విజృంభించిన మహమ్మారి..స్తంభించిన మానవాళి
కొవిడ్-19
దక్షిణ చైనాలోని వూహాన్లో 2019 డిసెంబర్ 31న బయటపడ్డ కొవిడ్ వ్యాధి ప్రపం చం నలుమూలలా విస్తరించి 21వ శతాబ్దపు అతిపెద్ద జైవిక విపత్తుగా నిలిచింది. భారత్‌తోపాటు అనేక దేశాల్లో అలలు అలలుగా వ్యాపించిన ఈ వ్యాధి ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసింది. అనేక పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడటంతో నిరుద్యోగం ప్రబలింది. పాఠశాలలు మూతపడటంతో విద్యార్థుల చదువులకు అంతరాయం కలిగింది. అనేక వేరియంట్లుగా రూపాన్ని మార్చుకుంటూ ఇంకా విస్తరిస్తుంది.
కొవిడ్-19 పుట్టుపూర్వోత్తరాలు
- కొవిడ్-19 అనేది నూతన కరోనా వైరస్ సార్స్-కోవ్-2 ద్వారా వ్యాపించే వ్యాధి.
- ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 జనవరి 30న ఈ వ్యాధిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
- కరోనా తొలుత గబ్బిలాల నుంచి మనుషులకు సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
- 2020 మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించింది.
కరోనా వైరస్ నిర్మాణం
- లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఇది సాధారణ జలుబు నుంచి అత్యంత తీవ్రమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వంటి వ్యాధులకు కారణమయ్యే అతిపెద్ద వైరస్ల కుటుంబానికి చెందినది. ఇది పెద్దగా ఉంటూ పాజిటివ్ స్టాండెడ్ RNA వైరస్. కరోనా వైరస్ అన్ని RNA వైరస్లలోకెల్లా అతిపెద్ద జన్యుక్రమాన్ని కలిగి ఉంటుంది. ఈ జీనోమ్ న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ద్వారా ఏర్పడిన ఒక చుట్ట రూపంలో ఉండే వైరస్. కవచంలో నిక్షిప్తమై ఉంటుంది. మూడు స్ట్రక్చరల్ ప్రొటీన్లలో స్పైక్ ప్రొటీన్ ఉపరితలంపై పెద్దపెద్ద మొనలను ఏర్పరుస్తుంది.
లక్షణాలు
- జ్వరం, దగ్గు, అలసట, రుచి లేదా వాసనను కోల్పోవడం, కళ్లు ఎర్రబడటం, గొంతులో మంట, తలనొప్పి, కండరాలు లేదా కీళ్ల నొప్పులు, వికారం లేదా వాంతులు, చర్మంపై వివిధ రకాల దద్దుర్లు, డయేరియా మొదలైన సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.
తీవ్రమైన లక్షణాలు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకలి లేకపోవడం, అయోమయం, ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి. అధిక శరీర ఉష్ణోగ్రత, సరిగా నిద్ర లేకపోవడం. అత్యంత తీవ్రమైన, అరుదైన న్యూరోలాజికల్ వ్యాధులు.
కరోనా ఇన్ఫెక్షన్
- కరోనా వైరస్ ప్రధానంగా గొంతు, ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్ కణాలకు సోకుతుంది. కరోనా వైరస్ మానవ కణాలపై ఉండే ACE2 గ్రాహకాలను బంధిస్తుంది. ఈ తరహా కణాలు ఎక్కువగా గొంతు, ఊపిరితిత్తుల్లో ఉంటాయి. ఈ వైరస్ ప్రధానంగా నోరు, ముక్కు, కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కరోనా వైరస్ ప్రధానంగా మన చేతులు వాహకంగా నోరు, ముక్కు, కళ్లను తాకడం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
- ప్రస్తుతం WHO వేరియంట్ ఆఫ్ క్యాన్సర్‌గా 1. ఆల్ఫా 2. బీటా 3. గామా 4. డెల్టా 5. ఒమిక్రాన్
భారతదేశంలో..
- దేశంలో మొట్టమొదటి కొవిడ్-19 కేసు 2020 జనవరి 30న కేరళలో నమోదైంది.
- సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చిన 76 ఏళ్ల కర్ణాటకకు చెందిన వ్యక్తి మార్చి 12న మరణించడంతో భారత్‌లో మొట్టమొదటి కొవిడ్ మరణం సంభవించింది.
- 22 మార్చి 2020న ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించారు.
- మొదటి విడత లాక్డౌన్ మార్చి 23 నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా విధించారు.
- 2020 మే 7న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సంజీవిని యాప్నుఆవిష్కరించారు.
- 2020 మార్చి 28న PMCARES FUNDను ఏర్పాటు చేశారు.
- ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 194 దేశాలకు కొవిడ్-19 విస్తరించింది.
- కరోనా వైరస్ సోకని ఒకేఒక ఖండం అంటార్కిటికా.
- ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని 16 జనవరి 2021న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు.
వివిధ రాష్ర్టాల్లో..
- దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొవిడ్-19 కేసులు విస్తరించాయి.
తెలంగాణ: కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆహార భద్రత కార్డుదారులందరికీ ఉచితంగా నెలనెలా ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలన్నింటిలో ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున ఏకకాల సహాయం అందజేశారు. లాక్డౌన్ సమయంలో కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం 24 మార్చి 2020న నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్: కొవిడ్ టెస్ట్‌ల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉంది. మాస్క్ కవచం క్యాంపెయిన్ నిర్వహించారు. 2020 మార్చి 10న ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు వాలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు.
గుజరాత్: 2020 మార్చి 2న ఫీవర్ హెల్ప్‌లైన్ 104ను ప్రారంభించారు. డాక్టర్ టెకో అనే మొబైల్ యాప్‌ను రూపొందించింది. కొవిడ్-19 పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, ఆరోగ్య సిబ్బంది వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది.
ఒడిశా: ఒడిశా ప్రభుత్వం 2020 మార్చి 13న కొవిడ్-19ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్-19తో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
అసోం: లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన అసోంకు చెందిన వారికి 2020 మార్చి 22న ప్రభుత్వం 2,000 డాలర్ల ఏకకాల ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది. ఔషధాలను నేరుగా ఇంటి వద్దకు అందించే ధన్వంతరి అనే నూతన పథకాన్ని ప్రారంభించింది.
సెకండ్ వేవ్
- కొవిడ్-19 సెకండ్ వేవ్‌తో 2021 ఫిబ్రవరి నుంచి దేశంలో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2021 మే నుంచి పట్టణ ప్రాంతాల్లో వ్యాధి సంక్రమణ తగ్గుముఖం పట్టినప్పటకీ గ్రామీణ ప్రాంతాలపై పంజా విసిరింది. చాలాకాలం వరకు పట్టువీడలేదు.
- అధికారిక లెక్కల ప్రకారం 2021 జూన్ నెలలో దేశంలో 3 మిలియన్ల క్రియాశీల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 2 లక్షల పైచిలుకు ప్రజలు మరణించారు.
- ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సరఫరా, అత్యవసర ఔషధాల కొరతతో మరణాలు ఆందోళనకు గురిచేశాయి. భారత్‌లోని కొవిడ్-19 సెకండ్ వేవ్‌పై పోరాటానికి మద్దతుగా 40 దేశాలు ముందుకు వచ్చాయి.
వ్యాక్సిన్లు
- ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశంలో 2021 జనవరి 16న ప్రారంభించారు.
- ఢిల్లీలోని ఎయిమ్స్‌లలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న 34 ఏండ్ల మనీష్ కుమార్‌కు మొదటి వ్యాక్సిన్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమక్షంలో ఇచ్చారు.
- వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ (కొవిషీల్డ్), దేశీయంగా తయారైన కొవాగ్జిన్‌తో ప్రారంభించారు. ఆ తర్వాత స్పుత్నిక్-వి, మోడెర్నా వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతించారు.
కొవిషీల్డ్: దీన్ని యునైటెడ్ కింగ్డమ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా రూపొందించగా భారత్‌లోని పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది. ఈ వ్యాక్సిన్ చింపాంజీల నుంచి తీసుకున్న సాధారణ జలుబు వైరస్ (ఎడినోవైరస్) బలహీనమైన వెర్షన్ ద్వారా తయారు చేస్తారు. ఈ వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయవలసి ఉంటుంది. రెండు డోసుల మధ్య వ్యవధి 4 నుంచి 12 వారాలు ఉండాలి.
కొవాక్జిన్: దీన్ని మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. దీన్ని చనిపోయిన వైరస్ నుంచి తయారు చేస్తారు. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయవచ్చు. రెండు డోసుల మధ్య వ్యవధి నాలుగు వారాలు.
వ్యాక్సిన్ కోసం యాప్: కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా కొనసాగించడానికి ప్రభుత్వం కొవిన్ అనే మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా 12 భాషల్లో టెక్ట్స్ మెసేజ్ వస్తుంది. అన్ని డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అందిస్తారు.
- కొవిడ్-19 వ్యాక్సిన్లకు ఎంపిక చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 2020 ఆగస్టులో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ కె.వి. పాల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది.
మాదిరి ప్రశ్నలు
1. కరోనా వైరస్ దృష్ట్యా దేశంలో రెండో దశ లాక్డౌన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేశారు?
1) 14.4.2020 నుంచి 2.5.2020
(19 రోజులు)
2) 15.4.2020 నుంచి 3.5.2020
(19 రోజులు)
3) 14.3.2020 నుంచి 3.4.2020
(21 రోజులు)
4) 25.3.2020 నుంచి 14.4.2020
(21 రోజులు
2. కరోనా వైరస్‌ను ఎపిడిమిక్గా ప్రకటించిన మొదటి రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) ఉత్తరప్రదేశ్
3) హర్యానా 4) పంజాబ్
3. కొవిడ్-19ను ఎదుర్కోవడానికి ఆపరేషన్ నమస్తేను ప్రారంభించింది?
1) భారత సైన్యం 2) భారత నావికాదళం
3) భారతీయ తీరప్రాంత భద్రతా దళం
4) భారతీయ వైమానికదళం
4. కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ఉపయోగించిన PPE కిట్ పూర్తి రూపం ఏంటి?
1) Provisinol Protective Equipment
2) Personal Protective Equipment
3) Provisional Protection Equipment
4) Personal Protective Element
5. కొవిషీల్డ్ ఎటువంటి తరహా కరోనా వైరస్ వ్యాక్సిన్?
1) ప్రొటీన్ ఆధారిత 2) m-RNA రకం
3) వైరల్ ఫ్యాక్టర్ 4) ఇనాక్టివేటెడ్ వైరస్
6. కింది వాటిని జతపరచండి.
1. ఆల్ఫా ఎ. భారత్
2. బీటా బి. బ్రెజిల్
3. గామా సి. యునైటెడ్ కింగ్డమ్
4. డెల్టా డి. దక్షిణాఫ్రికా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు