2004 ఎన్నికలు – పార్టీల పొత్తులు (తెలంగాణ ఉద్యమ చరిత్ర )
– 2004, మార్చిలో తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు సుమారు 15 లక్షల మంది హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనియాగాంధీ టీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని భావించింది.
– తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని టీఆర్ఎస్తో చర్చల కోసం ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ ఆజాద్‌ను పంపింది. ఆయన ఎన్నికల్లో పొత్తు గురించి సోనియా అభిప్రాయాలను కేసీఆర్‌కు తెలిపారు. కొద్దిరోజులు చర్చలు జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించే షరతుపై టీఆర్ఎస్ పొత్తుకు అంగీకరించింది.
– ఎన్నికల ప్రణాళికలో అస్పష్టంగానే ‘తెలంగాణ విషయంలో మొదటి ఎస్ఆర్సీ (స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్) నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తామని’ కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటించాలని కోరారు. సీమాంధ్ర ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నందున పరిస్థితిని అర్థం చేసుకోవాలని కేసీఆర్‌ను కోరారు. దీంతో ఈ అంశంపై మరింత ఒత్తిడి పెంచకుండా సీట్ల సర్దుబాటుకు టీఆర్ఎస్ సిద్ధపడింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమితో వామపక్షాలైన సీపీఐ, సీపీఎం కూడా ఉండటంతో టీఆర్ఎస్కు కేవలం 42 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు.
-వీటిలో కూడా కొన్ని పాతబస్తీ, టీఆర్ఎస్కు ఏ మాత్రం పట్టులేని స్థానాలు కావడంతో ఎన్నికల్లో ఆ పార్టీ 26 స్థానాల్లో గెలిచింది. తెలంగాణలోని మెజారిటీ స్థానాలు ఈ కూటమి వశమయ్యాయి. అధికారంలో ఉన్న టీడీపీ సమైక్య నినాదాన్ని వినిపించడంతో తెలంగాణలో కేవలం 10 స్థానాల్లో మాత్రమే గెలిచింది. పొత్తులో భాగంగా 6 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేయగా 5 స్థానాల్లో గెలిచింది. కేసీఆర్ కరీంనగర్ నుంచి, నరేంద్ర మెదక్ నుంచి, బోయినపల్లి వినోద్‌కుమార్ హన్మకొండ నుంచి, రవీంద్ర నాయక్ వరంగల్ నుంచి, మధుసూదన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 6వ స్థానం నుంచి పోటీ చేసిన కేఎస్ రత్నం ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన నిర్ణీత ఫారాల్లో పార్టీ గుర్తు కారును రాయకపోవడంతో వేరే గుర్తుతో పోటీ చేసినందున కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. సిద్దిపేట నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ఆ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలో హరీష్‌రావు గెలుపొందారు.
– యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్, నరేంద్రలు కేంద్ర మంత్రులుగా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పదే పదే విజ్ఞప్తి చేయడంతో కేంద్ర మంత్రవర్గంలో కేసీఆర్ చేరారు. 2004, జూన్ 23న టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఆరుగురు వైఎస్ క్యాబినెట్లో మంత్రులుగా నియమితులయ్యారు. వారు.. టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు జీ విజయరామారావు, నాయని నర్సింహారెడ్డి, సంతోష్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంత రావు, చంద్రశేఖర్, టీ హరీష్‌రావు.
పార్లమెంట్లో తెలంగాణం
– కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 2004, మే 26న యూపీఏ ప్రభుత్వం ‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించారు. 2004, జూన్ 7న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగంలో అవసరమగు సంప్రదింపుల ద్వారా ‘కన్సెన్సస్’ కుదిర్చి సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని చేపడుతుందన్నారు. ఆ రోజు ఢిల్లీలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
– ఇక్కడ కన్సెన్సస్ అంటే ఒక విస్తృత స్థాయిలో కుదిరే అంగీకారం. కానీ దీన్ని తప్పుగా వక్రీకరిస్తూ దేశంలోని వందకోట్ల ప్రజల అభిప్రాయం, అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కావాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివాదాన్ని లేపి యూపీఏ తెలంగాణ ఏర్పాటు ప్రయత్నాలకు అడ్డు తగిలారు.
-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో కేసీఆర్, నరేంద్రలు యూపీఏ సమావేశాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పదేపదే తమ నిరసనను తెలిపారు. చివరికి 2005, మార్చిలో యూపీఏ ప్రభుత్వం ‘ప్రణబ్ ముఖర్జీ’ అధ్యక్షతన ఉపసంఘాన్ని నియమించింది. ఈ కమిటీని నియమిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్లో ఉపసంఘం తన నివేదికను 8 వారాల్లో ఇస్తుందని తెలిపారు.
ప్రణబ్ ముఖర్జీ కమిటీ
-యూపీఏ ప్రభుత్వం వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపి ‘విస్తృత స్థాయిలో అంగీకారం’ కోసం ప్రయత్నించడానికి సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో డీఎంకే పార్టీకి చెందిన మంత్రి దయానిధి మారన్, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన మంత్రి రఘువంశ ప్రసాద్ సింగ్ సభ్యులుగా నియమితులయ్యారు.
– ఈ కమిటీ గడువు ఎనిమిది వారాలు. అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకోవడం ఈ కమిటీ ప్రధాన విధి. ఈ కమిటీ తెలంగాణపై తమ అభిప్రాయం తెలపాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. కేసీఆర్ దాదాపు అన్ని రాజకీయ పార్టీలను కలిసి తెలంగాణకు మద్దతు ఇవ్వాలని కోరారు. దాదాపు 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ కమిటీకి లేఖలు ఇచ్చారు. ఈ విధంగా 543 మంది సభ్యులున్న లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించే వారి సంఖ్య 440కి పైనే ఉంటుంది.
ప్రభుత్వం నుంచి వైదొలగిన టీఆర్ఎస్
-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ అధిష్ఠానానికి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులున్న తరువాత కూడా వారితో మాటమాత్రం చెప్పకుండా, మంత్రివర్గంలో చర్చించకుండా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు నష్టం కలిగించే అనేక చర్యలకు పూనుకున్నారు.
– కృష్ణా జలాలను అత్యంత ఎక్కువ పరిమాణంలో రాయలసీమలోని అక్రమ, అనుమతిలేని ప్రాజెక్టులకు తరలించడానికి పోతిరెడ్డిపాడు కాలువను నాలుగురెట్లు పెంచారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్న పోలవరం, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాలను మొదలుపెట్టారు. చర్చల పేరుతో నక్సలైట్లను పిలిచి మొదటి విడత చర్చల తరువాత వారికి హామీ ఇచ్చినవి ఏవీ నెరవేర్చకపోగా అర్ధాంతరంగా చర్చలను నిలిపివేశారు. మరో పక్కన బూటకపు ఎన్కౌంటర్లను ప్రారంభించి జనశక్తి పార్టీ చర్చల ప్రతినిధి అయిన రియాజ్‌ను కాల్చి చంపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుట్రలకు విసుగుచెందిన కేసీఆర్ 2006, జూన్ 23న పార్టీకి సంబంధించిన ఆరుగురు మంత్రులతో రాజీనామా చేయించారు.
లక్షలాది మందితో వరంగల్‌లో సభ
– 2006, జూలై 17న వరంగల్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ హాజరయ్యారు. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఈ సభకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. వైఎస్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను ప్రజలకు వివరించడానికి, తెలంగాణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణిని ప్రజలకు తెలపడానికి ఈ సభను టీఆర్ఎస్ నిర్వహించింది.
– సభలో ప్రసంగించిన కేంద్రమంత్రి శరద్‌పవార్ యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధంగా ఉందని తాను యూపీఏ ప్రతినిధిగా ఈ సభలో మాట్లాడుతున్నానని అంటూ తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పడుతుందని హామీ ఇచ్చారు.
కేసీఆర్, వైఎస్ఆర్ల సమావేశం
-ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు టీఆర్ఎస్ మంత్రుల రాజీనామా వల్ల వైఎస్ఆర్కు, టీఆర్ఎస్ నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతున్న విషయాన్ని గమనించి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవ తీసుకున్నారు. రాజశేఖర రెడ్డిని ఢిల్లీకి పిలిపించి కేసీఆర్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
-ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణంగా భావిస్తున్న ఆరు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఆరు అంశాలను టీఆర్ఎస్ ఎజెండాగా నిర్ణయించింది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో సుమారు 3 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ తరఫున కేసీఆర్‌తోపాటు నీటిపారుదల రంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ఫలప్రదం కాలేదు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టుల పనులను వైఎస్ఆర్ మరింత వేగంగా కొనసాగించాడు.
– జీవో 610 అమలును ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. మొక్కుబడిగా కొన్ని బదిలీలు జరిగాయి. అవి కూడా తెలంగాణ వారికి నష్టం కలిగించే విధంగా 6వ జోన్ నుంచి 5వ జోన్‌కు మాత్రమే జరిగాయి. బూటకపు ఎన్కౌంటర్లను విచ్చలవిడిగా కొనసాగించింది ప్రభుత్వం. మరోపక్క టీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారిని తనవైపు తిప్పుకొని పార్టీని చీల్చడానికి కుట్ర చేశాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి.
-ఈ పరిణామాలు యూపీఏ, టీఆర్ఎస్ మధ్య దూరం పెరగడానికి కారణమయ్యాయి. మరోవైపు ఏడాదిన్నరైనా నివేదిక ఇవ్వలేదు ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ఈ కమిటీ వ్యవహారాన్ని యూపీఏ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టింది. టీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోనియాను కలవగా ఆమె యూపీఏ బయటి నుంచి మద్దతిస్తున్న సీపీఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తుందని అన్నారు. దీంతో టీఆర్ఎస్ ప్రతినిధులు సీపీఎం నాయకులైన సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్లను కలవగా సీతారాం ఏచూరి బదులిస్తూ.. ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నందున మా పార్టీ తెలంగాణ ఏర్పాటును సమర్థించడం లేదు. అంతమాత్రాన యూపీఏ ఇస్తామంటే మేమెప్పుడూ అడ్డుపడతామని చెప్పలేదు. ఒకవేళ మేము అడ్డుపడినా వాళ్లు ఇవ్వాలనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందడానికి సరిపోయే బలం వారికి ఉన్నది’ అని అన్నారు.
ప్రధానితో కేసీఆర్
– దీంతో కేవలం రాజశేఖర రెడ్డి అడ్డుపడటం వల్లనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సుముఖంగా లేరని భావించి 2006, మే నెలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వనట్లయితే తాము యూపీఏ నుంచి వైదొలగుతామని కేసీఆర్ హెచ్చరించారు.
-తెలంగాణలో వైఎస్ఆర్ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లలో నక్సలైట్లను, అమాయక ప్రజలను చంపుతూ తెలంగాణ గ్రామాల్లో హింసాయుత వాతావరణాన్ని సృష్టించడంతో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి తక్షణమే బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాల్సిందిగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
– చంపడం ద్వారా నక్సలిజాన్ని అంతం చేయలేమని తెలంగాణను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే నక్సలైట్ల ప్రభావం తగ్గుతుందని ఇందుకు ఉదాహరణగా జూరాబాద్, జగిత్యాల ప్రాంతాల్లో గతంలో నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉండేదని, 1980 తరువాత శ్రీరాంసాగర్ కాలువ రావడంతో ఆ ప్రాంతమంతా సస్యశామలం కావడంతో ఆ గ్రామాల్లో ఇప్పుడెవరూ నక్సలైట్లలో చేరడం లేదని కేసీఆర్ మన్మోహన్ సింగ్‌కు వివరించారు. దీనికి ప్రధాని స్పందిస్తూ హోంమంత్రికి ఈ విషయాలన్నీ అర్థం చేయించాలన్నారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లి హోంమంత్రి శివరాజ్ పాటిల్‌ను కలిశారు. కేసీఆర్ చెప్పిన విషయాలతో హోంమంత్రి ఏకీభవించారు. ఈ విషయంపై తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. అయితే ఆ తరువాత కూడా నక్సలైట్ల విషయంలో రాజశేఖర రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వారిలో ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సభ్యులు?
1) రఘువంశ ప్రసాద్ సింగ్
2) గులాం నబీ ఆజాద్
3) దయానిధి మారన్ 4) 1, 3
2. కింది వాటిలో సరైనవి?
1) 2004 ఎన్నికల పొత్తులో భాగం గా టీఆర్ఎస్కు 42 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించగా 26 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది
2) పొత్తులో భాగంగా 6వ లోక్‌సభ స్థానాలకు గాను 5 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది
3) 1 4) 1, 2
3. పార్లమెంట్ ఉభయసభల సమావేశంలో ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’ గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి?
1) అబ్దుల్ కలాం 2) ప్రతిభాపాటిల్
3) ప్రణబ్ ముఖర్జీ
4) కేఆర్ నారాయణన్
4. 2004, మార్చి 12న కరీంనగర్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ‘తెలంగాణ ప్రజల భావోద్వేగాలు మాకు తెలుసు, వాటిని మేము గౌరవిస్తాం, వారి కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తాం’ అని ప్రకటించింది?
1) వైఎస్ రాజశేఖర రెడ్డి
2) సోనియాగాంధీ
3) ప్రణబ్ ముఖర్జీ 4) చిదంబరం
5. కింది వాటిలో సరైనవి?
1) వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్రలకు విసుగుచెందిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2006, జూన్ 23న పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులతో రాజీనామా చేయించారు
2) ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఆలస్యం వల్ల 2006, ఆగస్ట్ 23న యూపీఏ మంత్రివర్గం నుంచి టీఆర్ఎస్ మంత్రులు కేసీఆర్, ఆలె నరేంద్రలు రాజీనామా చేశారు
3) 1 4) 1, 2
6. 2005లో నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ గడువు?
1) ఎనిమిది వారాలు 2) పది వారాలు
3) ఆరు నెలలు 4) 12 నెలలు
సమాధానాలు
1-4, 2-4, 3-1, 4-2, 5-4, 6-1.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు