ప్రగతి పథం..‘థర్మల్’ రథం
విద్యుచ్ఛక్తి
ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ప్రగతి పథంలో పయనించడానికి విద్యుత్తు రంగం ముఖ్యమైనది. కీలక ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, సర్వీస్ రంగాలకు పటిష్ఠమైన విద్యుత్తు రంగం ఎంతో అవసరం. వీటితో పాటు రవాణా, ఆరోగ్యం, విద్య, వాణిజ్యం, వినోదం ఇలా అన్ని రంగాలపై ఈ రంగ ప్రభావం ఎంతో ఉంది. పైగా రాష్ట్ర ప్రజల అభివృద్ధిని అంచనా వేయడానికి విద్యుత్తు వినియోగం ఒక కొలబద్ధతగా పరిగణించవచ్చు.
- ప్రపంచంలో అమెరికా మొదటిసారిగా విద్యుత్తును ఉత్పత్తి చేసింది. భారతదేశంలో మొదటిసారిగా డార్జిలింగ్ (1897)లో విద్యుత్తు ఉపకేంద్రాన్ని నిర్మించారు. తొలిసారిగా కోల్‌కతా నగరాన్ని 1899లో విద్యుదీకరించారు.
- భారతదేశంలో మొదటిసారిగా భారీ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని కర్ణాటకలోని శివ సముద్రం వద్ద 1902లో నిర్మించారు. ఇది స్థాపించినప్పుడు విద్యుదుత్పత్తి సామర్థ్యం 4.5 మెగావాట్లుగా ఉంది. ప్రస్తుత విద్యుదుత్పత్తి సామర్థ్యం 42 మెగావాట్లు ఉంది.
- తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయి. బొగ్గు గనులు ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్నాయి. కృష్ణా, గోదావరి ఇతర చిన్న నదులు హైడ్రల్ విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతున్నాయి. తెలంగాణ అయనరేఖా ప్రాంతంలో ఉండటం వల్ల 330కి పైగా రోజులు సూర్యరశ్మి నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉంది.
- ప్రపంచంలోనే భారత్‌లో అత్యధికంగా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కావడంతో పాటు వినియోగించబడుతుంది. భారతదేశంలో ఈ విద్యుత్తును మహారాష్ట్ర అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణలో సైతం ఇదే తరహా విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో పాటు వినియోగిస్తున్నారు.
శక్తి వనరులు 2 రకాలు: అవి
1) పునరుత్పాదక శక్తి వనరులు
2) పునరుత్పాదన కాని శక్తి వనరులు - పునరుత్పాదకం కాని శక్తి వనరులైన బొగ్గు, ముడిచమురు, సహజ వాయువుల ద్వారా, పునరుత్పాదక శక్తి వనరులైన జలశక్తి, పవన శక్తి, సౌరశక్తిల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. బొగ్గు, నీటి ఆవిరి, ముడి చమురు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్తును థర్మల్ విద్యుత్తు అంటారు.
- 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం విద్యుత్తు వినియోగం పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం వ్యవస్థాపక సామర్థ్యాన్ని తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం చొప్పున విభజించారు.
- రాష్ట్రంలో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 60.70% ఉండగా జల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 39.10% ఉంది. విద్యుత్తు సరఫరాల్లో నష్టాలను పరిశీలిస్తే తెలంగాణలో 2018-2019లో 14.85% కాగా దేశంలో 20.66% ఉంది. కాగా దేశంలో అతి తక్కువ విద్యుత్తు సరఫరాలో నష్టాలను కలిగిన రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది.
1. హిమాచల్ ప్రదేశ్ 14.29%
2. పంజాబ్ 14.73%
3. తెలంగాణ 14.85%
1. హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్
- ఇది రాష్ట్రంలో మొదటిది. హైదరాబాద్ రాష్ట్రంలో 1920లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున ప్రారంభించారు. దీనిని 1992లో మూసివేశారు. ప్రస్తుతం దీని స్థానంలో ప్రసాద్ ఐమ్యాక్స్, ఎన్టీఆర్ గార్డెన్లు ఉన్నాయి.
2. కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (KTPC)
- కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ -I ను 2009 ఫిబ్రవరి నెలలో స్థాపించారు. దీని సామర్థ్యం 500 మెగావాట్లు. ఈ ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘనపురం మండలం చెల్పూరు వద్ద ఏర్పాటు చేశారు. అలాగే కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్-IIను 2016 జనవరి 5న స్థాపించారు. దీని సామర్థ్యం 600 మెగావాట్లు
3. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS)
- దీనిని 1966లో స్థాపించారు. KTPS-A 4 యూనిట్లను కలిగి 240 మెగావాట్లు, KTPS-B, C లు రెండేసి యూనిట్లు కలిగి ఉండి ఒక్కోటి 240 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. KTPS-V (2 యూనిట్లు), KTPS-VI (ఒక యూనిట్) ఒక్కోటి 500 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో స్థాపించారు.
4. జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)
- దీనిని పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1983లో స్థాపించారు. దీని సామర్థ్యం 2600 మెగావాట్లు. దేశంలో 1975లో నెలకొల్పగా ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తి సంస్థగా పేరుగాంచింది.
5. శంకర్పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్తు కేంద్రం
- దీనిని రంగారెడ్డి జిల్లాలో 2002లో నెలకొల్పారు. దీని స్థాపిత సామర్థ్యం 1600 మెగావాట్లుగా ఉంది. ప్రస్తుతం మూసివేశారు.
తెలంగాణలో కొత్తగా చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టులు - భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని మణుగూరు మండలం రామానుజవరం గ్రామం వద్ద స్థాపించారు. దీని సామర్థ్యం 1080 మెగావాట్లుగా ఉంది.
- యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెంలో నెలకొల్పారు. 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. (ఎ-స్టేషన్ 1600 మెగావాట్లు, బి-స్టేషన్ 2400 మెగావాట్లు)
- మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పెగడపల్లిలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్థాపించారు. దీని సామర్థ్యం 1200గా ఉంది.
అతిపెద్ద సోలార్ విద్యుత్తు ప్లాంటు
- తెలంగాణలోనే అతిపెద్ద రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంటును హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నెలకొల్పారు. 2018లో 500 కిలోవాట్ల ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇటీవల 350 కిలోవాట్ల సామర్థ్యం గల మరో ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ రెండు కలిపి రాష్ట్రంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంటుగా నిలిచింది.
ఉదయ్ పథకం (UDAY : Ujwal Discom Assurance Yojana)
- కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల భాగస్వామ్యంతో డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, పునరుద్ధరించడం, వాటికి పెరుగుతున్న ఆర్థిక నష్టాలను సుస్థిరమైన, శాశ్వత పరిష్కారాన్ని అందించడం. కేంద్రంతో రాష్ట్రం 2017, జనవరి 4న అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
- తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థ
- ఇది 2014, జూన్ 2న ఏర్పడింది. విద్యుత్తు ఉత్పత్తి ఈ సంస్థ ఆధీనంలో ఉంటుంది. విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు, ఆధునికీకరణకు ప్రణాళికలను అమలు చేస్తుంది.
1. దక్షిణ తెలంగాణ విద్యుత్తు సంస్థ
- దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. ఇది 15 జిల్లాలకు విద్యుత్తును సరఫరా చేస్తుంది. అవి: హైదరాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట.
2. ఉత్తర తెలంగాణ విద్యుత్తు సంస్థ
- దీని ప్రధాన కేంద్రం వరంగల్‌లో ఉంది. ఇది 18 జిల్లాలకు విద్యుత్తును సరఫరా చేస్తుంది. అవి: ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు.
విద్యుత్తు సరఫరా – ప్రస్తుత పరిస్థితి
- రాష్ట్రంలో వినియోగదారులందరికీ నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. 2021 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో మొత్తం సర్వీసు కనెక్షన్ల సంఖ్య 1.65 కోట్లు ఉంది. ఇందులో గృహ కనెక్షన్లు 1.20 కోట్లు, వ్యవసాయ కనెక్షన్లు 25.62 లక్షలు, పారిశ్రామిక/గృహేతర కనెక్షన్లు 19.29 లక్షలు ఉన్నాయి.
- రాష్ట్రంలోని రెండు డిస్కంలను నష్టాల నుంచి బయట పడేసి, సమర్థంగా పని చేయించేందుకు కేంద్రం రూపొందించిన ‘ఉదయ్’ పథకంలో తెలంగాణ చేరింది. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జనవరి 4న ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు దాదాపు రూ.6,116 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ రూ.7.392 కోట్లు, ఎన్పీడీసీఎల్ రూ.4,505 కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయి.
హరిత విద్యుత్తు (గ్రీన్ పవర్)కు ప్రోత్సాహం
- హరిత విద్యుత్తు, కాలుష్య రహిత విద్యుత్తును ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రం చర్యలు చేపట్టింది. రాష్ట్రం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సౌర విధానం 2015ను ఆవిష్కరించింది. ఈ విధానాలు హరిత ఇంధనంలో పెట్టుబడులకు ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించడమే కాకుండా రాష్ట్రంలో అటువంటి పరిశ్రమలకు వాతావరణాన్ని అభివృద్ధి చేస్తాయి.
- ప్రస్తుతం మన దేశంలో విద్యుత్తు వాహనాల వాడకం క్రమేణా పెరుగుతున్నది. 2030 నాటికి ప్రజా రవాణా వ్యవస్థలో 100 శాతం వ్యక్తిగత రవాణాలో 40 శాతం, విద్యుత్తు వాహనాలు వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తుంది. చార్జింగ్ ఏజెన్సీల కోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కమిషన్లకు ప్రత్యేక కేటగిరీని రూపొందించింది.
- తెలంగాణలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతుల జారీకి ప్రభుత్వం తెలంగాణ సౌర విద్యుత్ విధానం-2015ను 2015, మే 18న ప్రకటించింది.
- అనుమతించిన ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఇంధన శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ పని చేయనుంది. ప్రాజెక్టుల అనుమతుల కోసం మెగావాట్‌కు రూ.10 వేల చొప్పున గరిష్ఠంగా రూ.2 లక్షల రుసుం వసూలు చేయనున్నాయి. ఈ విధానం ఐదేళ్లపాటు అమల్లో ఉండనుంది. ఐదేళ్ల వ్యవధిలో పూర్తయిన ప్రాజెక్టులకు నిర్మాణం పూర్తయిన నాటి నుంచి 10 ఏళ్ల పాటు రాయితీలు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్న నిర్దిష్ట వ్యవధిని ప్రభుత్వం తెలిపింది.
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి, వినియోగించే విద్యుత్తు ఏది?
1) థర్మల్ విద్యుత్తు 2) జల విద్యుత్తు
3) సౌర విద్యుత్తు 4)పవన విద్యుత్తు
2. దక్షిణ తెలంగాణ విద్యుత్తు సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ కలదు?
1) మహబూబ్‌నగర్ 2) సిద్దిపేట
3) హైదరాబాద్ 4) రంగారెడ్డి
3. తెలంగాణ రాష్ట్రం ఎన్ని మెగావాట్ల థర్మల్ విద్యుత్తు సామర్థ్యం కలిగి ఉంది?
1) 5235.26 2) 9,241
3) 2351.7 4) 3082.56
4. రాష్ట్రంలో అత్యధిక జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టు?
1) శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం
2) నిజాంసాగర్ జల విద్యుత్ కేంద్రం
3) నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రం
4) సింగూరు జల విద్యుత్ కేంద్రం
5. ప్రతిపాదిత యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం మొత్తం సామర్థ్యం మెగావాట్లలో?
1) 1080 మెగావాట్లు
2) 2400 మెగావాట్లు
3) 4000 మెగావాట్లు
4) 1600 మెగావాట్లు
6. జతపరచండి.
జల విద్యుత్తు కేంద్రం ప్రదేశం
1. నిజాంసాగర్ ఎ. ఖమ్మం
2. సింగూరు బి. జోగులాంబ గద్వాల
3. పాలేరు మినీ సి. కామారెడ్డి
4. ప్రియదర్శిని జూరాల డి. సంగారెడ్డి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
7. రాష్ట్రంలో మొదటి సోలార్ విద్యుత్తు కేంద్రం ఏ జిల్లాలో కలదు?
1) జోగులాంబ గద్వాల
2) నాగర్‌కర్నూలు
3) కామారెడ్డి 4) రాజన్న సిరిసిల్ల
8. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో కలదు?
1) వరంగల్ 2) హనుమకొండ
3) జయశంకర్ భూపాలపల్లి
4) జనగామ
9. లోయర్ జూరాల జల విద్యుత్తు ప్రాజెక్టు కింది ఏ నదిపై నిర్మిస్తున్నారు?
1) గోదావరి 2) కృష్ణా
3) మున్నేరు 4) పాలేరు
10. ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన విద్యుత్తు ప్రాజెక్టు ఏది?
1) భద్రాద్రి 2) శబరి
3) సీలేరు 4) యాదాద్రి
జీబీకే పబ్లికేషన్స్, హైదరాబాద్, 8187826293
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు