లిడియా నాణేలు.. చైనా నోట్లు!
భారత ఆర్థిక వ్యవస్థ
- ద్రవ్యం-అర్థం, నిర్వచనాలు, ద్రవ్య పరిణామ క్రమం
- వస్తు మార్పిడి పద్ధతిలోని లోపాలను, సమస్యలను, ఇబ్బందులను నివారించడానికి ద్రవ్యాన్ని ప్రవేశపెట్టారు.
- ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని వినిమయ మాద్యంగా ప్రవేశపెట్టిన తర్వాత వ్యాపార, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
- ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి ద్రవ్యం శక్తిమంతమైన సాధనంగా ఏర్పడింది.
- ఆర్థికాభివృద్ధికి మూలం ద్రవ్యమనే చెప్పవచ్చు.
- ఆధునిక ఆర్థిక వ్యవస్థను ద్రవ్య ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటారు.
- వస్తు మార్పిడి పద్ధతిలో వినిమయ మాద్యం ఉండదు.
- కాబట్టి వస్తు మార్పిడి పద్ధతిని C-C Eco nomy (Commodity to Commo dity Economy) అంటారు.
- ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని వినిమయ మాద్యంగా ప్రవేశపెట్టిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థను C-M-C Econo myగా పిలుస్తారు. అంటే Commodity to Money to Commodity Economy.
ద్రవ్యం అర్ధం (Meaning of Money)
- ద్రవ్యం అనే పదాన్ని ఆంగ్లంలో Money అంటారు.
- Money అనే ఆంగ్ల పదం Moneta (మనేటా) అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది.
- ప్రాచీన రోమన్ దేవత అయిన మనేటా ఆలయంలో నాణేలు ముద్రించడం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు.
- మానవ కల్పనలో అతి ముఖ్యమైనది – ద్రవ్యం
- ప్రతి శాస్త్రంలో ముఖ్యమైన కల్పనల్లో ఒకటి – ద్రవ్యం
ద్రవ్యంపై క్రౌథర్ వ్యాఖ్యానం
- యాంత్రిక శాస్త్రంలో ముఖ్యమైనది- చక్రం
- విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యమైనది- నిప్పు
- రాజనీతి శాస్త్రంలో ముఖ్యమైనది- ఓటు
- అర్థశాస్త్రంలో ముఖ్యమైనది – ద్రవ్యం
ద్రవ్యం నిర్వచనాలు (Definitions of Money)
- ద్రవ్యానికి వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాల నిర్వచనాలు సూచించారు.
- సర్వాంగీకారం కలిగినదే ద్రవ్యం – సెలిగ్మెన్
- ద్రవ్యం ఏ పని చేస్తుందో అదే ద్రవ్యం – వాకర్
- వినిమయ మాద్యంగా సర్వాంగీకారం పొంది, విలువ కొలమానం, విలువ నిధిగా ఉపయోగపడేదే ద్రవ్యం- క్రౌథర్
- వస్తువులను కొన్నప్పుడు చెల్లించడానికి, ఇతర రకాల వ్యాపారాలు, బాకీలు తీర్చడానికి అందరూ అంగీకరించేదే ద్రవ్యం – రాబర్ట్ సన్
- వస్తువులను కొనడానికి ఏ కొనుగోలు శక్తి అవసరమవుతుందో అదే ద్రవ్యం – కోల్
- ఖర్చు చేయడానికి ఉపయోగించేది ఏదైనా ద్రవ్యం – రాన్ లైట్
- రుణాలను ఇచ్చిపుచ్చుకోవడంలో అందరూ అంగీకరించేదే ద్రవ్యం – R.S. షేయర్స్
- ద్రవ్యం అనేది తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం – మిల్టన్ ఫ్రీడ్మన్
- కరెన్సీ, DD, టైమ్ డిపాజిట్లు, బ్యాంక్ డిపాజిట్లు, నాన్ క్లియరింగ్ కలిగినదే ద్రవ్యం- చికాగో స్కూల్
చట్టం దేన్ని ద్రవ్యం అంటుందో అదే ద్రవ్యం
ద్రవ్యం పరిణామ క్రమం (Evalutionary Sequences of Money)
- ద్రవ్య క్రమానుగత చరిత్ర, అభివృద్ధి. ఆసక్తికరంగాను, అర్థవంతంగాను ఉంది.
- ద్రవ్యం వాడుకలోకి రాక ముందు ఆర్థిక లావాదేవీలన్నీ ఏవిధంగా జరిగేవో తెలుసుకోవడం అవసరం.
- ద్రవ్యం ఇప్పటి వరకు ఆరు దశలను ఎదుర్కొన్నదని ఆర్థికవేత్తల అభిప్రాయం.
మొదటి దశ/ప్రారంభ దశ:
- ప్రారంభంలో గవ్వలను, ఆవులు, గొర్రెలు మొదలైన సాధు జంతువులను వినిమయ మాద్యంగా ఉపయోగించేవారు. ఇది కూడా వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉండేది.
- ఉష్ణ ప్రాంతాల వారు ఏనుగు దంతాలను, పులి పంజాలను, పక్షుల రెక్కలను, ఎండిన చేపలను, జంతు చర్మాలను వినిమయ మాద్యంగా ఉపయోగించారు.
- పసిఫిక్ ప్రాంతంలోని ఏప్ ద్వీప వాసులు – రాళ్ల ముక్కలను, జంతువులను ఉపయోగించారు.
రెండో దశ:
- మొదటి దశలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉత్పన్నం కాగా క్రమంగా రెండో దశలో వస్తు రూపంలోకి మారింది.
- రెండో దశలో మానవుని అవసరాలను తీర్చే వస్తువులను వినిమయ మాద్యంగా ఉపయోగించారు. ఇది కూడా వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉండేది.
- ఉదా: ఉత్తర అమెరికాలో పొగాకును, గ్రీస్‌లో ఆవులను, ఆఫ్రికాలో ఏనుగు దంతాలను, భారత్‌లో
- ధాన్యం, మేకలు, గొర్రెలను, ఇతర దేశాల్లో రంగు రాళ్లను వినిమయ మాద్యంగా ఉపయోగించారు.
- ఈ దశలో అనేక సమస్యలు, ఇబ్బందులు అంటే కొరత సమస్య, రవాణా సమస్య, నిలువ సమస్య, విభజన సమస్య మొదలైనవి ఉత్పన్నమయ్యాయి.
మూడో దశ:
- నాగరికత అభివృద్ధి క్రమంలో మానవుడు వినిమయ మాద్యంగా లోహాన్ని వినియోగించాడు. ఉదా:
- బంగారం, వెండి, రాగి
- మొదట లోహాన్ని ముద్దలుగా, కడ్డీలుగా ఉపయోగించారు. తర్వాత నాణేలు తయారు చేశారు.
- క్రీ.పూ.700 సంవత్సరంలో లిడియా (Lydia) ప్రాంతంలో మొదట నాణేలు జారీచేశారు.
- రోమన్ల కాలంలో భిషాంత్ అనే బంగారు నాణెం ప్రాచుర్యం పొందింది.
- మౌర్యుల కాలంలో ఫణ అనే వెండి నాణెం ప్రాచుర్యం పొందింది.
- భారతదేశంలో వాడుకలో ఉన్న నాణేలు
- వేద కాలం – నిష్క, శతమానం (బంగారం), కృష్ణల (వెండి)
- ఢిల్లీ సుల్తానులు – టంక
- మొగలులు – రూపీ
- మూడో దశలో వినిమయ మాద్యంగా ఉపయోగించిన లోహంవల్ల అనేక సమస్యలు ఉన్నాయి. అంటే లోహం కొరత, లోహం స్వచ్ఛత, ఏకత లోపం, లోహం అంతర్గత, బహిర్గత విలువలు మొదలైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
నాలుగో దశ:
- బంగారం, వెండి లోహాలను ఆధారంగా చేసుకుని కేంద్ర బ్యాంకు ద్వారా కాగితపు ద్రవ్యం (నోట్లు) జారీ అయ్యింది.
- ప్రారంభంలో జారీ చేసిన ద్రవ్యానికి నూటికి నూరు శాతం లోహ విలువలు ఉండేవి. తర్వాత లోహ రూపంలోకి మార్చడానికి వీలులేకుండా నోట్లు జారీచేశారు.
- 17, 18 శతాబ్దాల కాలంలో కాగితాన్ని ద్రవ్యంగా లేదా వినిమయ మాద్యంగా ఉపయోగించారు.
ప్రపంచంలో మొదట కాగితపు ద్రవ్యాన్ని ఉపయోగించిన వారు చైనా దేశస్థులు (క్రీ.శ. 7వ శతాబ్దం). - దేశంలో క్రీ.శ.1806లో కాగితపు ద్రవ్యం చెలామణిలోకి వచ్చింది.
- కాగితపు ద్రవ్యాన్ని వినిమయ మాద్యంగా ఉపయోగించడంవల్ల వివిధ సమస్యలు అంటే లెక్కించడం కష్టం, నిలువ సమస్యలు, రవాణా సమస్యలు, భద్రతా సమస్యలు, అంతర్గత, బహిర్గత సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
ఐదో దశ:
- ఈ దశలో చెక్కులు, DD లను పరపతి ద్రవ్యంగా/బ్యాంకు ద్రవ్యంగా ఉపయోగించారు.
- బంగారాన్ని నిల్వచేసి కరెన్సీని జారీ చేసిన విధంగానే, కరెన్సీని నిల్వచేసి జారీచేసే ద్రవ్యాన్ని పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యం అంటారు.
ఆరో దశ:
- ఈ దశలో Debit Card, Credit Card, Smart Card మొదలైన ప్లాస్టిక్ ద్రవ్యాన్ని ఉపయోగిస్తున్నారు.
- డిజిటల్ ద్రవ్యం లేదా క్రిప్టో కరెన్సీ: భౌతికంగానే కాకుండా ఆన్లైన్ ద్వారా, కంప్యూటర్ ద్వారా రూపొందించిన వెబ్ బేస్డ్ ద్రవ్యాన్ని డిజిటల్ ద్రవ్యం అంటారు.
- ఉదా: బిట్ కాయిన్
సమీప ద్రవ్యం (Near Money):
బాండ్లు, ట్రెజరీ బిల్లులు మొదలైన వాటికి కూడా ద్రవ్యత్వం ఉంటుంది. వీటిని కూడా ఆర్థిక వ్యవస్థలో వినిమయ మాద్యంగా ఉపయోగిస్తున్నారు. వీటికి ద్రవ్యానికి ఉండే లక్షణాలు ఉండటంవల్ల దీన్ని సమీప ద్రవ్యం అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. Money అనే ఆంగ్ల పదం Moneta అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది? (బి)
ఎ) గ్రీకు బి) లాటిన్
సి) జర్మనీ డి) రష్యన్
2. జాన్ మనెటా ఏ దేశ దేవత? (ఎ)
ఎ) రోమన్ దేవత బి) జర్మన్ దేవత
సి) గ్రీక్ దేవత డి) ఈజిప్టు దేవత
3. C-M-C ఎకానమీ అంటే.. (ఎ)
ఎ) Commodity to Money to Commodity
బి) Cash to Money to Commodity
సి) Commodity to Money to Cash
డి) Credit card to Money to Commodity
4. మానవుని ఆర్థిక కార్యకలాపాల్లో ముఖ్యమైనది ఏది? (సి)
ఎ) వస్తువులు బి) సేవలు
సి) ద్రవ్యం డి) పైవన్నీ
5. యాంత్రిక శాస్త్రంలో చక్రం, విజ్ఞానశాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు, అర్థశాస్త్రంలో ముఖ్యమైనది ద్రవ్యం అని వ్యాఖ్యానించినది ఎవరు? (ఎ)
ఎ) క్రౌథర్ బి) వాకర్
సి) సెలిగ్ మెన్ డి) కీన్స్
6. సర్వాంగీకారం కలిగినదే ద్రవ్యం అని నిర్వచించినది ఎవరు? (బి)
ఎ) వాకర్ బి) సెలిగ్ మెన్
సి) ఫిషర్ డి) క్రౌథర్
7. ద్రవ్యం అనేది తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం అని పేర్కొన్నది ఎవరు? (ఎ)
ఎ) మిల్టన్ ఫ్రీడ్మన్ బి) ఫిషర్
సి) కీన్స్ డి) రాబర్ట్సన్
8. ఆర్థిక వ్యవస్థలో వినిమయ మాద్యంగా జంతువులను, గవ్వలను ఏ దశలో ఉపయోగించారు? (ఎ)
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
9. ఉష్ణ ప్రాంతం వారు వినిమయ మాద్యంగా వేటిని ఉపయోగించారు? (డి)
ఎ) ఏనుగు దంతాలు, పులి పంజాలు
బి) పక్షుల రెక్కలు, జంతు చర్మాలు
సి) ఎండిన చేపలు డి) పైవన్నీ
10. ఉత్తర అమెరికాలో వినిమయ మాద్యంగా దేన్ని ఉపయోగించారు? (ఎ)
ఎ) పొగాకు బి) తేయాకు
సి) ధాన్యం డి) మేకలు, గొర్రెలు
11. ఆర్థిక వ్యవస్థలో వినిమయ మాద్యంగా లోహాన్ని ఏ దశలో ఉపయోగించారు? (బి)
ఎ) రెండో దశ బి) మూడో దశ
సి) నాలుగో దశ డి) ఐదో దశ
12. భిషాంత్ అనే బంగారు నాణెం ఎవరి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది? (ఎ)
ఎ) రోమన్ల కాలం బి) మౌర్యుల కాలం
సి) వేద కాలం డి) మొగలుల కాలం
13. ఏ సంవత్సరంలో లిడియా ప్రాంతంలో మొదట నాణేలను జారీ చేశారు? (ఎ)
ఎ) క్రీ.పూ.700 బి) క్రీ.శ.700
సి) క్రీ.పూ.600 డి) క్రీ.శ.600
14. భారతదేశంలో వేదకాలంలో ఏ రకమైన నాణేలను ఉపయోగించారు? (డి)
ఎ) నిష్క (బంగారం) బి) కృష్ణల (వెండి)
సి) శతమానం (బంగారం) డి) పైవన్నీ
15. ఫణ అనేది? (బి)
ఎ) బంగారు నాణెం బి) వెండి నాణెం
సి) రాగి నాణెం డి) ఇనుప నాణెం
16. కాగితపు ద్రవ్యాన్ని ఏ శతాబ్దంలో చైనీయులు ఉపయోగించారు? (ఎ)
ఎ) క్రీ.శ.7వ శతాబ్దం
బి) క్రీ.శ.8వ శతాబ్దం
సి) క్రీ.పూ.7వ శతాబ్దం
డి) క్రీ.పూ.8వ శతాబ్దం
17. దేశంలో కాగితపు ద్రవ్యం ఏ సంవత్సరంలో చలామణిలోకి వచ్చింది? (సి)
ఎ) 1808 బి) 1807
సి) 1806 డి) 1805
18. Credit, Debit Cardలను ఏ ద్రవ్యంగా ఉపయోగిస్తారు? (బి)
ఎ) సమీప ద్రవ్యం బి) ప్లాస్టిక్ ద్రవ్యం
సి) డిజిటల్ ద్రవ్యం డి) క్రిప్టో ద్రవ్యం
19. సమీప ద్రవ్యానికి ఉదాహరణ? (డి)
ఎ) బాండ్లు బి) షేర్లు
సి) ట్రెజరీ బిల్లులు డి) పైవన్నీ
20. కరెన్సీని నిల్వచేసి జారీచేసే ద్రవ్యాన్ని ఏమంటారు? (ఎ)
ఎ) పరపతి ద్రవ్యం బి) ద్రవ్యత్వం
సి) సమీప ద్రవ్యం డి) పైవన్నీ
పానుగంటి కేశవరెడ్డి
వైష్ణవీ పబ్లికేషన్స్, గోదావరిఖని
99495 62008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు