19వ శతాబ్దంలో సాంఘిక, మత సంస్కరణోద్యమాలు
19వ శతాబ్దంలో ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యా విధానం భారతీయుల మనస్సును వికసింపజేసి, యథార్థానికి నాటి ప్రపంచ పోకడలకు సన్నిహితంగా తీసుకొని వచ్చింది. కొంతకాలం వరకు భారతీయులు పాశ్చాత్య విద్యతో పాటు, ఫ్రాన్స్ దేశంలో వెల్లివిరిసిన హేతువాద ప్రభావాలతో ఉండిపోయారు. నాటి భారతీయ పునరుజ్జీవనోద్యమం నిజమైనదని, కాన్‌స్టాంట్‌నోపుల్ నగరం పతనం తర్వాత ఐరోపాలో జరిగిన విప్లవాత్మకమైన ఉద్యమం కంటే తీవ్రమైనదని, విస్తృతమైనదని సర్ జేఎన్ సర్కార్ అభిప్రాయ పడ్డాడు. మత సంస్కరణ అనే విషయం హిందువులకు కొత్త కాదు. భారతదేశ చరిత్ర పరిశీలిస్తే వేదకాలం నుంచి హిందూమతం సంస్కరణలకు లోనైనట్లు మనకు తెలుసు. వేదమతం ఉపనిషత్తుల మతాలకు, బౌద్ధ-జైన మతాలకు మార్పులు గమనించడమైంది. తర్వాత కాలంలో ఇస్లాం మత ప్రభావం వల్ల హిందూమతంలో జ్ఞాన, కర్మ మార్గాల స్థానంలో అందరికీ అందుబాటైన సులభమార్గమైన భక్తిమార్గం ద్వారా మోక్షాన్ని పొందవచ్చుననే భావన కలిగి మధ్యయుగ శతాబ్దాల్లో చైతన్యుడు, వల్లభాచార్యుడు, కబీర్, తుకారామ్, గురునానక్, రామ్‌దాస్ వంటి భక్తులు ప్రచారం చేశారు.
19వ శతాబ్దంలో క్రైస్తవ మత వ్యాప్తి అరికట్టడం కోసం, తమ మతస్థులకు మతంలో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటం కోసం హిందూమత సంస్కరణోద్యమానికి పూనుకున్నారు. అనీబిసెంట్ భారతదేశ ఉద్యమాల గురించి ప్రస్తావిస్తూ ‘భారతదేశంలో ఏ ఉద్యమమైనా చకచకా జరగాలంటే మతంతో ముడిపెట్టాలి’ అని పేర్కొంది. సూక్ష్మంగా పరిశీలిస్తే పునరుజ్జీవనోద్యమానికి ప్రాచీన భారతీయ సాహిత్య అధ్యయనం, ఆంగ్ల విద్య, సాహిత్య ప్రభావం, జాతీయతా భావాలు, విదేశీయులు భారతీయ సంస్కృతిని అణచివేయడానికి పాటించిన విధానాలకు వ్యతిరేకత వంటివి ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి.
- 19వ శతాబ్దం మొదటి యాభై సంవత్సరాల్లో సామాజిక, మత రంగాల్లో బలమైన సంస్కరణల వెల్లువ ఉప్పొంగింది. బెంగాల్లో మొదలైన మత, సాంఘిక ఉద్యమాల్లో రాజారామ్మోహన్ రాయ్‌దే అగ్రస్థానం.
- రాజా రామ్మోహన్ రాయ్ 1772లో బెంగాల్‌లోని రాధానగర్‌లో జన్మించాడు.
- ఈయనను భారతదేశంలో మొదటి మోడరన్ మ్యాన్‌గా కీర్తిస్తారు. ‘భారతదేశపు సంఘ సంస్కరణ పిత’గా కూడా పేర్కొంటారు.
- వివిధ గ్రంథాల్లో వాస్తవంగా ఏం చెప్పారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పర్షియన్, అరబిక్, సంస్కృతం, ఇంగ్లిష్, ఫ్రెంచి, లాటిన్, గ్రీకు, హిబ్రో భాషలు నేర్చుకున్నాడు.
- ఈయన ఏకదేవతారాధనను నమ్మాడు. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో 1803లో పర్షియన్ భాషలో ‘తుహఫాత్ ఉల్ మువాహిద్దిన్’ లేదా ‘A Gift to Monotheists’ అనే గ్రంథం రాశాడు.
- 1815లో హిందూమతంలోని సాంఘిక చెడులను తొలగించడానికి ‘ఆత్మీయ సభ’ను కలకత్తాలో ఏర్పాటు చేశాడు. ఇదే 1828లో బ్రహ్మసమాజంగా మారింది.
- మత అంశాల్లో హేతుబద్ధతకు, మానవ పరిశీలన శక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు.
- 1820లో క్రిస్టియన్ మతంలో హేతుబద్ధతలేని అంశాలను విమర్శిస్తూ ‘The Prec epts of Jesus, the guide to piece and Happiness’ అనే గ్రంథం రాశాడు.
- క్రిస్టియన్ మిషనరీల విమర్శలకు వ్యతిరేకంగా వేదాంత తత్వంలోని గొప్పతనాన్ని బలపరిచాడు.
- ఈయన 1829లో సతీసహగమన చట్టం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
- ఆధునిక విద్యావిధానం ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా అందాలని పోరాడాడు. ఈ నేపథ్యంలో మెకాలే బిల్లు వచ్చింది.
- భారతదేశంలో రాజకీయ ఆలోచనలను చేసిన మొదటి వ్యక్తిగా రాజా రామ్మోహన్ రాయ్‌ను చెప్పవచ్చు. ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల పాలనలో మార్పు రావాలని, ప్రజా ఆందోళనను నిర్వహించిన మొదటి వ్యక్తి ఈయన.
- రాజా రామ్మోహన్ రాయ్ సంబంధ కౌముది, మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను స్థాపించాడు.
- ఈయనకు మొఘల్ చక్రవర్తి అక్బర్-2 ‘రాజా’ అనే బిరుదును 1830లో ఇచ్చారు.
- 1833లో చివరి మొఘల్ చక్రవర్తుల్లో ఒకరైన అక్బర్-2 పెన్షన్ కోసం బ్రిటన్ కోర్టులో వాదిస్తూ బ్రిస్టల్ నగరంలో చనిపోయాడు.
- 1828లో హిందూ మతంలోని పవిత్రతను కాపాడాలని, ఏక దేవతారాధనను పెంచే లక్ష్యంలో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.
- బ్రహ్మసమాజం అన్ని మతాలను అనుసరించే వారి చర్చావేదిక. వర్గ రహిత సమాజంగా పరిణామం చెందాలని కోరుకునేది.
- బ్రహ్మసమాజకులు ఒకే దైవాన్ని నమ్మారు. విగ్రహారాధనను త్యజించారు. రామ్మోహన్ రాయ్ వర్ణ వ్యవస్థను, ఛాందస బ్రాహ్మణుల దౌష్ట్యాన్ని, కర్మకాండలను, విగ్రహారాధనను ఖండించాడు.
- హిందూ మతంలోని లోపాలను తొలగించి వేదాలను, ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని, ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించాలనేది బ్రహ్మసమాజ ప్రధాన ఆశయం.
- ఇతని నాయకత్వంలో బ్రహ్మసమాజం సతీసహగమనాన్ని, బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించింది.
- ఏకేశ్వరోపాసన బ్రహ్మసమాజం అనుసరించిన ముఖ్య సిద్ధాంతం. బ్రహ్మసమాజం విశ్వ మానవ సౌభ్రాతృత్వ సిద్ధాంతాన్ని ఎలుగెత్తి చాటింది.
- అన్ని మతాలు, మత గ్రంథాలను గౌరవించాలని ఉపదేశించింది. కానీ ఏ మత గ్రంథాన్ని ప్రామాణికంగా స్వీకరించలేదు.
- బ్రహ్మసమాజాన్ని సాంఘిక మత సంస్కరణోద్యమంగా వర్ణించవచ్చు. ఆధునిక సంస్కృతి ప్రాధాన్యాన్ని గుర్తించి, ఆ సంస్కృతి ప్రజల్లో ప్రచారం కావడానికి దేశంలో విద్యాసంస్థలను స్థాపించింది.
- హిందూ మతాన్ని త్యజించడానికి బ్రహ్మసమాజం ఇష్టపడలేదని, పాశ్చాత్య మత సిద్ధాంతాల వల్ల ప్రతిస్పందించి ఉదార భావాలు స్వీకరించడానికి ఇష్టపడుతుందని, రామ్ సే మెక్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. రామ్మోహన్ రాయ్ మరణానంతరం దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్లు క్షీణిస్తున్న బ్రహ్మసమాజాన్ని పునరుద్ధరించారు.
- రాజా రామ్మోహన్ రాయ్ ఆలోచనలను, భావాలను వ్యాప్తి చేయడానికి తత్వబోధిని సభను 1839లో నెలకొల్పారు.
- అంతేగాక ‘తత్వబోధిని’ అనే పత్రికను బెంగాలీ భాషలో ప్రారంభించాడు. ఇది బ్రహ్మసమాజం అధికార పత్రిక అయ్యింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్ర వాల్ మిశ్రా ఈ పత్రికకు వ్యాసాలు రాశారు.
- వేదాలు అపౌరుషేయాలని, బ్రహ్మసమాజ సిద్ధాంతాలకు ఏకైక పునాది అని దేవేంద్రనాథ్ ఠాగూర్ ప్రగాఢంగా నమ్మాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి చాలామంది ప్రచారకులను నియమించాడు.
- బ్రహ్మసమాజం నిర్వహణలో ఈయనకు కేశవ చంద్రసేన్‌కు విభేదాలు వచ్చాయి. కేశవ చంద్రసేన్ కులం పోవాలని, మతపరంగా బ్రహ్మసమాజం హిందూ మతానికి దూరంగా ఉండాలని తెలిపాడు.
- కానీ దేవేంద్రనాథ్ ఠాగూర్ కులాన్ని పోగొట్టలేమని, అందులోని విచక్షణాయుత కాఠిన్యాన్ని తగ్గించేలా ప్రచారం చేయాలని, బ్రహ్మసమాజం హిందూమతంలోని ఒక భాగంగా ఉండాలని ఈయన తెలిపాడు.
- చివరి సంవత్సరాల్లో దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్యాత్మిక మత గ్రంథాల అధ్యయనంలో నిమగ్నుడయ్యాడు.
- కేశవ చంద్రసేన్ బ్రహ్మసమాజంలో ప్రముఖ నాయకుడు. కానీ దేవేంద్రనాథ్ ఠాగూర్‌లో వచ్చిన విభేదాల కారణంగా 1866లో బ్రహ్మసమాజం నుంచి విడిపోయి బ్రహ్మసమాజ్ ఆఫ్ ఇండియాను స్థాపించాడు.
- కొత్త మతాన్ని ప్రచారం చేయడానికి దేశంలో చాలా ప్రాంతాలను సందర్శించాడు. అతని కృషి ఫలితంగా బ్రహ్మసమాజ్ ఉద్యమం జనాదరణ పొందింది.
- ఇతని చైతన్యవంతమైన వ్యక్తిత్వం, అకుంఠిత దీక్ష, భావావేశంతో కూడిన ఉత్సాహం, వాక్చాతుర్యం వల్ల ఈ ఉద్యమం విస్తృతంగా ప్రజాదరణను పొందింది.
- సాంఘిక సంస్కరణల పట్ల కేశవ చంద్రసేన్ చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. సంస్కరణలు అమలు పరచడానికి తన శక్తిని ధారపోయడానికి సిద్ధమయ్యాడు.
- తన భావాలను ప్రచారం చేయడానికి ‘ఇండియన్ మిర్రర్’ అనే పత్రికను స్థాపించాడు.
- 1870లో ‘ఇండియన్ రిఫార్మ్ అసోసియే షన్’ను స్థాపించి 1872లో ‘నేటివ్ మ్యారేజ్ యాక్ట్’ను ప్రభుత్వం తీసుకురావడంలో ప్రధాన పాత్రను పోషించాడు.
- దీనివల్ల మగ పిల్లవాడి పెళ్లి వయస్సు 18, ఆడపిల్ల వయస్సు 14 సంవత్సరాలు చేశారు.
- కేశవ చంద్రసేన్ పై చట్టాన్ని స్వయంగా ఉల్లంఘించి మైనర్ అయిన తన కుమార్తెను కూచ్ బీహార్ సంస్థాన రాజుకిచ్చి పెళ్లి చేయడంతో అతని శిష్యులు అయిన ఆనంద్ మోహన్ బోస్, శివనాథ శాస్త్రి దీన్ని వ్యతిరేకించి సాధారణ బ్రహ్మసమాజ్‌ను నెలకొల్పారు.
ప్రార్థనా సమాజం
- దీన్ని ఆత్మరామ్ పాండురంగ 1867లో బొంబాయిలో స్థాపించాడు.
- దీనిలోని ప్రముఖులు- ఆర్జీ భండార్కర్, మహదేవ్ గోవింద రనడే, పండిత రమాబాయి
- మతపరంగా హిందూ మతంలోనే ఉంటూ సంస్కరణ కోసం కృషి చేసింది. ఈ సమాజ్ సభ్యులను నామ్‌దేవ్, తుకారాం, రామ్‌దాస్ మొదలైన మతాచార్యులు అనుసరించి గొప్ప మత సంప్రదాయాలకు వారసులుగా భావించవచ్చు.
- ప్రార్థనా సమాజ్ ముఖ్య ఆశయాల్లో హేతుబద్ధమైన ఆరాధనను ప్రోత్సహించడం, వర్ణాధిక్యతను నిరసించడం, వితంతు పునర్వివాహాలను ప్రవేశపెట్టడం, స్త్రీ విద్యను ప్రోత్సహించి, బాల్య వివాహాలను రద్దు చేయడం వంటివి ఉన్నాయి.
- ఇవేగాక అనాథ శరణాలయాలు, వితంతు గృహాలు, రాత్రి బడుల నిర్వహణ వంటి కొన్ని సాంఘిక సేవలను కూడా చేపట్టింది.
- ప్రార్థనా సమాజం పండరిపూర్‌లో అనాథ శరణాలయాన్ని స్థాపించింది. ఇది ‘సుబోధ’ పత్రికను ప్రారంభించింది.
- దేశ పశ్చిమ ప్రాంతంలో ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలకు కేంద్రంగా ప్రార్థనా సమాజాన్ని భావించవచ్చు.
ఆర్యసమాజం
- స్వామి దయానంద సరస్వతి 1875లో బొంబాయి నగరంలో ఆర్యసమాజాన్ని స్థాపించాడు.
- ఇతని అసలు పేరు మూల శంకర్. ఈయన 1824లో గుజరాత్‌లోని టంకారాలో పుట్టాడు. 15 సంవత్సరాలు సన్యాసిగా తిరిగి, మధురలోని బిరజానంద వద్ద శిష్యరికం చేశాడు.
ఆర్యసమాజ సూత్రాలు
- వేదాలు అత్యున్నతమైనవి, వేదాలన్నింటికి మూలం స్ఫూర్తి అని తెలిపి ‘గో బ్యాక్ టు వేదాస్’ అని పిలుపునిచ్చాడు.
- దయానంద సరస్వతి విగ్రహారాధనను, మత కర్మకాండలను, పూజారుల ఆధిక్యతను నిరసించాడు.
- బాల్య వివాహాలు, పుట్టుక ఆధారంగా కులం అనే వాటిని నిరసించాడు.
- కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలను బలపరిచాడు.
- ప్రకృతి వైపరిత్యాలప్పుడు ఆర్యసమాజాలు సేవలను అందించాయి.
- ఈయన హిందీలో ‘సత్యార్థ ప్రకాశిక’, సంస్కృతంలో ‘వేద భాష భూమిక’ అనే గ్రంథాన్ని రచించాడు.
- హిందూమతం నుంచి ముస్లిం మతంలోకి మారిన హిందువులను హిందూమతంలోకి రావడానికి ‘శుద్ధి’ అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది మతపరంగా వివాదాస్పదం అయింది.
- ఆర్యసమాజం బొంబాయిలో స్థాపించినా పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో బలంగా ఉండేది.
- దయానంద సరస్వతి హిందూమతాన్ని, సంస్కృతిని గాఢంగా సమర్థించాడు. బ్రహ్మసమాజ్‌లో కాకుండా ఆర్యసమాజ్ హిందూ మతంలోనే అతివాద సంస్థగా రూపొంది, ప్రాచీన మత పునరుద్ధరణలో ప్రముఖ పాత్ర వహించింది.
- దేశంలో గో సంరక్షణకు దయానంద సరస్వతి చాలా కృషి చేశాడు. ఈయన మరణానంతరం ఆర్యసమాజ్ కార్యకలాపాలను లాలా హన్స్‌రాజ్, లాలా లజపతి రాయ్, స్వామి శ్రద్ధానంద, పండిత్ గురుదత్ తదితరులు కొనసాగించారు.
- స్వామి దయానంద సరస్వతి, ఆయన సహచరుల కృషి ఫలితంగా సాంఘిక సంస్కరణలకు, జాతీయ విద్యకు చాలా ప్రచారం లభించింది. ఆర్యసమాజ్‌ను అనుసరించేవారు పాశ్చాత్య విద్యాప్రయోజనాలను గుర్తించారు.
- లాలా హన్స్‌రాజ్, లాలా లజపతి రాయ్‌ల ప్రోత్సాహంతో పాశ్చాత్య విద్యను ప్రచారం చేయడానికి దయానంద్ ఆంగ్లో-వేదిక్ (డీఏవీ) ధర్మకర్తృత్వ సంస్థను స్థాపించాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సంస్థ నిర్వహించిన పాఠశాలలు, కళాశాలలు, పాశ్చాత్య విద్యను ప్రజలకు అందించాయి. పాశ్చాత్య విద్యాభ్యాసం మాత్రమే కాకుండా హిందూ సంస్కృతి, తత్వ శాస్ర్తాలను కూడా ఈ కళశాలలో బోధించారు. డీఏవీ ధర్మకర్తృత్వ సంస్థ దేశంలో చాలా విద్యాసంస్థలను సక్రమంగా నిర్వహించి, విద్యావ్యాప్తికి కృషి చేసింది. పాశ్చాత్య విద్యను వ్యతిరేకించినవారు గురుకులాలను స్థాపించి, ఆశ్రమాల్లో ప్రాచీన పద్ధతిలో వేద విద్యను బోధించారు. వీరికి నాయకత్వం వహించింది స్వామి శ్రద్ధానంద్. వీరి ముఖ్య కేంద్రం హరిద్వార్.
- హిందూ పునరుజ్జీవనానికి ప్రతీక ఆర్యసమాజ్ అని చెప్పవచ్చు. హిందూ సమాజంలోని దురాచారాలను ప్రక్షాళన చేయాలని ఆర్యసమాజ్ భావించింది. హిందువులను ఇతర మతాల్లోకి మారడాన్ని నిరోధించాలన్నదే ముఖ్య ఆశయం కావడం వల్ల ఇతర మతాలకు వ్యతిరేకంగా గొప్ప ఉద్యమం ప్రారంభం కావడానికి కారణమయ్యింది ఆర్యసమాజ్.
- ఆర్యసమాజ్ హిందూ తత్వానికి మాత్రమే పరిమితం కావడం వల్ల హిందూమతంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఆర్యసమాజ్ కూడా బ్రహ్మసమాజం లాగానే విగ్రహారాధనను వ్యతిరేకించినప్పటికీ హిందూ మతంలోనే ఒక అతివాద సంస్థగా వ్యవహరించి, ప్రాచీన హిందూ మత పునరుద్ధరణలో ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
-సాసాల మల్లికార్జున్ అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు