ఉద్యమాలకు ఊతం ( గ్రూప్స్ప్రత్యేకం )
గత తరువాయి..
తెలంగాణ హిస్టరీ
– ప్రతిభావంతులను గుర్తించి, వారి సేవలను వినియోగించుకోవడం వల్ల సాలార్జంగ్ ప్రారంభించిన అనేక సంస్కరణలు విజయవంతమయ్యాయి. ఎందరో ముస్లిం మేధావులు ఉత్తర భారతం నుంచి ఇక్కడికి వచ్చారు. వారికి ఉద్యోగాలు ఇచ్చి, వారి తెలివితేటలను ఉపయోగించుకున్నాడు. సయ్యద్ బిల్గ్రామి, సయ్యద్ మొహిద్దీన్ అలీ, అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, రామచంద్ర పిళ్లె, రుద్ర ఇతని ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చినవారే.
-ఇప్పటి కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్‌కు ప్రసాదించింది ఇతడే. పరాయి ప్రాంతం వారు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేయడం, కీర్తి ప్రతిష్ఠలు పొందడం ఇక్కడి వారికి నచ్చలేదు. భవిష్యత్తులో తమకు ఉద్యోగాలు దక్కవేమో అనే భయంతో ముల్కీ ఉద్యమాన్ని స్థానికులు ప్రారంభించారు.
బ్రిటిష్ వారితో సాలార్జంగ్ సంబంధాలు
-రెండు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ 1853 నుంచి 1867 వరకు, రెండో దశ 1867 నుంచి 1878 వరకు. మొదటి దశలో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. 1857 తిరుగుబాటులో బ్రిటిష్‌వారితో సహకరించి నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాటును అణచివేశాడు. నిజాం సాలార్జంగ్ను తొలగించడానికి పూనుకున్నప్పుడు బ్రిటిష్‌వారు అతడికి అండగా నిలిచారు.
-రెండో దశలో సాలార్‌జంగ్‌కు, బ్రిటిష్‌వారి మధ్య గల సంబంధాల్లో మార్పు వచ్చింది. వీరి మధ్య వైరం పెరిగింది. బీరార్‌ను సంపాదించడానికి తీవ్ర కృషిచేశాడు. 1876లో ఇంగ్లండ్‌కు వెళ్లి విక్టోరియా రాణిని కలిశాడు. కానీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ సివిల్ లా తో గౌరవించింది.
– ఇతడు బీరార్‌ను పొందడానికి చేసిన ప్రయత్నాలు లార్డ్ లిట్టన్‌కు ఆగ్రహం కలిగించాయి. అతడి ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఇంగ్లిష్‌వారు ప్రయత్నించారు. 1877లో షామ్స్ ఉర్ ఉమ్రా మరణించగా అతడి తమ్ముడు, సాలార్‌జంగ్‌కు వ్యతిరేకి అయిన వికార్ను బాల నవాబుకు రెండో సంరక్షుడిగా నియమించారు. సాలార్‌జంగ్‌కు అది నచ్చక రాజీనామా చేస్తానని బెదిరించాడు. దానిని ఆమోదించాల్సిందిగా ఇంగ్లిష్‌వారు కోరడంతో రాజీనామా ప్రయత్నాన్ని విరమించాడు. అతడి ప్రాముఖ్యం తగ్గింది. సాలార్జంగ్ కలరాతో 56వ ఏట 1888లో మరణించాడు.
ఆదిహిందూ ఉద్యమం
-హైదరాబాద్ నిజాం సంస్థానంలో 19వ శతాబ్దపు చివరి రెండు దశకాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి జరిగి నూతన శక్తులు ఆవిర్భవించాయి. ఆధునిక విద్యావ్యాప్తి, పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు సమాజంలోని కింది తరగతుల్లో నూతన చైతన్యానికి అంకురార్పణ చేశాయి. బ్రిటిష్ ఇండియాలో సంఘ సంస్కరణోద్యమాలు, అస్తిత్వ పోరాటాలు, దళిత బజన ఆదివాసీ తిరుగుబాట్లు చెలరేగి వారిలో నూతన చైతన్యాలు రేకెత్తించాయి. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా అనేక రైతాంగ ఆదివాసీ ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా 20వ శతాబ్దపు మొదటి దశకాల్లో హైదరాబాద్ సంస్థానం పలు సంఘసంస్కరణలు, భాషా సాంస్కృతిక ఉద్యమాలను చవిచూసింది. కైస్తవ మిషనరీల విద్యాబోధన, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు, దళిత బజన వర్గాల్లో సామాజిక ఆర్థిక మార్పులకు దోహదం చేశాయి.
– మొదటగా హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమానికి పూర్తి అంకురార్పణ జరిగింది. తెలుగు సమాజంలో పెల్లుబికిన నూతన చైతన్యం అస్తిత్వ, ఆత్మగౌరవ ఉద్యమానికి దోహదపడింది. హైదరాబాద్ సంస్థానంలో ఆర్యసమాజ్, బ్రహ్మసమాజ్ సంఘ సంస్కరణల ఉద్యమాల ప్రభావం కూడా దళిత వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నెలకొల్పింది.
-హైదరాబాద్ దళిత ఉద్యమానికి అగ్రవర్ణ సంఘ సంస్కర్తల సహాయ సహకారాలు కూడా లభించాయి. తెలంగాణలో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, వామన్ నాయక్, రాజ ధన్‌రాజ్ గిరి, రాయి బాలముకుంద్ లాంటి వాళ్లు తమ వంతు సహాయాన్ని అందించారు. నిజాం రాష్ట్రంలో దళిత ఉద్యమ పితామడిగా పేర్కొనే భాగ్యరెడ్డి వర్మ (1888-1919) బ్రహ్మసమాజ్ సంఘ సంస్కరణ ఉద్యమాలతో ప్రభావితుడై కులవ్యవస్థను నిరసించి, హైందవ భావజాలాన్ని ధిక్కరించి, స్వతంత్ర దళిత ఉద్యమాన్ని నిర్మించారు. ఆయన నాయకత్వంలో 1906లో స్థాపించిన జగన్ మిత్రమండలి తెలంగాణలో దళిత జాగృతికి, మేలుకొల్పునకు నాంది పలికింది. దాదాపు 100 సంవత్సరాలకు పూర్వం హైదరాబాద్ పట్టణంలో ప్రారంభమైన దళిత చైతన్యం కాలక్రమంలో పరిణతి చెంది ఒక నిర్దిష్టమైన దళిత అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమానికి రూపకల్పన చేసింది. శతాబ్దాలపాటు అగ్రకుల దోపిడీకి, అణచివేతకు గురై అవమాన పరిస్థితుల్లో మగ్గుతున్న సామాజిక వెలివేతకు గురైన దళిత కులాల విముక్తికి ఆలోచనా విధానాన్ని, సిద్ధాంతాన్ని, భావజాలాన్ని చూపించింది. అందువల్ల తెలుగునాట దళిత ఉద్యమాలకు భాగ్యరెడ్డి వర్మ మూలపురుషుడు అని చెప్పవచ్చు.
– జగన్ మిత్రమండలి కార్యక్రమాల్ని విస్తృతపర్చడానికి భాగ్యరెడ్డి వర్మ పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. జగన్ మిత్రమండలి ఆధ్వర్యంలో హరికథా కాలక్షేపాలు, పంక్తి భోజనాలు నిర్వహించారు. ప్రాచీన భారతదేశంలో హైందవ కులధర్మ తాత్వికత ప్రాతిపదికగా, గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకున్నారు. బుద్ధుడి బోధనల ద్వారా ప్రభావితమైన జగన్ మిత్రమండలి సభ్యులు వైదిక ధర్మాన్ని, వర్ణవ్యవస్థను నిరసించి ప్రత్యామ్నాయంగా బుద్ధుడి బోధనల్ని ఆచరించారు.
–భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమినాడు బుద్ధ జయంతిని నిర్వహించారు. అదేవిధంగా జగన్ మిత్రమండలి సభ్యులు జంతుబలిని వ్యతిరేకించి శాకాహారాన్ని స్వీకరించారు. 1913 నుంచి 1938 వరకు నిర్వహించిన బుద్ధపౌర్ణిమ ఉత్సవాల్లో పంక్తి భోజనం కార్యక్రమాన్ని దళితుల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించారు. జగన్ మిత్రమండలి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడంతోపాటు నందసార్, చోక్మేళా ఉత్సవాలు నిర్వహించి దళితవర్గాల్లో కుల వ్యతిరేకతా భావాన్ని, చైతన్యాన్ని పెంపొందించడానికి కృషి చేశారు.
–దళిత ఉద్యమాన్ని విస్తృత స్థాయిలో నిర్మించే క్రమంలో భాగ్యరెడ్డి వర్మ 1911లో మన్య సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం ఆధ్వర్యంలో దళిత వర్గాల్లో మూఢ నమ్మకాలు, దురాచారాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా మద్యపానం, జంతుబలి, బాల్యవివాహాలు మొదలైనవాటి నిర్మూలనకు కృషిచేశారు. అంతేకాకుండా జోగిని, దేవదాసి, బసివి పేరుతో దళిత స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించారు. దళితుల అభ్యున్నతికి నూతన విద్యా ఉపాధి అవకాశాలు అవసరమని గుర్తించిన వర్మ స్వయంగా 1910లో ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. ఆ తర్వాతి కాలంలో వాటి సంఖ్య నలభైకి పెరిగింది. వీటి నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు వర్మ నిజాం ప్రభుత్వ సహాయాన్ని కోరారు. అందుకు నిజాం ప్రభుత్వం సమ్మతించి నిధులు సమకూర్చి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించారు.
–అయితే వర్మ స్థాపించిన పాఠశాలల్లో ఉర్దూలో కాకుండా విద్యార్థుల మాతృభాష తెలుగులో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వతహాగా ఆధునిక విద్య, కైస్తవ మిషనరీల ద్వారా ప్రభావితుడైన భాగ్యరెడ్డి వర్మ సంప్రదాయ, సామాజిక వ్యవస్థను మార్చి అణగారిన వర్గాల జాగృతికి కృషిచేసే క్రమంలో స్వచ్ఛంద సేవా సంఘాల పాత్రను గుర్తించారు. అందువల్ల ఆయన ఆధ్వర్యంలో ధర్మ ప్రచారిణి సభ, అహింసా సమాజ్, జీవ రక్షజ్ఞాన ప్రచార మండలి, స్వస్తి దళ్, సంఘ సంస్కరణ నాటక మండలి, రాజారామ్మోహన్ రాయ్ లైబ్రరీ, ఆదిహిందూ వైష్ణవ సమ్మేళనం, ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ మొదలైన సంస్థలు వైదిక ధర్మాన్ని, భావజాలాన్ని వ్యతిరేకించి దళితవర్గాల్లో సోదరభావం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాయి. సామాజిక, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్ని క్రమపద్ధతిలో నడిపించి దళితుల ఐక్యతకు కృషిచేసిన ఘనత భాగ్యరెడ్డి వర్మకే దక్కుతుందని చెప్పవచ్చు. ఆయన నాయకత్వంలో నడిపిన మన్య సంఘంలో అనేకమంది యువదళిత నాయకులు వెల్లాటి శేషయ్య, జక్కుల ముత్తయ్య, మదారి ఆదయ్య లాంటివారు దళితుల ఐక్యవ్యాప్తికి కృషిచేశారు.
–నిజాం రాష్ట్ర దళిత ఉద్యమానికి నాయకత్రయంగా భాగ్యవరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బీఎస్ వెంకట్రావులను పేర్కొనవచ్చు. అరిగె రామస్వామి (1875-1973) బ్రిటిష్ వలసవాద పూర్వరంగాల్లో ప్రాచుర్యం పొందిన వైష్ణవ మతం, అచల సిద్ధాంతాన్ని, బ్రహ్మ సమాజతత్వాన్ని ప్రచారం చేశారు. ఆయన సికింద్రాబాద్‌లో మొదటగా సునీత బాలసమాజాన్ని స్థాపించి మద్యపాన వ్యసనం, జంతుబలి, జోగిని వ్యవస్థల నిర్మూలనకు కృషిచేశారు. ఆ తరువాత 1922లో ఆదిహిందూ జాత్యోన్నతి అనే సభను స్థాపించి అనేక సంఘ సంస్కరణ కార్యక్రమాలను చేపట్టారు. రామస్వామితోపాటు మదారి ఆదయ్య సంఘాభివృద్ధి సమాజాన్ని స్థాపించి సంఘ సంస్కరణకు కృషిచేసిన దళితుల్లో ఐక్యతను పెంపొందించారు. అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టి దళిత సమాజంలోని రుగ్మతలను అంతం చేసి యువకుల్లో విద్యాసక్తులు పెంపొందించడానికి కృషిచేశారు.
–ఈయన స్థాపించిన ఆదయ్య స్మారక పాఠశాల సికింద్రాబాద్ ప్రాంతంలో నివసించే దళిత విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. సంఘసంస్కరణే లక్ష్యంగా సంఘాభివృద్ధి సమాజాన్ని స్థాపించి దళితవర్గాలకు సామాజిక విషయాల్లో, వివాహాది శుభకార్యాల్లో సహాయసహకారాలు అందిస్తూ దళితవర్గాల్లో నూతన స్పృహను పెంపొందించడానికి కృషిచేశారు. 20వ శతాబ్దపు మొదటి రెండు దశకాల్లో హైదరాబాద్ సంస్థానంలో విద్యావంతులైన దళిత మేధావులు, ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో వివిధ రకాలైన సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా దళితుల్లో ప్రతిఘటనా చైతన్యానికి బీజాలు నాటారు. భాగ్యరెడ్డి వర్మ లాంటి నాయకులు అనేక సమావేశాలు, సభలు ఏర్పాటు చేసి తమ ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా తెలంగాణ ప్రాంతంలో దళితుల సామాజిక, ఆర్థిక మార్పునకు కృషిచేశారు. వారు చేపట్టిన కార్యక్రమాలు, రూపొందించిన సాహిత్యం దళితవర్గాల మధ్య ఉన్న అనైక్యత భేద భావాల్ని అంతమొందించి ఐకమత్యంతో, సహజీవనం సాగించడానికి దోహదపడ్డాయి. వలసవాద ఆధునీకరణలో భాగంగా రూపుదిద్దుకుంటున్న మధ్యతరగతి దళిత మేధావి వర్గం ఈ కొత్త ఆలోచనలు, నూతన విలువలను ప్రచారం చేసి చైతన్యవంతులైన యువతరాన్ని సంఘసంస్కరణలకు పురికొల్పింది. తద్వారా తెలంగాణ ప్రాంతంలో దళితుల ఉనికి, అస్తిత్వం, గుర్తింపు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందిన వెంకట్రావు ఉత్తేజితమైన ఉద్యమాలను నడిపిన ధైర్యశాలి. సికింద్రాబాద్ హౌస్మండిలో జన్మించిన ఈయన తెలంగాణ దళిత స్త్రీల్లో అనాదిగా నాటుకుపోయిన దేవదాసీ దురాచారాన్ని నిర్మూలించే ఉద్దేశంతో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించారు.
– 1926లో ఆదిహిందూ మహాసభను ప్రారంభించి అనేక సాంఘిక, విద్యావ్యాప్తి కార్యక్రమాల్ని చేపట్టారు. ముఖ్యంగా ఈయన మహారాష్ట్రలో జ్యోతిబాఫూలే నడిపించిన విద్యాసంస్థలు, ఉద్యమాలవల్ల ప్రభావితుడయ్యారు. అందుకే మహాసభ ద్వారా దళితుల విద్యాభివృద్ధికి కృషిచేశారు. ఈయన నాయకత్వంలో హైదరాబాద్, సికింద్రాబాద్, బొల్లారం ప్రాంతాల్లోని అనేకమంది దళిత యువకులు అభ్యుదయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా రైల్వే ఉద్యోగులు, మిలిటరీ జవాన్లు, ఆంగ్లేయుల వద్ద పనిచేసిన బట్లర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు మొదలైనవారు. దళిత వర్గాల్లో రగుల్కొన్న చైతన్యాన్ని భాగ్యరెడ్డి వర్మ ఈ విధంగా వ్యక్తీకరించారు.. ‘ఇంకను ఎన్నినాళ్లు మమ్ము అణిచిపెట్టెదరు. స్వాతంత్య్ర భానుడు ఉదయించినాడు. ఒక ఎక్కువ, తక్కువైన భావాలు నశిస్తున్నాయి. మీరిదివరకు మమ్ముల బిగించిన సంఘ బహిస్కృత బంధనాలు పాతవై తమంతట తామే సడలి తేలిపోతున్నాయి. మా జాతి సంఖ్య ఏడు కోట్లు సుమా! ఆదిశక్తి మాలో విజృంభించింది. త్వరలో గమ్యస్థానమాక్రమించగలమని విశ్వాసం, ధైర్యం కలదు’.
– భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ కేంద్ర కార్యాలయ భవనం ఒక ప్రముఖ చిహ్నంగా నిలుస్తుంది. ఆదిహిందూ సమాజ ఉన్నతికి పాటుపడటంలో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన విద్యాలయాలు, సంస్థలు విలువైన పాత్రను నిర్వహించాయి. అంటరాని వర్గాల్లో ఐక్యతకు కృషిచేసిన భాగ్యరెడ్డి వర్మ దళితుల్లో ఉపకులమైన మాదిగల అభ్యున్నతికి కూడా కృషిచేశారు. ఉదాహరణకు అరుంధతీయుడైన సుబేదారో సాయన్న అంటరాని వర్గాల అభ్యున్నతికి కృషిచేశారు. ఆయన అధ్యక్షతన 1920 దశకంలో అనేక దళిత బస్తీల్లో వందలాది సభలు నిర్వహించి మూఢాచారాలు, దురలవాట్లను మాన్పించడానికి కృషిచేశారు.
– ఈ ఇద్దరి కృషి వల్ల దళితవర్గాల్లో ఐకమత్యం పెంపొందే అవకాశం కలిగింది. ఆదిహిందూ ఉద్యమంతోపాటు అరుంధతి, మాతంగి వర్గాల్లో కూడా నూతన చైతన్యం పెల్లుబికింది. మాతంగి మహాసభ నాయకుడు గుంటి మల్లప్ప. 1932, నాంపల్లిలో అంటరాని వర్గాల సమావేశం నిర్వహించారు. దళితవర్గాల్లో ఐక్యత తీసుకురావడం ఈ సభ ముఖ్య ఉద్దేశం.
–భాగ్యరెడ్డి వర్మ 1928లో పెరుంబుదూర్‌లో రావుసాహెబ్ ఎల్సీ గురుస్వామి అధ్యక్షతన జరిగిన అరుంధీయ మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన దళితవర్గాల్లోని భిన్న సమూహాల్ని ఏకతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దళిత ఉపకులాల్లో శతాబ్దాలపాటు అంతర్లీనంగా ఉన్న సామాజిక చీలికలు, సాంప్రదాయాలు, అలవాట్లు దళిత ఐక్యతకు విఘాతం కల్పించాయని చెప్పవచ్చు. దాదాపు 30 ఏండ్లకు పైగా ఆదిహిందూ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన భాగ్యరెడ్డి వర్మ ఉపకులాల మధ్య ఐక్యతను తీసుకురావడంలో పూర్తిగా సఫలీకృతడు కాలేకపోయారు.
అడపా సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు