బాలలపై వేధింపులు.. దేశానికి తలవంపులు
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
- జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.
చైర్పర్సన్ అర్హతలు: చైర్‌పర్సన్‌గా నియమితులయ్యే వ్యక్తి ప్రముఖుడై, బాలల సంక్షేమం కోసం అత్యున్నతంగా కృషి చేసిన వ్యక్తి అయి ఉండాలి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రితో నియమితమైన త్రిసభ్య కమిటీ చైర్‌పర్సన్‌ను సిఫారసు చేస్తుంది. సిఫారసు ఆధారంగా నియామకం అవుతుంది.
సభ్యులు: ఈ కమిషన్‌లో చైర్పర్సన్ కాకుండా ఆరుగురు సభ్యులుంటారు. వీరిలో ఇద్దరు మహిళా సభ్యులుంటారు. విద్య, బాలల ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, అనాథ, వికలాంగ బాలల సంక్షేమం, బాలకార్మిక నిర్మూలన, బాలల మానసికశాస్త్రం, బాలలకు సంబంధించిన చట్టాలు వంటి వాటిలో ప్రముఖంగా కృషి చేసినవారిని సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.
- చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు. రెండు పర్యాయాలకు మించి వీరు ఈ పదవికి ఎంపిక కారు. చైర్పర్సన్ 65 సంవత్సరాల గరిష్ఠ వయస్సు వరకు లేదా 3 సంవత్సరాల్లో ఏది ముందుగా అయితే అంతకాలం పాటు పదవిలో ఉంటారు.
- సభ్యుల గరిష్ఠ వయోపరిమితి 60 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల్లో ఏది ముందైతే అంతకాలం పాటు పదవిలో ఉంటారు.
- చైర్పర్సన్ లేదా సభ్యులు ఎప్పుడైనా తమ స్వదస్తూరితో సంతకం చేసిన రాజీనామా పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి రాజీనామా చేయవచ్చు.
- చైర్పర్సన్, సభ్యుల జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. పదవిలో ఉన్నంత కాలం వీరికి నష్టం కలిగించేలా జీతభత్యాలను తగ్గించరాదు.
- చైర్పర్సన్ లేదా సభ్యులు దివాళా తీసినప్పుడు, తన పదవి వెలుపల ఇతర ఏదైనా లాభదాయక పదవిని చేపట్టినా, చేయవలసిన పనిని నిరాకరించినా లేదా చేయరాని పని చేసినా, మానసిక స్థితి సరిగా లేదని తగిన అథారిటీ ధ్రువీకరించినా, ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకమైన పని చేసేందుకు తన పదవిని వినియోగించినా, కమిషన్ అనుమతి లేకుండా వరుసగా 3 సమావేశాలకు గైర్హాజరైనా, నైతికంగా విఫలమై న్యాయస్థానం శిక్ష విధించినా పదవి నుంచి తొలగిస్తారు.
- అయితే వీటిపై విచారణ జరుగుతున్నప్పుడు తమ వాదనను చెప్పుకొనే హక్కును కలిగి ఉంటారు. కమిషన్ కనీసం 3 నెలలకోసారి సమావేశం అవుతుంది. సమావేశానికి అవసరమైన కోరంను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
- కమిషన్‌కు విధినిర్వహణలో సాయపడేందుకు ఒక మెంబర్ సెక్రటరీని, ఇతర అధికారులను, ఉద్యోగులను కేంద్రప్రభుత్వం నిర్ణయిస్తుంది.
- మెంబర్ సెక్రటరీగా నియమితమయ్యే వ్యక్తి భారత ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి లేదా అదనపు కార్యదర్శి హోదాకు తక్కువ కాని హోదా కలిగి ఉంటారు.
- బాలల హక్కుల సంరక్షణకు సంబంధించి అన్ని విషయాలను పరిశీలించే అధికారాన్ని సివిల్‌కోర్టు హోదాలో కమిషన్ కలిగి ఉంటుంది.
- ఒకవేళ బాలల హక్కులకు సంబంధించి క్రిమినల్ అంశం ఏదైనా ఉంటే ఆ ప్రాంత పరిధిలోని మెజిస్ట్రేట్‌కు దాన్ని సమర్పిస్తుంది. అవసరమైతే సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించి అవసరమైన ఆదేశాలు, రిట్లు జారీ చేసేందుకు కృషి చేస్తుంది.
- రాష్ర్టాల్లో ఏర్పాటు చేసే కమిషన్‌ను, చైర్పర్సన్, సభ్యులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. రాష్ర్టాల్లో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో రాష్ట్ర స్థాయిలో కనీసం ఒక బాలల కోర్టు ఏర్పాటు చేస్తారు. బాలలపై జరిగే నేరాల విచారణ వేగవంతంగా జరిగేందుకు ఇది తోడ్పడుతుంది. అదే సమయంలో వీలైతే జిల్లాల్లో కూడా ఒక బాలల సెషన్స్ కోర్టు ఏర్పాటు చేస్తారు.
- బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం-2005కు బాలల హక్కుల పరిరక్షణ చట్టం-2006 ప్రకారం సవరణ జరిగింది. ఈ సవరణ చట్టం 29 డిసెంబర్ 2006న రాష్ట్రపతి ఆమోదం పొందింది.
- ఈ సవరణ ప్రకారం ‘మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి’ అనే పదాల స్థానంలో స్త్రీ, బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి అనే పదాలను చేర్చారు.
NCPCR చైర్పర్సన్లు
1. శాంతా సిన్హా 2007-2010
2. శాంతా సిన్హా 2010-2013
3. శ్రీమతి కుషాల్‌సింగ్ 2013-2015
4. స్తుతి రేన్ కాకర్ 2015-2018
5. ప్రియాంక కానూంగో 2018-2021 (16 అక్టోబర్ 2021న పునర్నియామకం)
- పెద్దల లైంగిక వేధింపులు, నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు భారతదేశంలో ప్రవేశపెట్టిన తొలి చట్టం ఇది.
బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం (2012)(Protection of Children fromSexual Offences Act2012)
18 ఏండ్ల లోపు బాలబాలికలు మానభంగం, తదితర లైంగిక వేధింపులకు గురైనప్పుడు వారికి ఈ చట్టం ద్వారా సరైన న్యాయం చేకూరుస్తారు.
- ఈ చట్టం ప్రకారం ఏ బాలుడు లేదా బాలికను ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట పోలీసు స్టేషన్లో ఉంచరాదు.
- లైంగిక దాడుల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో చట్టం) సవరణ చట్టం-2019: చిన్నారులపై అత్యాచారాలతో పాటు మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడానికి వీలుగా పోక్సో చట్టంలోని 2, 4, 5, 6, 9, 14, 15, 34, 42, 45 సెక్షన్లను సవరించింది.
- 16 ఏళ్లలోపు చిన్నారులపై (బాలికైనా, బాలుడైనా) అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించేందుకు వీలుగా 4, 5, 6 సెక్షన్లకు సవరణ చేశారు.
- పిల్లల కృత్రిమ ఎదుగుదల కోసం హార్మోన్లు, ఇతర రసాయన ప్రయోగాలు జరిపే వారిని శిక్షించడానికి వీలుగా సెక్షన్ 9కి సవరణ చేశారు.
- పిల్లల నీలిచిత్రాల (పోర్నోగ్రఫీ) నియంత్రణకు వీలుగా 14, 15 సెక్షన్లకు సవరణ చేసింది. చిన్న పిల్లల నీలి చిత్రాలను ఫోన్లోనో, కంప్యూటర్లోనో కలిగి ఉండటమంటే వాటిని వేరొకరితో పంచుకునే ఉద్దేశం ఉన్నట్లుగానే పరిగణించి శిక్షిస్తారు.
- లైంగిక దాడి స్థాయిని బట్టి 10-20 ఏళ్లు లేదా జీవితాంతం జైళ్లో ఉండేటట్లు కోర్టు శిక్ష విధించవచ్చు. చైల్డ్ పోర్నోగ్రఫీ చేస్తే 5-10 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
- పోక్సో చట్టం కింద నమోదైన కేసుల విచారణకు తెలంగాణ ప్రభుత్వం చిన్నారి మిత్ర కోర్టులను ఏర్పాటు చేసింది.
బాలలపై వేధింపులు.. దేశానికి తలవంపులు
- జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
పోక్సో చట్టం కింద 100 పైగా కేసులు నమోదైన చోట వాటిని విచారించేందుకు ప్రతి జిల్లాలో 60 రోజుల్లో కేంద్ర నిధులతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 25 జూలై 2019న ఆదేశించింది.
పాలిటీ
- చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించి FIR నమోదైన 24 గంటల్లోపు ప్రాథమిక విచారణను పూర్తిచేయాలి. (నేర సమాచారం తెలిసి చెప్పకపోయినా పోక్సో చట్టం ప్రకారం శిక్షిస్తారు)
- బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వికృత వాఖ్యానం- తీర్పును నిలిపివేసిన సుప్రీంకోర్టు: దుస్తులపై నుంచి తాకితే అది పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడి కాదంటూ బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ న్యాయమూర్తి పుష్పా గనేడివాలా 19 జనవరి 2021న తీర్పివ్వడంపై జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పిస్తూ ‘శరీరం-శరీరం (స్కిన్-స్కిన్) తాకకపోతే పోక్సో చట్టం కింద లైంగిక నేరం కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును 18 నవంబర్ 2021న సుప్రీంకోర్టు కొట్టేసింది. శరీరాన్ని తాకకపోయినా అలాంటి కామవాంఛను కలిగి ఉండటం కూడా తప్పేనని స్పష్టం చేసింది’.
బాల్య వివాహ నియంత్రణ చట్టం-1929
(The Child Marriage Resteaint Act-1929)
- బాల్య వివాహాలను నియంత్రించేందుకు బ్రిటిష్-ఇండియా 29 సెప్టెంబర్ 1929న ఈ చట్టాన్ని ఆమోదించింది. ఇది 1 ఏప్రిల్ 1930 నుంచి జమ్ముకశ్మీర్ మినహా దేశమంతటా అమల్లోకి వచ్చింది. దీన్నే ‘శార్దా’ చట్టం అని కూడా అంటారు. ఈ చట్టం ప్రకారం బాలికల కనీస వివాహ వయస్సు 14 సంవత్సరాలు. బాలుర కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు. ఈ చట్టాన్ని 1978లో సవరించారు. సవరించిన చట్ట ప్రకారం బాలికల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు. బాలుర కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు.
బాల్య వివాహ నిషేధ చట్టం-2006
- బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపేందుకు భారత ప్రభుత్వం బాల్యవివాహ నియంత్రణ చట్టం-1929ను తొలగిస్తూ దాని స్థానంలో కొత్తగా బాల్య వివాహ నిషేధ చట్టం 2006 (The Prohibition of Child Marriage) ను రూపొందించింది. ఇది జమ్ముకశ్మీర్ మినహా దేశమంతటా 1 నవంబర్ 2007 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం బాలికల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు. బాలుర కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు.
ఆపరేషన్ ముస్కాన్: బాల కార్మికుల పరిరక్షణకు కేంద్రప్రభుత్వం ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరిట ప్రత్యేక కార్యాచరణ ప్రక్రియను చేపట్టింది. ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి 31 వరకు నెలరోజుల పాటు బాల కార్మికులను గుర్తించేందుకు CID విభాగం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు దృష్టిసారిస్తారు.
ఆపరేషన్ స్మైల్: ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి 31 వరకు కుటుంబ ఆదరణ లేని పిల్లలను గుర్తించి ఉచిత విద్య, వసతి అందజేస్తారు.
దర్పణ్: తప్పిపోయిన పిల్లల్ని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు దర్పణ్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
- జువైనల్ జస్టిస్ (పిల్లల భద్రత) చట్టం (బాలనేరస్తుల నేర న్యాయ సవరణ చట్టం)-2015
- నిర్భయ హత్యాచారం కేసు నిందితుల్లో ఒకరికి 17 సంవత్సరాల 7 నెలల వయస్సు ఉండటంతో జువైనల్ చట్టం కింద అతడిని విడుదల చేయడంతో దేశమంతా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో
చట్టంలోని ముఖ్యాంశాలు
బాలనేరస్తుల బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై రాష్ట్రపతి 4 జనవరి 2016న సంతకం చేశారు.
- 16-18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు క్రూరమైన నేరాలు చేసినప్పుడు వారిని పెద్దవాళ్లలాగా పరిగణించాలా పిల్లలుగానా అనే విషయాన్ని బాలల న్యాయ బోర్డులు నిర్ణయిస్తాయి.
- దేశంలోని ప్రతి జిల్లాలోనూ జువైనల్ జస్టిస్ బోర్డులను (JJB) ఏర్పాటు చేయాలి.
- దేశంలోని ప్రతి జిల్లాలోనూ బాలల సంక్షేమ సంఘాలను (CWC)లను ఏర్పాటు చేయాలి.
- బాల నేరస్తుడిపై విచారణ జరపాలా! లేదా పునరావాస కేంద్రానికి పంపాలా! అని నిర్ణయించేది జువైనల్ జస్టిస్ బోర్డులు. నేరం రుజువైతే శిక్ష మాత్రం ఉంటుంది. మరణ శిక్ష, జీవిత ఖైదు మాత్రం ఉండదు.
- జువైనల్ జస్టిస్ బోర్డులో మానసిక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారు.
- బాలల సంక్షేమ సంఘాలు పిల్లల అవసరాలను తెలుసుకొని వారికి తగిన భద్రతను కల్పిస్తుంది.
- అనాథలు, ఇంటిని విడిచి వచ్చిన పిల్లలు, పోలీసులకు దొరికిన పిల్లలను దత్తతకు ఇచ్చే ప్రక్రియను మరింత క్రమబద్ధం చేయాలి. దత్తత తీసుకునేవారికి ఉండవలసిన అర్హతలు కచ్చితంగా అమలు చేయాలి.
- పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించేవారిపైనా, పిల్లలకు మాదకద్రవ్యాలు అలవాటు చేసినవారిపైనా, పిల్లలను నిర్బంధించడం, అమ్మడం వంటి చర్యలకు పాల్పడినవారిపైన విధించవలసిన జరిమానాల గురించి కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు.
నోట్: ఈ చట్టం అమలు బాధ్యతలు నిర్వర్తించే సంస్థల పనితీరు పర్యవేక్షణాధికారాలను ఇక మీదట జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్)/అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌కు ఇచ్చారు. జిల్లా చిన్నారుల సంరక్షణ విభాగం, జిల్లా మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో నడుస్తుంది. చిన్నారుల సంరక్షణ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యేవారి నేపథ్యాన్ని ముందుగానే పూర్తిస్థాయిలో పరిశీలించిన మీదట నియమిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు