మానవరహిత విమానం.. మానవాళికి ఉపయోగం
డ్రోన్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న పదం.. కనిపిస్తున్న మానవరహిత వైమానిక వాహనం.. ప్రస్తుతం సాంకేతికత ఎంతో పురోగతి సాధిస్తున్నది.. వ్యవసాయం, ఏరియల్ ఫొటోగ్రఫీ, దేనినైనా వెదకడానికి, నిర్మాణరంగం, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, అగ్నిప్రమాదాల నివారణకు ఇలా.. ప్రతి దాంట్లో డ్రోన్లను వినియో గిస్తున్నారు.. భవిష్యత్తులో ఆకాశంలో పక్షుల కంటే ఎక్కువగా డ్రోన్లే కనిపించినా ఆశ్చర్యపోనక్కర లేదు.. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన పలు రకాల డ్రోన్ల ప్రారంభ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం..
కిసాన్ డ్రోన్ యాత్ర
– రైతులకు సహాయమందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ 100 కిసాన్ డ్రోన్లను ఎగురవేశారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో 100 గ్రామాల్లో ఈ డ్రోన్ల సేవలు రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం (పురుగుమందులు చల్లడం, పండ్లు, కూరగాయల రవాణా వంటి సేవలు) ఉపయోగిస్తారు.
-హర్యానాలోని మానేసర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనికి గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారం అందించింది.
-గరుడ ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) సీఈవో అగ్నీశ్వర్ జయప్రకాష్.
డ్రోన్ మహోత్సవ్-2022
-దేశంలో అతిపెద్ద డ్రోన్ల ఉత్సవం మే 27, 28 తేదీల్లో ఢిల్లీలో ప్రగతి మైదానంలో జరిగింది. వివిధ రంగాలకు చెందిన 1600 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
70కి పైగా కంపెనీలు/వ్యక్తులు డ్రోన్లను ప్రదర్శించారు.
-మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (ఎంవోసీఏ) ‘డ్రోన్ సర్టిఫికేషన్ స్కీమ్’ను కేంద్రం ప్రారంభించింది. స్వమిత్ర యోజనలో భాగంగా భూ రికార్డుల సవరణకు, మెడిసిన్స్, వ్యాక్సిన్స్, ఇతర రవాణాల్లో డ్రోన్ల వినియోగం పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
డ్రోన్ స్కూల్
-భారత్‌లో మొట్టమొదటి డ్రోన్ స్కూల్‌ను కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గ్వాలియర్‌లో ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్ సహా వివిధ ప్రాంతాల్లో 5 డ్రోన్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
డ్రోన్ పాలసీని విడుదల చేసిన తొలి రాష్ట్రం
– దేశంలో తొలిసారిగా హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ పాలసీ-2022ను సీఎం జైరాం ఠాకూర్ ఆవిష్కరించారు. దీనికి GARUD (గవర్నెన్స్ అండ్ రిఫార్మ్ యూజింగ్ డ్రోన్స్) అని పేరుపెట్టారు. రవాణా, రక్షణ, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని సమర్థవంతంగా ఉపయోగించేలా ఈ పాలసీని రూపొందించారు.
వరుణ డ్రోన్
దేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ డ్రోన్‌ను ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. 25 కి.మీ. దూరాన్ని 25 నుంచి 30 నిమిషాల వ్యవధిలో చేరుతుంది. ఈ డ్రోన్ 130 కేజీల బరువును మోసుకెళ్లగలదు. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ (ముంబై) రూపొందించింది.
GARUD పోర్టల్
GARUD (గవర్నెన్స్ అండ్ రిఫార్మ్ యూజింగ్ డ్రోన్స్) పోర్టల్‌ను కేంద్ర విమానయాన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రభుత్వ ఏజెన్సీలు డ్రోన్ కార్యకలాపాలు విరివిగా వినియోగించుకునేందుకు సత్వర అనుమతులు లభించేలా చూడటం ఈ పోర్టల్ ప్రధాన లక్ష్యం.
హరా భరా డ్రోన్
దేశంలో మొదటిసారిగా విత్తన బంతులు వెదజల్లి అటవీ విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘సీడ్ కాప్టర్ డ్రోన్’ను ప్రారంభించింది. గతంలో ఇండియన్ నేవీ హెలికాప్టర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విత్తనాలు వెదజల్లింది. డ్రోన్ టెక్నాలజీ ద్వారా మొక్కలు పెంపొందించాలని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ డ్రోన్లను ‘మారుత్ డ్రోన్స్ సంస్థ’ రూపొందించింది.
మెడిసిన్స్ ఫ్రం ది స్కై
-దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలోని వికారాబాద్‌లో డ్రోన్స్ ద్వారా ఔషధాల రవాణా ప్రయోగాత్మకంగా చేపట్టారు. వ్యాక్సిన్స్, ఔషధాలు, బ్లడ్ యూనిట్లు వంటి అత్యవసరాలను మారుమూల ప్రాంతాలకు సత్వరమే సరఫరా చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. మెడిసిన్స్ ఫ్రం ది స్కై ప్రాజెక్టులోని తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, హెల్త్ నెట్ గ్లోబల్, నీతి ఆయోగ్‌లు భాగస్వాములు.
-కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించిన ప్రాజెక్టును తెలంగాణలోని 16 గ్రీన్ జోన్ల లో ప్రాథమికంగా అమలు చేసి ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టు అధ్యయనంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐటీ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం పాలుపంచుకుంటాయి.
– వజ్రోత్సవాల్లో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు కెమాంగ్ జిల్లాలోని ‘సెప్పా కమ్యూనిటీ’ కోసం మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రోగ్రాంను ఆగస్టు 15న వరల్డ్ ఎకనామిక్ ఫోరం థిమ్‌కు అనుగుణంగా ప్రారంభించారు. మెడిసిన్ ఫ్రం ది స్కై చేపట్టిన రెండో రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్ నిలిచింది.
డ్రోన్ హెల్త్ కేర్
-వాణిజ్య పరంగా హెల్త్ కేర్ రంగంలో డ్రోన్ల వినియోగానికి ఆమోదం పొందిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఉత్తర కాశి నుంచి డెహ్రాడూన్‌కు ఈ సర్వీస్ ప్రారంభించింది. 144 కి.మీ.ల దూరంగల ఈ రెండు పట్టణాలు రోడ్డు మార్గంలో ప్రయాణ సమయం 6-8 గంటలు. భూతాపాల్లో 12 గంటలు.
-ఈ దూరాన్ని డ్రోన్లు కేవలం 88 నిమిషాల్లో చేరడం గమనార్హం. రెడ్‌క్లిఫ్, స్కై ఎయిర్ సంస్థలు డ్రోన్ నిర్మాణం పనితీరు పరిశీలించాయి.
డ్రోన్ పోస్టల్ సర్వీసెస్
-ప్రపంచంలో మొదటిసారిగా డ్రోన్ ద్వారా పోస్టల్ సర్వీసెస్‌ను ప్రారంభించిన రాష్ట్రంగా గుజరాత్ రికార్డ్ సృష్టించింది.
– ఈ ప్రాజెక్టులో భాగంగా కచ్ జిల్లాలోని హబయ్-నెర్ గ్రామాల మధ్య 46 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల వ్యవధిలో సర్వీస్ అందినట్లు ‘ఇండియా పోస్ట్’ పేర్కొంది.
రైతులకు ఉచితంగా డ్రోన్స్ పంపిణీ చేయాలని నిర్ణయించిన రాష్ట్రం- తెలంగాణ
హిమ్ డ్రోన్ – ఏ థాన్
-భారత్ ఆర్మీ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హిమ్ డ్రోన్ – ఏ థాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పూర్తి స్వదేశీ సాంకేతికత ఆధారంగా వివిధ రకాలైన రక్షణ ఉత్పత్తులు తయారు చేయడమే దీని లక్ష్యం.
-ఎక్కువ ఎత్తులోకి సరుకు రవాణా, సామగ్రి తరలించడం
-నిఘాను పటిష్ఠపర్చడం
-సూక్ష్మ, అతిసూక్ష్మ డ్రోన్లను అభివృద్ధి చేయడం వంటివి ఇతర లక్ష్యాలు.
డ్రోన్ సర్వీసెస్ టెక్నీషియన్
-దేశంలోని 19 రాష్ట్రాల్లో 126 ఐటీఐల్లో షార్ట్ టర్మ్ కోర్సును 2022-23 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు 6 రకాల షార్ట్ టర్మ్ కోర్సులను అభివృద్ధి చేశారు.
స్కై స్ట్రెకర్ డ్రోన్స్/సూసైడ్ డ్రోన్స్
-అమెరికా నుంచి అత్యాధునిక ఎంక్యూ-9బి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత్ రూ.300 కోట్ల ఒప్పందానికి సంప్రదింపులు జరిపింది. వీటిని చైనా సరిహద్దులతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంపై నిఘాకు వినియోగించనున్నారు.
– 100 సూసైడ్ డ్రోన్లను దిగుమతి చేసుకునేందుకు ఇజ్రాయెల్-ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది.
ఇజ్రాయెల్ హెరాన్ డ్రోన్స్
-భారత్-ఇజ్రాయెల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ డ్రోన్లు భారత నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయనున్నాయి.
– బ్రిటన్‌కు చెందిన ఆల్డిట్యూడ్ ఏంజిల్, బీటీ తదితర సంస్థలు కలిసి ఆకాశంలో డ్రోన్ల కోసం సూపర్ హైవేలను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశాయి. ప్రస్తుతం బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ నగరాల మీదుగా సుమారు 265 కిలోమీటర్ల పొడవునా డ్రోన్ల సూపర్ హైవేను ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన డ్రోన్ల హైవే.
మాదిరి ప్రశ్నలు
1. దేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వరుణ డ్రోన్‌ను తయారు చేసినవారు?
1) సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ (ముంబై)
2) సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ (చెన్నై)
3) కొచ్చిన్ డిఫెన్స్ ఇంజినీరింగ్ (కేరళ)
4) సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ (కోల్‌కతా)
2. వరుణ డ్రోన్ రక్షణ రంగంలో ఏ విభాగానికి సేవలందించడానికి ఉద్దేశించింది?
1) మిలిటరీ 2) నేవి
3) వాయుసేన 4) పైవన్నీ
3. దేశంలో మొట్టమొదటి డ్రోన్ స్కూల్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) గ్వాలియర్ 2) మీరట్
3) అహ్మదాబాద్ 4) ఢిల్లీ
4. దేశంలో మొట్టమొదటి సారిగా డ్రోన్లను ఏ రాష్ట్ర పోస్టల్ సర్వీసెస్ వినియోగించింది?
1) తెలంగాణ 2) ఉత్తరాఖండ్
3) గుజరాత్ 4) హిమాచల్‌ప్రదేశ్
5. ప్రపంచంలో మొదటిసారి డ్రోన్ల ద్వారా ప్యాసింజర్లను తరలించిన దేశం?
1) చైనా 2) ఇరాన్ 3) ఇజ్రాయెల్ 4) యూఎస్ఏ
6. భారత్ సూసైడ్ డ్రోన్లను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇరాన్ 2) రష్యా 3) ఇజ్రాయెల్ 4) అమెరికా
7. దేశంలో మొట్టమొదటి సారిగా ఏ రాష్ట్రం డ్రోన్స్ పాలసీని ప్రారంభించింది?
1) హిమాచల్‌ప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) తెలంగాణ 4) గుజరాత్
8. ఇటీవల డ్రోన్ మహోత్సవ్ ఎక్కడ జరిగింది?
1) గ్వాలియర్ 2) ఢిల్లీ
3) అహ్మదాబాద్ 4) లక్నో
9. భారత్ అత్యాధునిక ఎంక్యూ-9బి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) రష్యా 2) ఫ్రాన్స్ 3) ఇరాన్ 4) అమెరికా
10. మెడిసిన్ ఫ్రం ది స్కై కార్యక్రమాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం
1) గుజరాత్ 2) తెలంగాణ
3) ఉత్తరాఖండ్ 4) ఢిల్లీ
సమాధానాలు
1-1, 2-2, 3-1, 4-3, 5-1, 6-3, 7-1, 8-2, 9-4, 10-2
ఎం ప్రవీణ్ కుమార్
21st సెంచరీ
ఐఏఎస్ అకాడమీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు