తెలంగాణ వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్బాక్స్
తెలంగాణ
- కొత్త తరం ఇంటర్నెట్ టెక్నాలజీగా పిలుస్తున్న వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్బాక్స్ను తెలంగాణ ఐటీ శాఖ ఆవిష్కరించింది. బెంగళూరులో నిర్వహించిన ఎథ్ ఇండియా హ్యాకథాన్-2022 డిసెంబర్ 4న ముగిసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి దీన్ని అధికారికంగా ప్రారంభించారు. దేశీయ కంపెనీలు, స్టార్టప్‌లను సమర్థంగా నడిపేందుకు వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్బాక్స్ దోహదపడుతుంది. ప్రపంచంలోని అత్యాధునిక వెబ్ 3.0 టెక్నాలజీ కొన్ని దేశాల్లోనే ఉండగా, ఇప్పుడు అది తెలంగాణలో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై అమెరికాకు చెందిన కాయిన్‌బేస్ సంస్థ డైరెక్టర్ కేటీ మిచెల్, పరిశ్రమలు, ఐటీ శాఖల చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ సంతకాలు చేశారు.
- తెలంగాణలో డేటా సెంటర్ ఏర్పాటుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్యాండ్ సంస్థ ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం డిసెంబర్ 6న కుదుర్చుకుంది. ఇందుకు రాష్ట్రంలో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ (సీఎల్ఐఎన్టీ-క్లింట్) రూ.6,200 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సింగపూర్‌లో 22 ఏళ్ల క్రితం ఏర్పాటైన క్యాపిటల్యాండ్ 30 దేశాల్లో 260 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందని క్యాపిటల్యాండ్ భారత సీఈవో సంజీవ్ దాస్ గుప్తా వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరణ ప్రణాళికలో భాగంగా భారత్‌లోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని దాస్ ప్రకటించారు.
క్రీడలు
అనీష్ తొప్పాని
- భారత షట్లర్ అనీష్ తొప్పాని ఆసియా బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అండర్-15 విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు. థాయిలాండ్‌లోని నోంతబురిలో డిసెంబర్ 3న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పురుషుల సింగిల్స్‌లో చుంగ్-హ్సియాంగ్ యిహ్ (చైనీస్ తైపీ) గెలిచి స్వర్ణ పతకం సాధించాడు.
- అండర్-17 పురుషుల డబుల్స్‌లో అర్ష్ మహ్మద్-సంస్కర్ స్రస్వత్ రజతం గెలుచుకున్నారు. అండర్-17 మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా రజతం గెలుచుకుంది. థాయిలాండ్‌కు చెందిన సరున్రాక్ విటిద్సర్న్ స్వర్ణం సాధించింది.
అర్జున్ ఇరిగేశి
- తెలంగాణకు చెందిన చెస్ క్రీడాకారుడు అర్జున్ ఇరిగేశి టాటా స్టీల్ చెస్ బ్లిట్జ్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు. డిసెంబర్ 4న కోల్‌కతాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 18 రౌండ్లు ముగిసే సరికి 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 10 గేముల్లో గెలిచిన అర్జున్ ఐదు గేమ్‌లను డ్రా చేసుకొని మూడు గేముల్లో ఓడిపోయాడు. 11.5 పాయింట్లతో నకముర (అమెరికా) 2, 9.5 పాయింట్లతో షఖిర్యార్ (అజర్బైజాన్) 3వ స్థానాల్లో నిలిచారు. ఇదే టోర్నీ ర్యాపిడ్ ఈవెంట్లో అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు.
- బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో భారత్‌కు చెందిన వైశాలి (13.5 పాయింట్లు) విజేతగా నిలువగా.. మరియా (ఉక్రెయిన్) రన్నరప్‌గా నిలిచింది.
మనీషా
- భారత యువ షట్లర్ మనీషా రామదాస్ (17) బీడబ్ల్యూఎఫ్ అవార్డు డిసెంబర్ 6న అందుకుంది. ఈ ఏడాది అద్భుత ప్రదర్శనకు బీడబ్ల్యూఎఫ్ మహిళా పారా బ్యాడ్మింటన్ ప్లేయర్-2022 అవార్డు గెలుచుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎస్‌యూ 5 విభాగంలో స్వర్ణం సాధించింది. దీంతో ఈ సీజన్లో మొత్తం 11 స్వర్ణాలు, 5 కాంస్య పతకాలు గెలుచుకుంది.
జాతీయం
నాగ్‌పూర్ మెట్రో
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో డబుల్ డెకర్ వయాడక్ట్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గిన్నిస్ రికార్డులో నిలిచిందని మహా మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ డిసెంబర్ 6న వెల్లడించారు. వార్ధా రోడ్డు ప్రాంతంలో 3.14 కిలోమీటర్లు ఉన్న ఈ డబుల్ డెకర్ వయాడక్ట్ ఈ రికార్డు సాధించింది. ఈ నిర్మాణం ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా గుర్తింపు పొందింది. దీని పై భాగంలో మెట్రో రైలు, మధ్యలో హైవే ఫ్లై ఓవర్, కింద రోడ్డు కొనసాగుతున్నాయి.
యూరోపియన్ యూనియన్
- యూరోపియన్ యూనియన్ (ఈయూ)-ఇండియా కాంపిటీషన్ వీక్ 5వ ఎడిషన్‌ను ఢిల్లీలో డిసెంబర్ 5 నుంచి 7 వరకు నిర్వహించారు. యూరోపియన్ కమిషన్ డైరెక్టరేట్-జనరల్ ఫర్ కాంపిటీషన్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారుల మధ్య పరస్పర సహకారం కోసం దీన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని ఈయూ, భారతదేశం పోటీ రంగంలో సహకారం, అవగాహన కోసం 2013లో ఏర్పాటు చేశారు. సీసీఐ చైర్పర్సన్ సంగీత వర్మ, భారతదేశం, భూటాన్‌ల ఈయూ డెలిగేషన్ డిప్యూటీ హెడ్ సెపో నుర్మి.
ఆర్బీఐ
- సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్‌వర్క్ ఆధ్వర్యంలో మాల్దీవుల మానిటరీ అథారిటీ (ఎంఎంఏ)తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 200 మిలియన్ యూఎస్ డాలర్ల కరెన్సీ స్వాప్ ఒప్పందంపై డిసెంబర్ 8న సంతకం చేసింది. స్వాప్ అంటే మార్పిడి. రెండు దేశాల మధ్య కరెన్సీ మార్పిడి అనేది ముందుగా నిర్ణయించిన నిబంధనలు, షరతులతో కూడిన ఒప్పందాన్నే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటారు.
అంతర్జాతీయం
వరల్డ్ సాయిల్ డే
- ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘వరల్డ్ సాయిల్ డే’ని డిసెంబర్ 5న నిర్వహించారు. దీన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ 2002లో సిఫారసు చేసింది. యూఎన్ జనరల్ అసెంబ్లీ 2014లో ఏర్పాటు చేసింది. ఈ ఏడాది దీని థీమ్ ‘సాయిల్స్, వేర్ ఫుడ్ బిగిన్స్’. ఈ దినోత్సవం సందర్భంగా ‘గ్లోబల్ స్టేటస్ ఆన్ బ్లాక్ సాయిల్స్’ రిపోర్ట్‌ను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) విడుదల చేసింది.
గాబ్లిన్ మోడ్
- ఈ ఏటి మేటి పదంగా ‘గాబ్లిన్ మోడ్’ను ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రచురించే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (వోయూపీ) డిసెంబర్ 5న ప్రకటించింది. గాబ్లిన్ మోడ్ అనేది ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించే విధానానికి ఒక యాస పదం. సామాజిక నిబంధనలను పాటించకుండా తన అలవాట్లు, కార్యకలాపాలను కొనసాగించడం. ఎంతసేపటికీ తన సుఖాలు, తన కోరికలే తప్ప ఇతరుల గురించి పట్టించుకోని తత్వమని, బద్ధకం, అపరిశుభ్రత, దురాశ జీర్ణించిన ధోరణిని ఈ పదం సూచిస్తుంది. ఈ పదం 2009లో ట్విటర్లో మొదటిసారిగా కనిపించింది. లాక్డౌన్ అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటపడిన నేపథ్యంలో 2022లో పాపులారిటీ పొందింది. ప్రపంచమంతటా ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో అత్యధికంగా 92 శాతం ఓట్లు ఈ పదానికే వచ్చాయి. ఈ ఓటింగ్‌లో ఈ పదంతో పాటు మెటావర్స్ (Metaverse), హ్యాష్ఐస్టాండ్ విత్ (#IStandWith) నిలిచాయి.
వేధింపులపై సర్వే
- పని ప్రదేశాల్లో సిబ్బందిపై వేధింపులపై ఐరాస ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో), లాయిడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్, గాలప్ సంస్థలు నిర్వహించే సర్వే వివరాలను డిసెంబర్ 5న విడుదల చేశారు. దీని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పని ప్రదేశాల్లో దిగువ స్థాయి సిబ్బంది ఏదో ఒక రకమైన హింస, వేధింపులకు ప్రతి ఐదుగురిలో ఒకరు గురవుతున్నారు. 121 దేశాల్లో 75 వేల మంది సిబ్బందిపై సర్వే చేయగా 22 శాతం మందికి పైగా ఈ వేధింపుల బారిన పడుతున్నారని తేలింది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన మొట్టమొదటి సర్వే ఇది.
ఫోర్బ్స్ మహిళలు
- వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్-2022 జాబితాను ఫోర్బ్స్ మ్యాగజీన్ డిసెంబర్ 6న విడుదల చేసింది. ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ (బెల్జియం) మొదటి స్థానంలో నిలువగా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే (జర్మనీ) రెండో స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (యూఎస్) మూడో స్థానంలో నిలిచారు. మేరీ బర్రా (యూఎస్) 4, అబిగైల్ జాన్సన్ (యూఎస్) 5, మిలిండా ఫ్రెంచ్ గేట్స్ (యూఎస్) 6, జార్జియా మెలోని (ఇటలీ) 7, కరెన్ లించ్ (యూఎస్) 8, జూలీ స్వీట్ (యూఎస్) 9, జేన్ ఫ్రేజర్ (యూఎస్) 10వ స్థానాల్లో ఉన్నారు.
- భారత్ నుంచి నిర్మలా సీతారామన్ 36, రోష్నీ నాడార్ మల్హోత్రా (హెచ్‌సీఎల్) 53, మాధవి పురి బచ్ (సెబీ చైర్పర్సన్) 54, సోమా మోండల్ (సెయిల్ చైర్పర్సన్) 67, కిరణ్ మజుందార్ షా (బయోకాన్) 77, ఫల్గుణి నాయర్ (నైకా) 89వ స్థానాల్లో నిలిచారు.
- ఇరాన్లో హిజాబ్ సరిగా ధరించలేదని నైతిక పోలీసులు అరెస్ట్ చేసి, పెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక మరణించిన మహ్సా అమిని 100వ స్థానంలో నిలిచారు.
ఆవిరితో స్పేస్‌క్రాఫ్ట్
- డిసెంబర్ 7న జపనీస్ స్పేస్ ఏజెన్సీ (జాక్సా) తొలిసారిగా ఇంధనానికి బదులు ఆవిరిని వినియోగించి స్పేస్‌క్రాఫ్ట్‌ను నడిపి రికార్డు సృష్టించింది. క్యూబ్‌శాట్ ఈక్విలిబ్రియమ్ లూనార్ ఎర్త్ పాయింట్ 6యూ స్పేస్‌క్రాఫ్ట్ సాయంతో వాటర్ ప్రొపెల్లెంట్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. నాసాకు చెందిన ఓరియన్ క్యాప్సూల్ మిషన్ నుంచి జపాన్‌కుచెందిన రెండు క్యూబ్‌శాట్‌లను చంద్రుడిపైకి పంపారు. ఆర్టెమిస్-1తో పాటు ఓమోటెనాషి, ఈక్యులియస్ను ప్రయోగించారు. దీనిలో ఈక్యులియస్ను ఎర్త్-మూన్ లెగ్రాంజ్ పాయింట్ (ఈఎంఎల్-2) వద్దకు పంపుతున్నారు.
వార్తల్లో వ్యక్తులు
వీణా నాయర్
- ఆస్ట్రేలియాలోని భారత సంతతికి చెందిన వీణా నాయర్ 2022 ప్రైమ్ మినిస్టర్ ప్రైజ్‌కు డిసెంబర్ 5న ఎంపికయ్యారు. సెకండరీ పాఠశాలల్లో సైన్స్ టీచింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. మెల్బోర్న్ నగరానికి చెందిన ఈమె వ్యూ బ్యాంక్ కాలేజ్ హెడ్ ఆఫ్ టెక్నాలజీగా, ఎస్టీఈఏఎం ప్రాజెక్ట్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు.
చాలామందికి ఎస్టీఈఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) అంటే తెలుసు. కానీ ఎస్టీఈఏఎం గురించి తెలియదని, దీనిలో ఏ అంటే ఆర్ట్స్ (కళ) అని వీణా నాయర్ చెప్పారు. ఇది విద్యార్థులకు సృజనాత్మకతను అందిస్తుందని వెల్లడించారు. ఎస్టీఈఏఎంలో ప్రముఖ విద్యావేత్తగా ఆమె భారత్, యూఏఈ, ఆస్ట్రేలియాలలో మంచి గుర్తింపు ఉంది.
నాగేశ్వర్‌రెడ్డి
- ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్‌రెడ్డి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పురస్కారాన్ని డిసెంబర్ 6న అందుకున్నారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ 8వ వార్షికోత్సవం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు అందజేశారు.
అరుణ్‌కుమార్ సింగ్
- ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ చైర్మన్‌గా అరుణ్ కుమార్ సింగ్ డిసెంబర్ 7న నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు ఉంటారు. అరుణ్‌కుమార్ బీపీసీఎల్ చైర్మన్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైరైన వ్యక్తిని మహారత్న హోదాగల ప్రభుత్వ రంగ సంస్థకు చైర్మన్‌గా నియమించడం ఇదే తొలిసారి.
జెలెన్స్కీ
- ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-2022’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీని ప్రముఖ టైమ్ మ్యాగజీన్ డిసెంబర్ 7న ప్రకటించింది. రష్యా దాడులను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు జెలెన్స్కీని హీరోగా పేర్కొంటూ అతడి ముఖచిత్రంతో టైమ్ మ్యాగజీన్ సంచికను ప్రచురించింది.
అర్చన కేఉపాధ్యాయురాలు, విషయ నిపుణులు, నల్లగొండ
Previous article
‘ఖేతి’ అనే అంకుర సంస్థ ఏ అవార్డును గెలుచుకుంది?
Next article
దివ్యమైన ఆహారం.. సంపూర్ణ ప్రొటీన్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు