వస్తురూప ఆర్థిక లావాదేవీ – ధాన్యానికి వస్త్రం, వస్త్రానికి ధాన్యం
భారత ఆర్థికవ్యవస్థ
వస్తుమార్పిడి పద్ధతి – ప్రయోజనాలు, సమస్యలు
-ఆర్థికవ్యవస్థలో మానవుని దైనందిన వ్యవహారంలో ద్రవ్యం ప్రముఖపాత్ర పోషిస్తుంది.
– ఆధునిక కాలంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ఇంకా సామ్యవాద, పెట్టుబడిదారి, మిశ్రమ ఆర్థికవ్యవస్థలో ద్రవ్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే నేడు ప్రపంచంలోని అన్ని ఆర్థికవ్యవస్థలు ద్రవ్య ఆర్థికవ్యవస్థలుగా చెప్పవచ్చు.
-మానవుని ఆర్థిక కార్యకలాపాలన్నింటికి ద్రవ్యం కేంద్ర బిందువు.
– ఆర్థికవ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు ఆర్థిక లావాదేవీలన్నీ వస్తు రూపంలో జరిగేవి.
– ప్రాచీన కాలంలో వస్తువుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. అట్లాగే మానవుని కోరికలు కూడా పరిమితంగా ఉండేవి. అందువల్ల ప్రతి వ్యక్తి తనకు అవసరమైన వస్తు సేవలను తానే తయారు చేసుకునేవారు.
– నాగరికత అభివృద్ధి చెందేకొద్ది మానవుని కోరికలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ పెరిగిన కోరికలను తీర్చుకోవడానికి వ్యక్తి తనకుతాను ఉత్పత్తి చేసుకోలేని స్థితికి వచ్చాడు. అప్పుడు తనకు కావాల్సిన వస్తువుల్లో కొన్ని వస్తువులను తానే తయారు చేసుకుని, మిగిలిన వాటి కోసం ఇతరుల మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. రానురాను కోరికలు అధికమై వస్తువుల కోసం ఇతరుల మీద ఆధారపడటం ఎక్కువైంది.
-ప్రతి వ్యక్తి తాను ఏ వస్తువులను సులభంగా ఉత్పత్తి చేస్తాడో ఆ వస్తువులను ఇతర వస్తువుల కోసం మారకంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. దీన్నే వస్తుమార్పిడి పద్ధతి అంటారు.
-ఒక వస్తువుకు బదులు మరొక వస్తువును మార్పిడి చేయడాన్ని వస్తు మార్పిడి అని, వస్తు వినిమయ పద్ధతి అని, బార్టర్ పద్ధతి అని కూడా అంటారు.
ఉదా: వరి పండించే వ్యక్తి వస్త్రం నేసే వ్యక్తికి వరి ఇచ్చి, వస్త్రాన్ని పొందేవాడు.
– ఇద్దరు వ్యక్తులు తమకు కావాల్సిన వస్తువులను పరస్పరం మార్చుకునే పద్ధతిని వస్తుమార్పిడి పద్ధతి అంటారు.
-వస్తువులను ప్రత్యక్షంగా ఇచ్చిపుచ్చుకోవడాన్ని వస్తుమార్పిడి పద్ధతి అంటారు.
-వస్తువుకు బదులుగా వస్తువు లేదా సేవకు బదులుగా వస్తువులు మార్పిడి చేసుకోవడాన్ని వస్తుమార్పిడి పద్ధతి అంటారు.
-ఈ వస్తుమార్పిడి పద్ధతిలో వినిమయ మాద్యం ఉండదు. అందుకే ఈ వస్తు మార్పిడి పద్ధతిని C-C Economy అంటారు.
-ఈ వస్తుమార్పిడి కంటే ముందు తొలి దశలో జంతువులను (ఉదా: ఆవులు, గొరెలు మొదలైన సాధు జంతువులు) వినిమయ మాద్యంగా ఉపయోగించారు. ఇది ఎక్కువగా భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది.
– కోరికలు, జనాభా పరిమితంగా ఉన్నంత వరకు, ప్రజలు పరిమిత ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు వినిమయ మాద్యం సాధ్యమైంది. క్రమంగా వివిధ సమస్యలు, ఇబ్బందులు ఏర్పడటంతో వస్తుమార్పిడి పద్ధతి అమల్లోకి వచ్చింది.
-మానవుని కోరికలను తీర్చే వస్తువులను వినిమయ మాద్యంగా రెండో దశలో ఉపయోగించారు.
– సులువైన మార్పిడి విధానం.
-పరిమితమైన కోరికలు, అధిక వస్తువుల ఉత్పత్తి.
-సంపదను పోగు చేసుకోవడమనేది ఉండకపోవడం.
-సహజసిద్ధమైన ఉత్పత్తి.
-ఆరోగ్యవంతమైన సమాజం ఉండటం.
-ప్రత్యక్ష సంబంధం ఉండటం.
వస్తుమార్పిడి పద్ధతి – లోపాలు, సమస్యలు, ఇబ్బందులు
-ఎలాంటి వినిమయ మాద్యం లేకపోవడం.
– ఉత్పత్తి వస్తువుల విలువ కట్టకపోవడం.
-జనాభా, కోరికలు పరిమితంగా ఉన్నంత వరకు, ప్రజలు పరిమిత ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు వస్తుమార్పిడి పద్ధతి సక్రమంగా పనిచేసేది.
– జనాభా పెరగడంవల్ల, మానవుల కోరికలు పెరగడంవల్ల వస్తువుల సంఖ్య, వస్తువుల రకాలు విపరీతంగా పెరుగడంవల్ల, బదూర ప్రాంతాల్లో ప్రజలు నివసించడంవల్ల (అంటే ప్రజల నివాస విస్తరణ జరగడంవల్ల), ఇలా క్రమంగా ఆర్థికవ్యవస్థ విస్తరించడంతో వస్తుమార్పిడి విధానంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడి, అనేక సమస్యలకు గురై అందులోని లోపాలు బయటపడ్డాయి.
1. కోరికల సమన్వయ లేమి (Lack of coordination of wants)
-వస్తుమార్పిడి పద్ధతిలో ఇద్దరి కోరికల సమన్వయం కుదరాలి.
అప్పుఆ పద్ధతికి అవకాశం ఉంటుంది. దీన్ని కోరికల పరస్పర ఏకీభావం అంటారు. అయితే అలా కోరికల సమన్వయం కుదరకపోతే వస్తుమార్పిడి సాధ్యం కాదు.
2. కాల సమన్వయం లేకపోవడం (Lack of time coordination)
– వస్తుమార్పిడి జరుగడానికి కోరికల సమన్వయంతోపాటు కాల సమన్వయం కూడా ఉండాలి. అప్పుడే వస్తుమార్పిడి
జరుగుతుంది.
-ఇద్దరు వ్యక్తులు తమతమ వస్తువులను ఒకే సమయంలో ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాక ఒకరు సిద్ధంగా ఉన్నప్పటికీ రెండో వ్యక్తి సిద్ధంగా లేకపోతే వస్తు మార్పిడి జరుగదు.
3. స్థిరమైన కొలమానం లేకపోవడం (Lack of common measure of value)
-వస్తుమార్పిడి పద్ధతిలో వస్తువుల విలువలను కొలవడానికి స్థిరమైన కొలమానం అంటూ ఏమీలేదు. ప్రతి వస్తువు విలువను అనేక ఇతర వస్తువుల విలువతో చెప్పాల్సి ఉంటుంది. అంటే ప్రతి రెండు వస్తువుల వినిమయ నిష్పత్తిని వేర్వేరుగా నిర్ణయించాలి. వీటి విలువలను గుర్తించడం, పోల్చడం కష్టం.
4. విభజించడానికి వీలు లేకపోవడం (Lack of Divisibility of commodities)
– కొన్ని వస్తువులను విభజించడానికి వీలుండదు. ఒకవేళ విభజిస్తే వాటి విలువ
నశిస్తుంది.
ఉదా: పశువులు, గృహాలు, యంత్రాలు మొదలైన వస్తువులను అవిభాజ్య వస్తువులు అంటారు.
5. వాయిదా చెల్లింపుల్లో ఇబ్బంది (Difficulty in differed payment)
– ఆర్థికవ్యవస్థలో రుణాలు ఇవ్వడం, తీసుకోవడం, క్రయ-విక్రయాల్లో భవిష్యత్తు చెల్లింపులు వస్తుమార్పిడి పద్ధతిలో సాధ్యం కాదు.
6. విలువ నిధి లేకపోవడం (Lack of store value)
-వస్తు మార్పిడి పద్ధతిలో ప్రతి వ్యక్తి భవిష్యత్ అవసరాలకు తమ వద్ద ఉన్న వస్తువులను నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని వస్తువులను నిల్వ చేస్తే వాటి విలువ, నాణ్యత తగ్గుతుంది.
ఉదా: పండ్లు, పాలు, కూరగాయలు, పూలు.
7. సేవల మార్పిడి ఇబ్బంది (Difficulty in the Exchange of services)
-వస్తు మార్పిడి పద్ధతిలో సేవల మార్పిడికి సాధ్యం కాదు. అవకాశం లేదు. ఎందుకంటే సేవల విలువలను వస్తురూపంలో చెప్పడం సాధ్యం కాదు.
ఉదా: డాక్టర్లు, లాయర్లు, టీచర్లు
-ఈ వస్తుమార్పిడి పద్ధతిలో కూడా అనేక సమస్యలు, ఇబ్బందులు, లోపాలను నివారించడానికి ఆర్థికవ్యవస్థలో ద్రవ్యాన్ని
ప్రవేశపెట్టారు.
ప్రాక్టీస్ బిట్స్
1. మానవుని ఆర్థిక కార్యకలాపాలన్నింటికి కేంద్ర బిందువు ఏది?
ఎ) వస్తువులు బి) సేవలు
సి) ద్రవ్యం డి) బంగారం
2. ఆర్థికవ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాక ముందు ఆర్థిక లావాదేవీలన్నీ ఏవిధంగా జరిగేవి?
ఎ) జంతువులు బి) లోహం
సి) వస్తువులు డి) కాగితపు ద్రవ్యం
3. ప్రాచీన కాలంలో మానవుని కోరికలు?
ఎ) పరిమితం బి) అపరిమితం
సి) ఎ & బి డి) పైవేవీ కావు
4. ఒక వస్తువుకు బదులు మరొక వస్తువును మార్పిడి చేయడాన్ని ఏమంటారు?
ఎ) వస్తు మార్పిడి పద్ధతి
బి) వస్తు వినిమయ పద్ధతి
సి) బార్టర్ పద్ధతి డి) పైవన్నీ
5. వస్తు మార్పిడి పద్ధతిలో వినిమయ మాద్యం?
ఎ) ఉంటుంది బి) ఉండదు
సి) అప్పుడప్పుడు ఉంటుంది డి) పైవన్నీ
6. వస్తు మార్పిడి పద్ధతిని ఏవిధంగా పిలుస్తారు?
ఎ) C-C ఎకానమీ
బి) C-M-C ఎకానమీ
సి) C ఎకానమీ డి) C-M ఎకానమీ
7. వస్తు మార్పిడి పద్ధతికి ముందు వినిమయ మాద్యంగా ఏది కొనసాగింది?
ఎ) జంతువులు బి) లోహం
సి) పరపతి ద్రవ్యం డి) వస్తువులు
8. వస్తువులను ప్రత్యక్షంగా ఇచ్చిపుచ్చుకోవడాన్ని ఏమంటారు?
ఎ) వస్తు వినిమయ పద్ధతి
బి) ద్రవ్య వినిమయ పద్ధతి
సి) బార్టర్ పద్ధతి డి) ఎ & సి
9. మానవుని కోరికలను తీర్చే వస్తువులను వినిమయ మాద్యంగా ఉపయోగించిన దశ ఏది?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
10. కింది వాటిలో వస్తు మార్పిడి పద్ధతి ప్రయోజనం కానిది ఏది?
ఎ) ప్రత్యక్ష సంబంధం ఉండటం
బి) ఆరోగ్యవంతమైన సమాజం
సి) సులభమైన మార్పిడి విధానం
డి) పై అన్నీ సరైనవి
11. వస్తు మార్పిడి పద్ధతి సమస్యలకు సంబంధించి సరికానిది ఏది?
ఎ) స్థిరమైన కొలమానం లేకపోవడం
బి) కోరికల పరస్పర ఏకీభావం లేకపోవడం
సి) విలువ నిధి లేకపోవడం
డి) వస్తువులను విభజించడం
12. వస్తువులను విభజించడానికి వీలు లేని వస్తువులను ఏమంటారు?
ఎ) విభాజ్య వస్తువులు
బి) అవిభాజ్య వస్తువులు
సి) ఎ & బి డి) పైవేవీకావు
13. ఆర్థిక వ్యవస్థలో రుణాలు ఇవ్వడం, తీసుకోవడం, క్రయ విక్రయంలో ఏ పద్ధతి అనుకూలం కాదు?
ఎ) వస్తు మార్పిడి పద్ధతి
బి) ద్రవ్య వినిమయ పద్ధతి
సి) సమీప ద్రవ్య వినిమయ పద్ధతి
డి) పరపతి వినిమయ పద్ధతి
14. వస్తు మార్పిడి పద్ధతికి మరొక పేరు?
ఎ) వస్తు వినిమయ పద్ధతి
బి) బార్టర్ పద్ధతి
సి) ఎ, బి డి) పైవేవీ కావు
15. అవిభాజ్య వస్తువులకు ఉదాహరణ..
ఎ) జంతువులు బి) గృహం
సి) యంత్రం డి) పైవన్నీ
16. ఏ వస్తువులను నిల్వ చేయడంవల్ల వాటి విలువ, నాణ్యత క్షీణిస్తుంది?
ఎ) పండ్లు బి) పాలు
సి) పూలు డి) పైవన్నీ
17. వస్తు మార్పిడి పద్ధతిలో సేవల మార్పిడి…
ఎ) సాధ్యం కాదు
బి) సాధ్యం అవుతుంది
సి) అవకాశం లేదు డి) ఎ, సి
సమాధానాలు
1-సి 2-సి 3-ఎ 4-డి 5-బి 6-ఎ 7-ఎ 8-డి 9-బి 10-డి 11-డి 12-బి 13-ఎ 14-ఎ 15-డి 16-డి 17-డి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత&
వైష్ణవీపబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు