ఆర్థిక సుస్థిరత .. ఆధునిక పరిపాలన వ్యవస్థ
తెలంగాణ చరిత్ర
సాలార్జంగ్ సంస్కరణలు
రెవెన్యూ సంస్కరణలు
- సాలార్జంగ్ సంస్కరణల్లో అతి ముఖ్యమైన సంస్కణలు రెవెన్యూ సంస్కరణలు. నాడు నిజాం పాలనలో భూమిని నాలుగు భాగాల కింద విభజించారు. ఖల్సా ప్రాంతం, సర్ఫేఖాస్, పైగా, జాగీరులు ప్రధానమైనవి. వీటిలో రకరకాల శిస్తు నిర్ణయ పద్ధతులుండేవి. సాలార్జంగ్ ప్రధాని అయిన తర్వాత భూమిశిస్తు పెంపునకు సంస్కరణలను చేపట్టాడు. 1864వ సంవత్సరంలో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశాడు. ఇది దివానీ ప్రాంతంలో, బ్రిటిష్‌వారి నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో రెవెన్యూ పరిపాలన వ్యవస్థను పర్యవేక్షించేది. ఈ బోర్డులో అధ్యక్షుడు నలుగురు సభ్యులుండేవారు. ప్రధాని ఆధ్వర్యంలో రెవెన్యూ పరిపాలనను పర్యవేక్షించే అధికారి ముఖరం ఉద్దౌలా సంతకం బోర్డు ఇచ్చే ఉత్తర్వులపై తీసుకునేవారు.
- 1875వ సంవత్సరంలో కేంద్ర ఇనాం కార్యాలయం ఏర్పాటు చేసి ఇనాం కమిషనర్‌ను నియమించారు. అవసరమైన ఇనాంలను కొనసాగించి, అనవసరంగా, నిరుపయోగంగా ఉన్న ఇనాం భూములను స్వాధీనం చేసుకొని ఖల్సా ప్రాంతంలో కలిపేవారు.
- సాలార్జంగ్ తనఖా జాగీరులను, కుదవ పెట్టిన జాగీరులు, జాత్ జాగీరులను స్వాధీనం చేసుకొని ఖల్సా లేదా దివానీ ప్రాంతంలో కలపడం జరిగింది. 1861కి ముందు ఖాల్సా ప్రాంతం సుమారు 40,000 చదరపు మైళ్లుకాగా తర్వాత 71,598 చదరపు మైళ్లుకు పెరిగింది.
- రెవెన్యూ పరిపాలనను రెవెన్యూ మంత్రి పర్యవేక్షించేవాడు. ఇతని ఆధ్వర్యంలో సదర్ తాలుకాదార్లు, వివిధ తరగతులు తాలూకాదార్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు ఉండేవారు.
- 1855లో జీతాలు ఇచ్చి తాలూకాదార్లను నియమించుకోవడం ప్రారంభమైంది. 1865లో సాలార్జంగ్ ‘జిలాబందీ’ విధానం ప్రవేశపెట్టాడు. భూములను సర్వేచేసి వాటి హద్దులను, సారాన్ని, ఇతర అంశాలను నిర్ధారించడానికి ‘ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్’ను ఏర్పాటు చేశాడు. దీనికి కమిషనర్‌ను నియమించారు. అతి చిన్న ప్రాంతాన్ని తీసుకొని ఈ శాఖ తన పని ప్రారంభించింది. భూమిని కొలిచేందుకు 10 గజాల చైన్‌ను వినియోగిం చారు. దీన్ని ఒక నమూనా కింద ‘భిగా’గా 6/6 చైన్లు లేదా 3600 చదరపు గజాల కింద పేర్కొనడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ‘భిగా’ అనేది భూ కొలతల్లో కీలకమైంది. నేటికీ వాడుకలో ఉంది.
ఆర్థిక సంస్కరణలు
- సాలార్జంగ్ ప్రధాని బాధ్యతలు చేపట్టేనాటికి సరైన చాలా భూభాగంలో పాలన వ్యవస్థలేదు. నిజాం విలువైన భూములను, నగలను కుదువపెట్టి అప్పులు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించేవాడు. రూ.30,60,309 ఆదాయం వచ్చే బీరార్లోయ, రూ. 5,48,601 ఆదాయం బాలాఘాట్, రూ. 2,29,588 ఆదాయం వచ్చే పశ్చిమ జిల్లాలు, రూ. 1,51,342 ఆదాయం వచ్చే రాయచూర్ జిల్లాలు 1853 ఒప్పందం ప్రకారం ఆంగ్లేయులకు ఇవ్వడం జరిగింది. 1857 తిరుగుబాటును అణచివేయడంలో నిజాం ప్రభుత్వం ఆంగ్లేయులకు సహాయం చేయడంతో నిజాం చెల్లించాల్సిన 50 లక్షలు బాకీని మాఫీ చేశారు. 1861లో రాయచూర్ డెల్టా, అహ్మద్‌నగర్, ధారశివం నల్దుర్గ్ వంటి ప్రాంతాలు నిజాంకు తిరిగి లభించాయి. 19 లక్షలకుపైగా విలువ చేసే ఇనాం భూములను, జత్ జాగీర్లను, ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అభివృద్ధి పథంలోకి వచ్చింది. నిజాం తనఖా పెట్టిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొంది. 1860లో ఎగుమతి దిగుమతులపై విధించిన వివిధ రకాల పన్నులను సాలార్ జంగ్ నిషేధించాడు. ఉప్పుపై పన్ను విధించే అధికారం కస్టమ్స్‌శాఖకు అప్పగించాడు. క్రమబద్ధంగా ఈ పన్నుల వసూలు జరిగేది. 1861-62లో దిగుమతి పన్నులు రద్దు చేశాడు.
- 1871లో హైదరాబాద్ రాజ్యంలోని సింగరేణి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. దాంతో బ్రిటిష్‌వారు ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నించారు.
- అటవీ సంపద కాపాడటానికి, అటవీ ఉత్పత్తుల వల్ల వచ్చే ఆదాయం క్రమబద్ధంగా రాబట్టడానికి 1867లో అటవీశాఖను ఏర్పాటు చేయడంతో అటవీ విస్తీర్ణం పెరుగుదల, అటవీ ఉత్పత్తుల పెరుగుదల కనిపించింది.
- 1861లో స్టాంప్ పేపర్ కార్యాలయం మున్షిఖానా ఆధ్వర్యంలో పనిచేసేది. వీటి విక్రయాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. నగరాల్లో రాజ్యకోశ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకు సహాయ సహకారాలు అందించగలిగింది. 1869లో ప్రజా గిడ్డంగుల శాఖను స్థాపించడం జరిగింది. వీటన్నింటి కృషి ఫలితంగా ప్రభుత్వం ఆర్థికంగా బలపడింది.
విద్యా సంస్కరణలు
- పరిపాలన సమర్థవంతంగా కొనసాగడానికి, సుశిక్షితులైన ఉద్యోగులను నియమించుకునేందుకు విద్యావిధానంలో అనేక మార్పులు చేశారు. సాలార్జంగ్ పాశ్చాత్య విద్యాబోధనతో కూడిన దారుల్ ఉల్మ్ అనే పాఠశాలను 1855లో స్థాపించారు. దీనిలో పర్షియా, ఉర్దూ, అరబ్బీ, ఆంగ్లంలో విద్యాభ్యాసం ఆరంభమైంది. 1870లో సిటీ హైస్కూల్, 1872లో చాదర్‌ఘాట్ హైస్కూల్స్ స్థాపించారు. ప్రజాపనుల శాఖలో పని చేయడానికి కావలసిన సిబ్బంది తయారు చేయడానికి ఇంజినీరింగ్ కళాశాలను, రాజకుటుంబంలో పిల్లల కోసం 1873లో మదర్సా-ఇ-ఆలియాను, రాజకుటుంబం కోసం మదర్సా-ఇ-ఐజాను ప్రారంభించారు. తర్వాత నిజాం కళాశాలను స్థాపించారు. అలీఘర్ విద్యా సంస్థ స్థాపనకు ఆర్థిక సహాయం అందించారు.
- జిల్లాల్లో అనేక పాఠశాలలను వివిధ నగరాల్లో ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేయడం వల్ల విద్యా ప్రగతికి తోడ్పడ్డాయి.
రవాణా సౌకర్యాలు
- సాలార్జంగ్ తాను ప్రధాని కాగానే రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి తీవ్రంగా కృషిచేశాడు. హైదరాబాద్‌ను వివిధ ప్రాంతాలతో కలుపుతూ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశాడు. 1868లో హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు రోడ్డు నిర్మించారు. 1870లో హైదరాబాద్ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ఫలితంగా మద్రాస్-బొంబాయి మార్గంలో వాడి నుంచి హైదరాబాద్ వరకు ఒక రైల్వే లైను నిర్మించాలి. 1871లో సింగరేణి బొగ్గునిక్షేపాలు కనుక్కోవడంతో రైల్వేలైను డోర్నకల్, ఇల్లందులకేగాక విజయవాడ,మహారాష్ట్రలోని చందా వరకు పొడిగించాలని నిర్ణయించారు.
- వాడి హైదరాబాద్ రైల్వేలైను 1878లో పూర్తయ్యింది.
- హైదరాబాద్-ముంబైని కలుపుతూ కర్నూలు మీదుగా టెలిగ్రాఫ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1862లో పోస్టల్ వ్యవస్థను హైదరాబాద్‌లో స్థాపించారు. 1871లో ఒకపోస్టు మాస్టర్ జనరల్ ఆధ్వర్యంలో దాన్ని జిల్లాలకు, తాలుకాలకు, పట్టణాలకు విస్తరిస్తూ రెగ్యులర్ పోస్టల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనేక వంతెనలను, కల్వర్టులను ఏర్పాటుచేసి అన్ని జిల్లాలు హైదరాబాద్‌కు వచ్చేలా వివిధ జిల్లాల్లో రోడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. ఈ చర్యల వల్ల హైదరాబాద్ రాజ్యం ఆధునికతవైపు దూసుకుపోయింది.
పబ్లిక్ సర్వీస్ వ్యవస్థ
- సాలార్జంగ్ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అర్హతలు గల యువకులను ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో ఉత్తర భారతీయులు, బెంగాలీలు చేరడంతో ఉద్యోగ అవకాశాలు స్థానికులకు అందకపోవడంతో ముల్కీ ఉద్యమాన్ని ఆరంభించారు. స్థానికేతరులను ఉద్యోగాల నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కాని నిజాం సరైన చర్యలు తీసుకోవడంతో ఉద్యమం సద్దుమణిగింది. ఈ విధంగా సాలార్జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆధునిక హైదరాబాద్ చరిత్రకు మార్గదర్శకుడయ్యాడు.
- సాలార్జంగ్ ఎంతో ప్రతిభ, విజ్ఞానం కలవాడు. తాను హైదరాబాద్ రాజ్య ప్రగతి కోసం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, పరిపాలన వ్యవస్థను సుస్థిరం చేశాడు. నిజాం విశ్వాసం కోల్పోయి పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నించిన ఆంగ్లేయ ఆధికారుల సహాయంతో ప్రధాని పదవిని నిలబెట్టుకున్నాడు. అనేక నూతన సంస్కర ణలను ప్రవేశ పెట్టాడు. రవాణా రైల్వే, పోస్టల్, టెలిగ్రాఫ్ వ్యవస్థలను సంస్కరించి హైదరాబాద్ రాజ్యాన్ని ఆధునిక రాజ్యంగా తీర్చిదిద్దాడు.
ప్రాక్టీస్ బిట్స్
1. డివిజన్/ రెవెన్యూ మండలానికి ముఖ్య అధికారిగా ఎవరు ఉండేవారు?
ఎ) సదర్ తాలుకా దారుడు
బి) తాలుకాదారుడు
సి) తహసీల్ దారుడు
డి) పై ఎవరూకాదు
2. ఎన్ని లక్షలకు పైగా ఆదాయం వచ్చే జిల్లాలను ప్రథమ శ్రేణి జిల్లాలుగా గుర్తించేవారు?
ఎ) 10 లక్షలు బి) 15 లక్షలు
సి) 12 లక్షలు డి) 18 లక్షలు
3. ఇలాకా పేష్కారీ వచ్చే సివిల్ వివాదాలను పరిష్కరించేందుకు గోవిందరావ్ నేతృత్వంలో నూతన న్యాయస్థానాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1872 బి) 1860
సి) 1867 డి) 1893
4. సాలార్జంగ్-1 అధికార బాధ్యతలను చేపట్టిన తర్వాత ఎన్ని నూతన న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు?
ఎ) 4 బి) 2 సి) 3 డి) 6
5. గ్రామ పరిపాలనలో ఎవరు ప్రధాన పాత్ర పోషించేవారు?
1) పట్వారీలు 2) పోలీసు పటేల్
3) రెవెన్యూ పటేల్ 4) తలారీలు
5) దేడ్లు
ఎ) 1, 2, 3 బి) 1, 2 ,3 ,4, 5
సి) 2, 3, 4, డి) 2, 4, 5
6. బ్రిటిష్ వారికి బాకీగా నిజాం ఎన్ని లక్షల రూపాయలను చెల్లించాలి?
ఎ) 30 లక్షలు బి) 50 లక్షలు
సి) 40 లక్షలు డి) 60 లక్షలు
7. రాజ్య కుటుంబంలో పిల్లల కోసం 1873లో స్థాపించిన విద్యా సంస్థ ఏది?
ఎ) మదర్సా ఇ-ఆలియా
బి) మదర్సా-ఇ-ఐజా
సి) ఎ, బి డి) పైవేవీకాదు
8. హైదరాబాద్ రాజ్యంలో ఉత్తర భారతీయులు, బెంగాలీలు చేరడంతో ఉద్యోగ అవకాశాలు స్థానికులకు అందకపోవడంతో వచ్చిన ఉద్యమం?
ఎ) ఉద్యోగ ఉద్యమం
బి) స్థానికత ఉద్యమం
సి) ముల్కీ ఉద్యమం
డి) పైవేవీకాదు
9. సాలార్జంగ్ అటవీశాఖను ఎప్పడు ఏర్పాటు చేశాడు?
ఎ) 1864 బి) 1865
సి) 1867 డి) 1870
10. ఎవరికి ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం ‘డాక్టర్ ఆఫ్ సివిలా లా’ అనే గౌరవ పట్టాను ఇచ్చింది.?
ఎ) నిజాం నవాబు
బి) సాలార్జంగ్
సి) సిరాజ్-ఉల్-ముల్క్
డి) కల్నల్ డేవిడ్ సన్
11. నిజాం రాజ్యం విద్యా వాప్తికి ఎన్ని పాఠశాలలను స్థాపించింది?
ఎ) 150 బి) 155
సి) 160 డి) 162
12. చందా రైల్వేస్కీంను క్షుణ్ణంగా పరిశీలించేందు మేధావి వర్గం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ముఖ్యలు ఎవరు?
ఎ) అఘోరనాథ చటోపాధ్యాయ
బి) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
సి) ఎ, బి
డి) ఎవరూకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు