ఎంబీబీఎస్ సీట్లు.. ట్రిపుల్
#ఎనిమిదేండ్లలో గణనీయ ప్రగతి
# జిల్లాకో మెడికల్ కాలేజీతో రికార్డు
# ఈ ఏడాది పెరిగే సీట్లు 1,200
# ఇప్పటికే 6 కాలేజీలకు అనుమతి
ఒకప్పుడు ఎంబీబీఎస్ అంటే ‘ధనికుల చదువు’ అనే ముద్ర ఉండేది. ప్రభుత్వ కాలేజీలు పెద్దగా లేకపోవడం, ప్రైవేట్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించాల్సి రావడంతో ప్రజల్లో ఆ భావన పెరిగిపోయింది. పేదలకు అందని ద్రాక్షగా కనిపించేది. ఇంకోవైపు డబ్బు ఉన్నా అందరికీ సీటు దొరకని పరిస్థితి. డాక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉన్నవారు, తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పట్టా పొందాలనుకొనేవారు చైనా, ఉక్రెయిన్ వంటి విదేశాలకు వెళ్లి వైద్యవిద్య అభ్యసించేవారు. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మార్చివేస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా వైద్యవిద్య సామాన్యులకు చేరువవుతున్నది. తెలంగాణ ఏర్పడేనాటితో పోల్చితే ఎనిమిదేండ్లలోనే ఎంబీబీఎస్ సీట్లు మూడు రెట్లు పెరిగాయి. మెడికల్ కాలేజీల సంఖ్య సైతం మూడు రెట్లు పెరిగింది.
తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, వీటిల్లో 850 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా మొదటి దశలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలను మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లో ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో సీట్ల సంఖ్య 1,640కి పెరిగింది. అంటే ఏడేండ్లలోనే సీట్లు సుమారు రెట్టింపయ్యాయి. ఈ విద్యాసంవత్సరం మరో 8 కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కాలేజీల సంఖ్య 17కు చేరనున్నది. రెండో దశలో జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో మహబూబాబాద్, మంచిర్యాల మినహా ఆరు కాలేజీలకు అనుమతులు వచ్చాయి. ఒక్కో కాలేజీలో 150 సీట్లు ఉండనున్నాయి. ఈ లెక్కన 2022- 23 విద్యాసంవత్సరానికి మరో 1,200 సీట్లు అదనంగా చేరనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం సీట్ల సంఖ్య 2,840కి పెరుగనున్నది. అంటే ఎనిమిదేండ్లలోనే సీట్ల సంఖ్య మూడు రెట్లు పెరుగనున్నది. మూడో దశలో 8 కాలేజీలకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేయగా, పనులు ప్రారంభం అయ్యాయి.
గణనీయంగా పెరిగిన పీజీ సీట్లు
పీజీ సీట్ల విషయంలోనూ తెలంగాణ గణనీయ ప్రగతి సాధించింది. 2014లో రాష్ట్రవ్యాప్తంగా 531 సీట్లు మాత్రమే ఉండేవి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఉండేవి. ప్రభుత్వం కృషితో వీటిల్లో అదనపు సీట్లతోపాటు నిజామాబాద్ కాలేజీలోనూ సీట్లు మంజూరయ్యాయి. దీంతో రాష్ట్రంలోని పీజీ సీట్ల సంఖ్య 2022 నాటికి 915కు పెరిగింది. 384 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది మహబూబ్నగర్, సూర్యాపేట, సిద్దిపేట, నల్లగొండ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎన్ఎంసీ బృందం పరిశీలించి వెళ్లింది. త్వరలో అనుమతులు లభించే అవకాశం ఉన్నది.
ఎంబీబీఎస్ సీట్ల పెరుగుదల ఇలా..
విద్యా సంవత్సరం సీట్లు పెరుగుదల
2014-15 850 –
2021-22 1,640 790
2022-23 2,840 1,200
- Tags
- MBBS
- medical college
- Seats
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు