ప్రజల సంక్షేమానికి జీడీపీ పరిమితులను వివరించండి?
జాతీయాదాయం వివిధ భావనలను వివరించండి? ప్రజల సంక్షేమానికి ప్రాతినిధ్యం వహించడంలో జీడీపీ పరిమితులను వివరించండి?
జవాబు:
ఏదైనా ఒక దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన వస్తు, సేవల విలువను జాతీయాదాయం అంటారు.
జాతీయ ఆదాయ భావనలు
- స్థూల జాతీయోత్పత్తి (జీఎన్‌పీ), స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), నికర జాతీయోత్పత్తి (ఎన్‌ఎన్‌పీ), జాతీయాదాయం (ఎన్ఐ), వ్యష్టి ఆదాయం (పీఐ), తలసరి ఆదాయం (పీసీఐ), వ్యయార్హ ఆదాయం (డీఐ)
1. మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)
- ఒక దేశంలో ఒక సంవత్సర కాంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల మార్కెట్ విలువను స్థూల దేశీయోత్పత్తి (Gross Domestic product) అంటారు.
- స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)
= C+I+G+ (X-M)
C = వినియోగం
I= పెట్టుబడి
G = ప్రభుత్వ వ్యయం
(X-M)= అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఆర్జించిన ఆదాయం (నికర ఎగుమతులు) లేదా నికర విదేశీ పెట్టుబడి (ఎగుమతులు-దిగుమతులు)
2. మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి (జీఎన్‌పీ): ఒక సంవత్సర కాలంలో దేశ విదేశాలలో ఆ దేశస్థులు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువల మొత్తాన్ని మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అంటారు.
- మార్కెట్ ధరలలలో జీఎన్‌పీ = జీడీపీ+ విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం (Net factor income from abroad)
3. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి (NNP):
స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలకు కావాల్సిన మొత్తాన్ని మినహాయించగా మిగిలిన విలువను మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి అంటారు.
- మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి – మూల ధన తరుగుదల
4. జాతీయాదాయం (లేదా) ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి:
- ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందే ద్రవ్యరూప ప్రతిఫలాలైన బాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిపితే వచ్చే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం అంటారు.
- జాతీయాదాయం (National Income) = మార్కెట్ ధరలలో NNP + సబ్సిడీలు- పరోక్ష పన్నులు
5. వ్యష్టి ఆదాయం (Personal Income):
ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు, సంస్థలకు లభించిన మొత్తం ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటారు
- వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం – కార్పోరేట్ పన్నులు- పంచని లాభాలు- విరాళాలు+ బదిలీ చెల్లింపులు
- PI – NI- Corporate Taxes- Undistributed corporate profits-Social Security Contributions + Transfer payments
- వ్యయార్హ ఆదాయం (Disposable Income) – వ్యష్టి ఆదాయం నుంచి వ్యష్టి పన్నులు మినహాయించి వచ్చే ఆదాయాన్ని ‘వ్యయార్హ ఆదాయం’ అంటారు
- తలసరి ఆదాయం (Per Capita Income) – ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. జాతీయాదాయాన్ని దేశంలో ఉన్న జనాభాతో భాగించడం వలన తలసరి ఆదాయం వస్తుంది. ఇది ఒక దేశం సగటు జీవన ప్రమాణాలకు సూచిక.
- స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అనేది దేశం ఆర్థిక పనితీరుకు సూచిక. శ్రేయస్సు కోసం సాధారణంగా దీన్ని కాలమానంగా భావిస్తారు. కానీ సమాజంలో ఆదాయ అసమానతలను లెక్కించడంలో సరైన గణాంకాలు లేకపోవడం, దేశం వృద్ధిరేటు నిలకడగా ఉందో లేదో సరిగ్గా నిర్ణయించలేకపోవడం, మార్కెటేతర లేదా ద్రవ్యేతర రంగం మినహాయింపులు, అయ్యే ఖర్చును గణించక పోవడం వంటి పరిమితులు ఉన్నాయి.
- అందువలన వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల ద్వారా దేశం జీవన నాణ్యతను మరింత చక్కగా
- అంచనా వేయడానికి ప్రత్యామ్నాయ సూచికలు అభివృద్ధి చేశారు. అవి…
- మానవాభివృద్ధి సూచిక
(Human Development Index) – HDI - నిజమైన ప్రగతి సూచిక
(Genuine Progress Indicator) – GPI - సంతోష గ్రహ సూచిక
(Happy Planet Index) – HPI - ఈ సూచికల ద్వారా ఆయుర్దాయం, అక్షరాస్యత రేటు, అసమానతల కొలతలు సగటు జీవన ప్రమాణం, ఆదాయ, ఆదాయేతర రంగాల మిశ్రమ భావనను సంపూర్ణంగా కొలుస్తారు. ప్రజల జీవన నాణ్యతను, ప్రజల సంక్షేమాన్ని గణించడం సులభతరం అవుతుంది.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘ఫ్రీజోన్‌గా హైదరాబాద్’ అనే వివాదాస్పద అంశంపై చర్చించండి?
- నేపథ్యం: ‘హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా మార్చడం’ అనే అంశం రాష్ట్రపతి ఉత్తర్వులు, 1975 నుంచి ఉద్భవించింది. రాష్ట్రపతి ఉత్తర్వులోని 14వ పేరాలో సచివాలయ శాఖాధిపతులు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు రాష్ట్రపతి ఉత్తర్వులకు కట్టుబడి ఉండవని పేర్కొన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్, సిటీ క్యాడర్ మొదలైనవిగా పేర్కొనకపోయినప్పటికీ, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎక్కడా స్థానికేతర కోటా అనే మాటను ఉపయోగించనప్పటికీ ఈ కోటా కింద 1975 నుంచి 2004 వరకు అనేక నియామకాలు జరిగాయి.
- అంతేకాకుండా 2009, అక్టోబర్ 9న సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ హైదరాబాద్‌ను ‘ఫ్రీ జోన్’గా పరిగణిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు పోలీస్, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పడేందుకు అర్హత కల్పిస్తూ తీర్పునిచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్, 1975లోని క్లాజ్ 14 (ఎఫ్) ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం కింద జరిగే నియామకాలు సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, పోస్టింగ్‌లు, ప్రమోషన్లలో ఎలాంటి పరిమితి లేకుండా అన్ని ప్రాంతాలకు సమాన హక్కులుంటాయని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
- హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా మార్చాలని పలువురు ఆంధ్రా నేతలు ఎప్పుడూ పట్టుబట్టేవారు. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ఉంచితే వారి ఆర్థిక, ప్రయోజనాలు నెరవేరుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులతో హైదరాబాద్‌ను జోన్-6గా మార్చిన తర్వాత సీమాంధ్రులకు విద్య, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారు. సచివాలయ శాఖాధిపతులు, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు కట్టుబడి ఉండవు కాబట్టి ఆంధ్రా నుంచి స్థానికేతరులు 90 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను పొందగలిగారు. సీమాంధ్రలోని సంపన్న వర్గాలు విద్య, ఉపాధి, వ్యాపారం, వనరుల దోపిడీపై తమ నియంత్రణను కోల్పోవద్దన్నారు. వారు ఎప్పుడూ ఫ్రీజోన్ వివాదాన్ని తెరపైకి తెస్తారు. దానికి తోడు సుప్రీంకోర్టు తీర్పు కూడా వారికి కలిసి వచ్చింది.
- నియామకాల నిమిత్తం హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించడంపై తలెత్తిన వివాదం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరోసారి ఆందోళనలకు దారితీసింది
- హైదరాబాద్ జోన్లో భాగం చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులకు అవసరమైన సవరణలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి
- తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులోని వివాదాస్పద నిబంధన 14 (ఎఫ్)ని తొలగించకుండా సబ్ ఇన్స్పెక్టర్ల నియామకాన్ని ప్రకటించింది
- ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సంఘాల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమైంది. వివాదాస్పద నిబంధనను తొలగించే వరకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వాయిదా వేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడుతామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ పేర్కొంది
- పేరా 14లోని క్లాజ్ (ఎఫ్)ని కొనసాగించడం వల్ల హైదరాబాద్ ఫ్రీ జోన్‌గా ఉండటం వల్ల స్థానిక అభ్యర్థుల ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ నేతల వాదన
- వివాదాస్పద పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహణకు ఒక రోజు ముందు భారత రాష్ట్రపతి 1975 ఉత్తర్వుల్లోని పేరా 14లోని క్లాజ్ (ఎఫ్)ని తొలగించాలని ఆదేశించారు
- రాష్ట్రపతి తాజా ఉత్తర్వులను అమలు చేస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది
- ఇలా రాష్ట్రపతి ఉత్తర్వులకు అసంబద్ధ వివరణనిస్తూ ఆ ఉత్తర్వులను అనేక విధాలుగా ఉల్లంఘంచడం వల్ల ఉత్పన్నమైన ‘ఫ్రీ జోన్ వివాదం’ తెలంగాణ ఉద్యోగార్థులకు తీరని అన్యాయం చేసింది. అంతేకాకుండా, రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14 (ఎఫ్) నిబంధన కింద అందించిన మినహాయింపును దుర్వినియోగం చేస్తూ హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు సీమాంధ్రులకు అవకాశం కలిగింది. తెలంగాణ జేఏసీ, ఇతర రాజకీయ పార్టీలు దాని రద్దు కోసం తీవ్రంగా ఉద్యమించాయి. చివరికి విజయం సాధించాయి.
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ సౌజన్యంతో అశోక్‌నగర్ హైదరాబాద్
నోటిఫికేషన్స్
పార్ట్‌టైం పీహెచ్డీ
- హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ
యూనివర్సిటీలో స్పాన్సర్డ్ సెల్ఫ్ పద్ధతిలో పార్ట్‌టైం డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. - ప్రోగ్రామ్: పార్ట్ టైం డాక్టోరల్ ప్రోగ్రామ్ (స్పాన్సర్డ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్)
- విభాగాలు: కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్, దక్కన్ స్టడీస్
- మొత్తం సీట్లు: 99
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి.
- ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
- ప్రవేశపరీక్ష తేదీ: మార్చి 6
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఫిబ్రవరి 17
- వెబ్సైట్: https://manuu.edu.in
గురుకుల సీవోఈలో ప్రవేశాలు
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ప్రకటనను తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ప్రకటన విడుదల చేసింది.
- పరీక్ష పేరు: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2023
- గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ (ఇంగ్లిష్ మీడియం)
- మొత్తం సీట్లు: 1140
- కాలేజీలు: రాజేంద్రనగర్, వరంగల్, ఖమ్మం, పరిగి, నర్సాపూర్, దేవరకొండ, మిర్యాలగూడ, దమ్మపేట, కల్వకుర్తి, హుస్నాబాద్, కేఎస్డీ సైట్
- పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు .025 మార్కులు కోత విధిస్తారు. ఎంపీసీలో ప్రవేశాల కోసం ఇంగ్లిష్- 20, మ్యాథ్స్-60, ఫిజిక్స్-40, కెమిస్ట్రీ-40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
బైపీసీలో ప్రవేశాల కోసం ఇంగ్లిష్-20, బయాలజీ-40, మ్యాథ్స్-20, ఫిజిక్స్-40, కెమిస్ట్రీ-40 మార్కులు
కేటాయించారు. - ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఫిబ్రవరి 17
- స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: మార్చి 12
- వెబ్సైట్: www.tgtwgurukulam.
telangana.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?