రుతుపవన అడవులు.. ‘వాణిజ్య’ అడుగులు
- జాగ్రఫీ
అడవులను ఆంగ్లంలో ఫారెస్ట్ అని పిలుస్తారు. ఈ పదం లాటిన్ భాషా పదం అయినా ఫారిస్ నుంచి ఏర్పడింది. లాటిన్ భాషలో ఈ పదానికి అర్థం గ్రామ సరిహద్దు వెలుపలి ప్రాంతం అని అర్థం. అడవులను సాధారణంగా ‘మానవ ప్రభావానికి లోనుకాని సహజ వృక్ష ప్రాంతం’గా నిర్వచించవచ్చు.
అడవులు-ఉపయోగాలు
- అడవులు మానవ మనుగడకు ఎంతో ఉపయోగమైనవి. ఇవి మనకు వంట చెరకు, వనమూలికలు, సహజసిద్ధమైన రంగులు, భవన, గృహోపకరణ వస్తువులకు, పేపరు తయారీలో కావాల్సిన కలపను అందించడమేగాక నేలల భూసార పరిరక్షణకు, వర్షాలు రావడానికి, వరదలు అరికట్టడానికి కాలుష్య నివారణకు ఎంతగానో దోహదపడుతున్నాయి.
- నీటి సంరక్షణ, వన జంతు సంరక్షణ, సూక్ష్మ శీతోష్ణస్థితి, జెనెటిక్ వనరుల సంరక్షణ, సంయుక్త వాటర్‌షెడ్ నిర్వహణ, నేలల పరిరక్షణ, ఆవరణ వ్యవస్థల పునరుత్పత్తిలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ ఇలాంటి వనరులు ఉండవలసిన నిష్పత్తిలో లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.
- అడవులు పర్యావరణ పరిరక్షణకు కలప ఉత్పత్తికి ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. అడవులు పునర్వినియోగిత వనరులు. ఇవి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర నిర్వహిస్తాయి.
కార్బన్ స్టాక్
- వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ రూపంలోని కార్భన్ ఎంత మేరకు మొక్కలతో గ్రహించబడి అటవీ ఆవరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి రూపంలో నిల్వ ఉన్నదో తెలియజేయడాన్నే ‘కార్బన్ స్టాక్’ అంటారు.
- ప్రభుత్వం పర్యావరణ డిపార్ట్మెంటు, అడవులు, శాస్త్ర సాంకేతిక వ్యవస్థల ద్వారా రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణం 26,969 చ.కి.మీ. ఇది తెలంగాణ భౌగోళిక వైశాల్యంలో 24 శాతం ఆక్రమిస్తుంది. ఇది జాతీయ సరాసరి 21.3 శాతం కంటే ఎక్కువ. రాష్ట్రంలో 33 శాతం అడవులు విస్తరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది.
- 2021-22లో అటవీ, లాగింగ్ ఉప రంగం రూ.1944 కోట్లు ప్రాథమిక రంగం ద్వారా జోడించబడిన స్థూల విలువలో 1.77 శాతం. 2014-15, 2021-22 మధ్య అటవీ, లాగింగ్ ద్వారా స్థిరమైన (2011-12) ధరల వద్ద జీవీఏ(Gross Value Added) 2014-15లో రూ.1,715 కోట్లు ఉండగా 2021-22లో రూ.1,944 కోట్లకు పెరిగింది.
- రాష్ట్రంలోని గొప్ప జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం 12 సంరక్షణ ప్రాంతాలను వెల్లడించింది. (తొమ్మిది వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, మూడు జాతీయ పార్కులు) వీటిని రెండు ఏజెన్సీలు – తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు, తెలంగాణ జీవ వైవిధ్య సంరక్షణ సొసైటీలు నిర్వహిస్తున్నాయి. 2015-16 నుంచి 2021-22 వరకు రాష్ట్రవ్యాప్తంగా 23,000 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 5 జనవరి, 2022 నాటికి, 23,599.5 లక్షల మొక్కలు నాటారు.
- భారత రాజ్యాంగం, ఆర్టికల్ 48ఎ ద్వారా, అన్ని స్థాయిల్లోని ప్రభుత్వాలను పర్యావరణాన్ని రక్షించడానికి, మెరుగుపరచడానికి, దేశంలోని అడవులతో పాటు వన్యప్రాణులను రక్షించడానికి కృషి చేయాలని నిర్దేశిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి) ప్రతి పౌరునిపై ‘అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం’ విధిగా సూచిస్తుంది.
- నీతి ఆయోగ్ ప్రకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో (ఎస్డీజీ) ఇండియా సూచిక 2019-20 ప్రకారం రెండు ఎస్డీజీలకు సంబంధించి తెలంగాణ మార్గదర్శిగా ఉంది. అవి ఎస్డీజీ 13 (వాతావరణ కాలుష్యం మార్పులు, ఎస్డీజీ15 (భూమిపై జీవం).
- తెలంగాణ ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అడవులు ఎక్కువ శాతంలో విస్తరించి ఉన్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అడవుల శాతం తక్కువగా ఉంది. రాష్ట్రంలోని అడవుల శాతం దక్షిణ భారతదేశంలోని రాష్ర్టాలలో కంటే ఎక్కువగా ఉంది. సవరించిన 2002 రాష్ట్ర అటవీ విధానంలోని లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న అడవుల రక్షణ, అభివృద్ధి కోసం వివిధ రకాలైన పథకాలను అమలు చేస్తున్నది.
- ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 38.93 శాతం సాపేక్ష సమృద్ధితో మామిడి చెట్టు (మాంజిఫెరా ఇండికా) అత్యంత సమృద్ధిగా ఉన్న చెట్ల జాతి. పట్టణ ప్రాంతాల్లో ఇది 18.35 శాతం సాపేక్ష సమృద్ధితో వేప చెట్లు ఉన్నాయి.
భారతదేశంలోని అడవులను ప్రధానంగా 5 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. సతత హరిత అరణ్యాలు
2. ఆకురాల్చు అరణ్యాలు
3. పర్వతీయ అరణ్యాలు
4. ముళ్లజాతి (లేదా) చిట్టడవులు
5. ఆటుపోటు అరణ్యాలు
తెలంగాణ అడవులు – రకాలు
1. ఆయనరేఖా, పొడి రుతుపవన (ఆకురాల్చు) అరణ్యాలు: ఎ) దక్షణ, మిశ్రమ, పొడి, ఆకురాల్చు అడవులు, బి) పొడి రుతుపవన ఆకురాల్చు పొదలు, సి) పొడి టేకు అడవులు, డి) ద్వితీయ శ్రేణి పొడి ఆకురాల్చు అడవులు, ఇ) పొడి వెదురు అడవులు, ఎఫ్) హార్డ్వికియా అడవులు, జి) బోస్విల్లె అడవులు, హెచ్) పొడి సవానా భూములు, ఐ) పొడి గడ్డి భూములు.
2. ఆయనరేఖా ముళ్ల అడవులు: ఎ) దక్షిణ ముళ్లపొదలు, బి) దక్షిణ ముళ్ల అడవులు
3. ఆయనరేఖా ఆర్థ్ర ఆకురాల్చు రుతుపవన అరణ్యాలు: ఎ) దక్షిణ ఆర్థ్ర మిశ్రమ ఆకురాల్చు రుతుపవన అరణ్యాలు
అనార్థ్ర ఆకురాల్చు అడవులు
- 70 సెం.మీ. నుంచి 100 సెం.మీ.ల వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. ఈ అడవులు 60.52 శాతం కలిగి ఉన్నాయి. టేకు, వెదురు, ఏగిస, మద్ది, మోదుగ, బూరుగ, సిరిమాను వంటి మొక్కలు పెరుగుతాయి. తెలంగాణలో ఈ అడవులే ఎక్కువ విస్తరించి ఉన్నాయి. ఇవి ద్వీపకల్ప భారతదేశంలో అధికంగా ఉంటాయి. వెదురును గృహావసరాలకు ఉపయోగిస్తుండడంతో ‘పేదవాని కలప’ అని కూడా అంటారు.
- ఆకురాల్చు అడవులు వేసవికాలం వచ్చే ముందు ఆకులను రాలుస్తాయి. వీటిని రుతుపవన అడవులు అని కూడా పిలుస్తారు. వాణిజ్యపరంగా ఇవి అత్యంత లాభదాయకంగా చెప్పవచ్చు.
అర్థ్ర ఆకురాల్చు అడవులు
ఇవి 100 సెం.మీ. నుంచి 200 సెం.మీ. వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. పడమటి కనుమల తూర్పు భాగంలో ఎక్కువగా ఉండి అటవీ విస్తీర్ణంలో 0.37 శాతం ఉన్నాయి. ఈ అడవుల్లో వేగి, ఏగిస, బండారు, జిట్రేగి, మద్ది, సాల్, టేకు, వెదురు, మంచిగంధం, దిరిసెన, బూరుగ, వేప, మేహువా వంటి చెట్లు పెరుగుతాయి. ఈ అడవులు ప్రధానంగా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. సాల్ వృక్షాలను రైల్వే స్లీపర్ల తయారీలో ఉపయోగిస్తారు.
చిట్టడవులు / పొదలు
చిట్టడవులు 70 సెం.మీ. ల కంటే తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ర్టాలతో పాటు తెలంగాణలో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. తుమ్మ, వేప, రేగు, మర్రి, తంగేడు, సుబాబుల్, బ్రహ్మజెముడు, నాగజెముడు, కలబంద మొదలైనవి ఈ అడవుల్లో పెరిగే ముఖ్య వృక్షజాతులు. ఈ వృక్ష జాతుల కలపను వ్యవసాయ పనిముట్లుగా, వంట చెరకుగా ఉపయోగిస్తారు.
అటవీ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన జిల్లాలు
టేకు: గోదావరి పరీవాహక జిల్లాలైన నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలలో పెరుగుతాయి.
వెదురు: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాలు.
రూసాగడ్డి: నిజామాబాద్, కామారెడ్డి. రూసాగడ్డి నుంచి సుగంధ నూనెను తయారు చేస్తారు.
బీడీ ఆకు: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు.
కాగితం-రేయాన్: ఆదిలాబాద్‌లో లభించే గడ్డిని కాగితం-రేయాన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
గంధపు చెట్లు: భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో గంధపు చెట్ల నుంచి నూనెను తయారు చేసి మందులలో, సుగంధ ద్రవ్యాలలోనూ ఉపయోగించడమే కాకుండా అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు.
కలప: ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలలోని అడవుల నుంచి లభ్యం అయ్యే కలపను ఇంటి కప్పులకు, పేపర్ తయారీకి కలపగుజ్జు ఉపయోగిస్తున్నారు.
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది?
1) వేప 2) రావి
3) జమ్మి 4) తంగేడు
2. భారతదేశంలో అటవీ విస్తీర్ణపరంగా తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 9 2) 10 3) 11 4) 12
3. ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు?
1) కేసముద్రం (మహబూబాబాద్)
2) ధూలపల్లి (మేడ్చల్ మల్కాజిగిరి)
3) ములుగు (సిద్దిపేట)
4) లక్సెట్టిపేట (మంచిర్యాల)
4. రాష్ట్రంలో అధికంగా విస్తరించి ఉన్న అడవులు?
1) అర్థ్ర, ఆకురాల్చు అడవులు
2) చిట్టడవులు
3) ముళ్లపొదలు
4) అనార్థ్ర, ఆకురాల్చు అడవులు
5. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా?
1) ఆదిలాబాద్ 2) నల్లగొండ
3) భద్రాద్రి కొత్తగూడెం 4) జోగులాంబ గద్వాల
6. రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా?
1) మంచిర్యాల 2) జోగులాంబ గద్వాల
3) హైదరాబాద్ 4) మెదక్
7. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణ శాతం గల జిల్లా?
1) ములుగు 2) హనుమకొండ
3) కుమ్రంభీం ఆసిఫాబాద్ 4) కరీంనగర్
8. రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణ శాతం గల జిల్లా?
1) జయశంకర్ భూపాలపల్లి
2) హనుమకొండ
3) జోగులాంబ గద్వాల
4) కరీంనగర్
9. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకొంటారు?
1) మార్చి 22 2) ఏప్రిల్ 22
3) మే 22 4) జూన్ 22
10. హరితహారం పథకంలో భాగంగా రాష్ట్రంలో మొత్తం ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు?
1) 130 కోట్లు 2) 230 కోట్లు
3) 330 కోట్లు 4) 430 కోట్లు
సమాధానాలు
1. 3 2. 4 3. 3 4. 4 5. 3
6. 3 7. 1 8. 4 9. 3 10. 2
– జీబీకే పబ్లికేషన్స్ సౌజన్యంతో…
9959361278
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు