గ్రంథాలయాలు.. ఉద్యమ దివిటీలు (తెలంగాణ హిస్టరీ)
-తెలంగాణ గ్రంథాలయోద్యమంలో 1906లో స్థాపించిన విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిని ఒక మైలురాయిగా చెప్పవచ్చు. దానికి రావిచెట్టు రంగారావు కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ మండలి చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాసా్త్రల్లో అనేక పుస్తకాలు ప్రచురించి ఆధునిక భాషావ్యాప్తికి కృషిచేసింది. తెలుగు భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థులకు రచనా పోటీలు, పరీక్షలు నిర్వహించింది. విజ్ఞాన చంద్రికా మండలి కృషి ఫలితంగా దేశ చరిత్రలు, విజ్ఞాన శాసా్త్రలు, విజ్ఞాన సర్వస్వాలు ప్రచురించారు. అంతేకాకుండా పాశ్చాత్య విజ్ఞానం, ఐరోపా దేశ చరిత్ర, ప్రపంచ నాయకుల జీవిత చరిత్రకు సంబంధించిన గ్రంథాలు కూడా వెలువడినాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. చిలుకూరి వీరభద్రరావు రచించిన ఆంధ్రుల చరిత్ర, ఆచంట లక్ష్మీపతి రచించిన జీవశాస్త్రం, కట్టమంచి రామలింగారెడ్డి రచించిన అర్థశాస్త్రం. కొమరాజు లక్ష్మణరావు రచించిన విజ్ఞాన సర్వస్వం, చరిత్ర, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన పలు అంశాలను విశదీకరించింది.
– గ్రంథాలయాల స్థాపన ద్వారా సాంస్కృతిక, రాజకీయ అంశాలు కేంద్రంగా నిజాం రాజ్యంలో ఆంధ్రోద్యమం వ్యాప్తి చెందింది. నిజాం ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యమంలో అంతర్లీనంగా ఉన్న రాజకీయ పోకడలను గమనించి, నిషేధాల్ని విధించింది. గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయ్యింది. అయినప్పటికీ గ్రంథాలయ ఉద్యమకారులు చాకచక్యంగా కొన్ని సందర్భాల్లో రహస్యంగా గ్రంథాల ప్రచురణలను పంపిణీ చేశారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో విజ్ఞాన చంద్రికా మండలిని 1908లో హైదరాబాద్ నుంచి మద్రాస్‌కు మార్చారు. కొమరాజు లక్ష్మణరావు హైదరాబాద్‌లో ప్రారంభించిన గ్రంథాలయోద్యమం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగింది. ఈ ఉద్యమకాలంలో కోదాటి నారాయణరావు లాంటి వారు కీలకపాత్ర వహించారు. ఆయన స్వీయచరిత్ర నారాయణ త్రయంలో తెలంగాణ గ్రంథాలయోద్యమానికి సంబంధించిన అనేక అంశాలను పేర్కొన్నారు.
20వ శతాబ్దపు మొదటి భాగంలో తెలంగాణ వ్యాప్తంగా ఏర్పరిచిన కొన్ని గ్రంథాలయాల వివరాలు..
1) 1910- ఆంధ్రభాషా నిలయం, ఖమ్మం
2) 1913-ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం,వరంగల్
3) 1913-సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం, సికింద్రాబాద్
4) 1918- రెడ్డి హాస్టల్ గ్రంథాలయం, హైదరాబాద్. దీనిని రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి చొరవతో స్థాపించారు.
5) 1918- ఆంధ్ర సరస్వతీ గ్రంథాలయం, నల్లగొండ
6) 1918- ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని, సూర్యాపేట, నల్లగొండ జిల్లా.
7) 1920- భాషాకల్పవల్లి గ్రంథాలయం, సికింద్రాబాద్
8) 1923- బాల సరస్వతి గ్రంథాలయం, హైదరాబాద్ (అఫ్జల్‌గంజ్)
9) 1923- వేమన ఆంధ్రభాషా నిలయం, హైదరాబాద్
10) 1923- ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం, ఖమ్మం
11) 1923- ఉస్మానియా భాషా నిలయం, కరీంనగర్
12) 1923- జగదీశ్వర్ గ్రంథాలయం, జగిత్యాల
13) 1923- ఉస్మానియా తెలుగు గ్రంథాలయం, మంథెన
14) 1923- నీలగిరి గ్రంథాలయం, నల్లగొండ
15) 1923- దక్షిణ ఆనంద గ్రంథాలయం, సంగారెడ్డి
16) 1924- ప్రతాపరుద్రాంధ్ర భాషానిలయం, మడికొండ
17) 1925- ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయం, హైదరాబాద్
18) 1926- ఆదిహిందూ లైబ్రరీ, హైదరాబాద్
19) 1926- దక్కన్ వైశ్యసంఘం గ్రంథాలయం
20) 1930- జోగిపేట గ్రంథాలయం, మెదక్
21) 1941- రైతు గ్రంథాలయం, చిలుకూరు, నల్లగొండ జిల్లా. దీనిని రావి నారాయణ రెడ్డి స్థాపించారు.
-తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమాన్ని వ్యాప్తిచేసే ఉద్దేశంతో కేసీ గుప్తా అణా గ్రంథమాలను 1937లో స్థాపించి అనేక గ్రంథాలను ప్రచురించారు.
– ప్రముఖ రచయిత, బహుభాషావేత్త వెల్దుర్తి మాణిక్యరావు సంపాదకత్వంలో వాటిని ప్రచురించారు. అణా గ్రంథమాల సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను ప్రచురించింది.
– నిజాం ప్రభుత్వం ఆగ్రహించి ప్రచురణకర్త కేసీ గుప్తాకు జైలుశిక్ష విధించింది. మాడపాటి హనుమంతరావు రచించిన మాలనాగుచ్ఛం, సురవరం ప్రతాపరెడ్డి మొగలాయి కథలు లాంటి గ్రంథాలతో సహా దాదాపు 40 పుస్తకాల్ని ఈ సంస్థ ప్రచురించింది. అణా గ్రంథమాల ప్రచురించిన వీరసావర్కర్ జీవిత చరిత్రను నిజాం ప్రభుత్వం నిషేధించింది.
– నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాకు చెందిన ప్రభుత్వాధికారి టీకే బాలయ్య తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈయన మారుమూల గ్రామాలకు ఎడ్లబండిపై పుస్తకాలను పంపిణీ చేశారు.
-అదేవిధంగా దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడైన వట్టికోట ఆళ్వారుస్వామి పుస్తకాలను నెత్తిమీద పెట్టుకొని గ్రామ గ్రామం తిరిగి పంపిణీ చేశారు. గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తి చేయడంలో వట్టికోట ఆళ్వారుస్వామితో పాటు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ధర్మభిక్షం, కన్నయ్య లాంటి వాళ్లు రహస్య గ్రంథాలయాన్ని స్థాపించారు. దానిపేరు అర్జున పుస్తక భాండాగారం.
– ఆంధ్రజన సంఘం నాయకులైన మాడపాటి హనుమంతరావు లాంటివారు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి గ్రంథాలయ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు.
నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం
– తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో 1920 దశకంలో ప్రారంభమైన పలు సంస్థలు, నూతన చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపాయి. భాషా సాహిత్యం పట్ల మక్కువను పెంచాయి. 1921లో హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక సంఘటన తెలంగాణ (తెలుగు) ప్రజల అస్తిత్వ, ఆత్మగౌరవ ఉద్యమానికి అంకురార్పణ చేసింది.
– 1921, నవంబర్ 11-12 తేదీల్లో మహర్షి కార్వే అధ్యక్షతన నిజాం స్టేట్స్ సోషల్ రీఫార్మ్ కాన్ఫరెన్స్‌లో ఉపన్యాసాలు ఇంగ్లిష్, ఉర్దూ, మరాఠీ భాషల్లో కొనసాగాయి. ఆ సభలో అల్లంపల్లి వెంటక రామారావు అనే న్యాయవాది తెలుగులో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు తెలుగేతరులు ఆక్షేపించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో తెలంగాణ ప్రజల భాషను ఇతర భాషలవారు ఆక్షేపించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేక సంస్థ ఉండాలని నిర్ణయించారు.
-అదేరోజు కొంతమంది ప్రముఖులు మాడపాటి హనుమంతరావు, మందుముల నర్సింగరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు లాంటివారు సమావేశమై 12 మంది సభ్యులతో ఆంధ్రజన సంఘాన్ని స్థాపించారు. ఆ తరువాత ఆ సంఘ సభ్యత్వం నూరు దాటింది. 1922, ఫిబ్రవరి 14న కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన ఆంధ్రజన సంఘం మొదటి సమావేశం జరిగింది. ఈ సభలోనే ఆంధ్రజన సంఘం పేరును నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘంగా మార్చారు. దీనికి మాడపాటి హనుమంతరావు సెక్రటరీగా వ్యవహరించారు.
-తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాల్ని చేపట్టడంలో ఆంధ్ర జన సంఘం ముఖ్యమైన పాత్రను నిర్వహించింది. నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం తెలంగాణలో భాష, సాహితి, సాంస్కృతిక, గ్రంథాలయ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. అనేక సమావేశాలు, సభలు నిర్వహించి తెలంగాణ సమాజంలో నూతన చైతన్యాన్ని నింపింది. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాల్ని వ్యాప్తిచేయడానికి 1923లో ఆంధ్రజన సంఘం ఏర్పడింది. దీనికి బారిస్టర్ రాజగోపాల్ రెడ్డి అధ్యక్షుడిగా, మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా వ్యవహరించారు.
ఆంధ్ర జన సంఘం ముఖ్య లక్ష్యాలు
1) తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతులను ప్రాచుర్యంలోకి తేవడం, గ్రంథాలయాలను, పఠనా మందిరాలను, పాఠశాలలను స్థాపించి విద్యార్థులకు సహాయపడటం
2) విద్వాంసులను గౌరవించి, ప్రోత్సహించడం
3) తాళపత్ర గ్రంథాలను, శాసనాల ప్రతులను సేకరించి పరిశోధించడం
4) కరపత్రాలు, చిన్న పుస్తకాలు, వ్యాసాలు, ఉపన్యాసాలను ప్రచురించి విజ్ఞానాన్ని వ్యాప్తిచేసి ప్రజల్ని చైతన్యవంతం చేయడం
5) ఆంధ్రభాషా ప్రచారానికి కార్యక్రమాల్ని నిర్వహించడం
6) వ్యాయామం, కళలను ప్రోత్సహించడం
7) అనాథలకు అత్యవసర సహాయ సహకారాలు అందజేయడం
-ఆంధ్రజన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు ఆంధ్ర పరిశోధక మండలిని స్థాపించి తెలంగాణలో చారిత్రక, సాంస్కృతిక, వైజ్ఞానిక వికాసానికి తోడ్పడ్డారు. కొమరాజు లక్ష్మణరావు మరణానంతరం ఈ సంస్థ పేరును లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మార్చారు. ఈ పరిశోధక మండలి కృషి ఫలితంగా తెలుగు వారికి సంబంధించిన అనేక చారిత్రక, సాంస్కృతిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది కవులు, రచయితలు శాసనాలు, తాళపత్ర గ్రంథాలను సేకరించి, తెలుగువారి చరిత్ర సంస్కృతికి సంబంధించిన అనేక నూతనాంశాలను వెలుగులోకి తెచ్చారు. వారిలో శేషాద్రి రమణ కవుల రచనలు విశిష్టమైనవి, ఆదిరాజు వీరభద్రరావు రచించిన తెలంగాణ శాసనాలు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర, మాడపాటి హనుమంతరావు, ప్రేమ్‌చంద్ కథలను ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. 1934లో వెలువడిన గోల్కొండ సంచిక తెలంగాణ సాహిత్యంలో ఒక గొప్ప మైలురాయి.
-ఆంధ్రజన కేంద్ర సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయోద్యమం విస్తరించింది. అదేవిధంగా తెలుగు మీడియం పాఠశాలల్ని నెలకొల్పింది. దీనిలో 1928లో మాడపాటి హనుమంతరావు స్థాపించిన ఆంధ్ర బాలికా పాఠశాల చెప్పుకోదగింది. తెలుగు మీడియంలో స్థాపించిన ఈ పాఠశాలకు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తింపు నిరాకరించడంవల్ల దీనిని మహారాష్ట్రలోని కార్వే సంస్థకు అనుబంధంగా నడిపారు.
పత్రికా రంగం
– తెలంగాణ సాంస్కృతిక వికాసంలో, గ్రంథాలయోద్యమంతో పాటు పత్రికా రంగం కూడా విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. 19వ శతాబ్దం మధ్య భాగంలో తొలుత వనపర్తి, తరువాత గద్వాల సంస్థానాల్లో ముద్రణాశాలలను ప్రారంభించారు. వనపర్తి సంస్థానంలో ఏర్పర్చిన బ్రహ్మ విద్యాముద్రాక్షర శాలలో (ఇది హైదరాబాద్ సంస్థానంలో తొలి అచ్చుయంత్రం) అచ్చువేసిన గ్రంథాలు, సాహిత్యం పలువురి ప్రశంసలను అందుకున్నాయి. ప్రసిద్ధ పరిశోధకులు మానవల్లి రామకృష్ణ కవి సంపాదకత్వంలో ప్రచురించిన ఎన్నో గ్రంథాలు తెలుగు, సంస్కృత సాహిత్యంలో పేర్కొనదగినవి. అప్పటి వరకు తెలుగు సాహితీ లోకానికి ఎంత మాత్రం పరిచయం లేని నన్నెచోడుని కుమార సంభవం కావ్యాన్ని లోకానికి వెల్లడించారు మానవల్లి. ఆత్మకూరు, గద్వాల, వనపర్తి సంస్థానాలు గొప్ప పండితులను ఆదరించాయి.
-దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, ఆంగ్ల, ఉర్దూ భాషల పత్రికలు హైదరాబాద్ సంస్థాన ప్రజలకు పరిచయమయ్యాయి. 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన వార్తలు హైదరాబాద్ నగరంలో గోడ పత్రికల రూపంలో దర్శనమిచ్చాయి. తెలుగు పత్రికల కంటే ముందే హైదరాబాద్‌లో ఆంగ్ల భాషలో కొన్ని పత్రికలు వెలువడినాయి. ఆంగ్లంలో మొదటి పత్రిక దక్కన్ టైమ్స్ 1864లో సికింద్రాబాద్ నుంచి ప్రచురితమయ్యింది. అదేవిధంగా 1884లో హైదరాబాద్ టెలిగ్రాఫ్, 1885లో హైదరాబాద్ రికార్డర్ ప్రారంభమయ్యాయి. ఈ ఆంగ్ల పత్రికల ద్వారా హైదరాబాద్ సంస్థానంలోని విద్యావంతుల్లో సాంస్కృతిక, జాతీయ భావాలు వ్యాపించాయి. హైదరాబాద్ రికార్డర్ బ్రిటిష్ రెసిడెంటును స్థానిక సీజర్గా అభివర్ణించింది. ఈ పత్రికను 1892లో నిజాం ప్రభుత్వం నిషేధించింది.
– కొన్ని ఉర్దూ పత్రికలు కూడా హైదరాబాద్‌లో ప్రచురించారు. వాటిలో పేర్కొనదగినది మౌల్వీ మెహిబ్ స్సేన్ 1892లో ప్రారంభించిన మౌలం-ఎ-షఫీక్ అనే పత్రిక. మౌల్వీని హైదరాబాద్ ఉర్దూ జర్నలిజానికి రూపశిల్పిగా అభివర్ణిస్తారు. ఈ పత్రిక ప్రధానంగా ముస్లిం సమాజంలోని దురాచారాలను ఖండిస్తూ సంఘ సంస్కరణలతో కూడిన భావాల్ని ప్రచారం చేసింది. పరదా పద్ధతిని తొలగించడం, ముస్లింలలో విద్యావ్యాప్తి వంటి అంశాలను ఈ పత్రిక ప్రచారం చేసింది. అయితే ప్రభుత్వం దృష్టిలో ఈ పత్రిక ప్రచారం చేసిన భావాలు ఆక్షేపణీయం. అందుకే పత్రికను ప్రభుత్వం నిషేధించింది. ఆ తరువాత ఆయన 1914లో ఉర్దూలో మరొక వారపత్రికను ప్రారంభించారు.
– హైదరాబాద్ రాజ్యంలో ‘శేద్యచంద్రిక’ తొలి తెలుగు పత్రికగా గుర్తింపు పొందింది. ఈ పత్రికను నిజాం ప్రభుత్వం 1886లో ఉర్దూలో ప్రారంభించిన ‘ఫునూన్’ పత్రికను తెలుగు అనువాదంగా ప్రారంభించారు. ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొనిరావడం. వ్యవసాయాభివృద్ధి కోసం నూతన పనిముట్ల వినియోగం, భూముల రకాలు, వంగడాలు, ఎరువుల వాడకం, పూల తోటల పెంపకం తదితర అంశాలకు సంబంధించిన వ్యాసాలు శేద్యచంద్రికలో ప్రచురితమయ్యాయి. శేద్యచంద్రిక మొదటగా తెలుగులో ప్రచురితమైనప్పటికీ అది ఉర్దూ పత్రిక అనువాదం. ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం 1913లో బాడారు శ్రీనివాస శర్మ సంపాదకత్వంలో వెలువడిన ‘హితబోధిని’ మొదటి తెలుగు పత్రికగా పరిగణించవచ్చు. ఈ పత్రికను ఆత్మకూరు సంస్థానాధీశుల ఆర్థిక సహాయంతో మహబూబ్‌నగర్‌లో ప్రచురించారు.
అడపా సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు