పెద్ద రాష్ర్టాలతో సమాఖ్య వ్యవస్థ బలహీనం
భాషాప్రయుక్త రాష్ర్టాలు/చిన్న రాష్ర్టాలపైన డా. బీఆర్ అంబేద్కర్ అభిప్రాయాలను చర్చించండి?
పరిచయం రాష్ర్టాల ఏర్పాటు లేదా పునర్వ్యవస్థీకరణ అనేది భారతదేశంలో అత్యంత సున్నితమైన అంశం. రాజ్యాంగం ప్రకారం ఈ అధికారం పార్లమెంట్ చేతిలో ఉన్నప్పటికీ చిన్న రాష్ర్టాల ఏర్పాటు డిమాండ్ అనేది అనాదికాలం నుంచి వస్తూనే ఉంది. ఈ విషయంలో అంబేద్కర్ తన అభిప్రాయాలను ‘భాషాప్రయుక్త రాష్ర్టాలపై భావాలు’ అనే గ్రంథంలో పొందుపరిచారు.
అంబేద్కర్ అభిప్రాయం
- ఒక రాష్ట్రంలో ఉన్నవాళ్లు ఒకే భాష మాట్లాడేటట్లుగా పునర్వ్యవస్థీకరణ జరగాలి. అంటే ఒక రాష్ర్టానికి ఒకే భాష ఉండాలి. కానీ ఒకే భాషవారికి అనేక రాష్ర్టాలు ఉండవచ్చు.
- హిందీ మాట్లాడేవారికి బహు రాష్ర్టాలను ఏర్పాటు చేయాలి. మరాఠీ మాట్లాడే మహారాష్ట్రను 3 లేదా 4 రాష్ర్టాలుగా విభజించాలి.
- రాష్ర్టాల ఏర్పాటు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా శాస్త్రీయంగా, నిష్పక్షపాతంగా జరగాలి. మిశ్రమ రాష్ట్ర ఆలోచనలను పూర్తిగా పక్కనపెట్టాలి.
- జనాభా, విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబన, భాష ఇత్యాది అంశాల ఆధారంగా రాష్ర్టాలను ఏర్పాటు చేయాలి.
- చిన్న రాష్ర్టాలను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంది. పరిపాలన కూడా సమర్థవంతంగా కొనసాగుతుంది.
- చిన్న రాష్ర్టాలను ఏర్పాటు చేయడం వల్ల దళితులు, మైనారిటీలకు ప్రాతినిథ్యం పెరుగుతుంది. మెజారిటీ, మైనారిటీల మధ్య నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలి.
- పెద్ద రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.
- ఉత్తరాదిన పెద్ద రాష్ర్టాలు, దక్షిణాన చిన్న రాష్ర్టాలను ఏర్పాటు చేయడం వల్ల సమతుల్యం దెబ్బతింటుంది.
- జనాభా, భౌగోళిక అంశాల ఆధారంగా అన్ని రాష్ర్టాలు ఒకే పరిమాణంలో ఉండటం శ్రేయస్కరం.
- రెండు కోట్ల జనాభాకు రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తే సహేతుకంగా ఉంటుంది.
ముగింపు
ప్రారంభంలో అంబేద్కర్ ఒక భాష మాట్లాడే ప్రజలు ఒకే రాష్ట్రంలో ఉండాలని భాషాప్రయుక్త రాష్ర్టాలకు సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఇదే విషయాన్ని థార్ కమిషన్‌కు విన్నవించినా, కాలక్రమంలో తన అభిప్రాయాలను మార్చుకొని చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు డిమాండ్ చేశారు.
వ్యాల్యూ యాడెడ్ పాయింట్స్
- రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసులు- అంబేద్కర్ అభిప్రాయం
- ఒకే భాష-ఒకే రాష్ట్రం అనే సూత్రాన్ని కమిషన్ తిరస్కరించగా, అంబేద్కర్ దాన్ని బలంగా సమర్థించాడు.
- చిన్న రాష్ర్టాల వల్ల మైనారిటీలకు రక్షణ ఏర్పడుతుందన్న వాస్తవాన్ని కమిషన్ గుర్తించలేకపోయింది.
- పెద్ద రాష్ర్టాలతో సమాఖ్య వ్యవస్థ బలహీనమవుతుంది.
- చిన్న రాష్ర్టాల ఏర్పాటు వల్ల ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సాధ్యమై, రాజ్యాంగ లక్ష్యాలు సాధించబడతాయి.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమర్థనీయమైనది.
n The Lands are shorn of the wool and They are feeling the intensity of cold- ఎస్సార్సీ కమిషన్‌ను ఉద్దేశించి అంబేద్కర్ వ్యాఖ్య
పెద్దమనుషుల ఒప్పందంలోని ముఖ్యాంశాలను వివరించి (తెలంగాణకు ఇచ్చిన హామీలు) ఉమ్మడి ఏపీలో అవి ఏవిధంగా ఉల్లంఘించారో చర్చించండి?
పరిచయం
సమైక్య రాష్ట్ర నిర్మాణ విషయమై తెలంగాణ నాయకుల అనుమానాలను నివృత్తి చేసి వారిని సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 1956, ఫిబ్రవరి 20న తెలంగాణ, ఆంధ్ర నాయకుల మధ్య జరిగిన ఒప్పందాన్నే పెద్దమనుషుల ఒప్పందం అని అంటారు.
పాల్గొన్న నాయకులు తెలంగాణ ఆంధ్ర
1) బూర్గుల 1) బెజవాడ
రామకృష్ణారావు గోపాల్ రెడ్డి
2) కేవీ రంగారెడ్డి 2) నీలం సంజీవరెడ్డి
3) మర్రి చెన్నారెడ్డి 3) గౌతు లచ్చన్న
4) జేవీ నర్సింగరావు 4) అల్లూరి సత్యనారాయణ రాజు
తెలంగాణకు ఇచ్చిన హామీలు
- తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ఆదాయ, వ్యయాలను వేర్వేరుగా నిర్వహించాలి. ఇరుప్రాంతాల పరిపాలనా వ్యయాన్ని ఆయా ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం భరించాలి. అధిక రెవెన్యూ, తక్కువ జనాభా ఉన్న తెలంగాణకు మిగులు నిధులు ఏర్పడతాయి. ఈ నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలి.
- తెలంగాణలో మద్యపాన నిషేధం తెలంగాణ శాసనసభ్యుల ఆమోదంతోనే అమలు చేయాలి.
- తెలంగాణలో ఉన్న విద్యాబోధన వసతులు తెలంగాణ విద్యార్థులకే దక్కాలి.
- ఏకీకరణ వల్ల ఉద్యోగాలు తగ్గించాల్సి వస్తే, వాటిని జనాభా నిష్పత్తి ప్రకారం రెండు ప్రాంతాలకు వర్తింపజేయాలి.
- రెండు ప్రాంతాలకు ఉద్యోగ భర్తీతో జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాధాన్యం కల్పించాలి.
- ఉర్దూ భాషను ఐదేళ్ల వరకు రాజభాషగా కొనసాగించాలి. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతీయ మండలి నిర్ణయాన్ని అమలు చేయాలి.
- ఉద్యోగ నియామకాల్లో ముల్కీ నియమాలను పాటించాలి.
- తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు తెలంగాణ ప్రాంతీయ మండలి అనుమతితో కొనసాగాలి.
- తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి.
- తెలంగాణ ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులు ఉండాలి.
- ప్రాంతీయ మండలిని రాష్ట్రపతి రాజ్యాంగంలోని 311 నిబంధన ప్రకారం ఏర్పాటు చేయాలి.
- కేబినెట్లో 40 శాతం తెలంగాణవారికి కేటాయించాలి. అందులో తెలంగాణకు చెందిన ముస్లిం సభ్యుడు తప్పక ఉండాలి.
- ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవుల్లో ఒకటి తెలంగాణ వారికివ్వాలి. హోం, ఆర్థిక, రెవెన్యూ, ప్లానింగ్, వాణిజ్య-పరిశ్రమల శాఖల్లో రెండింటిని తెలంగాణకు కేటాయించాలి.
- 1962 వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని కొనసాగించాలి.
ఉల్లంఘన
- 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి మంత్రిమండలిలో ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణవారికి నిరాకరించడం
- 1956-71 వరకు 15 ఏళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రాంతానికి చెందిన వారే పనిచేయడం
- ఒప్పందానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేయడం
- ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి బోగస్ సర్టిఫికెట్లతో తెలంగాణ ఉద్యోగాలన్నింటినీ ఆంధ్రప్రాంతం వారికి దక్కేలా చేయడం
- తెలంగాణలో గోదావరి నదిపై ప్రతిపాదిత నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దుచేసి, నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సంబంధించిన ప్రతిపాదిత సామర్థ్యాన్ని 132 టీఎంసీల నుంచి 89 టీఎంసీలకు తగ్గించడం
- తెలంగాణ నీటిపారుదల సామర్థ్యాన్ని 20 లక్షల ఎకరాల నుంచి 5.7 లక్షలకు తగ్గించడం
- పోచంపాడు (శ్రీరామ్‌సాగర్)కు సంబంధించి మొదట ప్రతిపాదించిన 250 టీఎంసీల నీటిని రాష్ట్రం ఏర్పడిన తర్వాత 66 టీఎంసీలకు తగ్గించడం. తద్వారా జలవనరుల వినియోగంలో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేయడం
- రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ ప్రాంతంలోని మిగులు నిధులను ఆంధ్రప్రాంత అభివృద్ధికి తరలించడం (మొదటి 5 నెలల కాలంలోనే
- 1956-68 మధ్యకాలంలో తెలంగాణ ఆదాయంతో సాలీన, సరాసరి 12.4 శాతం నిధులను ఆంధ్రకు ఖర్చుచేయడం
- పెద్దమనుషుల ఒప్పందానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యవసాయ భూములను కోస్తాంధ్ర ప్రజలు కొనుగోలు చేయడం వల్ల తెలంగాణలోని సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలుగా మారడం
- వ్యవసాయాభివృద్ధి కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో నికరసాగు భూమి వరుసగా 5:4 ఉండగా వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు 2.2:1గా ఉండటం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వ్యవసాయ భూమి శిస్తును గణనీయంగా పెంచి ఆంధ్రలో తగ్గించడం
- గ్రామీణ విద్యుదీకరణ కోసం ఆంధ్ర, తెలంగాణకు కేటాయించిన నిధులు 5:1గా ఉండటం, విద్యుత్ ఉత్పత్తి తెలంగాణలో 225 మెగావాట్లు, ఆంధ్రలో 181 మెగావాట్లుగా ఉండగా, వినియోగంలో మాత్రం ఆంధ్ర, తెలంగాణల మధ్య నిష్పత్తి 2:1గా ఉండేది.
- తెలంగాణ ప్రాంతీయాభివృద్ధి కమిటీ ఎలాంటి అధికారాలు లేకుండా నామమాత్రంగా మిగిలిపోవడం
ముగింపు
పై విధంగా తెలంగాణవారికి పెద్దమనుషుల ఒప్పందం రూపంలో కల్పించిన రక్షణలన్నింటినీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం వల్ల 1969లో ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమస్ఫూర్తే అనంతర కాలంలో కొనసాగి 2014లో రాష్ట్ర విభజనకు దారితీసింది.
రాష్ట్రపతి ఉత్తర్వులు (1975) నేపథ్యాన్ని వివరించి, వాటి అమలు కోసం ఏర్పాటైన జయభారత్ రెడ్డి కమిటీ, గిర్గ్లానీ కమిటీల గురించి చర్చించండి?
పరిచయం
జై ఆంధ్ర ఉద్యమం (1972-73) తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఆ ఉద్యమాన్ని శాంతింపజేయడానికి కేంద్రప్రభుత్వం ఆరుసూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ప్రకారం రాజ్యాంగానికి 32వ సవరణ చేసి ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలను కల్పించారు.
నేపథ్యం
- ఆరుసూత్రాల కార్యక్రమం ప్రకారం 1973-74 పార్లమెంట్ 32వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించింది.
- ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ రాజ్యాంగంలో కొత్తగా అధికరణ 371(డి) జోడించారు.
- అధికరణ 371 (డి) ప్రకారం లభించిన అధికారాలను ఉపయోగిస్తూ 1975, అక్టోబర్ 18న భారత రాష్ట్రపతి ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్’ను జారీచేశారు. దీన్నే రాష్ట్రపతి ఉత్తర్వులు అని అంటారు.
ముఖ్యాంశాలు
- ఉద్యోగాల నియామకాల నిమిత్తం రాష్ట్రంలోని జిల్లాలను ఆరు జోన్లుగా విభజించడం
- జిల్లాస్థాయిలో భర్తీ అయ్యే ఉద్యోగాల్లో 80 శాతం, జోనల్ స్థాయి నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీలో 70 శాతం, జోనల్ స్థాయి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీలో 60 శాతం ఉద్యోగాలు స్థానికులకు కేటాయించడం
- ఒక విద్యార్థి 4-10వ తరగతి వరకు కనీసం 4 సంవత్సరాలు ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతానికి స్థానికతను కల్పించడం
- రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేరా 14 ప్రకారం కొన్ని కార్యాలయ నియామకాలకు స్థానికతను వర్తింపజేయకపోవడం ఉదా: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, జంటనగరాల్లో పోలీస్ నియామకాలు.
అమలుపై కమిటీల నివేదికలు జయభారత్ రెడ్డి కమిటీ
- 58,692 మంది ఉద్యోగులు జోనల్ నియామకాలకు విరుద్ధంగా అక్రమ పద్ధతిలో నియామకాలు పొందారు.
- అందులో 22,722 మంది ఒక్క హైదరాబాద్‌లోనే నియమితులయ్యారు.
- రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతీయులకు కింది స్థాయి ఉద్యోగాల్లోనూ అన్యాయం జరిగింది.
గిర్గ్లానీ కమిటీ
- జంటనగరాలను ఫ్రీ జోన్‌గా ప్రకటించి స్థానికేతరులకు ఉద్యోగాలిచ్చారు.
- కారుణ్య నియామకాల్లో స్థానిక నియామకాలు పాటించలేదు.
- శాఖాధిపతుల కార్యాలయాలను భారీగా పెంచి స్థానికేతరులకు ఉద్యోగాలిచ్చారు.
- తప్పుడు స్థానిక ధ్రువీకరణ పత్రాలతో అనేక మంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారు.
- జోనల్ కార్యాలయాలను రాష్ట్ర కార్యాలయాలుగా మార్చారు.
ముగింపు
రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. వివిధ కమిటీల సిఫారసులు అమలు కాక, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరిగి తెలంగాణ ఆవిర్భవించింది.
-పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్-1 మెంటార్ హైదరాబాద్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు