గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సే
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ (Chat GPT) అనే పేరు బాగా వినిపిస్తుంది. ఇది ప్రస్తుత టెక్నో వరల్డ్‌లో సంచలన పదం (బజ్ వర్డ్) కూడా.
చాట్ జీపీటీ అంటే ముందస్తు శిక్షణ/ట్రెయినింగ్ ఇస్తే దేని గురించైనా మనుషులకు కావలసినట్లు సంభాషించగలదు. వ్యాకరణ తప్పిదాలను గుర్తించడం, వాక్యాలను సరిచేయడం, అనువదించడం, అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడం, ప్రోగ్రామ్స్ రాసి ఇవ్వడం, అన్ని సబ్జెక్టులకు సంబంధిత సమస్యలను క్షణాల్లోనే పరిష్కరించి అందించడం దీని ప్రత్యేకత. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీనికింత డిమాండ్ ఏర్పడింది. చాలా క్రియేటివ్‌గా, ఇంటెలిజెంట్‌గా ఇది ఇచ్చే సమాధానాలకు నెటిజన్లు ఆశ్చర్యంతో ఫిదా అయిపోతున్నారు. కేవలం ఐదు రోజుల్లోనే ఒక మిలియన్ యూజర్స్‌ని సంపాదించి చాట్ జీపీటీ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో పడేసింది. నెట్‌ఫ్లిక్స్ ఒక మిలియన్ యూజర్స్‌ను చేరుకోవడానికి మూడున్నర ఏండ్లు, ఫేస్‌బుక్‌కి పదినెలలు, స్పాటీఫైకి ఐదు నెలలు, ఐఫోన్‌కు డెభ్బై నాలుగు రోజులు పట్టింది. అయితే చాట్ జీపీటీకి మాత్రం కేవలం ఐదు రోజులే పట్టడం గమనార్హం. అత్యధికులు ఈ చాట్ జీపీటీ గురించి తెలుసుకోవడం ఆరంభంలోనే ఇది సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు.
అసలేంటి ఈ చాట్ జీపీటీ?
చాట్ జీపీటీ అంటే ‘జనరేటివ్ ప్రీ ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్’. అంటే ప్రీ ట్రెయినింగ్ ఇస్తే ఇది దేని గురించైనా మనుషులకు కావల్సినట్లు సంభాషించగలదు. దీన్ని ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Open AI) అనే అంకుర సంస్థ వాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించారు. ఈ అంకుర సంస్థలో మైక్రోసాఫ్ట్, ఎలాన్ మస్క్, సామ్ అల్ట్మెన్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇది దగ్గరగా గూగుల్‌ని పోలి ఉంటుంది.
గూగుల్‌లో ఎలా అయితే మనం ఒక విషయం గురించి వెతుకుతామో అలాగే ఈ చాట్ జీపీటీలో కూడా సెర్చ్ చేయవచ్చు. మనుషుల లాగానే ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది. చాట్ జీపీటీ కూడా గూగుల్ తరహాలోనే సెర్చ్ ఇంజిన్‌గా ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు గూగుల్‌నే వాడొచ్చు కదా? కొత్తగా ఈ చాట్ జీపీటీ దేనికి అనే ప్రశ్న రావచ్చు. అవును చాట్ జీపీటీ గూగుల్ తరహాలోనే ఉంటుంది. వీటి మధ్య ప్రధానమైన తేడా ఒకటి ఉంది.
అదేంటంటే మనం గూగుల్‌ని ఏదైనా ప్రశ్న అడిగితే దానికి వందల, వేల కొద్దీ లింక్స్ వస్తాయి. వాటిలో మనకు ఏది కావాలో అది మనం వెతుక్కోవాలి. కానీ చాట్ జీపీటీలో మనం ఒక ప్రశ్న అడిగితే అది స్ట్రెయిట్ జవాబు చెబుతుంది. మనకు లింక్స్ ఇవ్వడం, వెతుక్కోమనడం ఉండదు. అందుకే ఈ చాట్ జీపీటీకి యూజర్లు బాగా ఆకర్షితులవుతున్నారు. ఉదాహరణకు మనం ఇంట్లో వాడే అలెక్స్ లాగానే చాట్ జీపీటీ పని చేస్తుంది. ఇందులో మెషీన్ లెర్నింగ్, ఏఐ, ఇంటెలిజెన్స్ డీప్ లెర్నింగ్ వంటివన్నీ ఉంటాయి. ఇందులో వికీపీడియా, ఇతర పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని అంతా కలిపి రూపొందించారు.
దాదాపు 300 బిలియన్ పదాలతో ఇందులో సమాచారాన్ని తయారు చేశారు. చాట్ జీపీటీ విస్తృతంగా అమల్లోకి వస్తే గూగుల్ అంతమై పోతుందా అనే సందేహాలు కూడా లేవనెత్తుతున్నాయి. దీనికి దీటైన మరింత మెరుగైన సెర్చ్ చాట్‌బోట్‌ను డెవలప్ చేయాలని గూగుల్ ఆలోచిస్తుంది. గూగుల్‌కే గుబులు పుట్టిస్తున్న ఈ చాట్ బాట్లో 2021కి ముందు జరిగిన అన్ని విషయాలను నిక్షిప్త పరిచారు. మనం 2021కి ముందు జరిగిన అన్ని విషయాల్లో ఏ ప్రశ్న అడిగినా కూడా మనకు సమాధానం ఇస్తుంది.
చాట్ జీపీటీలో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది మనం అడిగిన ప్రశ్నలన్నింటినీ గుర్తు పెట్టుకోవడమే కాదు ఏదైనా తప్పు అని భావిస్తే సవరించి కూడా గుర్తు పెట్టుకుంటుంది. 2022 నవంబర్ 30లో చాట్ జీపీటీని ప్రారంభించారు. మొదట దీన్ని ప్రీ సర్వీస్‌గానే ప్రారంభించారు. డిసెంబర్లో దీన్ని పెయిడ్ సర్వీస్‌గా మార్చాలని చూశారు. కానీ ఇప్పటికీ పబ్లిక్కు ఇది ఫ్రీగానే అందుబాటులో ఉంది. దీనికి ఇప్పటికే లక్షల యూజర్లు ఉన్నారు.
ఈ చాట్ జీపీటీ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. దీన్ని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఉపయోగిస్తున్నారు. ఇది కష్టమైన కోడ్స్‌కు కూడా సులువుగా సమాధానం చూపిస్తుంది. మనం ఏ కోడ్ కావాలో టైప్ చేస్తే అది పూర్తి కోడ్‌ని రాసి మనకు అందిస్తుంది. అలాగే చదువులకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా మనకు సమాధానం చెబుతుంది. ఇక వంటలు తెలియని వారికి, వంటరాని వారు కూడా దీని సూచనలతో వంట చేసుకోవచ్చు. ఏదైనా వంట తయారీ అని కొడితే దానికి కావల్సిన పదార్థాల నుంచి తయారీ విధానం దాకా అంతా మనకు చూపిస్తుంది. అలా మనకు అనేక ప్రశ్నలకు దీనిలో సమాధానం వెతకవచ్చు.
తాజాగా నెటిజన్లు చాట్ జీపీటీని అడిగిన ప్రశ్నలు సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో 2023లో చాట్ జీపీటీ సాయంతో డబ్బులు సంపాదించడం ఎలా? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. యూజర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాట్ జీపీటీని ఉపయోగించి ఏడు మార్గాల్లో ధనం సంపాదించవచ్చని ఏఐ మోడల్ సమాధానాన్ని ఇచ్చింది. అందులో ముఖ్యంగా…
- చాట్ జీపీటీ ఉపయోగించి చాట్‌బాట్ తయారు చేసి వాటికి లైసెన్స్ పొందవచ్చు. అనంతరం వ్యాపార సంస్థలకు లేదంటే వ్యక్తులకు విక్రయించి ధనం సంపాదిచవచ్చు. ఈ చాట్‌బాట్ సాయంతో కస్టమర్ సర్వీస్, వర్చువల్ అసిస్టెన్స్ లేదా ఇతర పనులకు ఉపయోగించవచ్చు.
- చాట్ జీపీటీ ద్వారా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయవచ్చు. కన్సల్టింగ్, డెవలప్మెంట్ సర్వీసుల్ని అందించవచ్చు.
- ఏఐ ఆధారిత చాట్ బాట్ సాయంతో ప్రత్యేకమైన ప్రాజెక్టులు లేదా ఇండస్ట్రీస్‌కు సంబంధించిన డేటాను తయారు చేసే కోర్సుల పేరుతో సొమ్ము చేసుకోవచ్చు.
- చాట్ జీపీటీ అందించే యూనిక్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ సాయంతో సోషల్ మీడియా, బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌ను రన్ చేయవచ్చు. తద్వారా యాడ్స్, ప్రమోషనల్ యాడ్స్‌ను డిస్ప్లే చేసి ఆదాయాన్ని గడించవచ్చు.
- స్టాక్ మార్కెట్‌పై కొంచెం పట్టుంటే చాట్ జీపీటీని ఉపయోగించి ఆటోమేటెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేయవచ్చు. ట్రేడింగ్, లేదంటే కన్సల్టింగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలను అప్లయ్ చేసి కూడా సంపాదించవచ్చు.
- అంతేకాదు చాట్ జీపీటీ బేస్డ్ చాట్‌బోట్‌ను తయారు చేసి కస్టమర్ సర్వీస్, వర్చువల్ అసిస్టెంట్స్ పేరుతో సబ్స్క్రిప్షన్ మోడల్‌తో డబ్బులు సంపాదించవచ్చు.
- చాట్ జీపీటీతో లాంగ్వేజెస్‌ను ఉపయోగించి సంబంధిత బిజినెస్‌లలో కొన్ని పనులు చేసేందుకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, టెక్ట్స్ సమ్మరైజేషన్ వంటి పనులు చేస్తూ ఉపాధి పొందవచ్చు.
నష్టాలు
దీని ద్వారా నష్టాలు కూడా ఉన్నాయి. దీన్ని ఉపయోగించి విద్యార్థులు తమ చదువును పాడు చేసుకునే అవకాశం ఉంది. దీనిలో విద్యార్థులు సబ్జెక్టుకి సంబంధించిన ఏ ప్రశ్న అడిగినా నేరుగా సమాధానం వస్తుంది. దీన్ని కాపీయింగ్‌కు ఉపయోగించే ప్రమాదం ఉంది.
ఉద్యోగులు కూడా తాము చేయాల్సిన పనులకు తేలిగ్గా సొల్యూషన్ పొందవచ్చు. దీనివల్ల క్రియేటివిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే దీనిలో ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంది. మొదట్లో అయితే గన్ ఎలా తయారుచేయాలో కూడా ఇది వివరించింది. తర్వాత దీన్ని అప్డేట్ చేశారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అది చెప్పకూడని ప్రశ్న అంటూ సమాధానం చెబుతుంది.
ఇది ఇంటర్నెట్ సహాయం లేకుండానే సమాధానాలు చెబుతుంది. ఇంటర్నెట్ అనుసంధానం లేకపోవడం కూడా ఒక మైనస్‌గా చెప్పవచ్చు. 2022లో చనిపోయిన వ్యక్తి గురించి అడిగితే అతను ఇంకా బతికే ఉన్నాడని చెబుతుంది. ఇలాంటివి యూజర్లను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటేనే దీని సేవలను మనం పొందవచ్చు.
ప్రస్తుతం మానవులు చేస్తున్న కొన్ని ఉద్యోగాలను ఆటోమేషన్, ఏఐ చేపట్టడం గురించి కొంత ఆందోళన ఉంది. అయినప్పటికీ ఏఐ అభివృద్ధి, ఉపయోగం మానవ ఉద్యోగులను పూర్తిగా భర్తీ చేయడానికి బదులు వారి అభివృద్ధికి, వారికి సహాయం చేయడానికి తీసుకొచ్చిందని గుర్తుంచుకోవడం ముఖ్యం. భవిష్యత్తులో కొన్ని పనులు ఆటోమేటిక్‌గా మారే అవకాశం ఉన్నప్పటికీ ఏఐ అభివృద్ధి, స్వీకరణ ఫలితంగా కొత్త ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. 21వ శతాబ్దంలో కంప్యూటర్ శక్తి, పెద్ద మొత్తంలో డేటా లభ్యం కావడం, సైద్ధాంతిక అవగాహనలో పురోగతి తర్వాత కృత్రిమ మేధస్సుపై పరిశోధనలు పుంజుకున్నాయి.
కృత్రిమ మేధ టెక్నాలజీ రంగంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కార్యకలాపాల పరిశోధనల్లో అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడింది. అలా ఇప్పుడు చాట్ జీపీటీ కూడా కృత్రిమ మేధ ఆధారంగా ఏర్పడిన ఒక సరికొత్త విప్లవం. ఆరంభంలో ఎందులో అయినా సమస్యలు సాధారణమే. భవిష్యత్తులో సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపనంత వరకు ఆదరించడంలో ఎలాంటి తప్పులేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చాట్ బాట్లు మరిన్ని వచ్చే అవకాశాలు లేకపోలేదు. రానున్న రోజుల్లో ఏ సాంకేతిక విప్లవమైనా మానవ ఆధీనం లో ఉంటూ సేవలు అందించాలి. కానీ మానవున్ని శాసించకూడదు.
మల్లవరపు బాలలత, సివిల్స్ మెంటార్
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు