నెహ్రూ టోపీ పడవ పందేలు ఎక్కడ నిర్వహిస్తారు? ( ఇండియన్ జాగ్రఫీ)
తూర్పు కనుమలు
2) కడప కొండలు
ఎ) నల్లమల శ్రేణులు: ఇవి అత్యంత పొడవుగా ఉన్నాయి. ఇవి కృష్ణా, పాలర్ నదుల మధ్యలో కర్నూలు, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
-దీనిలో భైరేని కొండలు (1100 మీ.) ఎత్తయినవి. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద అటవీ ప్రాంతం.
బి) వెలికొండలు: ఇవి నల్లమల కొండలకు తూర్పువైపున సమాంతరంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నాయి.
– నల్లమల, వెలికొండలకు మధ్యలో ఉత్తరం వైపున ‘గుండ్లకమ్మ’ నది, దక్షిణం వైపున ‘సగిలేర్’ నది ప్రవహిస్తున్నాయి.
-నల్లమల కొండలకు పశ్చిమం వైపున ‘కుందు’ నది ప్రవహిస్తుంది. ఈ కుందు నదీలోయ ప్రాంతాన్ని ‘నంద్యాల’ లోయ అంటారు.
-నల్లమల కొండలకు దక్షిణం వైపున ‘లంకమల్లేశ్వర అభయారణ్యం’ ఉంది. ఇక్కడ అంతరించిపోయిందనుకున్న కలివి కోడి (Jerdon Courser Bird)ని కనుగొన్నారు.
సి) ఎర్రమల కొండలు: నల్లమల కొండలకు పశ్చిమ భాగాన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎరమల కొండలు ఉన్నాయి.
డి) పాలకొండలు: పెన్నా నదికి దిగువన కడప జిల్లాలో విస్తరించిన పర్వతాలను ‘పాలకొండలు’ అంటారు.
ఇ) శేషాచలం కొండలు: అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల దక్షిణ సరిహద్దులో విస్తరించిన పర్వతాలు. వీటినే ‘తిరుపతి’ కొండలు అంటారు.
-ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎర్రచందనం (Red Sandal Wood) ఇక్కడే దొరుకుతుంది. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ కూడా ఇక్కడే ఉంది. ‘తలకోన జలపాతం’ కూడా ఇక్కడే ఉంది.
– శేషాచలం కొండల్లో హార్స్లీ హిల్స్ (ఏనుగు మల్లమ్మ కొండ) అనే వేసవి విడిది ఉంది. 1290 మీ. ఎత్తున మదనపల్లి పట్టణానికి దక్షిణం వైపున ఉంది.
– శేషాచలం కొండల ఉత్తర వాలుల వెంబడి చిత్రావతి, పాపాగ్ని, చెయ్యేర్ నదులు ప్రవహిస్తున్నాయి.
ఎఫ్) నగరి కొండలు: చిత్తూరు జిల్లాల్లోని నగరి పట్టణానికి ఉత్తరంగా ఉన్న కొండలు. వీటికి ‘నగరి ముర కొండ’ అని కూడా పేరు ఉంది.
జి) ఇతర శ్రేణులు: గుంటూరులో బెల్లంకొండలు, గనికొండ, నాగార్జున కొండ, వినుకొండలు.
– ప్రకాశంలో చీమకుర్తి కొండలు.
– అనంతపురంలో పెనుగొండ, మడకసిర కొండ, మల్లప్ప కొండలు.
3) తమిళనాడు (దక్షిణ కొండలు)
– ఇవి పోపర్ నది నుంచి వైపర్ వరకు విస్తరించిన శ్రేణులు. ఈ కొండలు కావేరి, వైగై, వైపర్ నదులను ఖండిస్తున్నాయి.
దీనిలోని ప్రధాన శ్రేణులు
1) ఉత్తర ఆర్కాట్లో- జవ్యాది కొండలు
2) దక్షిణ ఆర్కాట్లో- జింజి కొండలు
3) సేలంలో- షెవరాయ్ (ఇక్కడ యెర్కోడ్ వేసవి విడిది ఉంది)
4) తిరుచిరాపల్లిలో- కొల్లామలై, పచాయ్మలై కొండలు
5) దిండిగల్‌లో- శిరుమలై కొండలు
6) కోయంబత్తూర్‌లో- సత్యమంగళం కొండలు
7) ధర్మపురిలో- మెలగిరి కొండలు
8) బళ్లారిలో- శాండూరు కొండలు
9) మైసూర్లో- బిలిగిరి కొండలు
– కావేరి నది పాంచమలై, శిరుమలై కొండలకు మధ్యలో ప్రవహిస్తుంది.
– పెన్నా నది క్రమక్షయం వల్ల కడప జిల్లాల్లోని గండికోటకు పశ్చిమోత్తర భాగాల్లో లోతైన గార్జ్ ఏర్పడింది. దీనిని భారతదేశపు గ్రాండ్ కాన్యన్ (గండికోట గార్జ్) అని పిలుస్తారు.
తీర మైదానాలు (Coastal Plains)
-భారత్‌కు 6,100 కి.మీ. పొడవైన ప్రధాన భూభాగపు సముద్ర తీరం ఉంది. ద్వీపకల్ప పీఠభూమికి, సముద్రపు అంచున మధ్యగల సన్నని మైదానాలనే తీర మైదానాలు అంటారు.
– వీటిలో 3 భాగాలుగా విభజించారు.
1) గుజరాత్ తీర మైదానం
2) పశ్చిమ తీర మైదానం
3) తూర్పు తీర మైదానం
గుజరాత్ తీర మైదానం
-గుజరాత్ ఉత్తర భాగాన్ని ‘కచ్ ద్వీపకల్పం’, దక్షిణ భాగాన్ని ‘కథియవాడ్ ద్వీపకల్పం’ అంటారు.
-ఈ రెండింటిని కచ్ సింధు శాఖ (Gulf of Kutch) వేరు చేస్తున్నది.
-కథియవాడ్ ద్వీపకల్పం సౌరాష్ట్రను తూర్పున ఉన్న ప్రధాన గుజరాత్ భాగాన్ని ‘కంబాట్ సింధుశాఖ’ వేరుచేస్తుంది.
– కచ్ తీర మైదానంలో ఉత్తర భాగాన ఉన్న సమతల మైదానం ఉప్పుతో కూడుకొని ఉంది. దీనిని గ్రేట్ రాణ్ (The Great Rann) తీర మైదానంగా పిలుస్తారు.
-కచ్ తీర మైదానంలోని దక్షిణ భాగాన్ని ‘లిటిల్ రాణ్ (Little Rann)’గా పిలుస్తారు. ఇది బురద నేలలు (Marshy Region) గల ప్రాంతం. ఇక్కడ లూనీ, బనాస్, సరస్వతి వంటి నదులు (అర్వాహినులు) ప్రవహిస్తున్నాయి.
-సౌరాష్ట్ర ప్రాంతం ఒకప్పుడు ద్వీపంలాగా ఉండేది. అది అగ్నిపర్వత ద్వీపం. తర్వాతి కాలంలో నదుల నిక్షేపణవల్ల ప్రధాన భాగాన్ని, దీనిని కలివేయడం జరిగింది. ఈ కలయికను ‘వాడ్ వాన్ గేట్ వే’ అని పిలుస్తారు.
– కచ్ ద్వీపకల్ప కూడా ఒకప్పుడు ద్వీపమే. తర్వాత నదుల నిక్షేపణ, పవన నిక్షేపణ వల్ల రెండు ప్రాంతాలు కలిసి కచ్ ద్వీపకల్పంగా పరిణామం చెందింది. కచ్ ఉత్తర భాగం చిత్తడిగా ఉంటుంది.
-కథియవాడ్ ద్వీపకల్ప దక్షిణ భాగంలో ‘గిర్నార్ కొండలు’ ఉన్నాయి. వీటిలో ఎత్తయిన శిఖరం గోరక్నాథ్ (1,117 మీ.). ఆసియాటిక్ సింహాలకు చివరి ఆవాసం అయిన గిర్ ఇక్కడే ఉంది.
-ఈ మైదానాల్లో మరొక ప్రత్యేక భూస్వరూపం క్రీక్స్. క్రీక్ అంటే భూభాగంలోకి చొచ్చుకొని సన్నని సముద్రభాగం. ఉదా: సర్‌క్రీక్, కోరి క్రీక్.
2) పశ్చిమ తీర మైదానాలు
-భారత పశ్చిమ తీరం వెడల్పు తూర్పు తీర మైదానం వెడల్పు కన్నా తక్కువ.
-భారత్ పశ్చిమ తీర మైదానం మధ్య భాగంలో (కర్ణాటక, గోవా) వెడల్పు తక్కువగా ఉండి ఉత్తర, దక్షిణ దిశల్లో క్రమంగా వెడల్పు పెరుగుతుంది.
పశ్చిమ తీర మైదానాల్లోనూ 3 భాగాలు ఉన్నాయి.
1) కొంకణ్ తీరం
2) కెనరా (కన్నడ్) తీరం
3) మలబార్ తీరం
పశ్చిమ తీర మైదానం వెడల్పు తక్కువ ఉండటానికి కారణాలు
1) అరేబియా సముద్ర తీర రేఖకు దగ్గరగా పశ్చిమ కనుమలు ఉండటం
2) పశ్చిమ కనుమల పశ్చిమ వాలు ఎక్కువగా ఉండటంతో పశ్చిమానికి ప్రవహించే నదులు ఎక్కువ వేగంలో ప్రయాణిస్తున్న ఒండ్రు మట్టి, శిథిలాలను అరేబియా సముద్రంలోకి తీసుకెళ్తాయి.
3) అరేబియా సముద్ర జలరాశి భారత పశ్చిమ తీర మైదానం వైపు చొచ్చుకు రావడంతో పశ్చిమ తీర మైదానం నిమజ్జనం చెందుతూ ఉంది.
కొంకణ్ తీరం
-డామన్ నుంచి గోవా వరకు లేదా మయూర్ నది నుంచి కాళీ నది వరకు మహారాష్ట్ర, గోవాల్లో విస్తరించిన తీర మైదానం.
– దీని పొడవు 500 కి.మీ., వెడల్పు 50-80 కి.మీ. ఉంది. దీనిపై ముంబై, నవసేన, మార్మగోవా ఓడరేవులు ఉన్నాయి.
-ముంబై నగరానికి ఉత్తరం వైపున వాసాయ్ క్రీక్, దక్షిణం, తూర్పువైపున థానే క్రీక్‌లు (ఉల్హాస్ నది దీనిలో కలుస్తుంది) ఉన్నాయి. ఈ రెండు క్రీక్‌లు ముంబై ద్వీపానికి చక్కని ఓడరేవుల నిర్మాణానికి అవకాశం కల్పించాయి. ఇది అత్యధిక జనసాంద్రతగల తీర ప్రాంతం.
ఈ మైదానంలో పశ్చిమంగా ప్రవహించే నదులు
-మహారాష్ట్ర- వైతరణి, దమన్ గంగా, అంబ, ఉల్హాస్, సూర్య, పాతాల్ గంగ, వశిష్ట, కర్లి.
– గోవా: జువారి, మండోవి, రాచోల్.
కెనాల్ తీరం
– గోవా నుంచి మంగుళూరు దక్షిణం వరకు కర్ణాటక రాష్ట్రంలో విస్తరించిన మైదానాలు.
-ఇది అతి తక్కువ వెడల్పును కలిగిన తీర మైదానం. వెడల్పు 30-50 కి.మీ..
– అత్యధికంగా మంగుళూరు వద్ద 70 కి.మీ. వెడల్పు కలిగి ఉంది.
-దీనిలో శరావతి, నేత్రావతి, గంగావళి, శాంభవి, వరాహి, కుళి, కుమరధార, గురుపుర, తాద్రి వంటి నదుల ప్రవాహాలు కలవు. దీనిలో కయ్యలు అధికంగా ఉన్నాయి. మంగుళూరు ఓడరేవు ఈ తీరంలో ఉంది.
మలబార్ తీరం
-మంగుళూరు నుంచి కన్యాకుమారి వరకు కేరళ రాష్ట్రంలో విస్తరించిన మైదానం. బైపోర్ నదీ లోయ వద్ద అత్యధిక వెడల్పు ఉంది.
-సముద్ర జలరాశి ముందుకు రావడంతో పశ్చిమ తీర మైదానంలో ఉప్పు నీటి కయ్యలు (లాగూన్స్), రోధికలు, బురద నేలలు, ఈస్టర్, పృష్ట జలాలు (Back Waters) లేదా కాయల్స్ అనేకం ఏర్పడ్డాయి.
-భూభాగపు చీలికల గుండా వచ్చిన సముద్ర నీటినే పృష్ట జలాలు అంటారు. ఇవి చేపల వేటకు, అంతఃస్థరీయ రవాణాకు, జల క్రీడలకు ఉపయోకగరం.
-ఈ తీరంలోని పున్నమాడ కాయల్లో ప్రసిద్ధి చెందిన నెహ్రూ టోపీ పడవ పందేలు నిర్వహిస్తారు.
-ఓనం (సంక్రాంతి) సందర్భంగా ఈ వల్లంకలి పడవ పోటీలు నిర్వహిస్తారు.
– వెంబనాడ్ లాగూన్ (అతిపెద్ద వెంబనాడ్), అష్టముడి లాగూన్, కాయంకుళం లాగూన్, ఎట్టికులం లాగూన్, కడినంకుళం, వెల్లి లాగూన్లు మలబార్ తీరంలో ఉన్నాయి.
– అత్యధిక వార్షిక సగటు వర్షం పడే తీరం కూడా ఇదే.
-భారతదేశంలో అత్యధికంగా సముద్ర చేపలు దొరికేది కూడా ఇక్కడే.
మలబార్ తీరంలో పశ్చిమానికి ప్రవహించే నదులు
1) పెరియార్ (244 కి.మీ.)
2) భరత్‌పూజ (209 కి.మీ.)
3) పంబ (176 కి.మీ.)
4) చాలియార్ (169 కి.మీ.), పాపనాశం, కుంతీపూజ, చలకుడి, కడలుండి ముఖ్యమైనవి.
ప్రాక్టీస్ బిట్స్
1. దేశంలోని 6100 కి.మీ. తీర మైదాన ప్రాంతంలో అత్యధిక వర్షపాతం పొందే తీర మైదానం?
1) సర్కార్ తీరం 2) కొంకణ్ తీరం
3) కెనరా తీరం 4) మలబార్ తీరం
2. కింది ఏ జలభాగం నౌకా రవాణాకు అనుకూలమైనది?
1) పృష్ట జలాలు 2) లాగూన్స్
3) ఈస్టరీలు 4) రోధికలు
3. కింది నదుల్లో కర్ణాటక మైదానాల గుండా ప్రవహించని నది?
1) గురుపుర 2) భరత్పూర్
3) శాంభవి 4) శరావతి
4. అత్యధిక జనసాంద్రత గల తీర మైదానం ఏది?
1) కొంకణ్ తీరం 2) కథియవాడ్ తీరం
3) మలబార్ తీరం 4) ఏదీకాదు
5. తుఫానుల వల్ల అత్యధిక వర్షపాతాన్ని పొందుతున్న తీర మైదానం?
1) కొంకణ్ తీరం 2) కోరమండల్ తీరం
3) మలబార్ తీరం 4) కర్ణాటిక్ తీరం
6. భారతదేశపు గ్రాండ్ కాన్యన్ (గండికోట గార్జ్) కింది ఏ నది వల్ల ఏర్పడింది?
1) కావేరి 2) కృష్ణా
3) గోదావరి 4) పెన్నా
7. కావేరి కింది ఏ కొండల మధ్య గుండా ప్రవహిస్తుంది?
1) పాంచ్మలై, శిరుమలై కొండలు
2) జవ్వాది, షెవరాయ్ కొండలు
3) కొల్లామలై, పచాయ్మలై కొండలు
4) శిరుమలై, పరుషనాథ్ కొండలు
8. కింది ఏ నది శేషాచలం కొండల్లో జన్మించదు?
1) చిత్రావతి 2) చెయ్యేరు
3) పాపాగ్ని 4) అమరావతి
సమాధానాలు
1-4, 2-1, 3-2, 4-1, 5-2, 6-4, 7-1, 8-4.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు