భారతీయ మహిళ-హక్కులు, రక్షణలు (ఇండియన్ పాలిటీ & గవర్నెన్స్)
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంరక్షణకు, అభివృద్ధికి, మహిళా సాధికారతకు తీసుకుంటున్న చర్యలు..
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మహిళా జనాభా 48.5 శాతంగా ఉంది. అదేవిధంగా స్త్రీ, పురుష నిష్పత్తి 943 :1000గా నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళా జనాభా 1,77,92,041గా నమోదుకాగా, స్త్రీ-పురుష నిష్పత్తి 932 :1000గా నమోదైంది.
రాజ్యాంగంలో పొందుపర్చిన మహిళా రక్షణ,సాధికారత అంశాలు
1. ఆర్టికల్ 15(1): మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేదా వాటిలో కొన్నింటి ఆధారంగా ఏ వ్యక్తిపై ప్రభుత్వం వివక్ష చూపరాదు.
2. ఆర్టికల్ 15(3): ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా ప్రత్యేక విధానాలు రూపొందించవచ్చు.
3. ఆర్టికల్ 16(2): ప్రభుత్వ ఉద్యోగ కల్పన విషయంలో లింగం ఆధారంగా వివక్ష చూపరాదు.
4. ఆర్టికల్ 23 (1): చట్టవ్యతిరేక చర్యల నిమిత్తం మనుషులతో వ్యాపారం చేయించడం నిషేధం. అక్రమ మానవ రవాణా, వ్యభిచారం, జోగిని, దేవదాసి వంటి వ్యవస్థలను నిషేధించారు.
5. ఆర్టికల్ 39(ఎ): స్త్రీ-పురుషులు ఇద్దరికీ జీవనభృతిని కల్పించాలి.
6. ఆర్టికల్ 39(సి): మహిళా ఉద్యోగినులు దోపిడీకి గురికాకుండా కాపాడటం రాజ్యం బాధ్యత.
7. ఆర్టికల్ 39(డి): స్త్రీ-పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.
8. ఆర్టికల్ 42: స్త్రీలకు ఉచిత ప్రసూతి సదుపాయాలను కల్పించడం రాజ్యం బాధ్యత.
9. ఆర్టికల్ 51(A)(e): ప్రతి పౌరుడు మహిళలను గౌరవించాలి. వారిని అవమాననించే చర్యలను విడనాడాలి.
10. ఆర్టికల్ 243D (3): పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 1/3 వంతు సీట్లు కేటాయించాలి.
11. ఆర్టికల్ 243D (4): పంచాయతీఅధ్యక్ష స్థాన ఎన్నికల్లో స్త్రీలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలి.
12. ఆర్టికల్ 243T (3): మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలి.
13. ఆర్టికల్ 243T (4): మున్సిపాలిటీ అధ్యక్ష స్థానాల ఎన్నికల్లో మహిళలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలి.
మహిళలకు చట్టపరమైన హక్కులు
– మహిళా సంరక్షణ, సాధికారత కోసం రాజ్యాంగపరమైన రక్షణలే కాకుండా చట్టపరమైన హక్కులను కూడా రూపొందించారు. అవి..
1. వరకట్న నిషేధ చట్టం – 1961
2. హిందూ వివాహ చట్టం – 1955
3. హిందూ వారసత్వ చట్టం – 1956 (ఈ చట్టాన్ని 2005లో సవరించారు. దీని ప్రకారం స్త్రీలు కూడా తండ్రి ఆస్తిపై హక్కులు కలిగి ఉంటారు)
4. కుటుంబ న్యాయస్థానాల చట్టం – 1984
5. మహిళల అసభ్య ప్రదర్శనా నిషేధ చట్టం – 1986
6. గృహహింస నిరోధక చట్టం – 2005
7. భారతీయ శిక్షాస్మృతి-1860 (2013లో దీన్ని సవరించారు. ఇందులో ఆమ్ల దాడులు, లైంగిక దాడులు, లైంగిక వేధిం పులు వంటివి చేర్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని నిర్భయచట్టం లేదా యాంటీ రేప్ యాక్ట్‌ను రూపొందించారు).
8. మైన్స్ యాక్ట్-1952, ఫ్యాక్టరీల చట్టం -1948 ప్రకారం మహిళలచేత రాత్రి 7గంటల తర్వాత, ఉదయం 6 గంటల లోపు వేళల్లో పని చేయించడం నిషేధం.
9. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013. (పబ్లిక్/ప్రై వేట్/సంఘటిత/అసంఘటిత రంగాలో పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధం)
10. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-1973 ప్రకారం.. మహిళలను అరెస్ట్ చేయాలంటే మహిళా పోలీస్ తప్పనిసరిగా ఉండాలి.
జాతీయ మహిళా కమిషన్
– 1988లో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ సిఫారసుల మేరకు 1990లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ద్వారా జాతీయ మహిళా కమిషన్ (NCW)ను ఏర్పాటు చేశారు. 1992లో NCW ని చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేశారు.
-మహిళల హక్కుల రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాల పరిరక్షణకు జాతీయ మహిళా కమిషన్ కృషి చేస్తుంది.
నిర్మాణం: 1+5. ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులతో జాతీయ మహిళా కమిషన్ తన విధులను నిర్వహిస్తుంది. చైర్మన్‌ను, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరి పదవీకాలం మూడు సంవత్సరాలు. వీరు రాజీనామా పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. వీరి జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఈ కమిషన్ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
– మొదటి చైర్మన్ – జయంతి పట్నాయక్
– ప్రస్తుతం – రేఖాశర్మ
NCW – విధులు
1. రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరును ఈ NCW పర్యవేక్షిస్తుంది.
2. పనిచేసే చోట మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను పరిశీలిస్తుంది.
3. గృహ హింస చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తుంది.
4. 73వ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ల అమలు తీరును పరిశీలిస్తుంది.
5. మహిళా విధానాల రూపకల్పనకు సంబం ధించిన విషయాల్లో పాలు పంచుకుంటుంది.
6. మహిళా హక్కుల ఉల్లంఘనలు తరచుగా జరిగే అవకాశమున్న మహిళా జైళ్ల లాంటి ప్రదేశాలను సందర్శిస్తుంది.
7. మహిళా హక్కులపై అధ్యయనం, పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
8. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించినప్పుడు తన సూచనలు, సలహాలు అందిస్తుంది.
9. మహిళలకు సంబంధించిన సామాజిక అభి వృద్ధి, ఆర్థిక అభివృద్ధి వంటి ప్రణాళికల్లో ఈ కమిషన్ పాలు పంచుకుంటుంది.
10. మహిళా ప్రగతికి సంబంధించిన అంశంపై అధ్యయనం చేస్తుంది.
11. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇతర అంశాలను కూడా పరిశీలిస్తుంది.
12. NCWకి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
13. NCW చైర్మన్.. హోదా రీత్యా NHRCలో ఎక్స్-అఫిషియో సభ్యురాలిగా వ్యవహరిస్తారు.
పరివారక మహిళా లోక్ అదాలత్‌లు
-పరివారక మహిళా లోక్ అదాలత్ లోక్ అదాలత్‌ను పోలి ఉంటుంది. NCW పరివారక మహిళా లోక్ అదాలత్ ఏర్పాటు, నిర్వహణకు కావాల్సిన నిధులను రాష్ట్ర మహిళా కమిషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ద్వారా అందజేస్తుంది.
విధులు
1. మహిళలకు సత్వర న్యాయం ఉచితంగా అందజేయడం.
2. మహిళలకు సంబంధించిన సమస్యల పరిష్కా రానికి PVMLA ఉందని ప్రజలకు అవగాహన కల్పించడం.
3. మహిళలు న్యాయపరమైన సాధికారత సాధించేందుకు కృషి చేయడం.
రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు/సంక్షేమ పథకాల్లో కొన్ని…
-2014లో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. అందులో భాగంగానే మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన, భద్రతాపరమైన సాధికారత కింద చర్యలు తీసుకుంది.
1. 24/7 మహిళల హెల్ప్ లైన్ (181)
– ఆగస్టు 2017న తుమ్మల నాగేశ్వర్రావు కొంపల్లిలో ప్రారంభించారు. మహిళలు ఏ రకమైన హింసకు గురైనా తక్షణమే స్పందించడానికి నిర్భయ సెంటర్/పోలీస్/హాస్పిటల్/అంబులెన్స్‌లకు అత్యవసరంగా తెలియజేయడం ద్వారా బాధితులను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం.
2. ASHA ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్)
-శిశు, ప్రసూతి ఆరోగ్య కార్యకలాపాలపై ఆశా వర్కర్స్ అవసరమైన సేవలు అందజేస్తారు. రాష్ట్రంలో 27,730 మంది ఆశా వర్కర్స్ ఉన్నారు.
3. షీ క్యాబ్స్/షీ ట్యాక్సీ
– 2015, సెప్టెంబర్ 8న మహిళా డ్రైవర్స్‌ను ప్రోత్సహించడానికి అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించారు. అర్హులైన అభ్యర్థులకు ప్రతి ట్యాక్సీకి 35 శాతం సబ్సిడీని ప్రభుత్వం సమకూరుస్తుంది.
4. ఉజ్వల
-బాలికలను అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించడాన్ని నిరోధించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. బాధిత మహిళలకు నివాస వసతి, తిండి, బట్టలు న్యాయ సహాయం, స్వయం ఉపాధి శిక్షణ కల్పించబడుతాయి. తెలంగాణలో 5 ఉజ్వల హోమ్‌లను నిర్వహిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ మహిళా సంక్షేమ పథకాలు
1. సఖి కేంద్రాలు (One stop centers)
– వీటిని 2015 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఉద్దేశం: మహిళలు వివిధ రకాల దాడులు, హిం సలు, రకరకాల వేధింపులకు బాధితులైనారు. ఇలాంటి బాధితులకు సఖి కేంద్రాలు షెల్టర్ సదుపాయం, మానసికపరమైన కౌన్సెలింగ్ సేవలు, న్యాయ సేవలు, ఆరోగ్య సేవలు అందిస్తుంది. వీరు నేరుగా ఈ కేంద్రాలను ఆశ్రయించవచ్చు. లేదంటే 181 ఉమెన్ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా కూడా ఆశ్రయించవచ్చు.
2. స్వధార్ గృహాలు
-అనాథ వితంతువులు, హెచ్ఐవీ బాధిత మహిళలు, జైలు నుంచి విడుదలైన మహిళలు, అక్రమ రవాణా నుంచి రక్షించబడిన మహిళలు, విపత్తులవల్ల ఒంటరి అయిన మహిళలు, విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలకు నివాస వసతి, జీవనోపాధి కోసం శిక్షణ, నైపుణ్యం పెంపుదల లాంటి సదుపాయాలు కల్పించేందుకు 2001లో ఈ స్వధార్ పథకాన్ని ప్రారంభించారు. బాధితులు ఏడాది వరకు ఈ స్వధార్ గృహాల్లో వసతి పొందవచ్చు.
3. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు
-నిర్భయ నిధులతో దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులను నెలకొల్పారు. వీటిద్వారా మహిళల లైంగిక నేరాలు, బాలలపై జరిగే నేరాలు, POCSO చట్టం ద్వారా నమోదైన నేరాలను త్వరితగతిన విచారిస్తారు.
4. అంగన్వాడీ సేవల పథకం (ICDS)
– గర్భిణులు, ఆరేండ్లలోపు పిల్లలు, పాలిచ్చే తల్లులకు సంపూర్ణ ఆరోగ్యంతోపాటు బాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడం పథకం లక్ష్యం.
5. జెండర్ బడ్జెటింగ్
-మహిళల జనాభాకు తగిన విధంగా వనరులు కేటాయించడం, లింగపరమైన భేదాలను తగ్గించడం లక్ష్యంగా 2005లో జెండర్ బడ్జెటింగ్‌ను ప్రారంభించారు.
6. E-HAAT
-మహిళా స్వయం సహాయక బృందాలు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముకునే అవకాశమున్న ఆన్లైన్ పోర్టలే E-HAAT. దీనిలో 18 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవచ్చు.
7. ఉజ్వల పథకం
– మహిళలను, బాలికలను వ్యాపారపరమైన, లైంగికపరమైన దోపిడీ కోసం జరుగుతున్న మానవ అక్రమ రవాణాను నివారించడం లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించారు. పునరావాసం, వసతి కల్పించి జనజీవన స్రవంతిలో భాగం చేయడం.
8. నిర్భయ నిధి
-2013లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖవారు నిర్భయ నిధిని రూ.1000 కోట్లతో ఏర్పాటు చేశారు. వీటి సహాయంతోనే మహిళా పోలీసింగ్, సఖి కేంద్రాలు, ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు, సైబర్ ప్రివెన్షన్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, సెంట్రల్ విక్టిమ్ కాంపన్సేషన్ ఫండ్లను నిర్వహిస్తున్నారు.
9. ఉడాన్ పథకం
l 2014, నవంబర్ 14న సీబీఎస్ఈ వారు ఈ పథకం ప్రారంభించారు. సాంకేతిక విద్య, ఇంజినీరింగ్ విద్య, IIT-JEE పరీక్షల్లో మహిళలు రాణించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా శిక్షణ అందించడం.
10. NARI (National Repositary of Information for Women)
-2018లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖవారు ప్రారంభించారు. నారి పోర్టల్‌లో అన్ని రాష్ట్రాలు మహిళల సంక్షేమం, రక్షణ కోసం అమలు చేస్తున్న చట్టాలు, పథకాలకు సంబంధించిన సమాచారం పొందుపర్చారు.
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
9704686009
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు