టీ, టూత్‌పేస్ట్, చిరుతిళ్లతో ఫ్లోరోసిస్!
నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ లేదా తక్కువగా ఉండటం వల్ల శరీరంలో వచ్చే మార్పులనే ఫ్లోరోసిస్ అంటారు. బోరు లేదా బావుల నుంచి వచ్చే నీటిలో ఫ్లోరిన్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ఆ నీటిని తాగిన వారి కాళ్లు, చేతులు వంకర్లు తిరగడం, పళ్లు గారపట్టడం జరుగుతుంది. దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో ఫ్లోరోసిస్ కు కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
ఫ్లోరోసిస్
షీలే అనే శాస్త్రవేత్త ప్రకారం ఫ్లోరిన్ అంటే వాయురూపక మూలకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ప్రకారం నీటిలో 0.5 పీపీఎం నుంచి 1.5 పీపీఎం మధ్య స్థాయిలో ఫ్లోరిన్ గాఢత కలిగి ఉంటే ఎలాంటి హాని జరగదు. ఒకవేళ ఫ్లోరిన్ గాఢత ఈస్థాయికి మించినా లేదా తగ్గినా ఆరోగ్యానికి హానికరం. 0.5 పీపీఎం కంటే తక్కువ ఉంటే మానవ దేహానికి కావాల్సిన ఫ్లోరిన్ లభించదు. దీని వల్ల దంతాల్లో దృఢత్వం కోల్పోవడం సంభవిస్తుంది. ఒకవేళ అవసరానికి మించి నీటిలో ఫ్లోరిన్ స్థాయి ఉంటే (1.5 పీపీఎం కంటే ఎక్కువ) ఫ్లోరోసిస్ సంభవిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం…
1. ఫ్లోరిన్ గాఢత 1.5 నుంచి 4 పీపీఎం మధ్యలో ఉంటే దంతాల ఫ్లోరోసిస్ సంభవిస్తుంది.
2. ఫ్లోరిన్ గాఢత 4 పీపీఎం నుంచి 10 పీపీఎం మధ్యలో ఉంటే దంతాల ఫ్లోరోసిస్‌తో పాటు అస్థిపంజర ఫ్లోరోసిస్ సంభవిస్తుంది.
3. ఫ్లోరిన్ గాఢత 10 పీపీఎం దాటితే తీవ్ర అస్థిపంజర ఫ్లోరోసిస్ సంభవిస్తుంది.
– ప్రపంచంలో ఫ్లోరోసిస్ కేసులు అత్యధికంగా చైనాలో నమోదవుతున్నాయి.
-భారతదేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో ఈ ఫ్లోరోసిస్ సమస్య ఉంది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానాల్లో అధికంగా కనిపిస్తుంది.
– ఒక లీటర్ నీటిలో 0.8 Mg కంటే ఎక్కువ ఫ్లోరిన్ గాఢత కలిగిఉంటే అది మానవ ఆరోగ్యానికి హానికరం.
ఫ్లోరోసిస్ కారణాలు
– గొట్టపు బావుల నీటిని అధికంగా ఉపయోగించడం వల్ల ఫ్లోరోసిస్ వస్తుందని భూగర్భ జలాల డైరెక్టరేట్ వారు పేర్కొంటున్నారు. ఉపరితల నీరు తగిన మొత్తంలో ఉండకపోవడం, కొన్ని చోట్ల కలుషితం అవడం వంటి కారణాల వల్ల బోరు లేదా గొట్టపు బావి నీటిపై అతిగా ఆధారపడుతున్నారు. దీంతో ఫ్లోరోసిస్ బారిన పడుతున్నారు.
– నల్లగొండ వంటి కొన్ని ప్రాంతాల్లో శిలల్లో (గ్రానైట్ క్వారీలు) లభించే నీటిలో ఫ్లోరైడ్ పరిమాణం గరిష్ఠ స్థాయిలో (సుమారు 325 నుంచి 3200 పీపీఎం) ఉండటంతో ఫ్లోరోసిస్ బారిన పడుతున్నారు.
-హరిత విప్లవ ప్రభావం వల్ల వ్యవసాయ రంగంలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం పెరిగింది. ఫలితంగా కూరగాయలు, ఆహార ధాన్యాల వంటి పంట ఉత్పత్తుల్లోకి ఫ్లోరైడ్ అధిక మొత్తంలోకి చేరడంతో ఫ్లోరోసిస్ వ్యాధికి కారణమవుతుంది.
– డాక్టర్ కాంతయ్య (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్-హైదరాబాద్), అబుల్ హసన్ సిద్ధికీ (ఉస్మానియా ఆస్పత్రి-జనరల్ ఫిజీషియన్) ల సంయుక్త పరిశోధనలో మనం ప్రతిరోజూ తాగే టీ (తేనీరు)లో కూడా ఫ్లోరైడ్ ఉంటుందని వెల్లడైంది.
– పోషకాహార లోపం, సంతులన పోషక ఆహారం తీసుకోకపోవడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్థులవుతున్నారు.
ఉదా: పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉన్న నీటిని తీసుకున్నప్పటికీ ఫ్లోరోసిస్ బారిన పడకుండా ఉండేందుకు కారణం వారు తీసుకునే పౌష్టికాహారమే.
– నల్లగొండ వ్యవసాయ, పాల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను సమీప అధిక జన సాంద్రత గల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తరలిస్తున్నారు. దీంతో పంపిణీదారులు తమ సొంతానికి ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాల వంటి వాటిని తక్కువగా తీసుకోవడంతో పౌష్టికాహార లోపం తలెత్తి ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు.
-నిల్వ ఉండే చిరుతిళ్లు (జంక్ ఫుడ్), శీతల పానీయాల్లో బ్లాక్ రాక్ సాల్ట్ (CaF2)ను అధికంగా ఉపయోగిస్తారు. ఇలాంటి పదార్థాలను అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు సహజంగానే ఫ్లోరోసిస్ వ్యాధి బారినపడుతున్నారు. బ్లాక్ రాక్ సాల్ట్ (కాలా నమక్), రెడ్ సాల్ట్ లో 157 పీపీఎం స్థాయిలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది హానికర స్థాయి.
-మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్న టూత్ పేస్ట్ లలో కూడా ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉండటం ఫ్లోరోసిస్‌కు దారితీస్తుంది.
-సెమి ఆరిడ్ వాతావరణ పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ఫ్లోరైడ్ మోతాదుకు మించి ఉన్న నీటిని అధికంగా తీసుకోవడంతో ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడుతున్నారు.
-ఫ్లోరో క్వినోలిన్, యాంటీ బయోటిక్స్, యాంటీ ఫంగల్ డ్రగ్స్ వంటి కొన్ని ఔషధాల వాడకం వల్ల శరీరంలోకి ఫ్లోరైడ్ మోతాదుకు మించి చేరడంతో ఫ్లోరోసిస్ కు గురవుతున్నారు.
-భూ అంతర్భాగంలో వైవిధ్యత కలిగిన భౌగోళిక నిర్మితుల వల్ల నీటిలో ఫ్లోరైడ్ అసమానంగా విస్తరించి ఉండటం కూడా ఫ్లోరోసిస్ కు కారణమవుతుంది.
ఫ్లోరోసిస్ లక్షణాలు
1. దంత సంబంధిత ఫ్లోరోసిస్: దంతాలు క్షీణించడం, పుచ్చిపోవడం, ఎనామిల్ పూతపోవడం దంత సంబంధిత ఫ్లోరోసిస్ లక్షణాలు.
2. అస్థి సంబంధిత ఫ్లోరోసిస్: శరీరమంతటా వ్యాపించే అస్పష్టమైన నొప్పులు, కీళ్లు బిగబట్టి కదలికలు తగ్గడం సామాన్యమైన ప్రారంభ లక్షణాలు. ఎముకల్లోని కాల్షియం స్థానంలో ఫ్లోరైడ్ చేరడం వల్ల ఎముకలు పెలుసుబారిపోయి వంకర్లు తిరగడం, అంగవైకల్యం సంభవిస్తుంది.
3. అస్థి సంబంధం లేని సమస్యలు: కండరాల బలహీనత, బిగుసుకుపోవడం, కండరాల్లో నొప్పి, కండర శక్తి తగ్గడం, చర్మంపై దద్దుర్లు, నరాల బలహీనత, మానసికంగా కుంగడం, చేతివేళ్లు, కాలివేళ్లు కంపించడం వంటి లక్షణాలు అస్థి సంబంధం లేని ఫ్లోరోసిస్ లక్షణాలు.
4. జీర్ణ నాళ సంబంధిత సమస్యలు: పొత్తి కడుపులో తీవ్రమైననొప్పి, అతిసారం, మలబద్ధకం, మల విసర్జనలో రక్తం పడటం, తలనొప్పి, చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు రావడాన్ని జీర్ణనాళ సంబంధిత ఫ్లోరోసిస్ గా పేర్కొనవచ్చు.
– గర్భిణులు ఫ్లోరైడ్ రహిత నీటిని తాగడం వల్ల గర్భ విచ్ఛిత్తి కావడం, నిర్జీవ శిశువుకు జన్మనివ్వడం, అవయవ లోపం గల శిశువులకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. పురుషుల్లో వంధ్యత్వం సంభవించవచ్చు.
– ఎర్రరక్తకణాల్లో ఫ్లోరైడ్ పేరుకుపోవడంతో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గి ఎనీమియా వ్యాధికి కారణమవుతుంది.
ఫ్లోరైడ్‌ను అంచనా వేయడం
తాగు నీరు: భారతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటర్ నీటిలో 1 పీపీఎం కంటే ఎక్కువ మోతాదులో ఫ్లోరైడ్ నమోదు అవడం.
హీమోగ్లోబిన్ అంచనా: రక్తంలో ఎనీమియాను గుర్తిస్తే హీమోగ్లోబిన్‌లో ఫ్లోరోసిస్గా నిర్ధారించవచ్చు.
యూరిన్: మూత్ర పరీక్షలో ఫ్లోరిన్ లెవల్స్‌ను కనుగొనడం ద్వారా ఫ్లోరోసిస్‌ను అంచనా వేయవచ్చు.
నివారణ చర్యలు
– ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఫ్లోరైడ్ రహిత మంచినీటిని మాత్రమే సరఫరా చేయాలి.
– వర్షపు నీటిని, ఉపరితల నీటిని శుద్ధిచేసి వినియోగించాలి.
– సాధారణంగా రెండు పద్ధతుల్లో నీటిని ఫ్లోరైడ్ రహితంగా మార్చవచ్చు.
1. నల్లగొండ సాంకేతిక (కెమికల్ ప్రిసిపిటేషన్): తగిన మోతాదులో పటిక, బ్లీచింగ్ పౌడర్, సోడియం కార్బొనేట్‌లను ఉపయోగించి నీటిని ఫ్లోరైడ్ రహితంగా సులువుగా మార్చవచ్చు.
2. ఎలక్టోలైట్ డిఫ్లోరిడేషన్: అధిక మోతాదులో ఫ్లోరైడ్ కలిగిన నీటిలో అల్యూమినియం ఎలక్టోడ్స్తో విద్యుత్తును ప్రవేశపెట్టినప్పుడు అల్యూనియం హైడ్రాక్సైడ్ ఉత్పత్తి అవుతాయి. ఇవి నీటిలో ఉన్న ఫ్లోరైడ్ అయాన్స్ను గ్రహించుకుని అవశిష్ట పదార్థం, మంచి నీటిని ఏర్పాటు చేస్తాయి.
– రసాయనాల కాలుష్యం నుంచి భూగర్భ జలాలను రక్షించాలి.
-ఫ్లోరోసిస్ ఎండమిక్ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యం బలవర్ధకమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలి.
-ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో తరచూ ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలి.
-పారిశ్రామిక వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాతనే నదులు, కాలువలు వంటి జలాశయాల్లోకి వదలాలి.
-ఫ్లోరైడ్ రహిత నీటినే పంటల సాగుకు వినియోగించాలి.
– వ్యవసాయ సాగులో క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను విస్తృతంగా వినియోగించాలి.
-ఉపరితల నీటిని క్లోరినేషన్, UV ప్రక్రియల ద్వారా శుద్ధిచేసి ఉపయోగించాలి.
ఫ్లోరోసిస్ నివారణలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పాత్ర
-తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ 2009లో నల్లగొండ ఫ్లోరైడ్ శుద్ధి ప్లాంటు ఏర్పాటుకు 60,000 డాలర్ల గ్రాంటు అందించింది.
-జల సాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రపంచానికి తెలియజేయడానికి అనేకసార్లు పార్లమెంట్ ముందు ర్యాలీలు నిర్వహించారు.
-ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడకుండా అవగాహన కల్పించడం కోసం సుభాష్ నేతృత్వంలో ఫ్లోరోసిస్ విముక్త పోరాట సమితిని ఏర్పాటు చేశారు. Each One Teach Ten అనే నినాదంతో ఈ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది.
– ఫ్లోరోసిస్ సమస్యపై ప్రజలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేశారు. దీని ఫలితమే నల్లగొండలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందించాలని జస్టిస్ ఎస్.బి. సిన్హా, వి.వి.ఎస్. రావులతో కూడిన ఆంధ్రప్రదేశ్ ధర్మాసనం తీర్పునిచ్చింది.
– నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఫ్లోరోసిస్‌పై అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడం, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం పునరావాసం ఏర్పాటు చేయడం వంటివి చేస్తారు.
– ఇంటింటికీ మంచినీరు అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
‘‘ప్రజల్లో అవగాహన, పౌర సమాజం, మేధావుల తోడ్పాటుతో పాటు ప్రభుత్వ స్పందన తోడై సరైన విధానంలో ప్రయత్నిస్తే ఫ్లోరోసిస్ రహిత భారతాన్ని నిర్మించడం సాధ్యమే’’
ఎం.ప్రవీణ్ కుమార్
21వ సెంచరీ ఐపీఎస్ అకాడమీ
ఫోన్ ః 9704686009
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?