‘ఖేతి’ అనే అంకుర సంస్థ ఏ అవార్డును గెలుచుకుంది?
1. వివిధ అంశాల ఆధారంగా ఐసీఏవో ఇచ్చిన ర్యాంకింగ్‌లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (3)
1) 102 2) 65 3) 48 4) 21
వివరణ: కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో-ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) వివిధ అంశాల ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో భారత్ 48వ స్థానంలో ఉంది. 2018లో భారత్ 102వ స్థానంలో ఉంది. మొత్తం 187 దేశాలకు సంబంధించి దాదాపు ఎనిమిది అంశాల ప్రాతిపదికన ర్యాంకులను కేటాయించారు. భారత్ 85.49% స్కోర్ సాధించింది. ఇందులో సింగపూర్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా యూఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాలు ఉన్నాయి. దక్షిణ ఆసియాలో మొత్తం ఎయిర్‌లైన్ ట్రాఫిక్‌లో భారత్ వాటా 69% ఉందని ఐసీఏవో తెలిపింది.
2. ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది? (4)
1) 2026 2) 2025
3) 2024 4) 2023
వివరణ: భారత్ సూచన మేరకు 2023 ఏడాదిని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సును డిసెంబర్ 5న ఢిల్లీలో నిర్వహించారు. ‘తృణధాన్యాలు-స్వల్ప పోషకాహారం’ అనే అంశం ప్రాతిపదికన ఇది జరిగింది. రైతులతో పాటు తృణధాన్యాల వ్యాపారంతో సంబంధం ఉన్న అంకుర సంస్థలు, ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులు, విలువను చేర్చే వ్యాపారులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచంలో తృణధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. 2020లో మొత్తం ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో భారత్ వాటా 41% ఉందని రోమ్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
3. బల్దేర్ బండి రచయిత ఎవరు? (3)
1) సుద్దాల అశోక్ 2) వినాయక్ సాగర్
3) రమేశ్ కార్తిక్ 4) నిరంజన్ సాగర్
వివరణ: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌నగర్ తండాకు చెందిన యువకుడు రమేశ్కార్తిక్. గిరిజన సాహిత్యంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన 20వ ఏట రాసిన కవితా సంపుటి బల్దేర్ బండిలోని జారేర్ బాటి కవితను కాకతీయ విశ్వవిద్యాలయం అటానమస్ కళాశాల డిగ్రీ 5వ సెమిస్టర్ సిలబస్‌లో రెండేళ్ల కిందట చేర్చింది. ప్రస్తుతం ఈ సంపుటికి మరో గుర్తింపు లభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు నాలుగో సెమిస్టర్ సిలబస్‌లో దీన్ని చేర్చారు. 1997లో జన్మించిన రమేశ్ 2014లో రచనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అతను తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం, కలహంస, మువ్వా రంగయ్య ఫౌండేషన్ నవ్యస్వరాంజలి, చిలకమర్తి లక్ష్మీనరసింహం సాహితీ పురస్కారం, బీఎస్ రాములు ప్రతిభా పురస్కారాలను గెలుచుకున్నాడు.
4. తెలంగాణకు చెందిన ఖేతి అంకుర సంస్థ ఏ అవార్డును గెలుచుకుంది? (1)
1) ఎర్త్ షాట్ అవార్డ్
2) బెస్ట్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్
3) వాటర్ ప్రైజ్ 4) ైక్లెమేట్ షాట్ ప్రైజ్
వివరణ: పర్యావరణ ఆస్కార్గా గుర్తింపు పొందిన ఎర్త్‌షాట్ అవార్డ్‌ను తెలంగాణకు చెందిన ఖేతి అనే అంకుర సంస్థ గెలుచుకుంది. పర్యావరణ హితమైన ఒక కొత్త విధానాన్ని ఈ సంస్థ ఆవిష్కరించినందుకు ఈ అవార్డ్ దక్కింది. పర్యావరణ హితంగా ఉండటంతో పాటు తక్కువ వ్యయంతో సుస్థిర ఆదాయం పొందేలా ‘గ్రీన్ హౌస్-ఇన్-ఎ-బాక్స్’ విధానాన్ని ఖేతి సంస్థ రూపొందించింది. ప్రకృతి రక్షణ-పునరుద్ధరణ అనే విభాగంలో ఈ సంస్థ అవార్డును సొంతం చేసుకుంది. పంటలకు క్రిమి కీటకాలతో పాటు ఇతర సమస్యల నుంచి కూడా రక్షణ కల్పించేదే గ్రీన్హౌస్-ఇన్-ఎ-బాక్స్.
5. కింది వాటిలో సరైనదేది? (4)
ఎ. 2022 డిసెంబర్ 1న జీ-20కి భారత్ నాయకత్వం స్వీకరించింది
బి. 2022 డిసెంబర్ 1న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ నాయకత్వాన్ని స్వీకరించింది
1) ఎ 2) బి 3) ఏదీకాదు 4) ఎ, బి
వివరణ: జీ-20 కూటమికి భారత్ డిసెంబర్ 1న నాయకత్వ బాధ్యతలను స్వీకరించింది. వచ్చే ఏడాది ఈ కూటమి సమావేశం భారత్‌లో నిర్వహించనున్నారు. ఇందులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి కూడా డిసెంబర్ 2022 నెలకు భారత్ నాయకత్వం వహిస్తుంది. భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 15. రొటేషన్ పద్ధతిలో ప్రతి దేశానికి ఒక నెల నాయకత్వం వహించే అవకాశం వస్తుంది. ఆగస్ట్ 2021లో భారత్ ఈ పాత్ర పోషించింది. మళ్లీ డిసెంబర్ 2022లో అదే బాధ్యతలను స్వీకరించింది. ఈ మండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశం. 2021లో ఎన్నికయ్యింది. 2022 డిసెంబర్ 31కి నాయకత్వంతో పాటు సభ్యత్వం కూడా ముగియనుంది. ఇప్పటివరకు భద్రతా మండలిలో భారత్ ఎనిమిది సార్లు సభ్యత్వాన్ని పొందింది.
6. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘వాటర్ హీరోస్ షేర్ యువర్ స్టోరీ’ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? (4)
1) మహేందర్ సింగ్ తవార్
2) ఎహాస్ స్వచ్ఛంధ సంస్థ
3) నేహా కుష్వాహ 4) అందరూ
వివరణ: జల సంరక్షణలో ప్రతిభ చూపిన వారికి కేంద్ర జల మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించింది. ఘజియాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన మహేందర్ సింగ్ తవార్ ఈ అవార్డును గెలుచుకున్న వారిలో ఉన్నారు. ప్రజలను శ్రమదానం చేయాలని ఉత్తేజపరిచి, చెరువును పునరుద్ధరించారు. ఎహాస్ అనే సంస్థ ఇంటి మేడపై వర్షపు నీటిని నిలువ చేసుకునే పద్ధతిని ప్రోత్సహించింది. నేహా కుష్వాహ పర్యావరణ కార్యకర్త. పూర్వీకుల జ్ఞాపకార్థం మొక్కలు నాటే ఒక సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసినందుకు అవార్డు దక్కింది.
7. శ్రీలంకకు రుణంపై పది సంవత్సరాల పాటు మారటోరియం విధించాలని కింది వాటిలో కోరిన గ్రూప్? (4)
1) జీ-20 2) జీ-7
3) ప్రపంచ బ్యాంక్ 4) పారిస్ క్లబ్
వివరణ: శ్రీలంక రుణ భారాన్ని తప్పించేందుకు పది సంవత్సరాల పాటు మారటోరియం ఇవ్వాలని 22 దేశాలతో కూడిన పారిస్ క్లబ్ కోరింది. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్‌లకు ఈ విజ్ఞప్తి చేసింది. శ్రీలంకకు ఇప్పటికే భారత్ ఎనిమిది సార్లు లైన్ ఆఫ్ క్రెడిట్‌ను అందించింది. గత అయిదేళ్లుగా శ్రీలంకకు రుణం ఇవ్వడంలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత్ ఈ ఏడాది అధిగమించింది. ఆర్థికంగా శ్రీలంకను ఆదుకుంది. పారిస్ క్లబ్ 22 దేశాలతో కూడిన వ్యవస్థ. పశ్చిమ యూరప్, స్కాండినేవియా దేశాలతో పాటు అమెరికా, ఆసియాలోని జపాన్, దక్షిణ కొరియా ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
8. సంగం అనేది ఏ రెండు దేశాల నావికా విన్యాసం? (2)
1) భారత్, శ్రీలంక
2) భారత్, అమెరికా
3) భారత్, ఇండోనేషియా
4) భారత్, థాయిలాండ్
వివరణ: సంగం అనేది భారత్, అమెరికా దేశాల మధ్య నావికా విన్యాసం. 1994 నుంచి రెండు దేశాల మధ్య దీన్ని నిర్వహిస్తున్నారు. ఏడో సంగం విన్యాసాన్ని డిసెంబర్ 1న ఇరు దేశాలు ప్రారంభించాయి. మూడు వారాల పాటు కొనసాగుతాయి. ప్రస్తుతం దీన్ని గోవాలో నిర్వహిస్తున్నారు. భారత్ తరఫున మార్కో (ఎంఏఆర్సీవో), అమెరికా తరఫున ఎస్ఈఏఎల్ఎస్ నావికా దళాలు పాల్గొన్నాయి.
9. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో రానుంది? (3)
1) దక్షిణాఫ్రికా 2) జపాన్
3) ఆస్ట్రేలియా 4) దక్షిణ కొరియా
వివరణ: ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యింది. 16 దేశాలు ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. 2028 నాటికి ఈ నిర్మాణం పూర్తి కానుంది. దీనికి ‘ది స్కేర్ కిలోమీటర్ అరే’ అని పేరు పెట్టారు. నిర్మాణ బాధ్యతను ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు చేపట్టాయి. అంతరిక్ష పరిశోధన కోసం దీన్ని వినియోగించనున్నారు. ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను కూడా ఇది పరిశీలిస్తుంది. స్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ (ఎస్కేఏవో) అనేది ఒక అంతర్జాతీయ కూటమి. దీన్ని 2021లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం బ్రిటన్‌లో ఉంది. భారత్ తరఫున నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ ప్రాతినిథ్యాన్ని కలిగి ఉంది.
10. ‘ఒక జిల్లా ఒక క్రీడ’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం? (4)
1) ఉత్తరాఖండ్ 2) మణిపూర్
3) కేరళ 4) ఉత్తరప్రదేశ్
వివరణ: జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటేందుకు ‘ఒక జిల్లా ఒక క్రీడ’ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఒక్కో జిల్లాలో ఒక్కో క్రీడను ఎంపిక చేసి ప్రోత్సహిస్తారు. ఆయా జిల్లాల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపే ఆటనే ఎంపిక చేస్తారు.
11. జతపరచండి? (1)
ఎ. రెపోరేట్ 1. 18%
బి.బ్యాంక్ రేట్ 2. 4.50%
సి. నగదు నిల్వల నిష్పత్తి 3. 6.50%
డి. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి 4. 6.25%
1) ఎ-4, బి-3, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1
వివరణ: డిసెంబర్ 7న ఆర్బీఐ తన నూతన ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలకమైన రెపోరేట్‌ను 35 బేసిక్ పాయింట్లు పెంచింది. దీంతో ప్రస్తుతం రెపోరేట్ 6.25 శాతానికి చేరింది. ఈ విధాన రేటును పెంచడం వరుసగా ఇది అయిదో సారి. ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 6%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 6% ఉన్నాయి. రివర్స్ రెపోరేట్ 3.35 శాతం ఉంది. ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ ఈ విధానాన్ని ప్రకటించింది. దీనికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వం వహిస్తున్నారు.
12. దేని నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కొత్త విధానాన్ని ఐఐటీ మద్రాస్ ఇటీవల ఆవిష్కరించింది? (3)
1) పంట వృథా 2) చెత్త
3) సముద్రపు అలలు 4) ఏదీకాదు
వివరణ: సముద్రపు అలల శక్తిని వినియోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ మద్రాస్ ఆవిష్కరించింది. దీనికి సింధూజ-1 అని పేరు పెట్టారు. సింధుజ అంటే సముద్రం నుంచి ఆవిర్భవం అని అర్థం వస్తుంది. ఈ ప్రయోగాన్ని నవంబర్ రెండోవారంలో తమిళనాడులోని ట్యూటికోరిన్ తీరంలో విజయవంతంగా నిర్వహించారు. ఇక్కడ సముద్రపు లోతు సుమారుగా 20 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఇది 100 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. రానున్న మూడు సంవత్సరాల్లో దీని సామర్థ్యాన్ని 1 మెగావాట్‌కు పెంచేందుకు కృషి చేస్తున్నారు.
13. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు కొత్త ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికయ్యారు? (2)
1) రాకేశ్ బల్లా 2) విజేందర్ శర్మ
3) రాజీవ్ లక్ష్మణ్ కరండికర్
4) జీసీ ముర్ము
వివరణ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు కొత్త ప్రెసిడెంట్‌గా విజేందర్ శర్మ, వైస్ ప్రెసిడెంట్‌గా రాకేశ్ బల్లా ఎన్నికయ్యారు. 2022-23కు వీరు ఈ పదవిలో ఉంటారు. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్‌కు పార్ట్‌టైం చైర్‌పర్సన్‌గా రాజీవ లక్ష్మణ్ కరండికర్ నియమితులయ్యారు. ఆయన చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది ఒక స్వయం పాలన సంస్థ. 2005లో దీన్ని ఏర్పాటు చేశారు. రంగరాజన్ కమిషన్ సూచన మేరకు ఏర్పాటైన ఈ కమిషన్ గణాంకాలకు సంబంధించి వివిధ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుంది. జీసీ ముర్ము ప్రస్తుతం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా ఉన్నారు
14. జనవరి 1, 2023లో దేనికి భారత్ నాయకత్వం స్వీకరించనుంది? (2)
1) మానవ హక్కుల మండలి
2) వాసెనార్ ఏర్పాటు
3) అణు నిరాయుధీకరణ ఒప్పందం
4) ఏదీకాదు
వివరణ: 2023, జనవరి 1న భారత్ వాసెనార్ ఏర్పాటుకు నాయకత్వం వహించనుంది. ఇది ఆయుధాల రవాణాకు సంబంధించింది. ఇందులో 42 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ 42వ సభ్య దేశం. 2017లో చేరింది. సంప్రదాయ ఆయుధాలు, ద్వంద్వ అవసరాలకు వినియోగించే వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం తదితరాలను బదిలీ చేయడంలో బాధ్యతాయుతంగా ఉండేందుకు ఉద్దేశించింది ఈ వాసెనార్. 1996లో ఇది అమల్లోకి వచ్చింది. హేగ్ వద్ద ఉన్న ఒక చిన్న ప్రాంతం వాసెనార్.
15. అగ్ని వారియర్ ఏ దేశంతో భారత్ నిర్వహించే సైనిక విన్యాసం? (3)
ఎ) థాయిలాండ్ బి) నేపాల్
3) సింగపూర్ 4) మలేషియా
వివరణ: అగ్ని వారియర్ అనేది భారత్, సింగపూర్ల మధ్య జరిగే యుద్ధ విన్యాసం. నవంబర్ 30న ఇది ముగిసింది. ఇరు దేశాలకు చెందిన సైన్యం ఇందులో పాల్గొంది. అగ్నిశక్తి ప్రణాళిక, దాని కార్యాచరణ తదితరాలను ప్రదర్శించారు.
- Tags
- Kheti
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు