నార్మ్ 47వ వ్యవస్థాపక దినోత్సవం
తెలంగాణ
రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సెప్టెంబర్ 1న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి పురస్కారాలు ప్రదానం చేశారు.
తెలంగాణ నంబర్ వన్
జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) నిర్వహించిన ‘సీసీటీఎన్ఎన్ హ్యాకథాన్ అండ్ సైబర్ చాలెంజ్-2022’లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. నిఘా విభాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ సెల్) రూపొందించిన ‘సైకాప్స్’ సాఫ్ట్వేర్ టూల్‌కు ఈ ఘనత దక్కింది. ఈ అవార్డును సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సీఐ సెల్ ఎస్పీ దేవేందర్ సింగ్ అందుకున్నా రు. దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలోని ఉద్యోగుల బృందం ఈ సాఫ్ట్ వేర్‌కు రూపకల్పన చేసింది.
షీ భరోసా సైబర్ ల్యాబ్
బాలల సంరక్షణ విభాగంలో తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ‘షీ భరోసా సైబర్ ల్యాబ్’కు ఫిక్కీ సర్మాటర్ పోలీసింగ్ స్పెషల్ జ్యూరీ-2022 పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా ఢిల్లీలో సెప్టెంబర్ 2న అందుకున్నారు.
జాతీయం
సారెక్స్-22
ఇండియన్ కోస్ట్ గార్డ్ 10వ నేషనల్ మారిటైం సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ సారెక్స్-22ను చెన్నైలో ఆగస్టు 28న నిర్వహించింది. ‘కెపాసిటీ బిల్డింగ్ టువర్డ్ మెరిన్ ప్యాసింజర్ సేఫ్టీ’ థీమ్‌తో ఈ ఎక్సర్సైజ్ను చేపట్టారు.
ఉద్యోగ్ ఖిలాడి యోజన
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి ఉద్యోగ్ ఖిలాడి ఉన్నయన్ యోజన’ను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌సింగ్ ధామి ప్రారంభించారు. దీని ద్వారా వర్ధమాన క్రీడాకారులకు ప్రతి ఏటా స్కాలర్షిప్ ఇస్తారు. మేటి క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు.
eAwas
కేంద్ర సాయుధ బలగాల ‘eAwas’ వెబ్ పోర్టల్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో సెప్టెంబర్ 1న ప్రారంభించారు. దీనిద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అర్హులైన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ సిబ్బందికి నివాస గృహాలు కేటాయిస్తారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ సీఏపీఎఫ్లో ఉన్నాయి.
నుఖాయ్
ఒడిశాలో నుఖాయ్ పేరుతో పండుగను సెప్టెంబర్ 1న నిర్వహించారు. దీనిని వినాయక చవితి తర్వాతి రోజు జరుపుకోవడం ఆనవాయితీ. నుఖాయ్లో నువా కొత్తది, ఖై అంటే ఆహారం. ధాన్యం పండిన తరువాత ఒడిశా రైతులు ఈ పండుగను జరుపుకొంటారు. ఒడిశా ప్రజలు జరుపుకొనే 13 పండుగల్లో ఇది ఒకటి. దీనిని స్థానిక ఒడియా భాషలో ‘బారా మాస్సా రే తేరా పర్వ’ అని పిలుస్తారు.
ఐఎన్ఎస్ విక్రాంత్
దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ సెప్టెంబర్ 2న జలప్రవేశం చేసింది. కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీఎం ప్రధాని హజరయ్యారు. దీనిని కొచ్చిన్ షిప్‌యార్డ్ తయారుచేసింది. దీని నిర్మాణ వ్యయం రూ.20 వేల కోట్లు. 16 అంతస్థులు ఉన్న దీని విస్తీర్ణం రెండు ఫుట్‌బాల్ గ్రౌండ్లతో సమానంగా ఉంటుంది. పొడవు 262.5 మీ., వెడల్పు 62.5 మీ., బరువు 42,800 టన్నులు.
నౌకాదళ నూతన పతాకం
నౌకాదళానికి సరికొత్త పతాకాన్ని ప్రధాని మోదీ సెప్టెంబర్ 2న ఆవిష్కరించారు. కొత్త పతాకంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో భారత జాతీయ జెండాను ఉంచారు. కుడివైపున నీలం, బంగారు వర్ణంలో అష్టభుజాకారం ఉంది. అష్టభుజాకారం.. నౌకాదళ బళ దిశల పరిధి, కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. లంగరు చిహ్నాన్ని స్థిరత్వానికి గుర్తు. నీలం రంగు నౌకాదళ సముద్ర సామర్థ్యానికి ప్రతీక. అష్టభుజాకారం చుట్టూ ఉన్న బంగారు రంగు బోర్డర్లు శివాజీ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. పతాకంలో తెలుపు రంగు నౌకాదళంలోని నౌకలు, నిర్మాణాలు, ఇతర సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. ఈ పతాకాన్ని ఛత్రపతి శివాజీకి అంకితమిచ్చారు.
క్రీడలు
మాక్స్ వెర్స్టాపెన్
బెల్జియన్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ బెల్జియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆగస్టు 28న జరిగిన పోటీలో 14వ స్థానంలో రేసు మొదలుపెట్టి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో అతడికిది తొమ్మిదో విజయం. ఈ రేసులో రెండో స్థానంలో సెర్గియో (రెడ్‌బుల్), మూడో స్థానంలో కార్లోస్ (ఫెరారీ) నిలిచారు.
కల్యాణ్ బే
ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడిగా ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ కల్యాణ్ బే ఎన్నికయ్యాడు. సెప్టెంబర్ 2న జరిగిన ఎన్నికల్లో బే బైచుంగ్ భూటియాను ఓడించాడు. 85 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి ఆటగాడిగా బే రికార్డు సృషించాడు. ఉపాధ్యక్షుడిగా ఎన్ఏ హారిస్ (కర్ణాటక), కోశాధిగారిగా కిపా అజయ్ (అరుణాచల్‌ప్రదేశ్) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా 14 మంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి ఫల్గుణ ఈసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
అక్సెల్సెన్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ విజేతగా నిలిచాడు. ఆగస్టు 28న టోక్యోలో జరిగిన మ్యాచ్‌లో థాయిలాండ్ ఆటగాడు కున్లావుట్ విదిత్సరన్ను ఓడించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అక్సెల్సెన్కు ఇది మూడో పతకం.
మహిళల సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి విజేతగా నిలిచింది. ఆమె చైనా క్రీడాకారిణి చెన్ యుఫియ్ను ఓడించింది. ఆమెకు ఇది మూడో ప్రపంచ చాంపియన్ పతకం.
అంతర్జాతీయం
రామన్ మెగసెసె అవార్డు
64వ రామన్ మెగసెసె అవార్డ్- 2022 విజేతలను ఫౌండేషన్ ఆగస్టు 31న ప్రకటించింది. సోథెరా చిమ్ (కంబోడియా), బెర్నాడెట్ మాడ్రిడ్ (ఫిలిప్పీన్స్), తదాషి హట్టోరి (జపాన్), గ్యారీ బెంచ్గిబ్ (ఇండోనేషియా)లకు ఈ బమతి వరించింది. సోథెరా చిమ్ కంబోడియాకు చెందిన మానసిక ఆరోగ్య న్యాయవాది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించడానికి విశేష కృషిచేశారు.
బెర్నాడెట్ జే మాడ్రిడ్ ఫిలిప్పీన్స్‌కు చెందిన పిల్లల హక్కుల పోరాట నాయకురాలు. బాలల హక్కుల పరిరక్షణకు విశేషంగా కృషిచేశారు.
తదాషి హట్టోరి జపనీస్ నేత్ర వైద్యుడు. వేలాదిమంది వియత్నామీలకు చికిత్స అందించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని అంధులకు చికిత్సలు చేయడంతోపాటు ఎందరో వైద్యులకు శిక్షణ ఇచ్చారు.
గ్యారీ బెంచ్గిబ్ సముద్ర ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఈయన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాడు.
1957లో స్థాపించిన ఈ అవార్డుకు ఫిలిప్పీన్స్ మూడో అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరు పెట్టారు. ఆసియా నోబెల్‌గా పరిగణించే ఈ అవార్డును ఏటా ఆగస్టు 31న ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ప్రదానం చేస్తారు. మొదటి రామన్ మెగసెసె అవార్డులను 1958, ఆగస్టు 31న ప్రదానం చేశారు.
వోస్టోక్-2022
రష్యా ఆర్మీ ఆధ్వర్యంలో వోస్టోక్-2022 పేరుతో సైనిక ఎక్సర్సైజ్ను సెప్టెంబర్ 1న మాస్కోలో ప్రారంభించింది. ఏడు రోజులు నిర్వహించిన ఈ ఎక్సర్సైజ్లో భారత్, చైనా, లావోస్, మంగోలియా, నికరాగువా, సిరియా, మాజీ సోవియట్ రిపబ్లిక్‌లైన అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజకిస్థాన్ పాల్గొన్నాయి. 50 వేల మంది సైనికులు, 140 యుద్ధ విమానాలు, 60 యుద్ధ నౌకలు, 5 వేలకు పైగా ఆయుధ యూనిట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయని మాస్కో రక్షణ శాఖ వెల్లడించింది.
వరల్డ్ కోకోనట్ డే
ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని సెప్టెంబర్ 2న నిర్వహించారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ (ఏపీసీసీ) 2009, సెప్టెంబర్ 2న చేపట్టింది. అప్పటి నుంచి యూఎన్-ఈఎస్సీఏపీ (యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ది ఆసియా పసిఫిక్) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా దీనిని నిర్వహిస్తున్నారు. కొబ్బరికాయల ప్రాముఖ్యత, సమాజంపై వాటి ప్రభావం గురించి అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘గ్రోవింగ్ కోకోనట్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ అండ్ లైఫ్’. భారత్‌లో ఈ దితనోత్సవాన్ని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ (సీడీబీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
వార్తల్లో వ్యక్తులు
దివితా రాయ్
కర్ణాటకకు చెందిన దివితా రాయ్ మిస్ దివా యూనివర్స్-2022గా ఎంపికయ్యారు. 10వ మిస్ దివా యూనివర్స్ పోటీలను ఆగస్టు 28న ముంబైలోని మహాలక్ష్మి స్టూడియోలో నిర్వహించారు. మిస్ దివా సూపర్నేషనల్-2022గా తెలంగాణకు చెందిన ప్రజ్ఞ అయ్యగారి ఎంపికయ్యారు.
నగేష్ సింగ్
థాయిలాండ్‌లో భారత రాయబారిగా నగేష్ సింగ్ ఆగస్టు 30న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఈయన 1995 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, కరెన్సీ థాయి బాట్, ప్రధాని ప్రయూత్ చాన్ ఓ చా.
గారెత్ విన్ ఓవెన్
బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్‌గా గారెత్ విన్ ఓవెన్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2న బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో రష్యా, అర్మేనియా, ఇరాన్, అజర్బైజాన్లలోని ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ కార్యాలయాల్లో పనిచేశారు. ఈయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
లక్ష్మణ్ నరసింహన్
స్టార్‌బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ సెప్టెంబర్ 1న నియమితులయ్యారు. అక్టోబర్ 1న పదవి చేపట్టనున్నారు. స్టార్‌బక్స్ అమెరికా ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాఫీ దిగ్గజ సంస్థ. ఈయన 2023, ఏప్రిల్ 1న స్టార్‌బక్స్ బోర్డులోకి వెళ్లనున్నారు. అప్పటిదాకా తాత్కాలిక సీఈవో హోవర్డ్ షాల్జ్‌తో కలిసి పనిచేస్తారు. లక్ష్మణ్ ప్రస్తుతం బ్రిటన్ సంస్థ రెకిట్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు సీఈవోగా పనిచేసిన తొలి విదేశీయుడు కూడా ఈయనే.
మిఖాయిల్ గోర్బచెవ్
సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) చివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ (91 ఏండ్లు) సెప్టెంబర్ 1న మరణించారు. ఈయన 1985లో సోవియట్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. శాంతి దూతగా పేరుపొందిన ఈయనకు 1990లో నోబెల్ శాంతి బమతి లభించింది.
అర్చన కే
ఉపాధ్యాయురాలు,
విషయ నిపుణులు, నల్లగొండ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?