు గాధ నీటి తరంగాల లక్షణాలను కలిగి ఉంటాయి. సునామీల తరంగ దైర్ఘ్యంతో పోల్చినప్పుడు సముద్రపు లోతు చాలా తక్కువగా ఉంటుంది.
- లోతైన సముద్రాల్లో సునామీ తరంగం కంపన పరిమితి సాధారణంగా 1 మీటరు కంటే తక్కువగా ఉంటుంది.
- సునామీలు పొడవైన తరంగాలుగా ఉంటే తక్కువ కంపన పరిమితి కలిగి ఉంటాయి. వీటిని ఉపరితలం నుంచి చూడలేం.
- వివిధ కారణాల వల్ల సునామీ తీవ్రత
- సముద్ర గర్భంలో భూకంపం వల్ల-75 శాతం
- అగ్ని పర్వతాల విస్ఫోటనం వల్ల- 5 శాతం
- సముద్రంలో భూమి కుంగిపోవడం వల్ల -5 శాతం
- వాతావరణంలో ప్రతికూల మార్పుల వల్ల- 2 శాతం
- తెలియని కారణాల వల్ల -10 శాతం
- శాస్త్రవేత్తలు భూకంపాలను ఏ విధంగా ముందుగా కచ్చితంగా అంచనా వేయలేరో అదేవిధంగా సునామీలు కూడా ఎప్పుడు ఏర్పడతాయో నిర్దిష్టంగా అంచనా వేయలేరు.
అంతర్జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థలు
పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్
- దీన్నే అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అంటారు. 1946లో వచ్చిన హిలో సునామీ అనంతరం అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో హవాయిలోని ఇవా బీచ్ వద్ద 1948లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ - దీన్ని యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ (IOC) ఆధ్వర్యంలో 1965లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఉన్న హొనలులు నగరంలో ఉంది.
అలస్కా సునామీ వార్నింగ్ సెంటర్ - అమెరికాలోని అలస్కా పశ్చిమ తీరంలో పాల్మర్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.
- నవంబర్ 5ను ప్రపంచ సునామీ అవగాహన దినంగా ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2015 డిసెంబర్లో ప్రకటించింది.
భారత సునామీ హెచ్చరిక వ్యవస్థ - 2004 డిసెంబర్ 26న సుమత్రా భూకంపం సంభవించిన తర్వాత భారత ప్రభుత్వం హైదరాబాద్‌లో జాతీయ సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసింది.
- ఈ కేంద్రాన్ని 2007 అక్టోబర్ 15న ప్రారంభించారు. దేశంలోని అన్ని తీరాల్లో ముందుగానే సునామీ సంభవించే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిస్తుంది.
- పసిఫిక్, హిందూ మహా సముద్రాలతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల అలల తీరు, సముద్ర గర్భంలోని పీడన స్థాయిలను ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లో ఉన్న INCOIS అంచనా వేస్తుంది.
భారత్‌లో సునామీలు
- దేశంలో మొట్టమొదటి సునామీ 326 B.Cలో కచ్ ప్రాంతంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చినట్లు రికార్డుల్లో ఉంది.
- 1883లో ఇండోనేషియాలో కాక్రటోవా అగ్ని పర్వతం బద్దలైనప్పుడు చెన్నైలో సునామీ వచ్చింది.
- 1945లో పాకిస్థాన్‌లోని దక్షిణ కరాచీకి 70 కిలోమీటర్ల దూరంలో 8.25 పాయింట్ల తీవ్రత కలిగిన భూకంపం సంభవించి 11 మీటర్ల ఎత్తైన అలలతో సునామీలు ఏర్పడి కచ్ ప్రాంతం వరకు విస్తరించింది.
చెన్నై సునామీ-2004
- ఈ సునామీ ప్రభావం ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, భారతదేశం, థాయిలాండ్, మయన్మార్ దేశాలపై ఎక్కువగా ఉంది. దీన్నే బాక్సింగ్ డే సునామీ అంటారు.
- భారత్‌లో ఈ సునామీకి గురైన రాష్ర్టాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, అండమాన్-నికోబార్ దీవులు, పాండిచ్చేరి.
- దీని వల్ల సుమారు 2,50,000 మంది మరణించారు. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది.
- దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో 8000 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 6000 మంది, పాండిచ్చేరిలో 508 మంది మరణించారు. ఈ సునామీ తమిళనాడుపై త్రీవ ప్రభావం చూపింది.
ప్రాక్టీస్ బిట్స్
1. సునామీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
1) జపనీస్ 2) రష్యన్
3) అరబిక్ 4) ఫ్రెంచి
2. సునామీలు తరచూ ఏ కోస్తా ప్రదేశాల్లో వస్తాయి?
1) తూర్పు కోస్తా ప్రాంతం
2) మలబారు రేవు
3) గల్ఫ్ ఆఫ్ కంబాట్
4) రాణ్ ఆఫ్ కచ్
3. సముద్రంలోపల భూకంపాల వల్ల ఏర్పడేవి?
1) అగ్ని పర్వతాలు 2) భూతాపాలు
3) సునామీలు 4) వరదలు
4. ఏ రిపోర్టుల నుంచి ఇండియన్ సునామీ గురించి బాగా పాత రికార్డులు లభించాయి?
1) 1941 భూకంపం
2) 286 బి.సి. భూకంపం
3) 316 బి.సి. భూకంపం
4) 326 బి. సి. భూకంపం
5. ఏ సముద్రంలో సునామీలు ఎక్కువగా సంభవిస్తాయి?
1) హిందూ 2) అట్లాంటిక్
3) పసిఫిక్ 4) మధ్యధరా
6. ఏ రోజున సముద్రంలోపల తీవ్ర భూకంపం సునామీకి దారితీసి జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని తాకి 19,000 మంది మరణానికి కారణమైంది?
1) 11.3.2011 2) 14.2.2011
3) 11.1.2011 4) 14.3.2010
7. నీటి లోతును బట్టి సునామీ గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?
1) 600-800 కిలోమీటర్లు
2) 900-1100 కిలోమీటర్లు
3) 800-900 కిలోమీటర్లు
4) 950-1150 కిలోమీటర్లు
8. సునామీ అలలు దేనివల్ల ఉద్భవిస్తాయి?
1) సముద్ర గర్భ భూకంపాలు
2) అగ్ని పర్వత సంబంధ పగుళ్లు
3) భూతాపాలు 4) పైవన్నీ
9. 11.3.2012 నాటికి ఏ దేశపు భూకంపం, సునామీ వల్ల వేలాదిమంది చనిపోయి ఒక సంవత్సరం అయింది?
1) మెక్సికో 2) ఫిలిప్పైన్స్
3) ఇండోనేషియా 4) జపాన్
సమాధానాలు
1. 1 2. 1 3. 3 4. 4
5. 3 6. 1 7. 1 8. 4
9. 4
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు