ఏ రాష్ట్రంలో ‘తోకు ఎమోంగ్ పక్షి’ గణనను ప్రారంభించారు?
1. కింది వాటిలో జీ-20లో లేని దేశం ఏది?(4)
1) మెక్సికో 2) కెనడా
3) అర్జెంటీనా 4) న్యూజిలాండ్
వివరణ: అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల కూటమే జీ-20. ఇందులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 1న జీ-20 కూటమి నాయకత్వ బాధ్యత భారత్‌కు రానుంది. ఇటీవల దీనికి సంబంధించిన లోగోను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. వసుదైక కుటుంబ భావనను ప్రతిబింబించేలా ఇది ఉంది. 2023లో జీ-20 సమావేశానికి భారత్ వేదిక కానుంది. 2022లో ఈ సమావేశం ఇండోనేషియాలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది షాంఘై కోఆపరేన్ ఆర్గనైజేషన్ సమావేశం కూడా భారత్‌లో
నిర్వహించనున్నారు.
2. 17వ ప్రవాస భారతీయ దివస్ ఏ నగరంలో నిర్వహించనున్నారు? (2)
1) బుర్హాన్ పూర్ 2) ఇండోర్
3) నాగ్‌పూర్ 4) గ్వాలియర్
వివరణ: ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తారు. 1915 జనవరి 9న మహాత్మాగాంధీ భారత్‌కు చేరుకున్నారు. తర్వాత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు కూడా భారత అభివృద్ధికి తోడ్పడాలన్న ఉద్దేశంతో ఈ రోజును ఎంపిక చేశారు. వచ్చే ఏడాది 17వ ప్రవాస భారతీయ దివస్‌ను ఇండోర్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు గయానా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ ఏడాది పలు అంశాల రీత్యా ఇండోర్ వార్తల్లో ఉంది. భారత్‌లో మొట్టమొదటి స్మార్ట్ అడ్రస్‌ల నగరంగా ఇండోర్ నిలిచింది. అలాగే నల్లాల ద్వారా అన్ని గృహ సముదాయాలకు నీటిని అందిస్తున్న భారతదేశపు తొలి జిల్లాగా బుర్హాన్పూర్ నిలిచింది.
3. 103వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? (3)
1) జీఎస్టీ
2) బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు
3) ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్
4) ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ మరో పది సంవత్సరాల పొడిగింపు
వివరణ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ను కల్పించేందుకు ఉద్దేశించింది 103వ రాజ్యాంగ సవరణ. 2019 జనవరిలో దీన్ని భారత పార్లమెంట్ ఆమోదించింది. దీని ద్వారా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో 15(6), 16(6)లను చేర్చారు. అయితే దీని రాజ్యాంగబద్ధతను పలువురు ప్రశ్నించడంతో దీన్ని ఇటీవల సుప్రీంకోర్ట్ సమీక్షించింది. ఇది రాజ్యాంగబద్ధమే అని తీర్పు ఇచ్చింది. ఈ చట్ట సవరణ మౌలిక స్వరూపాన్ని ఎంత మాత్రం ఉల్లంఘించలేదని అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి ఈ రిజర్వేషన్ సదుపాయం రానుంది.
4. 22వ న్యాయ కమిషన్‌కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? (1)
1) రితురాజ్ అవస్తి 2) కేవీ కామత్
3) కిశోర్ బాష 4) తయ్యబ్ విక్రం
వివరణ: 22వ న్యాయ కమిషన్ చైర్మన్‌గా రితురాజ్ అవస్తి నియమితులయ్యారు. ఇది కార్యనిర్వాహక వ్యవస్థ. నిజానికి కమిషన్ ఏర్పాటును 2020 ఫిబ్రవరి 24న ప్రకటించారు. న్యాయ కమిషన్ అనే వ్యవస్థ ఈస్టిండియా పాలన కాలంలో ఏర్పాటయ్యింది. 1833 నాటి చార్టర్ చట్టాన్ని దీనికి మాతృకగా చెప్పవచ్చు. స్వాతంత్య్రం తర్వాత దీన్ని కొనసాగిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు స్వతంత్ర డైరెక్టర్‌గా ఇటీవల కేవీ కామత్ నియమితులయ్యారు. ఆయన గతంలో బ్రిక్స్ బ్యాంక్‌కు సారథ్యం వహించారు. నేషనల్ మాన్యుమెంట్ అథారిటీకి చైర్మన్‌గా కిశోర్ కుమార్ బాష నియమితులయ్యారు. అలాగే ఏషియన్ హాకీ ఫెడరేషన్‌కు తయ్యబ్ విక్రమ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
5. ఏ దేశంతో గరుడ-7 విన్యాసాలను భారత్ నిర్వహిస్తుంది? (4)
1) నేపాల్ 2) శ్రీలంక
3) అమెరికా 4) ఫ్రాన్స్
వివరణ: యూరప్ దేశం అయిన ఫ్రాన్స్‌తో భారత్ గరుడ-7 విన్యాసాలను నిర్వహిస్తుంది. ఇటీవల అక్టోబర్ 26న ప్రారంభమై నవంబర్ 12న ముగిశాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించారు. భారత వైమానిక దళం, అలాగే ఫ్రాన్స్ దేశానికి చెందిన ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. తొలిసారిగా లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, లైట్ కంబాట్ హెలికాప్టర్లు ఇందులో పాలుపంచుకున్నాయి. అయిదో గరుడ విన్యాసం కూడా జోధ్‌పూర్‌లోనే 2014లో నిర్వహించారు. తొలిసారిగా ఇరుదేశాల మధ్య ఈ విన్యాసం 2003లో గ్వాలియర్‌లో జరిగింది.
6. విక్రం-ఎస్ ఇటీవల వార్తల్లో నిలిచింది.ఇది ఏంటి? (3)
1) కొత్త యుద్ధ నౌక
2) భారత్‌లో ప్రైవేట్ రంగంలో తయారైన తొలి క్షిపణి
3) భారత్‌లో ప్రైవేట్ రంగంలో తయారైన తొలి రాకెట్
4) ఏదీకాదు
వివరణ: విక్రమ్-ఎస్ అనేది వాహక నౌక. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ దీన్ని రూపొందించింది. వాతావరణ అనుకూలత ఆధారంగా దీన్ని ఇస్రో ప్రయోగించనుంది. భారత దేశ అంతరిక్ష రంగంలో ఇదే తొలి ప్రైవేట్ రంగ రాకెట్ కానుంది. ప్రపంచంలోనే అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను ప్రయోగించే సత్తా భారత్‌కు ఉంది. అయితే ప్రపంచ అంతరిక్ష వాణిజ్యంలో భారత్ వాటా కేవలం 2-3 శాతం మాత్రమే ఉంది.
7. RTS, S/AS01 ఇటీవల వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది? (2)
1) కరోనాలో కొత్త వేరియంట్
2) మలేరియా వ్యాక్సిన్
3) కరోనా అన్ని వేరియంట్లపై పనిచేస్తున్న తొలి వ్యాక్సిన్
4) కొత్త వైరస్ డయాగ్నస్టిక్ విధానం
వివరణ: గ్లాక్సో స్మిత్ైక్లెన్ సంస్థ రూపొందించిన మలేరియా వ్యాక్సిన్ ఇది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించింది. మలేరియా రాకుండా అడ్డుకొనేందుకు ఇదో మైలురాయి కానుంది. ప్రపంచవ్యాప్తంగా అయిదు రకాల మలేరియా జ్వరాలు ఉన్నాయి. ఎక్కువ శాతం ఇవి ఆఫ్రికాలో సంభవిస్తాయి. 2020లో నమోదైన మలేరియా కేసుల్లో భారత్ నుంచి 1.7 శాతం ఉన్నాయి.
8. ‘ఇండియన్ హనీ బీ’ ఇటీవల భారత్‌లో ఎక్కడ కనిపించింది? (4)
1) ఈశాన్య భారతం 2) తూర్పు కనుమలు
3) హిమాలయాలు 4) పశ్చిమ కనుమలు
వివరణ: పశ్చిమ కనుమల్లో తేనెటీగకు చెందిన ఒక కొత్త జాతిని గుర్తించారు. ఎంటోమోన్ అనే ఒక మ్యాగజైన్లో దీన్ని ప్రచురించారు. కొత్త జాతికి ‘అపిస్ కరింజొడియన్’ అని పేరు పెట్టారు. సాధారణంగా దీన్ని ‘ఇండియన్ బ్లాక్ హనీ బీ’ అనే పేరుతో పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో దాదాపు 200 సంవత్సరాల తర్వాత కొత్త తేనెటీగను గుర్తించారు. గతంలో 1798లో ఫ్యాబ్రిసియస్ అనే జాతిని గుర్తించారు. కొత్తగా గుర్తించిన అపిస్ కరింజోడియన్ అనేది మధ్య పశ్చిమకనుమల నుంచి నీలగిరి వరకు విస్తరించింది. అలాగే దక్షిణ పశ్చిమ కనుమల్లోనూ దీని ఉనికి ఉంది. రాష్ర్టాల పరంగా చూస్తే గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడులో కనిపించే జాతి ఇది.
9. ఏ రాష్ట్రంలో ‘తోకు ఎమోంగ్ పక్షి’ గణనను ప్రారంభించారు? (3)
1) త్రిపుర 2) మణిపూర్
3) నాగాలాండ్ 4) మేఘాలయ
వివరణ: తోకు ఎమోంగ్ పక్షి గణనను నవంబర్ 4 నుంచి 7 వరకు నాగాలాండ్ రాష్ట్రంలో చేపట్టారు. వీటి సంఖ్యను లెక్కించడం ఇదే ప్రథమం. నాగాలాండ్‌లోని పక్షి వైవిధ్యాన్ని తెలియచేసేందుకు ఈ గణన చేపట్టారు. నాగాలాండ్ అటవీ విభాగంతో పాటు బర్డ్ కౌంట్ ఆఫ్ ఇండియా అనే వ్యవస్థతో కలిసి దీన్ని చేపట్టారు.
10. హరిత వాయు ఉద్గారాలు పెరగడం వల్ల జరిగే పరిణామం కింది వాటిలో ఏది? (4)
1) మంచు, హిమానీ నదాలు కరిగిపోతాయి
2) నీటి కొరత ఏర్పడుతుంది
3) సముద్ర మట్టాలు పెరుగుతాయి
4) పైవన్నీ
వివరణ: హరిత వాయు ఉద్గారాలు పెరగడం వల్ల వేగంగా హిమానీ నదాలు కరుగుతాయి. దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి, దీవి దేశాల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అలాగే హిమానీ నదాలు కరగడం వల్ల వచ్చే నీటిపైన ఆధారపడిన దేశాల్లో నీటి కొరత వస్తుంది. పర్యావరణం, రుతుపవన వ్యవస్థల్లో మార్పులు వచ్చి మనుగడ అసాధ్యం అవుతుంది. దాదాపు 1/3వ వంతు హిమానీ నదాల్లోని యునెస్కో వారసత్వ ప్రదేశాలకు కూడా ముప్పు పొంచి ఉందని ఇటీవల యునెస్కో సంస్థ ఒక నివేదికను వెలువరించింది. హిమానీ నదాల నిర్వహణ, సంరక్షణల కోసం ఒక అంతర్జాతీయ నిధిని ఏర్పాటు చేయాలని కూడా తాజా నివేదికలో యునెస్కో సూచించింది.
11. బ్లూంబర్గ్ తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం కింది వాటిలో సరైనది? (1)
1) శిలాజ ఇంధనాల ప్రోత్సాహానికి జీ-20 దేశాలు రాయితీ ఇస్తున్నాయి
2) శిలాజ ఇంధనాల ప్రోత్సాహానికి జీ-20 దేశాలు రాయితీని నిలిపివేశాయి
3) జీ-20 దేశాల్లో శిలాజ ఇంధనాలను వినియోగించడం లేదు
4) ఏదీకాదు
వివరణ: పర్యావరణానికి హాని కలిగించే శిలాజ ఇంధనాలకు జీ-20 దేశాలు ఇంకా రాయితీలు ఇస్తున్నాయని బ్లూంబర్గ్ అనే సంస్థ ఇటీవల తాజా నివేదికలో పేర్కొంది. కూటమిలో అన్నింటికంటే ఎక్కువ చైనా రాయితీలను ప్రకటించిందని, ఇది పర్యావరణానికి ఎంత మాత్రం మంచిది కాదని వెల్లడించింది. దాదాపు 700 బిలియన్ అమెరికన్ డాలర్లు 2021లో జీ-20 కూటమిలోని దేశాలు శిలాజ ఇంధనాలకు వెచ్చించాయని తెలిపింది. పారిస్ పర్యావరణ ఒప్పందానికి ఇది పూర్తిగా విరుద్ధమని చెప్పింది. అయితే శిలాజ ఇంధనాల్లో బొగ్గుకు ఇస్తున్న ప్రాధాన్యం క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొంది. 2016లో బొగ్గుకు ప్రాధాన్యం 4.1 శాతం ఉండగా, 2021లో 2.9 శాతానికి తగ్గింది.
12. ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలును ఏ దేశంలో ఆవిష్కరించారు? (3)
1) నార్వే 2) హంగేరి
3) స్విట్జర్లాండ్ 4) జపాన్
వివరణ: ప్రపంచంలోనే అతి పొడవైన రైలును స్విట్జర్లాండ్ దేశంలో అందుబాటులోకి తెచ్చారు. 100 కోచ్‌లతో 1910 మీటర్ల పొడవు ఉంది. 4550 సీట్లు ఇందులో ఉన్నాయి. ఆ దేశంలోని ఆల్ప్స్ పర్వత శ్రేణి గుండా ఈ రైలు పరుగులు పెడుతుంది. స్విట్లర్లాండ్లో రైల్వే ప్రారంభమై 175 సంవత్సరాలు పూర్తయ్యింది.
13. శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌లో పూర్తయిన తొలి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? (4)
1) గుజరాత్ 2) ఉత్తర్‌ప్రదేశ్
3) ఉత్తరాఖండ్ 4) మిజోరం
వివరణ: గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో 2016లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్థిక వృద్ధికి దోహదం చేసేలా ఇందులో ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పూర్తయిన తొలి క్లస్టర్‌గా మిజోరంలోని ఐబక్ నిలిచింది. ఇది ఐజ్వాల్ జిల్లాలో ఉంది. 25,000 నుంచి 50,000 వరకు జనాభా ఉన్న గ్రామాలను కలుపుతూ ఒక క్లస్టర్‌ను తయారు చేస్తారు. ఇందులో జనాభా 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. ఆ విధంగా ఏర్పడిన ఐబక్ క్లస్టర్లో చేపట్టిన రూర్బన్ మిషన్ పనులు పూర్తయ్యాయి. ఆర్యూఆర్బీఏఎన్ అనే పదాన్ని విడదీస్తే రూరల్, అర్బన్ అని వస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని సౌకర్యాలను గ్రామాల్లోనూ తీసుకురావడం అనే అంశాన్ని స్ఫురణకు తెస్తుంది.
14. నెతన్యాహూ ఏ దేశానికి ఇటీవల ప్రధానమంత్రి అయ్యారు? (2)
1) ఆస్ట్రియా 2) ఇజ్రాయెల్
3) దక్షిణ ఆఫ్రికా 4) అంగోలా
వివరణ: పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్‌లో కొత్త ప్రధానిగా నెతన్యాహు ఎన్నికయ్యారు. ఆ దేశ పార్లమెంట్‌కు నెస్సెట్ అని పేరు ఉంది. నెతన్యాహు లికుడ్ పార్టీకి చెందిన వారు. ఇజ్రాయెల్ దేశంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం ఉంది. కార్యనిర్వాహక వర్గం పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉంటుంది. ఏకసభ విధానం కొనసాగుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆ దేశంలో ఓటు హక్కు కల్పిస్తారు. ఆ దేశంలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలను నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్‌లో స్థిర ప్రభుత్వాలు ఏర్పడటం లేదు. తరచూ ఎన్నికలు వస్తున్నాయి.
15. ఒక క్యాలెండర్ సంవత్సరంలో టీ-20 మ్యాచుల్లో 1000 పరుగులు చేసిన భారత తొలి ఆటగాడు ఎవరు? (3)
1) విరాట్ కోహ్లీ 2) రోహిత్‌శర్మ
3) సూర్యకుమార్ యాదవ్
4) కేఎల్ రాహుల్
వివరణ: 2022లో నిర్వహించిన టీ-20లో విశేషంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కొత్త రికార్డ్‌ను నమోదు చేశాడు. ఈ ఫార్మాట్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది నవంబర్ 10 నాటికి 28 ఇన్నింగ్స్‌లు ఆడి 1026 పరుగులు ఆయన చేశాడు. సగటు 44.60.
వి. రాజేంద్ర శర్మ ఫ్యాకల్టీ: 9849212411
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు