స్పర్శ తలాల సాపేక్ష చలనాన్ని ఎదిరించే బలం
భౌతిక శాస్త్రం
- ఘర్షణ బలం
- ఒకదానినొకటి స్పర్శిస్తున్న రెండు తలాల మధ్య సాపేక్ష చలనం ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఎదిరించే బలాన్ని ఘర్షణ బలం అంటారు.
ఘర్షణ బలం రకాలు
- స్థైతిక ఘర్షణ: విరామ స్థితిలో ఉన్న వస్తువుల మధ్య ఘర్షణను ైస్థెతిక ఘర్షణ అంటారు. ఇది వస్తువుల మధ్య జరగబోయే చలనాన్ని వ్యతిరేకిస్తుంది.
- వస్తువుపై అనువర్తిత బలం ప్రయోగించినప్పుడు మాత్రమే ైస్థెతిక ఘర్షణ బలం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ బలాలు అనువర్తిత బలంతో పాటు ఒక సీమాంత విలువ వరకు పెరుగుతాయి. గరిష్ఠ ైస్థెతిక ఘర్షణ (f..s)max విలువ అభిలంబ ప్రతిచర్య (N)కు అనులోమానుపాతంలో ఉంటుంది.
(fs)max=kN - గతిక ఘర్షణ: గమనంలోకి వచ్చిన తర్వాత స్పర్శ తలాల మధ్య సాపేక్ష చలనాన్ని నిరోధించే బాలాన్ని గతిక ఘర్షణ బలం అంటారు.
fk=kN - గతిక ఘర్షణ గుణకం k విలువ ైస్థెతిక ఘర్షణ గుణకం s కన్నా తక్కువ.
దొర్లుడు ఘర్షణ: వస్తువుల మధ్య దొర్లుడు చలనం ఉన్నప్పుడు దొర్లుడు చలనాన్ని వ్యతిరేకిస్తూ స్పర్శ తలాలకు సమాంతరంగా పనిచేసే బలాన్ని దొర్లుడు ఘర్షణ అంటారు. - వస్తువు దొర్లుతున్నప్పుడు స్పర్శ తలాలు స్వల్పంగా విరూపణం చెందుతాయి.
ఫలితంగా వస్తువులు పరిమిత తలంలోనే స్పర్శలో ఉంటాయి. దొర్లుడు ఘర్షణ బలం వస్తువుల మధ్య గల స్పర్శతలం వైశాల్యం మీద ఆధారపడుతుంది. - ఘర్షణ బాలలన్నింటిలోకి దొర్లుడు ఘర్షణ బలం విలువ అతి తక్కువ.
దొర్లుడు ఘర్షణ నియమాలు
1. దొర్లుడు ఘర్షణ విలువ స్పర్శలోనున్న తలాల వైశాల్యంపై ఆధారపడుతుంది.
2. దొర్లే వస్తువు, దొర్లుతున్న తలం ఆకారాన్ని మార్పు చేస్తుంది. అందువల్ల తలంలోని పదార్థం దొర్లుడును వ్యతిరేకిస్తుంది.
3. దొర్లుడు ఘర్షణ, దొర్లుతున్న వస్తువు వ్యాసార్థంపై ఆధారపడుతుంది. వ్యాసార్థం ఎక్కువైన దొర్లుడు ఘర్షణ తక్కువగా ఉంటుంది.
fr
4. దొర్లుడు ఘర్షణ లంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంలో ఉంటుంది.
Fr
ఘర్షణ వల్ల కలిగే లాభాలు
- ఘర్షణ బలాలు నిత్యజీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నడిచేటప్పుడు భూమికి, చెప్పులకు మధ్య గల ఘర్షణ బలం జారిపడిపోకుండా ఆపుతుంది.
- ఘర్షణ బలాలు యంత్రాల్లో చలనాన్ని ఒక చక్రం నుంచి రెండో దానికి బెల్టుల ద్వారా అందించడంలో ఉపయోగపడతాయి.
- బ్రేకులు వేసినప్పుడు వాహనాలు నిశ్చలస్థితికి రావడానికి ఘర్షణ బలాలు అవసరం.
- ఘర్షణ బలాలు లేకుంటే తాడుతో వస్తువులను బంధించలేం.
- ఘర్షణ బలాల కారణంగానే మేకులు, బోల్టులు, చెక్కలను కలిపి ఉంచుతాయి.
ఘర్షణ వల్ల కలిగే నష్టాలు
- ఘర్షణ వల్ల చాలా శక్తి వృథా అవుతుంది.
- యంత్ర భాగాలు త్వరగా అరిగిపోతాయి.
- ఘర్షణ వల్ల ఉష్ణం జనించి, యంత్ర పదార్థాల బలం తగ్గిపోతుంది.
ఘర్షణను తగ్గించే పద్ధతులు
నునుపు చేయడం: ఘర్షణ ముఖ్యంగా తలంలోని హెచ్చు తగ్గుల వల్ల వస్తుంది. కాబట్టి తలాలను నునుపు చేయడం ద్వారా ఘర్షణ తగ్గించవచ్చు. కాని బాగా ఎక్కువ నునుపు చేస్తే మళ్లీ ఘర్షణ పెరుగుతుంది.
స్నేహకాలు ఉపయోగించడం: గ్రీజు, నూనె మొదలైన పదార్థాలను ఉపయోగించి యంత్ర భాగాల మధ్య ఘర్షణ తగ్గించవచ్చు.
బాల్ బేరింగ్లు ఉపయోగించడం: చిన్నవి, గుండ్రవైన ఇనుప గోళాలు ఉపయోగించి రెండు తలాల మధ్యగల జారుడు చలనాన్ని దొర్లుడు చలనంగా మార్చవచ్చు. ఇలా చేయడం వల్ల ఘర్షణ తగ్గుతుంది.
స్ట్రీమ్ లైనింగ్: గాలిలో ప్రయాణించే విమానాలకు, గాలి వల్ల ఘర్షణ ఉంటుంది. అదేవిధంగా నీటిలో ప్రయాణించే ఓడలకు, నీటికి మధ్య ఘర్షణ ఉంటుంది. ఈ రకమైన ఘర్షణను తగ్గించడానికి, విమానాలు, ఓడలు ఒక ప్రత్యేకమైన ఆకారంలో తయారు చేస్తారు. దీన్ని స్ట్రీమ్ లైనింగ్ అంటారు.
ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు
గరుకుతల ప్రభావం: తలాల్లో గల చిన్నచిన్న ఎగుడు దిగుడుల్ని గరుకుతలం అంటారు. తలాల గరుకుతనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది. తలాల గరుకుతనం తగ్గితే ఘర్షణ తగ్గుతుంది.
అభిలంబ బల ప్రభావం: వస్తువు ఉండే తలానికి లంబంగా పై దిశలో గల బలాన్ని అభిలంబ బలం అంటారు.
- ఘర్షణ బలం, అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అభిలంబ బలం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది.
ప్రవాహి ఘర్షణ
- వస్తువులు ప్రవాహుల గుండా చలించేటప్పుడు ప్రవాహులు వస్తువులపై కలుగజేసే బలాన్ని ప్రవాహి ఘర్షణ అంటారు. దీన్నే డ్రాగ్ అని కూడా పిలుస్తారు.
- ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు
1. ప్రవాహి పరంగా గల వస్తువుల వడి
2. వస్తువు ఆకారం
3. ప్రవాహి స్వభావం - విమానాలు, ఓడలు, కార్లను ప్రత్యేక ఆకారాల్లో తయారు చేస్తారు. ఎందుకంటే ప్రవాహుల ఘర్షణ బలాన్ని తగ్గించడం కోసం.
ఘర్షణ బలాల క్రమం: దొర్లుడు ఘర్షణ< జారుడు ఘర్షణ<ైస్థెతిక ఘర్షణ వస్తువుల మధ్య ఘర్షణను పెంచే పద్ధతులు
తలాల గరుకుతనం పెంచడం: స్పర్శలో ఉండే యంత్ర తలాల మధ్య గరుకుతనం పెంచడం వల్ల ఘర్షణను పెంచవచ్చు.
తలాలను పొడిగా ఉంచడం: స్పర్శలో ఉండే యంత్ర తలాల మధ్య పొడిగా ఉంచడం వల్ల ఘర్షణను పెంచవచ్చు.
బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించడం: వాహనాలను సాధారణంగా బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించి ఆపుతారు. ఉదాహరణకు గమనంలో గల సైకిల్‌ను ఆపడానికి బ్రేక్‌లను నొక్కుతాం. ఈ బ్రేక్‌లకు గల బ్రేక్ ప్యాడ్లు సైకిల్ చక్రంలోని రిమ్‌ను ఘర్షించుకోవడం వల్ల సైకిల్ ఆగిపోతుంది.
- ఘర్షణ, తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది.
ద్రవ్యవేగం
- ఘర్షణ గుణకం = ఘర్షణ బలం/అభిలంబ ప్రతిచర్య=F/N
- వస్తువు ద్రవ్యరాశి (m) దాని వేగం ల లబ్దాన్ని దాని ద్రవ్యవేగం అంటారు.
- వేగం సదిశ రాశి కాబట్టి ద్రవ్యవేగం కూడా సదిశ రాశియే P=mv
- ద్రవ్యవేగానికి C.G.S ప్రమాణం: గ్రాము.సెం.మీ/సెకను, M.K.S ప్రమాణం: కి.గ్రా. మీటర్/సెకను.
న్యూటన్ రెండో గమన సూత్రం (F=ma) - వస్తువుల త్వరణం వాటిపై పనిచేసే బాహ్య బలానికి అనులోమానుపాతంలో, వాటి ద్రవ్యరాశులకు విలోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా బల దిశలో ఉంటుంది.
- వస్తువు ద్రవ్యవేగంలో మార్పు రేటు దానిపై కలిగించిన బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉండి అదే దిశలో కలుగుతుంది.
బలానికి ప్రమాణాలు
- C.G.S పద్ధతి: m= 1గ్రాము, a=1సెం.మీ/సెకన్2. అయితే అప్పుడు F=ma= 1gmX 1 సెం.మీ/సెకన్2= 1గ్రాము సెం.మీ/సెకన్2= 1 డైను అవుతుంది. అందువల్ల బలానికి C.G.S ప్రమాణం= గ్రాము సెం.మీ/సెకన్2 లేదా డైను.
- M.K.S పద్ధతిలో బలానికి ప్రమాణం న్యూటన్. 1 న్యూటన్=105 డైనులు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో కాలానికి మూల ప్రమాణం?
1) నిమిషం 2) గంట
3) సెకను 4) మీ/సెం.
2. స్థిర బిందువు గుండే వెళ్లే ఊహా రేఖ?
1) స్పర్శ రేఖ 2) భ్రమణ అక్షం
3) ఛేదన రేఖ
4) భ్రమణ చలనం
3. కింది వాటిలో క్రమ చలనం కానిది ఏది?
1) డోలన చలనం
2) భ్రమణ చలనం
3) స్థానాంతర చలనం
4) ఏదీకాదు
4. కింది వాటిలో సరైనది ఏది?
1) చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది
2) స్థిర వేగంతో కదులుతున్న కారు క్రమ చలనంలో ఉంటుంది
3) ఓడోమీటరు రీడింగు తిరోగమనం కాదు
4) పైవన్నీ సరైనవే
5. వాహన వేగాన్ని లెక్కించే పరికరం?
1) స్పీడోమీటర్ 2) ఆల్టీమీటర్
3) ఓడోమీటర్ 4) ఏదీ కాదు
6. కింది వాటిలో సదిశ రాశులు ఏవి?
ఎ. దూరం బి. స్థానభ్రంశం
సి. వేగం డి. వడి
1) ఎ, సి 2) బి
3) బి, సి 4) సి, డి
7. కిందివాటిలో సరైనది ఏది?
ఎ. స్థానభ్రంశం > దూరం
బి. వడి> వేగం
సి. 1మీ/సెం.=5/18 కి.మీ/గంట
డి. 1 కి.మీ/గంట=18/5 మీ/సె
1) ఎ 2) సి, డి
3) బి 4) బి, డి
8. వేగానికి S.I ప్రమాణం?
1) మీటరు 2) మీ/సె
3) మీ/సె2 4) ఏదీకాదు
9. రైల్వే స్టేషన్లలో ఉపయోగించే గడియారం?
1) పరమాణు గడియారం
2) అలాగ్ గడియారం
3) ఎలక్ట్రానిక్ గడియారం
4) సన్డయల్
10. భూమి పరిభ్రమణం వల్ల ఏర్పడేది?
1) పగలు, రాత్రి 2) రుతువులు
3) ఎడారులు 4) పర్వతాలు
సమాధానాలు
1. 3 2. 2 3. 4 4. 4
5. 1 6. 3 7. 3 8. 2
9. 3 10. 2
ద్రవ్యరాశి, బరువు
- న్యూటన్ రెండో గమన సూత్రం ద్రవ్యరాశికి, బరువుకూ మధ్యగల తేడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
- బలాన్ని గురుత్వ ప్రమాణాల్లో కూడా కొలుస్తారు.
- C.G.S పద్ధతిలో గురుత్వ ప్రమాణం ‘గ్రాము భారం’గానూ M.K.S పద్ధతిలో కిలోగ్రాము భారంగానూ కొలుస్తారు.
- అంతరిక్షంలో వస్తువులు ద్రవ్యరాశి కలిగిఉన్నా బరువు కలిగి ఉండవు.
న్యూటన్ మూడో గమన సూత్రం
- ప్రతి చర్యకూ దానికి సమానంగా, వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. లేదా రెండు వస్తువులు ఒకదానిపై ఒకటి పరస్పర చర్య జరుపినప్పుడు ఆ బలాలు రెండూ పరిమాణంలో సమానంగా, దిశలో వ్యతిరేకంగా ఉంటాయి.
ఉదాహరణలు
1. మన చేతిని టేబుల్‌పైన గాని, గోడపైన గాని బలంగా నొక్కితే ఆ టేబుల్ లేదా గోడ మన చేతిపై అంతే బలాన్ని వ్యతిరేక దిశలో కలుగజేస్తుంది. మనం గోడపై లేదా టేబుల్‌పై కలుగజేసే బలాన్ని చర్య అంటాం. అప్పుడు గోడ లేదా టేబుల్ మనపై కలుగుజేసే బలాన్ని ప్రతిచర్య అంటారు. ఈ రెండూ సమానంగానూ, దిశలో వ్యతిరేకంగానూ ఉంటాయి.
2. నడిచేటప్పుడు మనం నేలపై కొంత బలాన్ని కలుగజేస్తాం. నేల ప్రతిచర్య వల్ల మనం ముందుకు నడవగలుగుతున్నాం.
3. నీటిపై ఈదే మనిషి నీటిపై బలాన్ని కలుగజేసి వెనక్కు తోస్తాడు. ప్రతిచర్య వల్ల అతడు ముందుకు పోతాడు.
4. తారాజువ్వ కార్బన్పొడి (బొగ్గు పొడి), పొటాషియం నైట్రేట్ల మిశ్రమంతో గట్టిగా ఉంటుంది. ఇదే ఇంధనం దాని చివర అంటించినప్పుడు మండి, మండుతున్న వాయువులు చాలా వేగంగా శబ్ధం చేస్తూ బయటకు వస్తాయి. ఇదే చర్య, ప్రతిచర్య వల్ల తారాజువ్వ ఆకాశంలోకి దూసుకుపోతుంది.
5. తుపాకీ మీట నొక్కి, పేల్చినప్పుడు తుపాకీ గుండు కొంతవేగంతో ముందుకు పోతుంది ఇదే చర్య. ప్రతిచర్య వల్ల తుపాకీ వెంటనే వెనక్కు నెట్టబడుతుంది. దీన్నే తుపాకీ రీకాయిల్ అంటారు.
అందువల్ల తుపాకీ పేల్చే వ్యక్తి దాని రీకాయిల్ వల్ల కలిగే దెబ్బను నిరోధించడానికి తుపాకీని అతని భుజానికి గట్టిగా అదిమి పట్టుకుంటాడు.
- Tags
- Physics
- Physics articles
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?