‘బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సంఘం’ను స్థాపించింది?
తొలి రాజకీయ సంస్థలు
బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్ర సాధనకు 1857లో జరిగిన కృషి విఫలమైనప్పటికీ, ఆధునిక జాతీయోద్యమం పెంపొందడానికి ఈ సంఘర్షణ దోహదపడింది. 1857 తిరుగుబాటు తర్వాత ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగిన భారతీయ ప్రతిఘటనోద్యమ నాయకత్వం, సంప్రదాయక విధానాలను అనుసరించే ఉన్నత వర్గాల నుంచి ఆంగ్ల భాషను అభ్యసించిన వర్గానికి మారింది. ఈ వర్గం జాతీయవాదం, పౌర హక్కులు, రాజ్యాంగబద్ధ ప్రభుత్వం వంటి నూతన భావాల వల్ల ప్రభావితమైంది. నాయకత్వం వహించిన మేధావి వర్గం వారికి పాశ్చాత్య భావాలు, ఆధునిక జాతీయవాదం, ప్రజాస్వామ్యం బాగా వంటబట్టాయి. 1857 సంఘటనల అనంతరం, దేశ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి.
భూ స్వామ్య సంఘం
- బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సంఘంగా ప్రసిద్ధి చెందిన జమీందారీ సంఘం 1837లో ద్వారకానాథ్ ఠాకూర్, ప్రసన్న కుమార్ ఠాకూర్, రాధాకాంత్ దేవ్‌లు స్థాపించారు.
- బెంగాల్, బీహార్, ఒరిస్సా జమీందారీ వర్గ ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు.
- 1843లో విస్తృత రాజకీయ లక్ష్యాలతో బెంగాల్ బ్రిటిష్ ఇండియన్ సొసైటీని ఏర్పాటు చేశారు.
- 1851లో ఈ రెండు సంస్థలను విలీనం చేసి ‘బ్రిటిష్ భారత సంఘం’ను ఏర్పాటు చేశారు.
తూర్పు ఇండియా సంఘం
- దాదాభాయ్ నౌరోజీ 1866లో ఈ సంఘాన్ని లండన్‌లో స్థాపించారు.
- భారతదేశ సమస్యను చర్చించడానికి, బ్రిటిష్ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ఈ సంఘాన్ని ప్రారంభించారు.
- అనతికాలంలోనే ఈ సంస్థ ఆంగ్లేయుల మద్దతును పొంది, బ్రిటిష్ పార్లమెంట్‌పై ప్రభావాన్ని చూపింది.
- అనంతరం భారతదేశంలోని ముఖ్య నగరాలైన బొంబాయి, కలకత్తా, మద్రాస్ నగరాల్లో ఈ సంస్థ శాఖలు ఏర్పాటయ్యాయి.
- తూర్పు ఇండియా సంఘం 1880 తర్వాత పని చేయడం ఆగిపోయింది.
పూనా సార్వజనిక సభ
- ఈ సంస్థను జస్టిస్ మహదేవ్ గోవింద రనడే 1870లో నెలకొల్పాడు.
- రనడే సారథ్యంలో పూనా సార్వజనిక సభ త్రైమాసిక పత్రికను ఆరంభించింది.
- భారత ఆర్థిక స్థితిగతులపై ఈ పత్రికలో మేధావుల విలువైన వ్యాసాలు ప్రచురించారు.
మద్రాస్ నేటివ్ అసోసియేషన్
- దీన్ని 1852లో స్థాపించారు.
- ప్రారంభంలో ఈ సంస్థ బ్రిటిష్ ఇండియా ఆఫ్ కలకత్తాకు అనుబంధంగా ఏర్పడింది.
- అనంతరం స్వతంత్ర సంస్థగా ఏర్పడి అనేక సంవత్సరాల పాటు బ్రిటిష్ పార్లమెంట్‌కు భారత ప్రభుత్వానికి, అధికారులకు అనేక విజ్ఞాపనలను అందించింది.
- ఈ సంస్థ అందించిన విజ్ఞప్తుల్లో 1859, 1861లలో అందినవి ఎంతో ముఖ్యమైనవి.
- ఈ సంస్థ అందజేసిన ఈ విజ్ఞప్తులు ప్రభుత్వంలోని లోపాలను అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా, వాటికి నివారణ మార్గాలను చూపించింది.
- అలాగే పునప్పాకం ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, సుబ్రమణ్య అయ్యర్ మద్రాస్ మహాజన సభను ఆరంభించారు.
- 1865లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ను కేటీ తెలాంగ్, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీల నాయకత్వంలో ప్రారంభించారు.
- ఈ సంస్థలన్నీ ప్రధానంగా పరిపాలన, శాసన సంబంధ వ్యవహారాలపై తమ దృష్టిని కేంద్రీకరించాయి.
బ్రిటిష్ ఇండియా అసోసియేషన్
- భారతదేశంలో రాజకీయ ఆందోళనలను విస్తృత ప్రాతిపదికపై కొనసాగించాల్సిన అవసరాన్ని ఈ అసోసియేషన్ గ్రహించింది.
- చట్టం ముందు సమానత్వాన్ని ఈ సంస్థ కోరింది. భారతీయులకు, పాశ్చాత్యులకు మధ్య ఎలాంటి తేడా చూపించకూడదని, జ్యూరీ విధానంలో విచారణ జరపాలని కోరింది.
- సివిల్ సర్వీసులతో సహా అన్ని అధికార పదవులకు ఎలాంటి విచక్షణ చూపించకుండా భారతీయులకు కూడా అవకాశాలు ఇవ్వాలని ఈ సంస్థ కోరింది.
భారతీయ సంఘం
కాంగ్రెస్‌కు ముందు ఏర్పాటైన జాతీయ సంస్థల్లో అతి ప్రధానమైనది కలకత్తా భారతీయ సంఘం.
బెంగాల్ యువజన జాతీయవాదులు బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ సంప్రదాయ వాద, భూస్వామ్య అనుకూల విధానాలతో విసిగిపోయారు.
ప్రజానీకానికి సంబంధించిన సమస్యలపై నిర్విరామ రాజకీయ ఆందోళన కొనసాగించాలని వారు భావించారు.
సురేంద్ర నాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్‌ల నాయకత్వంలో యువజన బెంగాల్ జాతీయవాదులు 1876 జూలైలో ‘భారతీయ సంఘాన్ని’ స్థాపించారు.
ఈ సంస్థ ముఖ్య ఆశయాల్లో ఉమ్మడి రాజకీయ కార్యక్రమాలతో, భారత ప్రజలను సమైక్యపరచడం, హిందూముస్లింల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని ఏర్పరచడం, దేశంలో బలమైన ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం, నాటి ప్రజా ఉద్యమాల్లో ప్రజాసమూహాన్ని భాగస్వాములను చేయడం ఉన్నాయి.
ప్రజా బాహుళ్యాన్ని ఎక్కువ సంఖ్యలో ఈ సంస్థ పరిధిలోకి తెచ్చేందుకు, పేద వర్గాల కోసం అతి తక్కువ సభ్యత్వ రుసుమును ఏర్పాటు చేసింది.
ఈ బెంగాల్‌లోని అనేక గ్రామాలు, పట్టణాల్లోనే కాకుండా బెంగాల్ వెలుపల సైతం ఈ సంస్థ తన శాఖలను ఏర్పాటు చేసింది.
సంస్థకు స్ఫూర్తివంతమైన నాయకత్వం అందించిన సురేంద్రనాథ్ బెనర్జీ భారతదేశమంతా పర్యటించాడు. ఆయన గంభీరోపన్యాసాలకు ప్రజలు ఆకర్షితులయ్యారు. దేశ రాజకీయ రంగంలో బెనర్జీ ప్రధాన పాత్ర పోషించాడు.
సివిల్ సర్వీస్ పరీక్షల వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించడంతో ఇండియన్ అసోసియేషన్ ఈ చర్యను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇల్బర్ట్ బిల్లు వివాదం సందర్భంగా ఈ సంఘం దృఢంగా వ్యవహరించింది.
ఇల్బర్ట్ బిల్లును సమర్థిస్తూ ఈ సంస్థ నిర్వహించిన ఆందోళన పటిమను చూసి బ్రిటిష్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. దేశీయ పత్రికలకు వ్యతిరేకంగా ఆమోదించిన శాసనాన్ని ఘాటుగా విమర్శించింది. లాంక్షైర్ మిల్లు వస్ర్తాలకు అనుకూలంగా, స్వదేశీ పరిశ్రమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దిగుమతి సుంకాలను రద్దు చేయడాన్ని ఈ సంఘం గర్హించింది.
రిప్పన్ పరిపాలనా కాలంలో ఈ సంస్థ ప్రజా సమస్యలపై చర్చావేదిక అయ్యింది.
సురేంద్ర నాథ్ బెనర్జీ ప్రారంభించిన ప్రాంతీయ సంస్థ జాతీయ సంఘంగా రూపాంతరం చెందింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 1883లో కలకత్తాలో అఖిల భారత సదస్సు మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. 1885లో రెండో సదస్సు నిర్వహించారు. 1886లో ఈ సంస్థ భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనమయ్యింది.
భారత జాతీయ కాంగ్రెస్
అఖిల భారత స్థాయిలో జాతీయ భావాన్ని వ్యక్తీకరించేందుకు మొదటి సారి ఏర్పడిన జాతీయ సంస్థ భారత జాతీయ కాంగ్రెస్.
ఈ సంస్థను 1885లో స్థాపించారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనతో స్వాతంత్య్రోద్యమంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది.
ఈ సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సాధన కోసం అనేక ఉద్యమాలు కొనసాగాయి. దేశంలోని విద్యాధికులు, మేధావులు ఒక చోట సమావేశమై, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఒక జాతీయ వేదికగా భారత జాతీయ కాంగ్రెస్ అవతరించింది.
ఈ జాతీయ సంస్థను స్థాపించింది అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే ఒక ఆంగ్లేయుడు. దేశంలోని నాటి నాయకులు సురేంద్ర నాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, దాదాభాయ్ నౌరోజీ, సుబ్రమణ్య అయ్యర్ తదితరులు హ్యూమ్ ప్రయత్నాలకు సహకరించడం వల్ల ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌ను నెలకొల్పగలిగాడు. ఈ కారణంగానే హ్యూమ్ను ‘భారత జాతీయ కాంగ్రెస్ పితామహడు’గా పిలుస్తారు.
ప్రథమ కాంగ్రెస్ సమావేశం
1885, డిసెంబర్ 28 నుంచి 30 వరకు ప్రథమ జాతీయ కాంగ్రెస్ సమావేశం బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్‌పాల్ సంస్కృత కాలేజీలో నిర్వహించారు.
మొదట్లో పూనా నగరంలో ఈ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలడం వల్ల బొంబాయికి మార్చారు.
నాటి ప్రథమ సమావేశానికి అధ్యక్షుడు ప్రముఖ బెంగాలీ న్యాయవాది బారిస్టర్ ఉమేశ్ చంద్ర బెనర్జీ, ఏవో హ్యూమ్, కేటీ తెలాంగ్లు కార్యదర్శులుగా ఎంపికయ్యారు.
ఆ సమావేశాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
వారిలో న్యాయవాదులు, పత్రిక సంపాదకులు, వాణిజ్యవేత్తలు, భూస్వాములు, ఉపాధ్యాయులు ఉన్నారు. దీనిలో విదేశీయులైన ఏవో హ్యూమ్, వెడ్డర్ బర్న్, హెన్రీ కాటన్లు కూడా పాల్గొన్నారు.
దాదాభాయ్ నౌరోజీ, కేటీ తెలాంగ్, దిన్హావాచా, ఫిరోజ్ షా మెహతా, మహదేవ్ గోవింద రనడే, చంద్రావర్కార్, వీర రాఘవాచారి, ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, కేశవ పిైళ్లె, సుబ్రమణ్య అయ్యర్, బద్రుద్దీన్ త్యాబ్జీ కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్న వారిలో ప్రముఖులు. ఇండియన్ మిర్రర్, ది హిందూ, కేసవి వంటి పత్రిక సంపాదకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించిన డబ్ల్యూసీ బెనర్జీ కాంగ్రెస్ ఆశయాలను వివరించాడు.
జాతీయవాదం వల్ల ప్రభావితులైన కార్యకర్తల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం
కుల, మత, ప్రాంతీయ దురభిమానాలకు అతీతంగా, ప్రజల్లో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించి, దృఢపరచడం
మనస్ఫూర్తిగా చర్చలు జరిపిన తర్వాత విద్యావంతులైన భారతీయులు ముఖ్య సమస్యలపై తీసుకున్న నిర్ణయాలను తీర్మానించడం
తదుపరి సంవత్సరంలో అమలుపరచాల్సిన కార్యక్రమాన్ని వివరించడం
కాంగ్రెస్ మొదటి సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించి, వివిధ తీర్మానాలను ఆమోదించారు. కాంగ్రెస్ ముఖ్యంగా కింది విషయాల గురించి తీర్మానాలు చేసింది.
భారత పరిపాలన వ్యవస్థ పనిచేసే తీరు గురించి సమీక్షించడానికి రాయల్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం
కేంద్ర, ప్రాంతీయ శాసన సభల్లో అధిక సంఖ్యలో భారతీయులకు ప్రాతినిథ్యం కల్పించి ఎక్కువ అధికారాలివ్వడం
సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు ఇంగ్లండ్‌లో, భారతదేశంలో ఏక కాలంలో నిర్వహించడం, ఆ పోటీ పరీక్షలకు వయోపరిమితి పెంచడం.
భారతీయులకు ఉద్యోగ అవకాశాలు పెంచడం, వారిని జాతి వివక్షతో చూడకుండా ఆంగ్లేయులతో సమానంగా చూడటం
న్యాయ శాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయడం
వాయవ్య సరిహద్దు రాష్ట్రం, అయోధ్య, పంజాబ్ రాష్ర్టాల్లో కౌన్సిళ్లను ఏర్పాటు చేయడం
క్షామాలు సంభవించినప్పుడు రుణ సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం
ప్రథమ కాంగ్రెస్ సమావేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తూ చర్చలు మొదలయ్యాయి. ఈ విధంగా ఉదారవాద రాజకీయాలు ప్రారంభించి, వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ సభ, ఆమోదించిన తీర్మానాలు నమ్రతా భావంతో ఉన్నాయి. ఇవి పరిపాలనా యంత్రాంగ సంస్కరణకు, శాసన సభలో ఎన్నిక సిద్ధాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి. అంతేగాక హ్యూమ్ కాంగ్రెస్ తరఫున విక్టోరియా మహారాణికి అభినందలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని బట్టి కాంగ్రెస్ బ్రిటిష్ వారి పట్ల విశ్వాసపూరిత విధానాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది.
మాదిరి ప్రశ్నలు
1. కింది వారిలో ‘బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సంఘం’ను స్థాపించింది?
1) ఠాకూర్
2) ప్రసన్న కుమార్ ఠాకూర్
3) రాధాకాంత్ దేవ్ 4) అందరూ
2. దాదాభాయ్ నౌరోజీ 1866లో ‘తూర్పు ఇండియా సంఘాన్ని’ ఎక్కడ స్థాపించారు?
1) శాన్ఫ్రాన్సిస్కో
2) లండన్
3) బొంబాయి 4) కలకత్తా
3. ఏ సంస్థలను విలీనం చేసి ‘బ్రిటిష్ భారత సంఘం’ను ఏర్పాటు చేశారు?
1) భూస్వామ్య సంఘం
2) బెంగాల్ బ్రిటిష్ ఇండియన్ సొసైటీ
3) మద్రాస్ నేటివ్ అసోసియేషన్
4) 1, 2
4. కింది వాటిలో సరైనవి?
1) 1884లో పీ ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, సుబ్రమణ్య అయ్యర్ ‘మద్రాస్ మహాజన సభ’ను స్థాపించాడు
2) 1885లో కేటీ తెలాంగ్, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీల నాయకత్వంలో బాంబే ప్రెసిడెన్సీ
అసోసియేష న్ను స్థాపించారు
3) 1 4) 1, 2
5. అహ్మదీయ ఉద్యమ స్థాపకుడు?
1) మీర్జా గులాం అహ్మద్
2) ఫకీర్ అహ్మద్ బెరిల్వీ
3) అయోతి థాస్
4) సయ్యద్ అహ్మద్ ఖాన్
6. ‘సుబోధ’ పత్రికను ప్రారంభించింది?
1) దివ్యజ్ఞాన సమాజం
2) రామకృష్ణ మిషన్
3) ప్రార్థనా సమాజం 4) ఆర్య సమాజం
7. ‘సార్వజనిక్ సత్యధర్మ పుస్తక్, గులాంగిరీ’ అనే గ్రంథాలను రచించింది?
1) రామస్వామి నాయకర్
2) మహాత్మా జ్యోతిబా ఫులే
3) మహదేవ్ గోవింద రనడే
4) ఆత్మారాం పాండురంగ
8. ‘భారతీయ బ్రహ్మసమాజం’ను స్థాపించింది?
1) కేశవ చంద్రసేన్
2) రాజా రామ్మోహన్ రాయ్
3) దేవింద్రనాథ్ ఠాగూర్
4) స్వామి శ్రద్ధానంద్
సమాధానాలు
1-4, 2-2, 3-4, 4-4,
5-1, 6-3, 7-2, 8-1.
-సాసాల మల్లికార్జున్ అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు