ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రయోజనాలను ప్రస్తావించండి?
కాలుష్య నివారణలో బయోరెమిడియేషన్ పద్ధతులను వివరించండి? (లేదా) కింది పదాలను నిర్వచించండి?
1) బయో రెమిడియేషన్
2) ఫైటో రెమిడియేషన్
3) బయోస్టిమ్యులేషన్
4) బయో ఆగ్మెంటేషన్
5) ఇంట్రిన్సిక్ బయోరెమిడియేషన్
బయోరెమిడియేషన్
- సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, శైవలాలు, సయనోబ్యాక్టీరియాలు, పరిమిత స్థాయిలో మొక్కలను ఉపయోగించి జల, మృత్తికలోని కాలుష్య పదార్థాలను నిర్మూలించే విధానాన్ని బయోరెమిడియేషన్ అని అంటారు.
- ఉదాహరణకు సూడోమోనాస్ పుటిడ అనే బ్యాక్టీరియా ద్వారా జలాల్లో కలిసిన చమురు నిల్వలను విచ్ఛిన్నం చేసి, నిర్వీర్యం చేయవచ్చు.
బయోస్టిమ్యులేషన్ - మృత్తిక (లేదా) నీటిలో సహజంగా ఉంటూ కాలుష్య పదార్థాల నిర్మూలనను చేపట్టే అనేక సూక్ష్మజీవులకు పోషకపదార్థాలు, ఆక్సిజన్‌ను సరఫరా చేసి బయోరెమిడియేషన్ను ప్రోత్సహించే ప్రక్రియను బయోస్టిమ్యులేషన్ అని అంటారు.
- పోషకాలు, ఆక్సిజన్‌ను ద్రవ లేదా వాయు రూపంలో అందించి సహజంగా జరుగుతున్న బయోరెమిడియేషన్ను ప్రోత్సహించడాన్ని బయోస్టిమ్యులేషన్ అని అంటారు
బయో ఆగ్మెంటేషన్
- జీవ సాంకేతిక విజ్ఞానం ద్వారా అభివృద్ధి చేసిన సూక్ష్మజీవులను లేదా సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ఉపయోగించి చేపట్టే కాలుష్య పదార్థాల నిర్మూలనను బయోఆగ్మెంటేషన్ అని అంటారు. మురుగును శుభ్రం చేయడానికి ఈ పద్ధతిని వినియోగిస్తారు.
ఇంట్రిన్సిక్ బయో రెమిడియేషన్ - ఎటువంటి బాహ్య ప్రేరణ లేకుండానే మృత్తిక, జల కాలుష్య పదార్థాలను సూక్ష్మజీవుల ద్వారా సహజంగానే పూర్తిస్థాయిలో నిర్మూలించడాన్ని ఇంట్రిన్సిక్ బయోరెమిడియేషన్ అని అంటారు.
ఫైటో రెమిడియేషన్ - జీవ సాంకేతికత విజ్ఞానం ద్వారా కొన్ని ప్రత్యేక లక్షణాలున్న సూక్ష్మజీవులను (లేదా) వాటి మిశ్రమాన్ని (లేదా) మొక్కలను ఉపయోగించి నేలలోని కలుషిత పదార్థాలు (లేదా) కాలుష్య కారకాలను నిర్మూలించే పద్ధతిని ఫైటో రెమిడియేషన్ అని అంటారు.
అదనపు సమాచారం
బయోరెమిడియేషన్లో పాల్గొనే ముఖ్యమైన బ్యాక్టీరియాలు
1) సూడోమోనాస్ పుటిడా – చమురును విచ్ఛిన్నం చేస్తుంది
2) డైక్లోరోమోనాస్ అరోమాటికా – బెంజీన్‌ను ఆక్సీకరణ చేస్తుంది
3) డీనోకాకస్ రేడియోడ్యూరాన్స్ – అమ్మోనియం, నైట్రేట్లను నీటిలో విచ్ఛిన్నం చేస్తుంది
4) ఆల్కానివోరాక్స్ బోర్కుమెన్సిస్- ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో డీప్ వాటర్ ఆయిల్ స్పిల్ నుంచి 8,30,000 కంటే ఎక్కువ గ్యాలన్ల చమురును శుద్ధి చేసింది.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏమిటి? ఇది సంప్రదాయ వ్యాక్సిన్ సాంకేతికత నుంచి ఎలా భిన్నంగా ఉంటుంది? దాని ప్రయోజనాలను ప్రస్తావించండి?
పరిచయం
- శరీరంలో వ్యాధికారక యాంటీజెన్లను ఉత్పత్తి చేయడానికి మెసెంజర్ ఆర్ఎన్ఏ అనే సూక్ష్మ అణువులను మానవ కణాల్లోకి ఇంజెక్ట్ చేసి వ్యాధినిరోధకతను పెంచే సరికొత్త వ్యాక్సిన్‌ను ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అని అంటారు.

ఎంఆర్ఎన్ఏ-సంప్రదాయ వ్యాక్సిన్ల మధ్యగల తేడా
1) సంప్రదాయ టీకాలు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను పాక్షికంగా (లేదా) పరోక్షంగా క్రియారహితం చేసి (లేదా) అందులో చిన్న భాగాన్ని తీసుకొని శరీరంలోకి ప్రవేశించి తద్వారా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి.
2) కానీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు మెసెంజర్ ఆర్ఎన్ఏ అనే సూక్ష్మ కణాలను శరీరంలోకి పంపి కొన్ని వైరల్ ప్రొటీన్లను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ప్రేరేపిస్తాయి. దానికనుగుణంగా డీఎన్ఏలకు సూచనలిస్తూ వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి.
3) సంప్రదాయ టీకాల ఉత్పత్తి నెమ్మదిగా జరుగుతుంది. అందుకు అవసరమైన, కచ్చితమైన ప్రొటీన్లను తయారు చేయడమూ కష్టంగా ఉంటుంది.
4) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఉత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ పద్ధతిలో ఎంఆర్ఎన్ఏ అణువులను ఉత్పత్తి చేయడం సులభం.
5) సంప్రదాయ టీకాల వల్ల అదనపు దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వచ్చే అవకాశాలూ ఉంటాయి. కానీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అత్యంత అరుదుగా జరుగుతాయి.
6) సంప్రదాయ టీకాలు కొద్దికాలం వరకే రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. వ్యాధి తీవ్రతను బట్టి బూస్టర్ డోస్‌లూ అవసరమవుతాయి. కానీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు దీర్ఘకాలికంగా పనిచేస్తాయి. బూస్టర్ డోస్‌ల అవసరం ఉండదు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రయోజనాలు
1) ఇవి క్రియాశీలంగా ఉండే సూక్ష్మజీవుల నుంచి కాకుండా పూర్తిగా నశింపచేసిన సూక్ష్మజీవుల నుంచి ప్రొటీన్లను సంశ్లేషించి తయారు చేయబడతాయి. కాబట్టి వ్యాధి మళ్లీ రావడం జరగదు. ఇవి అత్యంత సురక్షితమైన టీకాలు.
2) ఈ రకమైన వ్యాక్సిన్లను వేగంగా, చౌకగా మరింత ప్రామాణిక పద్ధతిలో తయారు చేయవచ్చు. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయవచ్చు.
3) వీటిని సులభంగా రోగి శరీరంలోకి ప్రవేశపెట్టవచ్చు. ఎక్కువ పనితీరును కనబరుస్తాయి.
4) ఇవి దీర్ఘకాలం పాటు క్రియాశీలంగా పనిచేస్తాయి.
5) ఈ పద్ధతిలో యాంటీజెన్ల ప్రతిక్రియా యంత్రాంగం కోసం ఓఆర్ఎఫ్ కోడింగ్ జోడించబడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుంది.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సవాళ్లు
1) వీటిని గతంలో మానవులకు ఇవ్వలేదు. కాబట్టి వీటి పనితీరును పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మానవ శరీర జీవక్రియలకే ముప్పు కలగవచ్చు.
2) వీటిని -70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలి. లేదంటే అవి విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి భారత్ లాంటి ఉష్ణమండల దేశాలకు ఇది అనుకూలం కాదు.
3) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది మానవ కణంలోకి సులభంగా ప్రవేశించలేని తంతువులతో పెళుసుగా తయారు చేయబడి ఉంటాయి. కాబట్టి శరీరంలోకి టీకాను ఇంజెక్ట్ చేసిన తర్వాత విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది.
- ముగింపు పరిశోధకులు దశాబ్దాలుగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల గురించి అధ్యయనం చేస్తున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో ఫైజర్-బయోఎన్‌టెక్, మోడెర్నా (అమెరికా) సంస్థలు ఈ సాంకేతికతను ఉపయోగించి టీకాలను తయారు చేస్తున్నాయి. భారత్ కూడా క్యాండిటేట్-హెచ్‌జీసీఓ19 పేరుతో ఈ తరహా వ్యాక్సిన్‌ను తయారు చేస్తుంది. అయితే వీటిమీద ఇంకా లోతైన అధ్యయనం జరగాల్సి ఉంది.
జీవ క్రిమిసంహారకాలు (బయోపెస్టిసైడ్స్) అంటే ఏమిటి? వాటిలోని వివిధ రకాలను ప్రస్తావించి, వాటి ప్రయోజనాలను వివరించండి? భారత్‌లో వాటి అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించండి?
పరిచయం
పంటలకు సోకే వివిధ రకాల తెగుళ్లను నివారించడానికి బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, ప్రొటోజోవా లాంటి సూక్ష్మజీవుల జీవసంబంధ పదార్థాలను ఉపయోగించి తయారు చేసే వాటిని జీవక్రిమి సంహారకాలు అని అంటారు. కొన్నిసార్లు మొక్కల ఉత్పత్తులనూ వీటి తయారీలో వినియోగిస్తారు.

రకాలు
1) జీవసంబంధ కీటక నాశినులు
2) జీవసంబంధ బ్యాక్టీరియా నాశినులు
3) జీవసంబంధ శిలీంధ్ర నాశినులు
4) జీవసంబంధ కలుపు మొక్కల నాశినులు(బయాలజికల్ కంట్రోల్)
5) జీవసంబంధ నెమటోడ్ నాశినులు ప్రయోజనాలు
1) బ్యాక్టీరియా సంబంధిత జీవక్రిమి సంహారకాలు
ఎ) బ్యాక్టీరియా రకం – ప్రయోజనాలు
1) బాసిల్లస్ తురింజయన్సిస్ (బీటీ టాక్సిన్): కీటక తెగుళ్లు, వాటి డింభకాలు, శిలీంధ్రాల తెగుళ్లను నివారించవచ్చు. మొక్కల్లో కాయతొలిచే పురుగు, టమాటా మొగ్గ, క్యాబేజీలను ఆశించే పురుగు వంటి వాటిని సంహరించవచ్చు.
2) బాసిల్లస్ పాపిలే, బాసిల్లస్ లెంటిమార్బస్: మొక్కలను ఆశించే జపనీస్ బీటిల్ కీటకాన్ని నియంత్రించవచ్చు.
3) సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్: ధాన్యపు మొక్కలు, టమాట, మిరప, పొగాకు వంటి వాటిని ఆశించే శిలీంధ్రాలను నివారిస్తుంది.
4) బాసిల్లస్ పెనెట్రాన్స్: టమాట మొక్క వేరును ఆశించే నెమటోడ్ను నియంత్రిస్తుంది.
బి) వైరస్ సంబంధిత క్రిమిసంహారకం – ప్రయోజనాలు
1) గ్రాన్యులోసిస్: చెరకు కాండాన్ని ఆశించే కీటకాన్ని నియంత్రిస్తుంది.
2) హీలియాంథస్ న్యూక్లియర్ పాలిహెడిరోసిస్: పత్తి, మొక్కజొన్న, జొన్న లాంటి వాటిని ఆశించే హీలియాంథస్ కీటకాన్ని నియంత్రిస్తుంది.
3) లైమాంట్రియా డిస్పర్ న్యూక్లియర్ పాలిహెడిరోవిస్: మొక్కలను ఆశించే జిప్సిమౌత్ కీటకాన్ని నియంత్రిస్తుంది.
4) రైనకోఫోరస్ ఫెర్రుగెనిస్ సైటో ప్లాస్మిక్ పాలిహెడిరోసిస్: పామ్ జాతి చెట్లను ఆశించే కీటకాలను నివారిస్తుంది.
సి) శిలీంధ్ర సంబంధిత జీవ క్రిమిసంహారకం- ప్రయోజనం
1) ఫ్యుసేరియం పాల్లిడోగోసియం: చిక్కుడు జాతి మొక్కలను ఆశించే ఆఫిడ్ కీటకాలను నియంత్రిస్తుంది.
2) బ్యూవేరియా బాసియానా: కాఫీ గింజలను ఆశించే కీటకం, వరి కాండం తొలిచే పురుగు నివారణకు వినియోగించవచ్చు.
3) గ్లోమస్ ఫాసిక్యులేటమ్: వేరుశనగపై ఆశించే శిలీంధ్రం నివారించవచ్చు.
4) గ్లోమస్ మాసియో: సోయా మొక్కను ఆశించే రైజాక్టానియా సొలాని.
డి) మొక్కల రసాయనాల సంబంధిత జీవక్రిమి సంహారకాలు
1) వెల్లుల్లి- జొన్నపంటలో ఎర్గాట్ వ్యాధిని కలిగించే క్లావిసెప్స్ పర్పూరియా శిలీంధ్రాన్ని నియంత్రించవచ్చు.
2) మారేడు, గోరింటాకు, తమలపాకుల రసం- శిలీంధ్రాలను నియంత్రించవచ్చు.
3) పసుపు, బంతిమొక్కల రసం- కీటకాల నివారణ చేయవచ్చు.
4) వేప రసం- కీటక, శిలీంధ్రాలను నివారించవచ్చు.
5) బిల్లగన్నేరు రసం- పత్తిలో తెల్ల ఈగను నివారించవచ్చు.
6) ఉమ్మెత్త రసం- వరి, గోధుమలపై వచ్చే శిలీంధ్ర వ్యాధులను నియంత్రించవచ్చు.
భారత్‌లో బయోక్రిమిసంహారకాల అభివృద్ధికి చర్యలు
- భారత వ్యవసాయ పరిశోధన మండలి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్తంగా జీవక్రిమిసంహారకాల ఉత్పత్తి, పరిశోధనలు చేస్తున్నాయి.
- భారత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా బయోపెస్టిసైడ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
- సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్ వివిధ శిక్షణ కార్యక్రమాలు, పొలాల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా ఇంటిగ్రేటెడ్ పెస్ట్
మేనేజ్మెంట్ను ప్రోత్సహిస్తున్నాయి. - దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో ఉన్న 38 స్టేట్ బయో కంట్రోల్ ల్యాబ్స్ ద్వారా జీవక్రిమిసంహారకాల వినియోగం ప్రోత్సహిస్తున్నారు.
- జీవక్రిమిసంహారక ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు వీలు కల్పించే విధంగా 1968 క్రిమిసంహారక చట్టాన్ని భారత ప్రభుత్వం సవరించింది.
ముగింపు
- రోజురోజుకూ పర్యావరణం మానవసంబంధ కార్యకలాపాల వల్ల ప్రమాదంలోకి నెట్టివేస్తున్న నేపథ్యంలో వ్యవసాయరంగంలో మితిమీరిన రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారాల వినియోగం వల్ల వాతావరణ సమతుల్యం మరింత దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ విధానాలవైపు వ్యవసాయ రంగం మారాల్సిన అవసరం ఉంది.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






