స్త్రీ, పురుష నిష్పత్తి పెంచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి?
దేశంలో ధాన్యాగారాలుగా పిలువబడుతున్న ఉత్తర మైదానాలు ఎలా ఏర్పడ్డాయి?
- హిమానీ నదులు, వాటి ఉపనదుల నిరంతర శిథిలాల అవక్షేపణ ప్రక్రియ ద్వారా ఉత్తర మైదానాలు ఏర్పడ్డాయి. దేశంలో పశ్చిమాన పంజాబ్ నుంచి తూర్పున అస్సాం వరకు ఆగ్నేయాన, పశ్చిమాన పశ్చిమ బెంగాల్ వరకు సుమారు 7.50 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఇవి ఏర్పడ్డాయి. ఉత్తరాన శివాలిక్ పర్వతాలకు దక్షిణాన ద్వీపకల్ప పీఠభూమికి మధ్యలో ఇవి ఏర్పడ్డాయి.
- స్థానిక లక్షణాలు, రూపురేఖలు మొదలైన వాటి ఆధారంగా వీటిని బాబర్, టెరాయ్, భంగర్, ఖాదర్ అని సమాంతరంగా వర్గీకరించారు. రాష్ర్టాలు 4 ప్రధాన నదులైన సింధూ, గంగ, బ్రహ్మపుత్ర ప్రాతిపదికన వీటిని పంజాబ్ మైదానాలు, రాజస్థాన్ మైదానాలు, ఎగువ గంగ, దిగువ గంగ, మధ్య గంగా మైదానాలు, బ్రహ్మపుత్ర మైదానాలుగా వర్గీకరించారు.
1) నది తనలో భారాన్ని తొలగించుకునే మైదాన ప్రాంతమైన ‘బాబర్’ శిలాజ నిక్షేపాలకు ప్రసిద్ధి.
2) చిత్తడిగా కనిపించే టెరాయ్ ప్రాంతం సహజ ఉద్భిజ్జాలకు ప్రసిద్ధి.
3) నదీ ప్రవాహానికి దూరంలో, కొంత ఎత్తులో వరద ప్రవాహం లేని ముదురురంగులో గల ‘భంగర్’ మైదానాలు కొంత సారవంతమైనవి.
4) నదీ ప్రవాహానికి అత్యంత సమీపంలో వరద ప్రభావంతో కూడుకొని, లేత రంగులో కనిపించే ‘ఖాదర్’ మైదానాలు అత్యంత సారవంతమైనవి.
- ఉత్తర మైదానాలు ఇంచుమించు రుగ్వేద కాలం నుంచి ప్రస్తుతం వరకు ఆహార ధాన్యాల అవసరాల్లో అగ్రభాగాన్ని అందిస్తూ, భారతదేశపు ధాన్యాగారాలుగా పిలువబడుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఒండ్రు నేలలు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల ఆహార పంటలు, చెరకు, జనుము వంటి వాణిజ్య పంటలు, పండ్ల తోటలకు ఇవి ప్రసిద్ధి చెందాయి.
- వీటిలో పొటాష్ వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ నైట్రోజన్ లోపాన్ని కలిగి ఉన్నాయి.
- ఇవి చెరువులు మినహా అన్నిరకాల నీటి పారుదల వ్యవస్థకు అనుకూలమైనవి. వీటి ఉత్తర దక్షిణ అంచుల్లో ముడి చమురు, సహజ వాయువు, అక్కడక్కడ బొగ్గు వంటి నిక్షేపాలు ఉన్నాయి. అన్ని రకాల రవాణా సౌకర్యాల ఏర్పాటుకు అత్యంత అనుకూలం కాబట్టి పై లక్షణాల వల్ల ఈ ప్రాంతంలో జీవనానికి అత్యంత అనుకూల పరిస్థితులు ఏర్పడటం, వేదకాల మహాజనపద మగధ వంటి సామ్రాజ్యాల నుంచి బ్రిటిష్ కాలం వరకు జనాభా విస్ఫోటనం జరుగుతూ, జనసాంద్రతతో ఈ ప్రాంతాలు ముందువరుసలో ఉన్నాయి.
- ఏవైతే అనుకూలతలు ఉన్నాయో, వాటిని అస్తవ్యస్తంగా వినియోగించడం ద్వారా ఈ మైదానాలపై ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడి తలతన్యతగా మారి, అవి కేశనాళికీయత అనే ప్రక్రియ ద్వారా లవణాలను నేలల ఉపరితలానికి తీసుకువచ్చి, ఆయా ప్రాంతాలను వ్యర్థ భూములుగా మారుస్తుంది. వీటినే ఉషర్ (లేదా) రే (లేదా) కల్లార్ మైదానాలు అంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమపై ఒక లఘు వ్యాసాన్ని రాయండి?
- కేంద్ర ప్రభుత్వం 1968లో ఫార్మా రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మా ఉత్పత్తులు పెంచడం ఔషధ దిగుమతుల్ని తగ్గించడం మొదలైన లక్ష్యాలతో ఐడీపీఎల్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యాలయం రుషికేశ్‌లో ఉన్నప్పటికీ దేశీయంగా మరో రెండు యూనిట్లను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి అప్పటి రంగారెడ్డి జిల్లాలోని బాలానగర్ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేశారు.
- అనతికాలంలోనే హైదరాబాద్‌లో డా. రెడ్డీస్ ఫార్మా ఇండస్ట్రీని నెలకొల్పారు. తర్వాత 90వ దశకంలో శామీర్‌పేట మండలంలో తుర్కపల్లిలో ఫార్మా సెజ్ ‘జీనోమ్ వ్యాలీ’ని ఏర్పాటు చేయడంతో ఈ రంగం మరింత ఊపు అందుకోవడానికి కారణమైంది. భారత్ శాంతా బయోటెక్, బయలాజికల్-ఈ తదితర సంస్థలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ ఫార్మా రంగం ప్రత్యేకతలు
1) దేశానికి అవసరమైన ఔషధాలు, బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 30 శాతం వరకు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి.
2) దేశం నుంచి జరుగుతున్న ఫార్మా ఎగుమతుల్లో 1/3వ భాగం తెలంగాణ నుంచే జరుగుతుంది.
3) ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ సుమారు 17 వేల కోట్ల వ్యాపారాన్ని కలిగి ఉండి, దేశంలో గుజరాత్ తర్వాత ఈ రంగంలో 2వ స్థానంలో ఉంది.
4) కొవిడ్ పాండమిక్ సమయంలో ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 3వ భాగం హైదరాబాద్ నుంచే జరిగింది.
5) దేశంలో ఫార్మా రంగానికి సంబంధించిన 19 ల్యాబొరేటరీస్, పరిశోధన సంస్థలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.
- ఈ రంగానికి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలైన ఐఐసీటీ, ఆ విద్యను అందిస్తున్న, సీసీఎంబీ, ఎన్ఐఎన్, నైపర్ వంటి సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
- పై విషయాలన్నింటినీ సంఘటితపరుస్తూ వాటిని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ఫార్మా సెజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిమ్జ్ (ఎన్ఐఎంజడ్-జాతీయ పరిశ్రమల తయారీ మండలం) హోదా ఇచ్చింది. అదేవిధంగా తుర్కపల్లి జీనోమ్ వ్యాలీకి మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ఈ రెండింటికి తోడుగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేశారు.
- గుజరాత్ వంటి రాష్ర్టానికి తీర ప్రాంతం ఉండటం, ఆ రాష్ట్రంతో పోల్చినప్పుడు ఔషధాల తయారీకి అవసరమైన ముడిసరకును చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం, దిగుమతి జరిగే ప్రాంతాలైన ఓడరేవులు మనకు సుదూరంగా ఉండటం, ఆ రవాణా జరిగే ఖర్చు మన ఫార్మా పరిశ్రమపై కొంత ఒత్తిడిని కలుగజేస్తున్నాయి. ఫార్మా పరిశ్రమల ప్రాంతాల్లో జరిగే పర్యావరణ, భూ కాలుష్యం మొదలైన వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఇవ్వాల్సిన ఎన్వోసీ వంటి వాటి విషయంలో అలసత్వం స్థానికంగా ఈ రంగానికి సంబంధించిన నిపుణుల కొరత, తయారీకి ఇస్తున్న ప్రాముఖ్యం పరిశోధన విశ్లేషణకు లేకపోవడం జనరిక్ ఔషధ పోటీ, ఐపీఆర్ ల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు, అమెరికా వంటి దేశాలు కొన్ని ప్రొడక్ట్స్‌ను అంగీకరించకపోవడం ఇటువంటివి ఈ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.
2011 జనాభా లెక్కల ప్రకారం భారత స్త్రీ, పురుష నిష్పత్తి తీరుతెన్నులను తెలియజేస్తూ, ఈ నిష్పత్తిని పెంచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి?
- సగటున వెయ్యి మంది పురుషులకు గల స్త్రీల సంఖ్యను స్త్రీ పురుష నిష్పత్తి అని అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత స్త్రీ పురుష నిష్పత్తి 943. 2001తో పోలిస్తే పెరిగింది. 933-943 మధ్య 10 పాయింట్లు. అయితే 2001లో 927లో ఉన్న పిల్లల స్త్రీ పురుష నిష్పత్తి 2011 నాటికి 919కి తగ్గడం బాధాకరం. 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ (1084), పుదుచ్చేరి (1037), తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు ఈ నిష్పత్తిలో ముందంజలో ఉంటే చివరి 5 స్థానాల్లో డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి, చండీఘర్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రధాన రాష్ర్టాల్లో హర్యానా (879), జమ్ముకశ్మీర్ (889), సిక్కిం (890), పంజాబ్ (895) చివరి స్థాయిల్లో ఉన్నాయి.
- పిల్లల్లో స్త్రీ పురుష నిష్పత్తిలో అరుణాచల్ ప్రదేశ్ (972), మిజోరం (970), మేఘాలయ (970), పుదుచ్చేరి, కేరళ రాష్ర్టాలు ముందు వరుసలో ఉంటే 5 కేంద్ర పాలిత ప్రాంతాలు చివరి 5 స్థానాల్లో ఉన్నాయి. ఎప్పటి మాదిరిగానే హర్యానా (861), సిక్కిం (875), పంజాబ్ (876) ఈ నిష్పత్తిలో కూడా చివరి స్థానాల్లో ఉన్నాయి.
- ఇవి సామాజికంగా చూస్తే అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ల కంటే మెరుగైన నిష్పత్తిని ప్రదర్శిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంది. అదేవిధంగా మత పరంగా చూస్తే ఈ నిష్పత్తిలో సిక్కులు అధమ స్థానంలో ఉన్నారు.
స్త్రీ పురుష నిష్పత్తిని పెంచడానికి కింది చర్యలు తీసుకోవాలి
1) ఏ వర్గాలు ఏ ప్రాంతాలు, ఏ రాష్ర్టాలైతే ఈ నిష్పత్తిలో అధమ స్థానాల్లో ఉన్నాయో అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు వివక్ష ప్రాంతాల్లో తగ్గించాలి.
2) స్త్రీ పురుష నిష్పత్తి తగ్గడానికి ముఖ్యమైన కారణంగా భ్రూణ హత్యలను చెప్పాలి. కాబట్టి పీసీపీఎన్డీటీ యాక్ట్-1994 ప్రకారం లింగ నిర్ధారణను జరపకుండా, జరిపినా బయటికి తెలియపర్చకుండా ఒక దృఢమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ చట్టం ఉల్లంఘనలకు అత్యంత కఠిన శిక్షలు వేయాలి.
3) స్త్రీల పట్ల సమానత్వాన్ని చూపేటట్లు ఆ సమానత్వాన్ని పెంపొందించేటట్లు కుటుంబం, సమాజం, పాఠశాల మొదలైన స్థాయిల్లో అవగాహన కల్పించాలి. ఈ విషయం పాఠ్యప్రణాళికల్లో భాగంగా ఉండాలి. కనీస వివాహ వయస్సు మధ్యలో ఉన్న తేడాను తొలగించాలి.
4) ఆడ శిశువులు జన్మించిన వెంటనే ఉన్న ఫలంగా బర్త్ సర్టిఫికెట్లను జారీ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మొత్తంలో ఆడ శిశువు పేరిట నిధులను బదిలీ చేయాలి.
5) సమాజంలో స్త్రీలను కుటుంబాలు ఏ అంశాల్లో భారంగా అనుకుంటున్నారో వాటిని తొలగించడానికి ఆస్తిలో సమాన వాటా, వరకట్న నిషేధం వంటి చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
6) ఎన్నో దశాబ్దాలుగా పార్లమెంట్ వద్ద వేచి చూస్తున్న మహిళా రిజర్వేషన్ల బిల్లులను చట్ట రూపంలోకి మార్చి అమలు చేయాలి. ఏవైతే స్థానిక సంస్థల వంటి వాటిలో రిజర్వేషన్లు కల్పించారో వాటి ప్రయోజనాలను ప్రత్యక్షంగా ఉండేటట్లు చూడాలి.
7) కొన్ని ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో ఏవైతే ఆటంకాలుగా కొన్ని పరిమితులు ఉన్నాయో వాటిని తొలగించాలి. వీలున్నంత వరకు ఎక్కువ మొత్తంలో మినహాయింపులను కలిగించాలి.
- రిజర్వేషన్లను, హక్కులను, గరిష్ఠ ప్రయోజనాలను మహిళలు పొందాలి. వీటిని పొందడం కంటే ముందే వాటిని అమలుపర్చడానికి అవసరమైన అక్షరాస్యత రేటు వంటి విషయాల్లో మెరుగైన ప్రదర్శన చేసేటట్లు ప్రభుత్వాలు, సమాజాలు చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్ భౌతిక నిర్మాణాన్ని తెలియజేయండి?
- చారిత్రకంగా హైదరాబాద్ నగర నిర్మాణాన్ని మూసీ నది ఆధారంగా తెలుపవచ్చు. గోల్కొండకు 18 కి.మీ. దూరంలో మూసీ నదికి దక్షిణంగా హైదరాబాద్ నగర నిర్మాణ ప్రస్తావన ప్రారంభమైంది. 16వ శతాబ్దంలో నిర్మించిన అప్పటి ఆ నగరాన్ని ప్రస్తుతం పాతబస్తీ అని పిలుస్తున్నాం. సైన్య సహకార ఒప్పందం ద్వారా బ్రిటిష్ రెసిడెన్సీని నదికి ఉత్తరంగా సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేయడంతో నగర నిర్మాణం 18వ శతాబ్దం చివరలో నది ఉత్తరానికి చేరింది.
- నగర నిర్మాణాభివృద్ధిలో ఆ తర్వాత కాలంలో అత్యధిక పాత్రను పోషించినవి జాతీయ రహదారులని చెప్పవచ్చు. మేడ్చల్ నుంచి శంషాబాద్ వరకు నగరం నుంచి వెళ్తున్న ఎన్‌హెచ్-44 (7) అదేవిధంగా పటాన్చెరు నుంచి ఎల్బీ నగర్ వరకు పోతున్న ఎన్‌హెచ్-65 నగర విస్తీర్ణాన్ని, నిర్మాణాలను పెంచడానికి కారణమయ్యాయి. నగర తూర్పు దిశలో ఈసీఐఎల్, ఎన్ఎఫ్సీ వంటి పరిశ్రమల స్థాపనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉప్పల్, మౌలాలి, కుషాయిగూడ, చర్లపల్లి పారిశ్రామిక వాడను ప్రకటించింది. అటువైపు నిర్మాణాలను ప్రోత్సహిస్తూ వచ్చింది.
- నగర ఉత్తర ప్రాంతంలో ఐడీపీఎల్, హెచ్ఏఎల్ వంటి పరిశ్రమల స్థాపనతో సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలను ప్రకటిస్తూ అటువైపు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రకటించారు. ఈ పారిశ్రామిక ఎస్టేట్‌కు ఉత్తరంగా డా. రెడ్డీస్, అరబిందో, నాట్కో, నొవార్టీస్ వంటి ప్రముఖ ఫార్మా రంగ పరిశ్రమల స్థాపనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా జీనోమ్ వ్యాలీని ప్రకటిస్తూ నగర నిర్మాణ విస్తీర్ణాన్ని అవిభక్త మెదక్ జిల్లా వరకు వ్యాపింపజేసింది.
- నగర పశ్చిమం వైపు లేదా వాయవ్య దిశలో 90వ దశకంలో ఐటీ పరిశ్రమ స్థాపనతో ఈసారి నగర నిర్మాణ క్రమం పశ్చిమం వైపు కొనసాగింది. దానికి తోడుగా హెచ్‌సీయూ, ఐఐఐటీ, రెవెన్యూ సిటీ నానక్‌రామ్‌గూడ, ఫిలింసిటీ మొదలైన అన్నీ రంగారెడ్డి హద్దులుగా అవిభక్త మహబూబ్‌నగర్ వైపు నిర్మాణాలను, అభివృద్ధిని పరుగులెత్తించాయి. పై రెండూ పారిశ్రామిక వాడల మధ్యలో బీహెచ్ఈఎల్, లింగంపల్లి, బీడీఎల్, ఎద్దుమైలారం, ఇక్రిశాట్ పటాన్చెరు వంటి నిర్మాణాలతో వాయవ్యంగా నగరాభివృద్ధి కొనసాగుతూ వచ్చింది.
- నదికి దక్షిణంగా ఆగ్నేయ భాగంలో ఫిలింసిటీ ఏర్పాటుతో హద్దులు అవిభక్త నల్లగొండ జిల్లాను తొక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. పాతబస్తీకి దక్షిణంగా డీఆర్డీఎల్, మిధాని సంస్థల నిర్మాణంతో నగరం కొంత దక్షిణానికి అభివృద్ధి చెందుతూ వచ్చింది.
- 2008లో శంషాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం, దాన్ని అనుసంధానిస్తూ పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఆ తర్వాత ఈ ప్రాంతాన్నంతటినీ దాని నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) వంటివి నగర నిర్మాణాన్ని, విస్తీర్ణాన్ని వేగవంతం చేశాయి. వీటికి తోడు అవిభక్త మెదక్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల గుండా ఓఆర్ఆర్కు సగటున 25 కి.మీ. వ్యాసార్థం దూరంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణం చేపట్టడం నగర విస్తీర్ణం, నిర్మాణాలు ప్రస్తుతం ఇంచుమించు 7జిల్లాల పరిధిలోకి విస్తరించనున్నాయి.

Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






